జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు మహాశివరాత్రి. ఆపార్వతీపరమేశ్వరుల చల్లని చూపులవెన్నెలలు మీపై ప్రసరించాలని,మీ జీవితం ఆనందంగా, చిదానందంగా సాగాలని మనసారా కోరుకొంటున్నాను.
ఈ శివరాత్రి సందర్భంగా శివతాండవం వింటూ చదువుకో వచ్చును.ఆ పరమేశ్వరుని దర్శనభాగ్యం మనసుకు కలుగుతుంది.
VIDEO
శివునికి మనసారా జ్ఞానాభిషేకం చేయ దలచుకున్నారా? ఐతే ఈ క్రింది యూ.ఆ.రెల్.పై క్లిక్ చెయ్యండి. అభిషేకంద్వారా శివదర్శన భాగ్యం పొందండి.
రుద్ర నమకము - చమకము - భావము.http://andhraamrutham.blogspot.in/2011/10/blog-post_27.html#.VOIMgIKqqko
శ్రీ శివాష్టోత్తరశత పంచచామరావళి . (శివ శతకము)
రచన: చింతా రామ కృష్ణా రావు.
ఓం నమశ్శివాయ.
-: అంకితము :-
సీ. శ్రీకరంబైనట్టి చింతాన్వయంబున
-జనియించినాడ సుజనుల నడుమ.
వేంకటరత్నము వేంకట సన్యాసి
-రామరావుల పుత్రు. రామ కృష్ణ
రావుగా వర్థిల్లి, రాఘవాచార్యుల
-ప్రథమ శిష్యుండనై వ్రాసినాఁడ
నుత శివాష్టోత్తర శత పంచచామరా
-వళి పేరఁ బరగు శివ శతకమును
గీ. శివుని కృపఁ జేసి. దీనిని సవినయముగ
నాది దంపతులై మనకమరియున్న
యా భవానికి భవునకు నంకితముగ
నందఁ జేసితి, నే, ముక్తి నంద గోరి.
1 .
శివా ! భవా ! నమో ೭ స్తుతే !
విశేష భక్త వత్సలా !
భవాని వామ భాగమందు భవ్యయై వసింపగా
నవీన దివ్య తేజసంబు నాట్యమాడు నీ దరిన్ .
నివాసముండుమా మదిన్ . వినీల కంధరా ! శివా !
2 . నమో ೭ స్తు తే . సదా శివా ! సనాతనా ! నమో ೭ స్తు తే .
నిమేషమందె నీల కంఠ ! నీ కృపా కటాక్షముల్
ప్రమోదమందఁ జేయుఁగా , ప్రభావపూర్ణ తేజమై ,
నమస్కరింతునయ్య నీకు . నన్నుఁ గాంచుమా ! శివా !
3 .
శశాంక శేఖరా ! హరా ! విశాల నేత్ర ! సుందరా !
ప్రశాంత చిద్విరాజమాన భవ్య భక్త వత్సలా !
నిశీధిలో విశేష కాంతి నింపి లింగమూర్తిగా
నశేష భవ్య భక్త కోటి యార్తిఁ బాపితే ! శివా !
4 .
ఉపాసనా ప్రభావ మెన్న నో హరా ! పొసంగునే ?
కృపా నిధీ ! ఉపాసకుల్ నిరీక్షణన్ నినున్ గనన్
ప్రపూజ్యమాన దివ్య తేజ భద్ర లింగ దర్శనం
బపూర్వమై , యమేయమైన హాయి గొల్పుఁగా ! శివా !
5 .
సమస్త దోష హారి వంచు జాగరంబుఁ జేసి , నిన్
ప్రమోద మందఁ జేయఁ బూను భక్త కోటిఁ గాంచితే ?
క్షమింపుమా దురాత్ములన్ , విశాల నేత్ర ! శంకరా !
నమామి భక్త వత్సలా ! ప్రణామమందుమా ! శివా !
6 .
సరోరుహాననా ! నినున్ ప్రసన్నతం గనుంగొనన్
ధరాతలంబునన్ బుధుల్ ప్రతాపమొందు చుందురే !
దురాత్ములైన గాని నిన్నుఁ దోయిలించి మ్రొక్కినన్
కరావలంబమిచ్చి దీక్ష కాచు చుందువే ! శివా !
7 .
ప్రదీప్త దీప మొక్కటైన భక్తి నీదు సన్నిధిన్
ముదంబుతో వెలుంగఁ జేసి పూజ చేయు వారికిన్
సదా సుయోగ భాగ్యమిచ్చి , సత్ కృపన్ గ్రహింతువే !
మదీయ చిత్త సంస్థితా ! సుమంగళాకరా ! శివా !
8 .
దురంత దుష్కృతంబులేను దుర్మదాంధ వర్తినై
నిరంతరంబు చేసితో ! వినీతునై చెలంగితో .
కరంబు నిచ్చి గాచితీవు గౌరవంబు దక్కెరా !
వరంబు నాకు నీ యుదార భావ మీశ్వరా ! శివా !
9 .
ప్రదోష కాలమందు నిన్ను భక్తి తోడఁ గాంచితిన్ .
ముదావహంబుగా భవాని పూజ లందుచున్ భవా !
సుధా సుదృక్పరంపరన్ సుశోభఁ గూర్చి , యంబకున్
విధేయతా స్వభావ మీవు వెల్వరించితే ! శివా !
10 .
స్వధర్మ రక్షణంబు లోన సాధుపుంగవాళి నీ
విధేయులై మనోజ్ఞ భావ వీక్షణాళి నొందగా
మదిన్ దలంచి చూచుచుంద్రు , మాంద్యభావ శూన్యతన్ ,
ప్రదీప్త దివ్య తేజమిచ్చి రక్ష సేయుమో శివా !
11 .
ప్రపూజ్య దివ్య భక్తి భావ పారవశ్యమందు నే
ప్రపూజ్యుఁడా ! ముదంబు తోడ పాప భావ నాశమున్ ,
తపో విధాన భాగ్యమున్ , ప్రధాన భక్తి తత్వమున్ ,
నెపంబు నెంచకిమ్మటంచు నిన్నుఁ గోరనా ? శివా !
12 .
వరంబయెన్ నమశ్శివాయ పంచ వర్ణ మంత్ర మీ
ధరన్ . దురంత దుఃఖ దూరతన్ , కృతార్థతన్ , భవత్
కరావలంబమున్ , పరంబు కల్గఁ జేయు . భక్తులన్
నిరంతరంబు కాచు చుండు , నిర్వికారుఁడా ! శివా !
13 .
మనోజ్ఞుఁడా ! నమో ೭ స్తుతే .
ఉమాపతీ ! నమో ೭ స్తుతే .
యనాధుఁడా ! నమో ೭ స్తుతే . మహాత్ముఁడా ! నమో ೭ స్తుతే .
వినీతుఁడా ! నమో ೭ స్తుతే . సువేద్యుఁడా ! నమో ೭ స్తుతే .
పునీతుఁడా ! నమో ೭ స్తుతే . సుపూజ్యుఁడా ! మహా శివా !
14 .
నిరామయుండ ! నిర్గుణుండ ! నిర్వికార ! ఈశ్వరా !
ధరాతలంబు నేలు చుండె దౌష్ట్యముల్ . గ్రహించితే ?
కరావలంబ మీవె యిచ్చి కావకున్న మాకికన్
చరింప సాధ్యమా ! మహేశ ! సత్ స్వరూపుఁడా ! శివా !
15 .
నరాధముల్ , నరాంతకుల్ , వినాశకారకుల్ భువిన్
పరాపకార మూర్ఖులున్ , స్వభావ సిద్ధ దుష్టులున్ ,
చరించు చుండ్రి స్వేచ్ఛగా . విచార మగ్న చిత్తులై
నరోత్తముల్ కృశించు చుండ్రి . న్యాయమేదిరా ? శివా !
16 .
స్వభావ సిద్ధ భక్తి భావ సాధు మానవాళికిన్
శుభాకరా ! ప్రపూజ్య ! నీదు సూక్ష్మ దివ్య బోధనల్
ప్రభాసమాన ! స్పష్టమయ్య . భాగ్యమీవ వారికిన్ .
విభుండ వీవ కాతువంచు విశ్వసింతురో శివా !
17 .
గణాధిపుండు మీ విశిష్టగౌరవంబునెన్నుచున్ ,
ప్రణామముల్ ప్రదక్షిణల్ ప్రభావమున్ గ్రహించి తా
ననేక మాచరించెగా ! గణాధిపత్యమందెగా !
సనాతనా ! నినున్ గనన్ బ్రశాంతి కల్గునో శివా !
18 .
హిమాద్రి పుత్రి నీ విచిత్ర హృద్య సుస్వరూపమున్
ప్రమోదమందెఁ గాంచి , యేమి భాగ్య మబ్బె నామెకున్ ?
ప్రమాణ మీవ సృష్టికంచు భవ్య భావనన్ వివా
హ మాడె నిన్నుఁ బ్రేమతో , మహాత్ముఁడా ! మహాశివా !
19 .
హిమాచలాద్రి పుత్రి యుత్సహించి నీపయిన్ మహా
ప్రమోద మానసంబుతోడ భక్తి భావ యుక్తయై
యమేయ దీక్షఁ బూన , నీవు నామెనంది యుండగా
యమోఘమంచు దివ్యులెల్ల హర్షమందిరో శివా !
20 .
నమామి తే ! మనోహరా ! అనాధనాధ ! సుందరా !
నమామి తే ! ప్రభాన్వితా ! అనంత రూప ! తే నమ :!
నమామి తే ! వినీల కంఠ ! నాగ భూషణా ! నమ :!
నమామి తే ! జగత్పితా ! ప్రణామమందుమా ! శివా !
21 .
ఉమాపతీ ! కృపాంబుధీ ! సమున్నతత్వమంది నిన్
బ్రమోద మానసుండనై సభక్తిఁ గొల్చి , భ్రాంతులన్ ,
సమస్త లంపటంబులన్ , విషాద పూర్ణ జన్మమున్ ,
బ్రమాదమున్ బరిత్యజింతు . ప్రాపుఁ గొల్పుమా ! శివా !
22 .
ఉమాహరుల్ స్వరూపమందు నొక్కటై రహించగా
రమేశుఁడున్ విరించియున్ సరస్వతీ రమా సతుల్
ప్రమోద మంది గాంచిరే వరంబుగా ! మనంబునన్
నిమేషమైన నిన్ను నిల్పు నేర్పు నీయుమా ! శివా !
23 . సముజ్జ్వలత్ప్రశస్త లింగ సత్కృపా కటాక్షముల్
నమస్కరించు నట్టి వారు , నవ్య దివ్య భావులున్
ప్రమోద దివ్య చిత్తులున్ , ప్రభాత సేవ భక్తులున్ ,
నిమేష కాలమందు పొందు , నిత్యుఁడా ! మహా శివా !
24 .
మృకండు పుత్ర రక్షకా ! వరేణ్యులన్నఁ బ్రీతితో
ప్రకాశమాన గౌరవంబు , ప్రాభవంబుఁ గొల్పుదే ?
దుకూల , సర్వ భోగ భాగ్య దుండ వౌదువయ్య ! త్ర్యం
బకా ! మహాత్మ ! నన్ను కావుమా ! మహేశ్వరా ! శివా !
25 .
జలాభిషేకమొప్పఁ జేయ , చాల సంతసింతువే !
కులాలుడైనఁ గాని వానిఁ కూర్మితో గ్రహింతువే !
విలాసవంతులైన గాని , పేదలైన గాని నీ
తలంపునందునొక్కటే . నితాంత భాగ్యదా ! శివా !
26 .
ప్రపంచ భూత సాక్ష్య దివ్య పంచ వక్త్ర శోభివే ,
విపంచి నాదమాధురిన్ సువేద్యమౌదువే హరా !
కృపాకటాక్ష వీక్షణల్ ధరిత్రిపైన నింపితే !
ప్రపూజ్య ఓం నమశ్శివాయ భవ్య మంత్రమై . శివా !
27 . వినాశమన్నదెన్న లేని విశ్వ సాక్షివే ! హరా !
మనోజ్ఞ సృష్టి చేసి , దాని మట్టిఁ జేయ న్యాయమా ?
ప్రణామముల్ ప్రపంచ దివ్య భవ్య భాగ్య రక్షకా !
ననున్ గనంగదోయి సాంబ ! నా మనోజ్ఞుఁడా ! శివా !
28 . నిరంతరాయ దృష్టి నీది .
నిర్వికల్పుఁడా !
భవా !
భరింపరాని దుష్ట భావ పాపు లేల పుట్టిరో !
విరించి చేయు సృష్టిఁ గాంచి వేగమే గ్రహించి , యీ
భరంబుఁ బాపి కావుమయ్య భారతాంబ నో శివా !
29 .
కవీశ్వరుల్ గ్రహించునట్లు కానిపించుమా హరా !
నివేదనంబు లందుమా ! వినీతులన్ గ్రహింపుమా !
సువేద్యమై , మనోజ్ఞమైన సుందరాకృతిన్ కృపన్
కవిత్వ తత్వ రూప మొంది కాంచఁ జేయుమా ! శివా !
30 .
గుణత్రయంబు నీవయై , ప్రకోప దుష్ట సంహతిన్
వినాశమొందఁ జేయవేమి ? విశ్వ రూపుఁడా ! హరా !
వినీతులెల్ల బాధలొంద ప్రీతి తోడఁ గాంతువా ?
అనాది దుష్ట తత్వమెన్ని యార్పుమా ! మహా శివా !
31 .
సుమంగళాకరా ! నినున్ బ్రశోధనంబు చేయుచో
యమంగళంబులన్ని బాయు నాత్మ తేజ దర్శనం
బమోఘమై లభించునయ్య ! హర్షణీయమై . సదా
సమాధి సుస్థితిన్ వెలుంగ సాధ్యమౌనుగా ! శివా !
32 .
ప్రభాత వేళ స్నాన సంధ్య ప్రార్థనల్ చరించుచున్ ,
విభో ! త్వదీయ లింగ మూర్తి వేల్పుగా గణించి , మా
యభీప్సితంబు లెల్లఁ ద్రోచి , యద్భుతాభిషేకముల్
శుభాకరా ! గ్రహింపుమన్నశోభఁ గూర్తువే ! శివా !
33 .
నిదానమే ప్రధానమంచు నిన్ను నమ్మి యున్నచో ,
విధాత వ్రాయు వ్రాత నైన విశ్వసింపనేలరా !
సుధా ప్రపూర్ణ జీవితంబు శోభిలన్ యమర్తువే !
మదిన్ విశాల భావమున్న మమ్ముఁ గాతువే ! శివా !
34 .
విరించి సృష్టి లోనఁ గల్గు వింతలెల్ల కంటివా ?
ధరాతలంబునందునుండు ధర్మమే నశించదా !
నరాధముల్ పొనర్చు దౌష్ట్య నర్తనంబు కానరా !
కరావలంబమిచ్చి మమ్ము కావుమా ! మహా శివా !
35 .
త్రినాధ పూర్ణ దివ్య రూప ! దేవ దేవ ! శంకరా !
త్రినేత్రుఁడా ! మనోజ్ఞ భావ దీప్తిఁ గొల్పి కావరా !
అనాధనాధుఁడా ! కనన్ మహా విశిష్ట దైవ మీ
వనంగ నుండుమా యెదన్ , శుభాస్పదంబుగా , శివా !
36 .
రమా వినోది యైన విష్ణు రక్షణంబు చూచితిన్ !
యమోఘ వాణినేలు బ్రహ్మ యాత్మ శక్తి చూచితిన్ !
ప్రమోద మానసుండవై వరంబు లిచ్చుటందు నీ
సమానులన్ గనంగ లేను . శంకరా ! మహాశివా !
37 .
స్వభావ సిద్ధ సత్స్వభావ భాగ్య మీవ కొల్పినన్
విభో ! దురంత దౌష్ట్యముల్ నవీనులందు కల్గునా ?
శుభప్రదంబు నీకు , మాకు , చూచి మంచి కొల్పుమా !
ప్రభో ! శుభంకరా ! మహేశ ! భక్త బాంధవా ! శివా !
38 .
నిశాచరుల్ నరాధముల్ వినీతి దూరులీ భువిన్
నశింపఁ జేయుచుండ్రి . వారి నాశనంబు చేయుమా .
నిశీధిలోన నంగనల్ పునీత మార్గమందునన్
వశింపగల్గఁ జేయుమా ! భవా ! గ్రహింపుమా ! శివా !
39 .
నవీన మార్గ మంచు నేడు నాట్య శాలలందునన్
వివస్త్రలై కృశాంగులే సవిస్తరంబుఁగా తమన్
ప్రవేశపెట్టుకొందు రేల ? పాప చింత లేదొకో ?
భవా ! త్వదీయ దివ్య దృష్టిఁ బాపుమిట్టి వో శివా ! ?
40 .
ఉమా ధవా ! ప్రమోదమా ? సమున్నతిన్ దురాత్మకుల్ ,
ప్రమాదమందు సజ్జనుల్ ప్రభావమేది యుండెరా !
సమస్త మీవ చూచు చుండి సజ్జనాళిఁ బ్రోవుమా !
ప్రమోద మంద సజ్జనాళి భక్తిఁ గొల్తురో శివా !
41 .
ప్రశాంత చిత్తమందు నిన్ను భక్తిఁ గొల్వఁ గోరగా
నశాంతి చుట్టి ముట్టు నన్ను నాత్మ తేజ మీవయై
విశేష దివ్య దర్శనంబు ప్రీతి తోడఁ గొల్పుమా !
అశేష భవ్య భక్తకోటి యాశ తీర్చుమా శివా !
42 .
మనోజ్ఞుఁడా ! అశేష సృష్టి మానసంబు నందునే
వినోద మంద తల్చ నీవు విశ్వమే జనించెనా !
అనాధ నాధ ! నీదు లీల హాయిఁ గొల్పు నీకు . నీ
వినోదమెల్ల శిక్ష మాకు విశ్వనాథుఁడా ! శివా !
43 .
నమోనమశ్శివాయ యంచు నాల్కపల్కినంతనే
ప్రమోదమంది రక్ష సేయ వచ్చితీరుదీవు . నీ
సమాను లెవ్వరయ్య కావ ? సర్వ భూత సంస్థితా !
నమో నమో నమో ೭ స్తు తే ! ప్రణామ మందుమా ! శివా !
44 .
ప్రమాద సూచి నీవు గాంచి భక్త కోటి కెల్లెడన్
ప్రమేయముండు , లేక పోవు , రక్షఁ గొల్ప చూతువే !
ప్రమాణమౌచు నిల్తువే ! శుభంబుఁ గల్గఁ జేతువే !
సమాను లెవ్వరయ్య నీకు ? సన్నుతాత్ముఁడా ! శివా !
45 .
పవిత్ర భక్తి భారతీయ భావ జాలమందునన్
ప్రవర్ధిలున్ శివాంశఁ జూచి , భక్తి తోడ నెల్లెడన్
శివా ! హరా ! యటంచు బిల్చు క్షేమమందఁ జేయగన్ !
భవానితోడఁ గావుమయ్య ! భారతీయులన్ శివా !
46 .
చరాచరంబు లం దుఁ జిక్కి సంచలించు నామదిన్
నిరాశఁ జిక్కకుండ కావ నీకె సాధ్యమౌనుగా .
దురాశ కల్గ నీక కాచు ధూర్జటీ ! ఉపేక్షయా ?
పరాచికంబు లేల కావ ? భక్త బాంధవా ! శివా !
47 .
మదేభ సర్ప శ్రీ లవేమి మంత్రముల్ పఠించెరా ?
ముదావహంబయెన్ మనోజ్ఞ పూజలీవు పొందుటన్ .
సదా విశాల భావ పూర్ణ సత్ ప్రశస్త భక్తులన్
మదిన్ గ్రహించి కాతు వీవు . మా మహేశుఁడా ! శివా !
48 .
ధరాతలంబునందు నీ ప్రధాన భక్త బృందముల్
చరించు ధర్మ బద్ధులై ప్రశస్తి నీకుఁ గొల్పుచున్ .
పరాత్పరా ! గ్రహించరా ! స్వభావ సిద్ధ సద్గుణుల్
దురాగతంబు లోర్తురే ! గతుల్ మరల్చరా ! శివా !
49 .
అమోఘ భవ్య పాద పద్మమాశ్రయించు వారికిన్
నమస్కరించు వారికిన్ , వినమ్రులైన వారికిన్ ,
శమ క్షమాది సద్గుణ ప్రశస్తి కొల్పు శంకరా ! -
నమస్కరింతునయ్య నీకు . నన్నుఁ గాంచుమా ! శివా !
50 .
అయోమయాంధకార మీవు హాయిగా సృజించి , యే
ప్రయోజనంబు కోరినావు ? బ్రహ్మ సాక్షిగా హరా !
ప్రయాస కాక యేమి దక్కె ? ప్రస్ఫుటంబుగా భవ
ద్దయాప్రభావ కాంతి , మార్గ దర్శకంబురా ! శివా !
51 .
విశిష్ట సృష్టి బ్రహ్మచేయ , విష్ణు సంస్థితంబయెన్ .
విశాల విశ్వ సంలయంబు వేల్పు వీవ చేయగా ?
ప్రశాంతమైన ధ్యానివై ప్రభావ మొందినావుగా !
నశింపఁ జేయు వృత్తి యెట్లు నచ్చెరా ? మహా శివా !
52. మహాశివా ! మహాశివా ! ప్రమాణ మీవ మాకు . నీ
మహోదయంబు సృష్టికే సమస్త సత్ఫలంబయా !
మహాత్ములెన్నినిన్నుఁ గాంచు , మమ్ముఁ గాతువీవనున్ .
మహాద్భుతంబుచూపుదీవుమమ్ముఁగావుచున్ శివా !
53 .
శనీశ్వరుండు లోక మందు సంచరింప వీలుగా
మనుష్యులందు భక్తిఁ గొల్పి మాన్యుడా శనీశ్వరుం
డనంగ దాగినావు కాని , యడ్డగింప నేర్వవే ?
యనాధ వోలె తొఱ్ఱలోన నంబుజాక్షుఁడా ! శివా !
54 .
సుధర్మ మాచరింపగా నశుద్ధులన్ వధింపనా ?
స్వధర్మ మాచరించుచున్ ప్రభావమేది యుండనా ?
సుధర్మమా ? స్వధర్మమా ? త్రిశూల పాణి తెల్పుమా !
ప్రధాన ధర్మమాచరింతు . భవ్యమేదిరా ? శివా !
55 .
పరాత్పరుండ వీవటంచు భక్తితో భజింపగా
నిరాశఁ గొల్పుదేల నీవు ? నీవు గల్గి యుండగా
ధరాతలంబునందు దుష్ట దంభులన్ గణింపనా ?
నరాధమాళి యేచుచుండె . నన్నుగావరా ! శివా !
56 .
పరాక్రమాదులెల్ల నీవు పన్ను నట్టి యుక్తులే .
దురంత దుర్దశల్ వరింప , త్రోవ కాన రాదుగా ?
పరాక్రమంబదేమి చేయు ? భక్తి నిన్ స్మరించినన్
దురంత దుర్దశల్ తొలంచి త్రోవ చూపుదే ! శివా !
57 .
కవిత్వ తత్వ దర్శనంబు కావ్య కర్తఁ జేయునా ?
భవాని సత్కృపాబ్ధి మున్గు భక్తుడన్న ప్రీతితో
కవిత్వ శక్తి నిచ్చి , వాణి కావ్య రూప మొందునే !
భవుండ ! భాగ్యశాలివే భవాని కల్గుటన్ శివా !
58 .
సుధార్ణవంబు నందు ముంచు సోమశేఖరా ! నినున్ .
మదాంధకార మగ్నులైన మానవాళి కాంతురే ,
మదోన్మదుల్ మదంబడంచి , మంచి నుంచి గాంచుమా !
వ్యధార్తపాళి బాధ తీర్చి భక్తిఁ గొల్పుమా ! శివా !
59 .
నమస్కరించి నంతలోన నమ్ము చుందువే మమున్ !
సమస్త సృష్టిఁ జేయునట్టి శంకరా ! యెఱుంగవే ?
ప్రమాద మెంచవేలనయ్య ? భక్తులన్న మాటలే
ప్రమోద మీకుఁ గొల్పగా స్వభావమెంచవా ? శివా !
60 .
జయంబు నిచ్చు వానిగా , యసాధ్య సాధ్యుగా తమన్
భయంబు వీడి పల్కుచుంద్రు . భక్త వత్సలా సదా
జయంబు నీవు కల్గఁ జేయఁ సత్యమౌను . కానిచో
భయంబు కల్గు నిశ్చయంబు పాపికిన్ . సదాశివా !
61 .
విశాల విశ్వ సృష్టి బ్రహ్మ పేరఁ జేతువా హరా !
ప్రశాంత పోషణంబు విష్ణు భావ మొప్పఁ జేతువా !
నశింపఁ జేయు వాఁడవా ! వినాశనంబు నీ పనా ?
ప్రశాంత భావ ! భక్త పోష ! భావ్యమా ! మహా శివా !
62 .
అపర్ణగా ప్రశస్తి పొంది యాది శక్తి నిన్నుతా
నపేక్షతోడ పొందెనయ్య ! హాయి యేమి కొల్పితో !
ప్రపూజలన్ మనోజ్ఞ భావ ప్రాప్తి నీకు గొల్పె నా
యపర్ణ కోరు మాదు రక్ష , హాయి , కూర్చుమా ! శివా !
63 .
గణాధిదేవతాదులున్ ప్రగాఢ భక్తి యుక్తులై
ప్రణామ మాచరించుచున్ సపర్య చేయ వత్తురే !
మునీశ్వరుల్ ముదంబు తోడ పూజ చేయ వత్తురే !
మనంబు నీకు లేదొకో ? సమాధి నుంటివా ! శివా !
64 .
సమీప్సితార్థ మొందఁ జేయ చాలు దీవె యందురే !
సమీపమందె యుండి నీవు చక్కఁ జూతు వందురే !
ప్రమోదమీకు కల్గఁ జేయ బాధలం గణింపరే !
ప్రమాదమెంచి కావుమయ్య ! భక్తి మూఢులన్ . శివా !
65 .
అపూర్వ దైవ మీవెగా ! మహత్ప్రసిద్ధి నీదెగా !
సపర్య లందఁ జేయుచున్న సాధ్వి యా యపర్ణగా ?
అపూర్వమైన భక్తి బంధ మందియున్న మిమ్ములన్
తపించి పొందు భక్తులెల్ల తాపసాళియే ! శివా !
66 .
వ్యధార్త జీవ కోటికిన్ సహాయ కారివౌచు నీ
ప్రధాన దైవ ధర్మమున్ స్వభక్తపాళిఁ గాంచగా
విధేయతన్ వహించి చేతువే , ముదావహంబుగా .
స్వధర్మ మాచరింప సత్ స్వభావ మిమ్మురా ! శివా !
67 .
నరేంద్రులున్ సురేంద్రులున్ మనంగ నీవె కారణం
బురా ! మహేశ్వరా ! నితాంత పుణ్య సత్ఫలంబుగా
స్మరింపఁ గల్గు మాకు నిన్ను . శంకరా ! శుభంకరా !
ధరాతలంబునందు మాకు దైవ మీవెరా ! శివా !
68 .
అనంత విశ్వమంతటన్ శివాజ్ఞ లేక ఏదియున్
మనంగ లేదు , కుట్ట లేదు మంట పుట్ట చీమయున్ .
వినాశమున్ వివేకమున్ నవీన సద్విభావమున్
మనోజ్ఞుఁడా ! త్వదీయ శక్తి . మమ్ముఁ గాచుమా ! శివా !
69 .
ప్రభావ మీవ కొల్పగా నభంబు తాకనౌనుగా !
నభంబు తాక గల్గినన్ వినాశ మొందు మానవుల్
ప్రభావమేది . నీ కృపా ప్రవాహ మేది యున్నచో ?
విభో ! త్వదీయ శక్తి , యుక్తి , విజ్ఞు లెన్నురా ! శివా !
70 .
మరంద మెంత పుష్పమందు ? మాన్య ! నీదు సృష్టిలో
మరంద మక్షికం బదెంత ? మాధురీ విమోహతన్
మరంద మెంత సేకరించు ? మందుకైనఁ దక్కునా ?
మరంద మందు మానవాళి . మాయ నీదిరా ! శివా !
71 .
వృథా ప్రయాస నీదిరా ! భవిష్య వాణి తెల్పెరా !
సుధీర ! నీ ప్రయత్నతన్ వసుంధర ప్రణాశమున్
బుధాళి తోడనున్న గాని పొందకుండ చేయలే
వు . ధర్మ హీనతన్ గదా భవుండ యిట్లగున్ ? శివా !
72 .
ప్రకాశ మార్గ మీవు చూప భాగ్య శాలు రందుగా !
ప్రకోప శత్రు షట్క శక్తి భక్తులన్ మరల్చుగా !
వికారమంది నిన్ను వీడ , వేల్పు వయ్యు కావ సా
వకాశ మేది చూతువయ్య భక్త పాళి నో శివా !
73 .
ప్రపంచమందు నిండి యుండె పంచబాణు శక్తి . ఓ
సు పూజ్యుఁడా ! గ్రహించి , వానిఁ జూచు బూది చేసినన్ ,
నెపంబె దక్కె నీకుఁ గాని , నేర్పునన్ మనంబులన్
తపింపఁ జేయుచుండె . మారు తాప మార్పరా ! శివా !
74 .
సభాసదుల్ మనంబు పొంగ సన్మనోజ్ఞ బోధనల్
ప్రభావ మంత చూపి పల్కు పండితాళిఁ గంటి నే .
ప్రభావ మెల్ల వారికున్న భక్తి యొక్కటే కదా !
ప్రబోధ శక్తి మాయమౌను భక్తి లేనిచో , శివా !
75 .
నిరామయా ! నిరంజనా ! వినీల కంఠుఁడా ! శివా !
ధరా తలంబునందు నా స్వధర్మ బద్ధతన్ భవా !
నిరంతరంబు కల్గి యుండ నీక చేయ సాధ్యమౌన్ .
పరీక్ష చేయుటాపుమయ్య ! భక్తుఁ గావుమా ! శివా !
76 .
ప్రభాత దివ్య భాసమాన భాగ్య మీవె కల్పితే !
నభంబునందు చుక్కలన్ యనంత ! నీవె కొల్పితే !
నభోంతరాళ మధ్య శోభ నమ్మి చూడఁ గొల్పితే !
స్వభావ సిద్ధ సృష్టి కర్తవా ! పరాత్పరా ! శివా !
77 .
నభంబునందు చుక్కలున్ వినమ్రతన్ నినున్ గనున్
ప్రభో ! నమశ్శివాయ యంచు భక్తితో వచించుచున్ .
ప్రభాత సూర్య కాంతి నీ ప్రభావమెన్ని వెల్గెడున్ .
విభుండ వంచుఁ గాంచు నెల్ల విశ్వమున్ నినున్ శివా !
78 .
భగీరథుండు స్వర్నదిన్ భవా ! శివా ! గ్రహింపవా !
ప్రగాఢ భక్తిఁ గొల్తునంచు భక్తితోడ వేడగా
మృగాంక శేఖరా ! వహించి మేలుగా శిరంబునన్
బిగించి యుంచి దించితీవు , భీతిఁ బాపుచున్ శివా !
79 .
జరా రుజల్ ధరా స్థలిన్ ప్రజాత మైన వారికిన్
వరంబుగా కలుంగ , నీదు పావనాంఘ్రి యుగ్మమున్
స్థిరంబుగా భజించినన్ సుచేతనంబుఁ గొల్పుచున్
కరంబు నందఁ జేసి నీవు కాతువే ! మహా శివా !
80 .
సమాజ సేవ చేయు వారు స్వార్థమున్ త్యజింపరే !
నమస్కరింప బూనినన్ మనంబు నిష్కళంకమై
ప్రమోదమందఁ జేయరే ! స్వభావ సిద్ధ సద్గుణుల్
సమస్త మీశ్వరార్పణంబు సల్పునెప్పుడున్ శివా !
81 .
ప్రమాదమైన మంచు కొండ పై తపంబదేమిటో !
ప్రమోదమంది భక్త కోటి భక్తిఁ గొల్చుటేమిటో !
నమో ೭ స్తుతే మహాశివా ! అనాధ నాధుఁడా ! హరా !
సమీప మందు నుండ రాదొ ? సమ్మతిన్ సదా శివా !
82 .
జనాను కూలమైన చోట చక్కనుండుమా హరా !
నినుం భువిన్ స్వభక్త పాళి నిండుగా కనంగనౌన్ .
ప్రణామ మాచరించనౌన్ . కరంబు సేవ చేయనౌన్ !
మనో వికారముల్ త్యజించి మంచిఁ గాంచనౌన్ . శివా !
83 .
శ్రమైక జీవనుల్ , నినున్ ప్రశాంత చిత్తులై కనున్ .
మమేకమై భజించు నెట్టి మర్మమే యెఱుంగరే !
అమోఘమైన భక్తితత్వ మబ్బె వారి కెట్లు ? ఓం
నమశ్శివాయ మంత్రమే పునాది భక్తికిన్ , శివా !
84 .
స్మశాన భూములందు నీవు సంచరింతు వందురే !
విశిష్టమా స్మశాన భూతి ? ప్రీతిఁ దాల్తువందురే !
నశింప చేయువృత్తి నీవు నచ్చి , చేతువందురే !
ప్రశస్తమేది ? కాని దేది ? భాగ్యమేదిరా ? శివా !
85 .
త్రిశూలముల్ శరీరమందుఁ బ్రీతిఁ గ్రుచ్చు కొందురే !
విశేష పూజ లంద నిన్నుఁ బ్రీతిఁ వేడు కొందురే !
ఆశేష భక్త కోటి నీకు హారతిచ్చి , కాంతురే .
విశేష మేమి కల్గియున్న వేల్పు వీవురా ? శివా !
86 .
పురాణ గాధలందు నిన్ను పూర్తిగా పఠించితిన్ .
వరాల వర్ష మందఁ జేయు భక్త బాంధవా హరా !
నరాధముండె యైన గాని నమ్మి నిన్ను కొల్చినన్
భరింతు వీవు వాని తప్పు భక్త పెన్నిధీ ! శివా !
87 .
నిరంతరంబు నీప్రశస్తి , నీ మహత్యమున్ భవా !
చరాచరంబులందు నీ ప్రచారమున్ , స్థితిత్వమున్ ,
సురాసురాళి కెల్ల నీదు శోభఁ జూపి గాచుటీ
ధరాతలాన కీర్తిఁ గాంచె , దర్శనీయుఁడా ! శివా !
88 .
భరింపరాని బాధ కల్గ భవ్య ! నిన్ను తిట్టుదే .
నిరంతరాయ సౌఖ్యమబ్బ నిన్ను నే స్మరింపనే !
వరంబుగా స్థిరంబుగా నివాసముండి నా యెదన్
భరించు నీకు రక్ష సేయ భావ్యమే కదా ! శివా !
89 .
జగజ్జయంబు చేసినట్టి జాణ లేరిరా ! హరా !
ప్రగాఢ ప్రేమ జీవు లేరి ? భాగ్య శాలు రేరిరా !
జగంబులో సజీవ సత్య సాక్షి లేదు చూడరా !
దిగంత వ్యాప్త ! నీవె సత్య తేజ మెన్నగా . శివా !
90 .
సముద్ధరింతుమంచు దేశ , సంఘ సేవ చేసినన్ ,
సమున్నతత్వమొందినన్ , ప్రశాంతతన్ వహించినన్
నమామి తే మహేశ్వరా ! యనంగ లేని జీవులీ
సమాజమందు వ్యర్థ జీవ సన్నిభుల్ . మహా శివా
90 .
( పుష్ప గుచ్ఛ బంధము )
హరా ! హరా ! పరాత్పరా ! మహాత్మ ! హాని హారివా !
చరాచరాళి రావమౌ ప్రశస్త శబ్ద శక్తివా !
వరాలు రాల్చు రాజువా ! ప్రభావ భాగ్య భాతివా !
నరాప్త రాజ రాజ యో యనాథ నాథ నా శివా !
91 . హిమాద్రిపై సమాధి లోన హృన్మనోజ్ఞ మూర్తివై ,
ప్రమాణమై రహించుచున్ , కృపా కటాక్ష వీక్షణల్
ప్రమోదమంద భక్త పాళిపైనఁ జూపుదే హరా !
నమామి తే మహేశ్వరా ప్రణామ మందుమా శివా !
92 . అహంబు చావ లేదురా ! మహానుభావ ! నా హరా ! -
ఇహంబునందు దుష్కృతుల్ మహేశ్వరా ! గణించినన్
సహాయ మీవు చేయ లేవు . సౌమ్యభావ పూర్ణమౌ
మహామతిన్ ననున్ మరల్చి మాన్యుఁ జేసితే శివా !
93 . నితాంత శాంతిమంతుఁడా ! వినీల కంఠ ! శంభుఁడా !
కృతాపరాధినైన నన్నుఁ గేలి చేయ బోకురా !
శతాంశమైన నీ ప్రసక్తి సల్పి యుండి యుండనా ?
మతిన్ గణించి కావుమయ్య ! మాననీయుఁడా ! శివా !
94 . సభా సదుల్ ప్రశంస చేయ చాల పొంగి పొవుచున్
స్వభావ సిద్ధ దుష్ట షట్క సంగతిన్ జరించితిన్ .
విభుండ వీవ గౌరవంబు వెల్లి గొల్పు సంగతిన్
ప్రభో ! స్మరింపఁ జాలనైతి . రక్ష సేయరా ! శివా !
95 . నయాను కూల వర్తినై యనంతమైన బాధలన్
జయించి వచ్చి యుంటినయ్య ! సర్వ దు : ఖ హారుఁడా !
ప్రియంబునన్ , నినున్ స్మరించి , తృప్తినొందఁ జేయుమా !
జయింతు నా యమున్ భవద్వశంబు నుండి , నే , శివా !
96 . ప్రమాణ మంతరాత్మరా ! స్వబంధు వెన్న నీవెరా !
నమస్కరించి గొల్తురా ! గుణంబు మంచిదీయరా !
ప్రమాద మొందనీకురా ! శివా ! నశింపనీకురా !
ప్రమోద మొందఁ జేయ రార ! భక్తుఁ గావరా ! శివా !
97 . భవాని నాకు తల్లిరా ! ప్రభావ మొందఁ జేసెరా !
నివాసముండి నాయెదన్ బునీతుఁ జేసెరా హరా !
సవిస్తరంబుగా త్వదీయ సద్గుణాళి చూపెరా !
భవాని పంచ చామరాళి వ్రాయఁ జేసెరా ! శివా !
98 . గుణంబులుండు , నుండకుండు , ఘోరమైన దోషముల్
గణింప నున్న నుండ వచ్చు , కాంక్ష తోడనిన్నునే
గణించి పంచ చామరాళి కమ్మగా రచించితిన్ .
గణించి నన్ను , సత్వమిచ్చి , కాచుమా ! సదా శివా !
99 . ప్రశస్తి గాంచి పాఠకాళి భక్తితో పఠించినన్ ,
స్వశక్తి వృద్ధిఁ జేయునంచు వ్రాసి , వాసి గొల్పినన్ ,
దిశాంతమంద దీని కీర్తి దీక్షతో వచించినన్ ,
ప్రశాంతి పంచచామరస్థ ! పాదుకొల్పరా ! శివా !
100 . వయస్సు మళ్ళిపోవుచుండ భక్తి సన్నగిల్లురా !
భయంబు బాధ పెట్టుచుండ భ్రాంతు లెట్లు పోవురా !
నయానుకూల వర్తనంబు నాఁ డదెట్లు కల్గురా !
ప్రియంబుతోడఁ గానిపించి ప్రీతి గొల్పరా ! శివా !
101 . దయార్ద్ర చిత్తుడీశ్వరుండు , తప్పులన్ క్షమించుచున్
నయానుకూల వర్తనంబు నాకుఁ గొల్పు నిత్యమున్ .
భయంబు పార ద్రోలి , భక్తి భావ మిచ్చు నంచు నా
శ్రయించి యున్న నన్నుఁ గాంచి , రక్ష సేయరా ! శివా !
102 . భవాని మాత నీ ప్రశస్త భాగ్య రేఖరా ! హరా !
నవీన తేజ మిచ్చు నా వినాయకుండు తోడురా !
భవుండ ! షణ్ముఖుండు సత్ ప్రభావ మొందఁ జేసెరా !
నివేశమై హిమాద్రి నీకు నిష్ఠ కొల్పెరా ! శివా !
103 . మహామునుల్ నిరంతరంబు మౌనదీక్షఁ బూని , నీ
మహోన్నత ప్రబోధఁ గాంచి మాయనే త్యజించిరే .
మహేశ్వరా ! దయార్ద్రచిత్త ! మమ్ముఁ బ్రోవ నీకృపా
మహత్వ దృష్టిఁ జూడుమా ! ప్రమాద మాపుమా ! శివా !
104 . సుపూజ్యులైన పండితుల్ విశుద్ధ రమ్య చిత్తులై
ప్ర పూజ్యమైన పంచ చామరమ్ములన్ పఠించ , నీ
వపూర్వమైన భక్తిఁ గొల్పి , హాయి నొందఁ జేయుమా !
విపర్యయంబు లేక గాచి , ప్రీతి గొల్పుమా శివా !
105 . వినీతులైన కల్వపూడి వీర రాఘవార్యులీ
యనాధనైన నన్ గ్రహించి యాంధ్ర భాష నేర్పి , స
జ్జనానుకూల భక్తి భావజాల మందఁ జేసి రా
మనీషుఁ భక్తి గొల్చెదన్ , నమస్కరించుచున్ శివా !
106 . కళా విలాస మెన్న లేను . కావ్య దృష్టి లేదుగా !
స్వలాభ కాంక్ష లేదు . నీదు భక్త కోటి మెచ్చగా ,
ప్రలోభ దూరులై నినున్ ప్రభావ మొప్పఁ గొల్వగా
తలంచి వ్రాసితిన్ త్వదీయ ధర్మ తేజమున్ . శివా !
107 . మహన్నకారరూప ! ఓం నమశ్శివాయ ! ఓం హరా !
మహన్మకార రూప ! ఓం నమశ్శివాయ ! శంకరా !
మహత్శికార రూప ! ఓం నమశ్శివాయ ! ఈశ్వరా !
మహద్వకార రూప ! ఓం నమశ్శివాయ ! సుందరా !
మహద్యకార రూప ! ఓం నమశ్శివాయ ! మా శివా !
108 . సుమంగళీ ప్రపూజ్య పాద శోభితాయ మంగళం .
సమస్త జీవ శక్తి రూప శాశ్వతాయ మంగళం .
అమంగళాంతకాయ సద్గుణాశ్రయాయ మంగళం .
సమస్త మంగళం భవాయ . సర్వ మంగళం శివా !
శ్రీశివాష్టోత్తరశత పంచచామరావళి పేరంబరగు శివ శతకము సంపూర్ణము .