గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, నవంబర్ 2013, శుక్రవారం

కార్తీక పురాణం 5వ అధ్యాయం

జైశ్రీరామ్.
ఆర్యులారా! 
శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ శర్మ వివరించిన
శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం ఐదవ అధ్యాయం పఠించండి.

వశిష్ఠ మహర్షి తిరిగి చెప్తున్నారు ’ ఓ జనక మహారాజా! వినుము కార్తీక మాసమందు పాప క్షయము కొరకు పుణ్య కార్యాచరణము చేయవలెను. పుణ్యకార్యాచరణముచేత పాపము నశించుటయే గాక పుణ్యమధికమగును. కార్తీక మాసమందు శ్రీ హరి సన్నిధిలో భగవద్గీతా పారాయణము చేయుటవలన పాము కుబుసము వలె పాపములు విడువబడును. కార్తీక మాసమున తులసీదళంతోనూ, తెలుపు, నలుపు అయిన గన్నేరు పూలతోను హరిని పూజించిన వైకుంఠముచేరి హరితో కూడగలడు.

కార్తీక మాసమందు భగవద్గీతలోని విభూతి, విశ్వరూప సందర్శన అధ్యాయములను శ్రీ హరి సన్నిధిలో పారాయణ చేయువాడు వైకుంఠాధీశునితో సమమగును. కార్తీక మాసమందు హరి సన్నిధిలో శ్లోకముగానీ, శ్లోక పాదముగానీ పురాణము చెప్పినవారునూ, విన్నవారునూ కర్మబంధ వినిర్ముక్తులగును.

కార్తిక మాసమందు శుక్ల పక్షమందు వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును. ఇతర కాలములలో జపకాలమందు హోమ కాలమందు పూజాకాలమందు భోజన కాలమందు తర్పణ కాలమందు మాట్లాడకూడని వారితో నూ యొక్క పాపాత్ములతోనూ అశౌచవంతులతోనూ సంభాషణములను వినిన దోషపరిహారము కొఱకు కార్తీక మాస వన భోజనమాచరించవలెను.

ఈ వన భోజనములెట్లు చేయవలెననగా.. అనేక వృక్ష జాతుల సమూహముచే కూడినదైన వనమునందు, ఉసిరిక చెట్టు వద్ద సాలగ్రామమునుంచి గంధ పుష్పాక్షతాదులతో పూజించి శక్తికొలది బ్రాహ్మణులను పూజించి బ్రాహ్మణులతో కలిసి భోజనము చేయవలెను. ఇట్లు కార్తిక మాసమునందు వనభోజనము చేసిన ఆయా కాలములందు చేసిన సమస్త దోషములు, పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా ఉండెదరు. కాబట్టి తప్పక కార్తీక మందు వనభోజనము ఆచరించవలెను.

కార్తీక మహాత్మ్యము భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడైన దుర్యోన సంకటము వలన ముక్తుడాయెను. అని వశిష్ఠమహర్షి పలికెను. అంత జనక మహారాజు ’ ఓ మునీశ్వరా! బ్రాహ్మణునికుమారుడైన ఈ దుర్యోనుడెవ్వడు? వాడేకర్మ చేసెను? దేని చేత విముక్తుడాయెను. ఈ వృత్తాంతమును వినవలెనని కుతూహలముగ నున్నది కనుక దయతో చెప్పుము’ అని ప్రార్థించెను.

విశిష్ఠుడు చెప్పుచున్నాడు ’ జనక మహారాజా! చెప్పెదను వినుము, కావేరీ తీరమందు దేవశర్మయను బ్రాహ్మణుడు వేద వేదాంగ పారీణుడు కలడు, అతనికి దురాచారవంతుడైన ఒక కుమారుడు కలడు, అతని దుర్మార్గము చూసి, తండ్రి నాయనా నీకు పాపములు నశించెడి మాటను చెప్పెదను వినుము’ అని ఇట్లు చెప్పసాగెను. ’అబ్బాయీ కార్తీక మాసమందు ప్రాతః స్నానము చేయుము సాయం కాలములో హరిసన్నిధిలో దీపమాలను సమర్పించుము.’ అంత ఆ కొడుకు ఈ మాట విని అసలీ కార్తీక మాసధర్మమంటే ఏమిటి? ఈ కార్యాన్ని నేనెప్పుడు చేయవలెను (నేను చేయడమా అనినట్లు)’ అని పరుషముగా బదులిడెను.

అంత ఆ తండ్రి కోపగించి ’ఓరి దుర్మార్గుడా! ఎంత మాట అన్నావు! నువ్వు అరణ్యములో చెట్టుతొఱ్ఱలో ఎలుకవై ఉండుము’ అని శపించెను. ఆ శాపమును విన్న దుర్యోనుడు, తండ్రీ నాగతియేమి నాకు ముక్తి ఎప్పుడు అని అడుగగా తండ్రివిని పశ్చాత్తప్తుడై శాపవిమోచనమార్గమును చెప్పెను.’ కుమారా నీవు కార్తీక మాహాత్మ్యమును ఎప్పుడు వినెదవో అప్పుడు నీకు మూషకత్వమునుండి విముక్తి కలుగును’ అని చెప్పెను.

తండ్రి చెప్పిన మాటలు వినగా ఆ కుమారుడు అప్పుడే ఎలుకయై గజారణ్యమందు ఫలములతో గూడి అనేక జంతువుల కాధారమై, సకల వృక్షసమూహమైన ఆ అడవినందు నివసించుచుండెను.

ఇట్లు కొంత కాలము గడచిన తరవాత ఒకప్పుడు విశ్వామిత్ర మహర్షి శిష్యులతో సహా కార్తిక స్నానం చేసి ఒక వృక్షము మొదటి భాగమందు కూర్చొని కార్తీక మహాత్మ్యమును భక్తితో చెప్పుచుండెను. అంత దురాచారుడు, దయాహీనుడు ఐన ఒక వ్యాధుడు వేట నిమిత్తము అటు వచ్చి, అక్కడి బ్రాహ్మణులను పాపాత్ముడై చూసి సంహరించుటకు నిశ్చయించుకొనెను. అంతలోనే విశ్వామిత్ర మహర్షిని చూచినంత పురుషార్థదాయకమైన జ్ఞానము కలిగి సంతోషించి అయ్యా ఇదేమిటి మీరేమి చేయుచున్నారు దీని వలన ఫలమేమి అని అడిగగా విశ్వామిత్ర మహర్షి ఆ కిరాతునకు ఇట్లు చెప్పుచున్నారు...

విశ్వామిత్రుడు ఇలా చెపుతున్నాడు ’ఓ కిరాతా! వినుము, నీ బుద్ధి మంచిదైనది, ఇది కార్తీక ధర్మము, ఈ ధర్మము మనుష్యులకు కీర్తినిచ్చును. కార్తిక మాసమందు మోహముచేత నైనా సరే స్నానాదికములు చేసిన వాడు పాపవిముక్తుడై వైకుంఠలోకమును చేరును. కార్తిక మాసమందు భక్తి శ్రద్ధాసంయుక్తుడై స్నానదానాది వ్రతములను ఆచరించువాడు జీవన్ముక్తుడగును.  అందు సందేహము లేదు.

విశ్వామిత్రమహర్షి ఇట్లు కిరాతునకు చెప్పిన కార్తీక ధర్మము వృక్షమున తొఱ్ఱలో ఉన్న మూషకము విని  వెంటనే మూషక రూపమును వదిలెను. విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయిచూడగా, ఆ బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమంతయును తెలిపి విశ్వామిత్ర అనుజ్ఞతో తన ఆశ్రయమైన తన తండ్రిదరికి పోయెను.

కిరాతుడు మూషకము దేహత్యాగము చేసి బ్రాహ్మణ కుమారుడుగ మారుటను బట్టిమ్, కార్తీక వ్రత ధర్మములను పూర్తిగా విశ్వామిత్ర మహర్షి చేత తెలుసుకుని వైకుంఠమును చేరెను. ఉత్తమ గతులను కోరువారు ఈ కార్తీక మహాత్మ్యమును ప్రయత్న పూర్వకముగ వినవలెను. విన్నంతనే పుణ్యవంతులై అంత్యమును పరమును పొందెదరు. కాబట్టి తప్పక కార్తీక వ్రతమాచరించవలెను. ఇది నిజము నిజము నాకు బ్రహ్మ చెప్పినాడు. రాజానీవు పురాణములందు బుద్ధినుంచుము. అట్లైన పుణ్యగతికి పోయెదవు ఈ విషయమై విచారణతో పనిలేదు ఇది నిశ్చయము.
ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి ఐదవ అధ్యాయము సమాప్తము.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.