జైశ్రీరామ్.
ఆర్యులారా! చిత్ర బంధ గర్భ కవితానురక్తులారా! చిత్ర కవులారా!
సన్మతినెంచినన్ తెలుగు చక్కని భాషగ లోకమెన్నదే?
జన్మకు సార్థకంబనుచు చక్కని చిత్ర కవిత్వ తత్వమున్
చిన్మయమూర్తులెంచి విరచించిరి. మీరును వ్రాయరాదొకో?
సందర్భంబును బట్టి వ్రాసినవియౌన్, సన్మాన్య వృత్తంబులౌన్,
సౌందర్యంబును కోరి వ్రాసినవియౌన్, సన్మూర్త్యుదంతంబులౌన్,
గ్రంథాంతర్గత చిత్ర బంధ తతియౌన్, కానిండు యేదైన. నా
కందింపన్ మిము కోరు చుంటి.దయతో నందింపుడీ చిత్రముల్.
మహనీయాత్ములు, చిత్ర బంధ కవితా మాహాత్మ్య సద్వేద్యులై
యిహమందెట్టి బృహత్కవిత్వ తతులన్ హృద్యద్యాద్భుతంబై కనన్
సహ వాసుల్ రచియించియుందు రనుచున్ సన్మాన్యులౌ వారలన్
గ్రహియింపన్ ఘన వైద్యవంశజ లసత్ కారుణ్యుడెంచెన్, భువిన్.
కావున తెల్ప వేడెదను. కల్గినచో తమ విత్ర బంధముల్.
భావన చేసి వ్రాసినవి, పండిత పామర రంజకంబుగా
ధీవరు లెంచ వ్రాసినవి, దివ్య మహాద్భుత చిత్ర గర్భ శ్లే
షావహ మౌక్తికంబులను, హాయిగ వ్రాసినవెల్ల పంపుడీ!
కోరెద పంపగ మిమ్ముల
మీరెఱిగిన వెవరివైన మేలగు కృతులన్
తీరగు బంధము లెన్నుచు
ధీరోత్తములార! పంపి తేజరిలుడయా!
మీరు కాని, మరెవరైన కాని, చిత్ర, బంధ, గర్భ కవితానురక్తితో వ్రాసిన చిత్ర, బంధ, గర్భ చాటు మౌక్తికములు అయి యుండవచ్చును, గ్రంథాంతర్గత ప్రదీపిత చిత్ర, బంధ, గర్భ రచనలయి యుండవచ్చును, ఏవయినను అయి యుండవచ్చును, ఆధునిక కవులు వ్రాసిన ఆ ఆణి ముత్యములను చిత్ర రత్నములను నాకు మీరు తప్పక చూప కలరని మనసారా ఆశించుచున్నాను.
మీ
రామ కృష్ణా రావు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.