గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జులై 2015, బుధవారం

యాజ్ఞవల్క్యుడు - కాత్యాయని, మైత్రేయి, గార్గి

జైశ్రీరామ్.
యాజ్ఞవల్క్యుడు -  కాత్యాయని, మైత్రేయి, గార్గి
బృహదారణ్యకోపనిషత్ ను గూర్చి సద్గురు శివానందమూర్తిగారి ప్రసంగ సారము.
1. గంగా తీరంలో చమత్కార పురమని ఒక ఊరు ఉండేది. అక్కడ వేదాధ్యయన తత్పరుడైన ఒక విప్రశ్రేష్ఠుడు ఉండేవాడు. ఎల్లప్పుడు యజ్ఞాలు వేదాలు సలక్షణంగా వచించడం వలన యజ్ఞవల్క్యుడు అనేపేరు, నిరతాన్నదానం వలన వాజసని అనేపేరు, వేదాధ్యనం, అధ్యాపనం  వలన బ్రహ్మరాతుడు అనేపేరు, దేవవరప్రసాదంచేత ఒక పుత్రుని పొందడం వలన దేవరాతుడనే పేరు  ఆయన పొందాడు. ఆయన భార్య సునంద. బ్రహ్మవిద్యను బోధించి వ్యాపింపచేయగల పుత్రునికోసం ఆ దంపతులు తపస్సుచేయగా బ్రహ్మ దర్శనం ఇచ్చాడు. వాళ్ళు ఆయననే తమ కుమారునిగా జన్మించమని కోరారు. సహజమైన  బ్రహ్మ తేజస్సుటో జన్మించిన ఆపుత్రుడే యాజ్ఞవల్క్యుడు, వాజసని. చిన్నతనంలో ఉపనయనాది సంస్కారముల అనంతరం  వేదవిద్యకు పంపించారు. బాష్కలుని వద్ద ఋగ్వేదం,  జైమిని వద్ద సామవేదం, ఉద్దాలకునివద్ద అధర్వణ వేదం, తండ్రివద్ద యజుస్సు నేర్చుకున్నాడు. తరువాత వ్యాసునియొద్ద నియోగించబడి యజుర్వేదాన్ని శిష్యులకు చెబుతున్న వైశంపాయనుని వద్దకు యజుర్వేదం పూర్తిగా అధ్యయనం చేయడానికి వెడతాడు.  
 "గురువును మించిన దైవములేడు. నీ సర్వస్వము గురువే అని యాజ్ఞవల్క్యునికి తండ్రిబోధించి గురువు వద్దకు పంపిస్తాడు. యాజ్ఞవల్క్యుడు భక్తితో గురువును సేవించి, అక్కడ ఉన్న విద్యార్థులలో ప్రథమునిగా నిలిచి, గురువు వద్ద సంపూర్ణ యజుర్వేదము, అనేక రహస్య విద్యలు నేర్చుకున్నాడు. సంపూర్ణమైన బ్రహ్మ తేజస్సు, గురుసేవా పుణ్యఫలమూ అతనికి లభించాయి. దీనితో కొంత సాత్త్వికాహంకారము అతనికి వచ్చిందట. ఒకరోజు గురువుగారిఎదుటే "గురుసేవ వలన ఎంతో తపోబలం జ్ఞానం వచ్చాయి. గురువుగారికి బ్రహ్మహత్యాపాతకంవంటిది వస్తే నాతపస్సుతో ఆయనకు దానినుండి విముక్తి కలిగించగలను" అంటాడు.  
వైశంపాయనుని శిష్యులలో  ఆయన మేనల్లుడు ఉండే వాడు. అతడు ఒకనాడు తనపట్ల అవిధేయతను ప్రదర్శిస్తే వైశంపాయనుడతన్ని కాలితో తన్నాడట. ఇంతలో సంబాళించుకొని "నేనూ కూడా వాని వలెనే ప్రవర్తించాను.నాదోషం కూడా బ్రహ్మహత్యతో సమానం" అంటాడు. అక్కడే ఉన్న యాజ్ఞవల్క్యుడు "నేను నా తపః శక్తితో గురువుగారి దోషం నివృత్తిచేస్తాను. ఈ పని ఇంకెవరూ చేయలేరు" అన్నాడు. గురువుగారికి కోపము వచ్చి, "నాకంటె గొప్పవాడివయ్యావా? నిన్ను నాగురుకులం నుండి బహిష్కరిస్తున్నాను. నీఅహంకారానికి ప్రతిఫలంగా నావద్ద నేర్చుకొన్న విద్య ఇక్కడే వదిలేసి పో" అని ఆజ్ఞాపిస్తాడు. యాజ్ఞ వల్క్యుడు గురువు పాదాలపై పడి, క్షమాపణ వేడి, ఆయన ఆజ్ఞ ప్రకారం యజుర్వేద విద్యనంతా అక్కడ రక్తసిక్త వమనంతో వదలిపెడతాడు. తన మాట ప్రకారం గురువుగారి  దోషంకూడా తొలగించాడు. ఆ విద్యను తిత్తిరి పక్షులు గ్రహిస్తే వాని పలుకులు విని ఇతరులు గ్రహించారు. ఇదే తైత్తిరీయ సంహిత. తరువాత యాజ్ఞవల్క్యుడు సూర్యుని ఉపాసించి కొంచెంభిన్నమైన శుక్లయజుర్వేదం నేర్చుకుంటాడు. ఇది ఉత్తరభారతంలో ప్రచారంలో ఉన్నది. మన ప్రాంతంలో ప్రథమ శాఖ బ్రాహ్మణులది ఈవేద శాఖ. సూర్యుడు శుక్లయజుర్వేదాన్ని యాజ్ఞవల్క్యునికి ఇచ్చినతరువాత సరస్వతీదేవిని ఆరాధించి ఇతరవిద్యలను పొందమని చెబుతాడు. యాజ్ఞవల్క్యుని తపోనిష్ఠ ఫలంగా సరస్వతీదేవి దర్శనం లభించినది. ఆమె అన్నివిద్యలూ ఎల్లవేళలా అతని హృదయఫలకంపై ఉండేటట్లు అనుగ్రహించినది.
2. బృహదారణ్యక ఉపనిషత్తు యాజ్ఞవల్క్యుని ప్రతిభను ఆవిష్కరిస్తుంది. మిథిలనుపాలించే జనక మహారాజు ఒకసారి ఈయనను యాగంచేస్తూ ఆహ్వానించాడు. అనేక మంది మహర్షులుకూడా ఆయాగానికి వచ్చారు. జనకుడు అక్కడ అపారమైన ధన రాశినీ, గోసంపదను అక్కడ ఉంచి "మీలో అందరికంటే శ్రేష్ఠుడను అనుకునేవారు ఈ సంపదను తీసుకు వెళ్ళండి" అన్నాడు.అక్కడ ఉన్న ప్రతివారికి ఆసంపద మీద ఆశ పుట్టి, తానేశ్రేష్ఠుడనని చెప్పాలని మనసులో ఉన్నా భయంతో సంకోచించారు. యాజ్ఞవల్క్యుడు లేచి తన శిష్యులను పిలిచి ఆసంపదను తన ఆశ్రమానికి తరలించమని ఆజ్ఞాపిస్తాడు.
వెంటనే సభలోని కొందరులేచి "నీవు అంత గొప్పవాడివా? నీజ్ఞానము ఏపాటిదో పరీక్షిస్తాం. ముందు మాప్రశ్నలకు సమాధానం చెప్పు" అని అతడితో వాదన లోనికి  దిగారు.  తాను గోసహస్రాన్ని అందరిలో శ్రేష్ఠుడనననే ఉద్దేశ్యంతో తీసుకోవడంతో యాజ్ఞవల్క్యునకు అందరిముందు తాను బ్రహ్మజ్ఞానిననీ, అందరికంటే అధికుడననీ నిరూపించుకోవలసి వచ్చినది. అందరిప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అందరి సందేహాలు తీర్చాలి. యజ్ఞయాగాదులు చేసి, జ్ఞానార్జనకూడాచేసి బ్రహ్మజ్ఞాన సిద్ధినిపొందినవారు కూడా తమ సందేహాలు తీర్చుకునేందుకు, అతడు తమమీద అధికుడౌనోకాదో తేల్చుకునేందుకు ప్రశ్నించారు.  కొందరు ఒకమార్గములో ఉండి ఇతరుల మార్గములు ఖండించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకా సాధనదశలోనే ఉండి కొంత అహంకారం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాల వారు ఈ ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యునితో వాదించడం కనుపిస్తుంది. యాజ్ఞవల్క్యుని వాదనా విధానం  వాదమా? జల్పమా? అనిప్రశ్నించినవారున్నారు.  యాజ్ఞవల్క్యుడు వారిప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. వాదనలో వారు అతనిని జయించలేక ఓటమిని అంగీకరించారు.

మిథిలా నగరానికి సమీపంలోని ఒక అరణ్యంలో కతుడనే మహర్షి నివసించేవాడు. ఆయన కుమార్తె కాత్యాయని. అమెకు యుక్తవయస్సు వచ్చాక ఆమె తండ్రి ఆమెను యాజ్ఞవల్క్యునకిచ్చి వివాహంచేస్తానని అడిగితే ఆయన అంగీకరించి వివాహం చేసుకున్నాడు. వారికి చంద్రకాంతుడు, మహామేఘుడు, విజయుడు అని ముగ్గురు పిల్లలు కలిగారు. ఈ ఘట్టం బృహదారణ్యకములో ఉన్నది. కాత్యాయని మంచి గృహిణి. ఇల్లు గడపడం, ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను సేవించడం వంటి పనులలో ఆమె నిమగ్నురాలై ఉండేది. మిత్రుడు అనే బ్రాహ్మణునికి మైత్రేయి అనే కుమార్తె ఉండేది. ఆమె రాజ సభలలో యాజ్ఞవల్క్యుని బోధలను, సంవాదాలను విని ఉన్నది. యాజ్ఞవల్క్యునివద్ద ఆత్మజ్ఞానాన్ని గ్రహించడం ఆమె కోరిక. ఇది సులభసాధ్యం కావడానికి ఆయనను పెండ్లిచేసుకోవాలని అనుకున్నది. ఆకాలంలోనే గార్గి అనే యోగేశ్వరి, మహాజ్ఞాని ఉండేది. ఆమె ఈ మైత్రేయిని తీసుకొనివెళ్ళి  కాత్యాయని అనుమతితో ఆమెను యాజ్ఞవల్క్యుని సేవలో నియోగించినది. ఆయన అనుగ్రహంచేత మైత్రేయిని భార్యగా అంగీకరించేటట్లు చేసినది గార్గి.   మైత్రేయి ఆకాలములోని మహిళలలో ప్రఖ్యాతి వహించినది. ఋగ్వేదములోని కొన్ని మంత్రాలకు ఆమె ఋషిగా చెప్పబడినది. ఆమెను బ్రహ్మవాదిని అనేవారు.
3. యాజ్ఞ వల్క్యుని జీవితం గురించిన వివరాలు క్లుప్తంగా సద్గురు శివానంద మూర్తిగారి మార్గ దర్శకులు - మహర్షులు - సం. 2.లో లభిస్తాయి. యాజ్ఞవల్క్యుని  గృహస్థజీవితం,తత్త్వాన్వేషణ ఒక ఆధునిక నవలగా తీర్చి దిద్దిన ఖ్యాతి కన్నడ రచయిత శ్రీ దేవుడు నరసింహ శాస్త్రిగారికి చెందుతుంది.
శ్రీదేవుడు నరసింహశాస్త్రిగారు (1895-1962) కన్నడభాషలో విఖ్యాత రచయిత. సంస్కృత పండితులు. ములకనాడు (తెలుగు) బ్రాహ్మణులు. బహుముఖ ప్రజ్ఞాశాలి. సంప్రదాయ రీతిలో మీమాంసా దర్శనమును అభ్యసించిన వారు. కర్మిష్ఠి. మీమాంసా దర్శన అనే కన్నడ గ్రంధం రచయిత. నటుడు. పాత్రికేయుడు. వేదకాలమునాటి ముగ్గురు ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలను నవలా రూపములో రచించారు. మహా బ్రాహ్మణ (గాయత్రీ మంత్ర ద్రష్ట విశ్వామిత్ర మహర్షి), మహాక్షత్రియ (నహుష చక్రవర్తి), మహా దర్శన (యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర) అనే మూడు చారిత్రక నవలలు కన్నడ ప్రేమికులు చదివితీరవలసినవి అని చెబుతారు. తెలుగువారికి వీని అనువాదాలు విభాతవీచికలు  అనే బ్లాగ్‌సైట్ లో లభిస్తాయి. అది శ్రీ జనార్దన శర్మగారి అనువాదాలు. ఆయన బెంగళూరు నివాసులని తప్ప ఇతరవివరాలు తెలియవు. మైత్రేయి గురించిన వివరాల అన్వేషణలో ఈ మంచి అంతర్జాల స్థానము కనబడినది. (http://vibhaataveechikalu.blogspot.in/ )
శ్రీ జనార్దన శర్మగారి మాటలలో
’మహాదర్శనము ’ శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారు రాసిన అనేక కృతులలో ప్రముఖమైన మూడింటిలో ఒకటి ,   చివరిది . ఇది యాజ్ఞవల్క్యుని కథ. పేరుకి యాజ్ఞవల్క్యుని కథ యథాతథముగా రాసినా , ఇందులో అనేక తత్త్వ రహస్యములు , అంతరంగ రహస్యములు , ధ్యాన రహస్యములు మనిషి ఎంతవరకూ అభివృద్ధి చెందవచ్చునో కళ్ళకు కట్టినట్టు , తేలికైన భాషలో , సులభముగా అర్థమయ్యే రీతిలో వ్రాసినారు .  మనలో , మన శరీరములో మనకు తెలియని ఇన్ని రహస్యములున్నవా అని అబ్బుర పరచే కావ్యము. వారి మిత్రులొకరు యాజ్ఞవల్క్యుని విమర్శించినారట.  అప్పుడు దేవుడు నరసింహ శాస్త్రి గారు ఆ మిత్రుడితో  " ఒక వేదము , ఒక బ్రాహ్మణము , ఒక ఉపనిషత్తు మానవ లోకానికి తెచ్చి ఇచ్చి, ఇంకొక ఉపనిషత్తుకు కారణమైన యాజ్ఞవల్క్యుడు మహాపురుషుడు . అతడిని ఇలాగ విమర్శించుట తగదు ’ అని చెప్పినారు . ఈ పుస్తకము వారు వ్రాయుటకు ప్రేరణ అదే .
4. మహాదర్శనము---ఉప సంహారము (శ్రీ జనార్దన శర్మగారి మాటలలో)
యాజ్ఞవల్క్యుడి గురించి ప్రాచుర్యములోనున్న విషయము తక్కువ. వాజసనేయ సంహిత ( శుక్ల యజుర్వేదము ) , బృహదారణ్యకోపనిషత్ ( యాజ్ఞవల్క్య , జనకుల సంవాదము ) మైత్రేయ్యుపనిషత్తు ( మైత్రేయి , యాజ్ఞవల్క్యుల సంవాదము ) మొదలైనవి ప్రాచుర్యములోనున్నను, యాజ్ఞవల్క్యుని గురించిన ఎక్కువ విషయములు శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారు పరిశోధించి తమదైన శైలిలో మిక్కిలి ఆసక్తిదాయకముగా వ్రాసిన ఎన్నో విషయములు ఈనాటికీ సులభముగా ఆచరణీయములు.
        పంచప్రాణములు ( ప్రాణోపాన వ్యానోదాన సమానములు ) మానవుని భౌతిక , మానసిక ఆరోగ్యములకు ఎంత ముఖ్యమైనవో , ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఎట్లు ఉపయోగపడునో , వాటిని ఆరాధించుటెట్లో , వాటివలన పొందగలుగు లబ్ధులేమిటో వాటిని ఎందరో సాధకులు ఈ నాటికీ  సాధన చేస్తూ ఉత్తమ గతి దిశగా పయనించుచున్నారు. వీటి గురించి ఏ మాత్రమూ అవగాహన లేనివారికి ఇదంతా ఒక పుక్కిటి పురాణము. ఇటువంటి ఆధ్యాత్మికమైన విషయములలో ఆసక్తి కలుగుటయే ఒక అదృష్టమని చెప్ప వలెను. ఆ తరువాత అందులో దిగితే గానీ వాటి గొప్ప దనము బోధ పడదు. పంచాగ్ని యజ్ఞము , పంచాత్మ సంక్రమణము , పంచభూతముల అనుగ్రహము పొందుట వంటివి ప్రతిఒక్కరూ అనుష్ఠించదగిన బృహదనుష్ఠానములు.  మానవుడికి సాధ్యము కానిదేదీ లేదు అను మాట తరచూ వింటుంటాము. అది ఎంత నిజమో , అంత అబద్ధము కూడా ! ఎందుకంటే ,  ప్రయత్నము చేయని వారికి అన్నీ అసాధ్యములే , అబద్ధములే ! . ప్రయత్నించినవాడు ఎన్నడూ విఫలము కాడు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి జన్మ హక్కు. దేవతలు , ఇటువంటి అనుష్ఠానములపై ఆసక్తి గల వారికై వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు అన్నది ఇందులో కాలు పెట్టిన ప్రతి ఒక్కరికీ అనుభవమే. ఇట్టి సత్యములను మరొకసారి మన ముందుకు తెచ్చి మనలను కార్యోనుముఖులుగా చేయుటకు ఉపయోగపడేదే ఈ యాజ్ఞవల్క్యుని చరిత్రము.
        సృష్ఠిలో సర్వులూ పరమాత్మ స్వరూపులనీ , బ్రహ్మ పదార్థము లేని చోటు లేదనీ మనమే ఆ బ్రహ్మ అని ఆదిశంకరుల వంటి మహనీయులు ఎందరో చెప్పియున్నారు. వారు చెప్పినది అసత్యమగునా ? మానవుడు సత్యమును గుర్తించుటలో కూడా ఎన్నో భ్రమలకు లోనైయున్నాడు. తన శక్తికి అందుబాటులో ఉండి , తనకు సాధ్యమయితే అది సత్యము, లేకున్న అసత్యము. తన శక్తిని వృద్ధిపరచుకోవచ్చునన్న విషయము అతడికి తట్టదు. అనేక ప్రారబ్ధ కారణముల చేత పుట్టుకతో వచ్చిన శక్తి మాత్రమే తనకు ప్రాప్తమన్న భ్రాంతిని వదలి ప్రయత్నించిననాడు సర్వశక్తులూ అతడివే !యాజ్ఞవల్క్యుడు సాధించిన విషయములు సాధించుటకు అందరూ శక్తులే. ఇక్కడ లోపించినది శక్తి కాదు. దృఢమైన సంకల్పము ! ఆ సంకల్ప బలమును పెంచుకొనుటకు మనకు ఇట్టి చరిత్రములు ఎంతో ఆవశ్యకములు.
5. యాజ్ఞవల్క్యునికి వృద్ధాప్యం వచ్చాక అతడు సన్యాసం స్వీకరించాలనుకున్నాడు. దానికి ముందు తనవద్ద ఉన్న సం పదను భార్యలకు పంచుదామనుకున్నాడు. "మీకేమి కావాలో కోరుకోండి" అని అడుగుతాడు. మాకు సంపద అక్కరలేదు. జరామృత్యువులులేని మోక్షమార్గం అడిగారు వాళ్ళు. అప్పుడు యాజ్ఞ వల్క్యుడు వారికి ధర్మబోధచేశాడు. భర్త భార్యను ప్రేమిస్తున్నాను, నేను ఆమెకు ప్రియుడిని అనుకుంటాడు. కాని అతడు తనకొరకే, తన ఆత్మకొరకే ఆమెకు ప్రియుడవుతున్నాడు. భార్యను భర్త ప్రేమించడంలో ఉద్దేశ్యం అతని ఆనందం కోసమే. ఎవరూఎవరినీ నిస్వార్థంగా ప్రేమించరు. తమకొరకే వాళ్ళను ప్రేమిస్తారు. ఇదే సూత్రం మిత్రులకు, పుత్రులకు, సమస్తానికీ వర్తిస్తుంది. అంతా నాకొరకే అంటున్నావు కదా! ఎవరీ నేను? - అని విచారణ చేయాలి.   అంతా ఆత్మయే అంటూ బోధించాడు. “ఆత్మావా అరే ద్రష్టవ్యో, శ్రోతవ్యో, మంతవ్యో నిధిధ్యాసితవ్యో” - అనిచెప్పబడేది ఇదే. అజ్ఞానంచేతనే దేహేంద్రియాత్మకమైన జీవభావం కలుగుతుంది. ఆత్మజ్ఞానమే అమృతత్వమని వారికి బోధించి అతడు సన్యసించి వెళ్ళిపోతాడు.
హిందూ మతమంటే మనుస్మృతిగుర్తుకు వస్తుంది. హిందువులు చదవకపోయినా దానిని ముఖ్యంగా చదివేవారు క్రైస్తవ మతప్రచారకులు. బ్రాహ్మణులకు వేసే శిక్షలు తేలికగా ఉంటాయని వారి ప్రచారం. నిజానికి మనుస్మృతి కృతయుగానికి స్మృతి. కాలానుగుణంగా అనేక స్మృతులు వచ్చాయి. త్రేతాయుగానికి గౌతమ స్మృతి, ద్వాపరానికి శంఖలిఖిత స్మృతి, కలి యుగానికి పరాశర, యాజ్ఞవల్క్య స్మృతులు చెప్పబడ్డాయి. యాజ్ఞవల్క్య స్మృతి ప్రధమంగా స్త్రీలకు ఆస్తిహక్కు ఇచ్చిన స్మృతి.
6. యాజ్ఞ వల్క్యుడు - గార్గి
ఆత్మ లేదా బ్రహ్మ జ్ఞానం కొరకు చేసే ప్రయత్నాలలో వేదకాలం లోనే వైవిధ్యం ఏర్పడినది. ఆకాలంలో పండితులు, ఋషులు మునులలో కూడా మాత్సర్యం ఉండేది. బృహదారణ్యకోపనిషత్తే దీనికి ప్రమాణం. మిథిలా నగరాన్ని ఒక జనకమహారాజు పాలించే కాలమది. ఆయన సభ ఆనాటివేద విద్యకు కేంద్రము.  ఋషులు, మునుల తత్త్వబోధలను  విని జనకుడు పండితుడు, రాజర్షి అయ్యాడు.  అటువంటి రాజు పాలనలో ఉంటే లోక కల్యాణమే. కనుక ఋషులు ఆయనను సందర్శించడం లోకానుగ్రహమే. యాజ్ఞవల్క్యుడు ధైర్యంగా రాజు అక్కడ వాగ్దానం చేసిన సంపదను తాను వశపరచుకోవడమే ఈ ఉపనిషత్తుకు ప్రాతిపదిక. ఈయనికి ధనాశయా? అహంకారమా? నిజంగా బ్రహ్మవేత్తయా? తానే అధికుడనని గర్వమా? ఇది సభలోని వారందరికీ వచ్చిన సందేహాలు. యాజ్ఞవల్క్యుడు తన ప్రసంగం ఇలా ప్రారంభించాడు. "సభలోని బ్రహ్మవేత్తలందరికి నా నమస్కారం." తాను బ్రహ్మజ్ఞానిని అని పరిచయం చేసుకోలేదు. "మీలో ఏ  ఒక్కరుకాని, అందరూ కాని, ఒకటికాని, అనేకముగానినన్ను ప్రశ్నలు వేయవచ్చును." ఈ ప్రకటనతో సభలో ఒక ముఖ్యమైన చర్చ ప్రారంభమయినది. ఒకరి తరువాత ఒకరు ఆయనను ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇక్కడ మనం యాజ్ఞ వల్క్యుడు, గార్గిల మధ్య జరిగిన సంవాదం తెలుసుకుందాం.
7. యాజ్ఞవల్క్యుడు ఎప్పటివాడు?
వేద ఋషులలో అర్వాచీనుడు యాజ్ఞ వల్క్యుడు.శ్రీకృష్ణుని కాలపు వాడు (సుమారు 5000 సంవత్సరాల చరిత్ర). ఇది చెప్పడంతేలికే. యాజ్ఞవల్క్యుడు ప్రధమంగా వైశంపాయనుని శిష్యుడు. కృష్ణుడు చదివిన (కృష్ణ) యజుర్వేదాన్నే ఆయన అధ్యయనం చేసి తరువాత గుర్వాజ్ఞ వలన దానిని వదలిపెట్టాడు.సూర్యుని వద్ద (శుక్ల) యజుర్వేదాన్ని సంపాదిస్తాడు. పరీక్షిత్తు కుమారుడు, జనమేజయుదు  ఈ వేదం, అనుబంధ బ్రాహ్మణం ఆధారంతోనే అశ్వమేధంచేస్తాడు.    
గార్గి బ్రాహ్మణము
గార్గికి భారతీయ తత్త్వ శాస్త్రములోగల కీర్తి ఆమె బృహదారణ్యకములో యాజ్ఞవల్క్యునితో పాల్గొన్న చర్చవలన వచ్చినది. యాజ్ఞవల్క్యుడు గొప్పయోగి. ఆయనను యోగీంద్రుడు అని వ్యవహరించేవారు. యోగయాజ్ఞవల్క్యము అనేగ్రంధానికి ఆయన కర్త. దీనిలోకూడా గార్గి యాజ్ఞవల్యుల సంవాదం ఉంటుంది. ఈమెను గార్గి వాచక్నవి అంటారు. వచక్నుడనే ఆయన కుమార్తె. ఆమె యాజ్ఞ వల్క్యుని బ్రహ్మజ్ఞానాన్ని పరీక్షించడానికి ప్రయత్నముచేసింది. యాజ్ఞవల్క్యుడు సభలో అందరి కంటె అధికుడనని నిరూపించుకుంటాడు.  ఈ సంభాషణ వాదము ఎలా ఉండాలో నిరూపిస్తుంది. వాదము ఇద్దరిమధ్యనే జరుగుతుంది కాని అది సభలో అందరికి వారి వారి స్థాయిలను ఎవరికివారు గమనించుకునేటట్లు చేస్తుంది.  అశ్వలుడు, భుజ్యుడు, ఉషస్తుడు, కహోలుడు అనే మునులు యాజ్ఞవల్క్యుని  బ్రహ్మము గురించి ప్రశ్నలు అడిగినతరువాత అవకాశం గార్గికి వచ్చింది. అందరు అడిగే ప్రశ్నలు బ్రహ్మ వస్తువు, ఆత్మవస్తువులను గురించే. కాని అందరూ తమ తమ ప్రశ్నలు అనేక విధాలుగా అడిగారు. యాజ్ఞవల్క్యుడు ఆ ప్రశ్నలనుబట్టి, వారి స్థాయిని, అడిగినవారి ఉద్దేశ్యాన్ని గ్రహించి వారికి తగిన రీతిలో సమాధానాలు చెప్పాడు.
8. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అక్కడ ఉన్నవారెవరూ యాజ్ఞవల్క్యుని గురించి తెలిసిన వారు కాదు. విజ్ఞాన శాస్త్రము యొక్క విజ్ఞానము అన్నీతెలుసుకున్నాననే భ్రాంతిని కలుగచేసి అసలు బ్రహ్మవస్తువునిగాని, బ్రహ్మజ్ఞానిని కాని గుర్తించకుండా చేయగలవు. బ్రహ్మజ్ఞాని తన జ్ఞానాన్ని ప్రదర్శించుకునే ప్రయత్నం చేయడు. బాలుని వలె, లేదా ఉన్మత్తునివలె కనుపిస్తాడు. ఆ లోతులేని వారి పాండిత్యము తెలిసిన కొంచెము ప్రదర్శించుకునే ప్రయత్నంలో యాజ్ఞవల్క్యుని ధిక్కరించే, ప్రశ్నలు వేయడముకూడా కనబడుతుంది. మొదట గార్గి అడిగిన ప్రశ్నలు ఇతరులు అడిగిన విధముగానే ఉన్నాయి. ఆయనను పరీక్షించడానికి అడిగిందా? ఆయన మహాత్మ్యాన్ని నిరూపించడానికి అడిగినదా? ఇది తెలియకుండా అడిగింది.  
గార్గి వరుసగా సృష్టిలోని పంచ భూతముల ఆధారములను గురించి ప్రశ్నించింది. ఆమె మొదటి ప్రశ్న "కస్మిన్ను ఖల్వాప ఓతశ్చ ప్రోతాశ్చేతి?" ఈ కనుపించే  సృష్టి అంతా జలముచే ఓతప్రోతముగా ( చేనేతవస్త్రములో పడుగుపేకల వలె) వ్యాపింపబడి ఉన్నది. జలమునకు ఈవ్యాపించే లక్షణము ఎక్కడనుంది వచ్చినది? దానికి మహర్షి "ఓ గార్గీ, వాయువు వలన" (వాయో గార్గేతి) అని సమాధానం చెబుతారు. ఆమె ప్రశ్న "వాయువుకు ఆశక్తి ఎక్కడి నుండి వచ్చినది?" "అంతరిక్షం వలన" ఆయన సమాధానం. "అంతరిక్షానికి ఆశక్తి ఎక్కడి నుండి వచ్చినది?" ఆమె తిరిగి ప్రశ్నించింది.
"గంధర్వలోకము నుండి" ఆయన సమాధానం. గార్గి శర పరంపరవలె ప్రశ్నలు సంధిస్తున్నది. "గంధర్వలోకమునకు?" ప్రశ్న. "ఆదిత్యలోకమునుండి?" సమాధానము. "ఆదిత్యలోకమునకు?" ప్రశ్న.   "చంద్రలోకమునుండి" అని సమాధానము. వరుసగా చంద్రలోకమునకు  నక్షత్రలోకము, దేవలోకము, ఇంద్రలోకము, ప్రజాపతిలోకము, బ్రహ్మలోకము - ఈ విధముగా ఉన్న ఒకదానికంటె ఉన్నతముగా ఉన్న మరొకలోకమునుండి శక్తి వచ్చుచున్నదని  యాజ్ఞవల్క్యుడు చెబుతాడు. బ్రహ్మలోకము సృష్టిరచనా సామర్ధ్యమునకు కేంద్రము.  గార్గి ఇదే విధముగా "బ్రహ్మకు ఈ సృష్టి రచనా శక్తి ఎక్కడనుండి వచ్చినది? పంచభూతములను ఎలా సృష్టించాడు? స్థితి లక్షణాన్ని పంచభూతములకు ఎలా ఈయగలిగాడు?" అని ప్రశ్నించినది. దానికి యాజ్ఞవల్క్యుని సమాధానం అనేక వ్యాఖ్యానాలకు దారితీసినది. "ఇది బ్రహ్మవిద్య గార్గీ! అనవసరముగా పిచ్చిప్రశ్నలు వేయకు. ఇక అధికంగా ప్రశ్నిస్తే తలతెగి పడిపోతుంది సుమా!" అన్నాడు యాజ్ఞవల్క్యుడు. ఆయన కోపిష్ఠియా? గర్విష్ఠియా? సమాధానము తెలియక తన కోపాన్ని ప్రదర్శించాడా? ఇలాంటి సందేహాలు ఆనాడు సభలోవారికి, ఈనాడు మనందరికీ కలిగే అవకాశం ఉన్నది.    
9. గార్గి -- " బ్రహ్మ లోకములు దేనిలో అల్లుకొని ఓతప్రోతమైపోయి ఉంటాయి ? "
యాజ్ఞవల్క్యుడు -  " దానికి ముందర అడగ వద్దు. గార్గి , ఆ బ్రహ్మలోకములలో బ్రహ్మాండములను నిర్మించు భూతములు ఉన్నాయి. భూతములు ఉన్నంతవరకూ జ్ఞానము బాహ్యము. జ్ఞానము భూతములను దాటిననూ అంతటా నిండిపోదు. అప్పుడు  విషయమును తెలుసుకొనుట ఆగమము వలన. అనుమానము వలన కాదు. కాబట్టి ఆగమమును వదలి , అనుమాన ప్రధానముగా వెళితే , విషమును అన్నమని తిన్నట్టగును. వదిలివేయండి. " ఇది యాజ్ఞవల్క్యుని వాక్కు "తల తెగి పడిపోతుంది" అన్న వాక్యానికి నరసింహ శాస్త్రిగారి వివరణ.
దీనిని మరి కొంత వివరంగా చూదాము. "పంచదార తీయగానుండును." అంటే "తీపి అనగానేమి?" అని ప్రశ్నిస్తే, దానిని గ్రహించుటకు పంచదార అడిగిన వారి నోటిలో వేయుట ఒకటే మార్గము. తీయదనము వాచా వర్ణించలేనిది. యాజ్ఞ వల్క్యుడు గార్గి ప్రశ్న పరంపరకు వాచా చెప్పగలిగినంతవరకు చెప్పాడు. తరవాత స్థాయి పరిజ్ఞానము మనోబుద్ధులతోకాక తపస్సువలన తెలుసుకొని అనుభూతము కావలసినది. బ్రహ్మ వస్తువు అనిర్దేశ్యము. సర్వభూతములందు ఆత్మను, ఆత్మయందు సర్వ భూతములను చూడాలి. అప్పుడే పరబ్రహ్మవస్తువును చూస్తాడు. ప్రవచనాలు వింటేనో, ప్రశ్నోత్తరాల ద్వారానో, వాదముతోనో లభించేది కాదు. మనము అనేక గుణాలతో, అనేక నామాలతో భగవంతుని వర్ణిస్తాము. అంటే ఆయన మన ఊహలకు అనుగుణముగా ఉంటాడనికాదు. ఆయన సంపూర్ణస్వరూపము ఇది అనిచెప్పగలవారు లేరు. శిరస్సు పతనమౌతుంది అంటే శాపముకాదు. మనోబుద్ధులతో  తెలుసుకొవాలనే ప్రయత్నము విఫలమౌతుంది అని అర్థము.   గురూపదేశము, అనుగ్రహము, ఆధ్యాత్మిక సాధన వలన మాత్రమే తెలియగల జ్ఞానమది.
గార్గి అది విని, విధేయురాలవలె చేతులు జోడించి , తన చోటుకి వచ్చింది.
జైహింద్.
Print this post

2 comments:

సురేష్ బాబు చెప్పారు...

ఈ వ్యాసం వ్రాసి మమ్ములను మన సనాతన ఋషుల గురించి స్మరణకు పురికొల్పినందులకు చాలా సంతోషం అండీ.

మన దౌర్భాగ్యం ఏంటంటే "తల తెగి పడిపోతుంది" అని యాజ్ఞ్యవల్కులు సాధ్వి గార్గితో అన్నందుకు స్త్రీవాదులు అని చెప్పుకొనే మన నేటి మనుషులు ఆయనకు సమాధానం తెలియక బెదిరింపుతో పురుషాధిపత్యాన్ని ప్రదర్శించాడని అంటుంటారు. వారిని బ్రహ్మజ్ఞాని యాజ్ఞయవల్కులు క్షమించి సన్మార్గము చూపెదరు గాక.

latha purushotham చెప్పారు...

ఏదైనా భౌతిక శాస్త్రం లో మనకు వచ్చే అనుమానాలకు సమాధానాలు చెప్పారు .దీనికి మించి వచ్చే ఆలోచనలు నిజంగా తపస్సు లో ఎవరి కివారు తెలుసుకోవలసిందే

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.