జైశ్రీరామ్.
ఆర్యులారా!
శ్రీ అయ్యగారి సూర్యనాగేంద్ర కుమార్ శర్మ వివరించిన శ్రీ స్కాంద పురాణాంతర్గత
కార్తీక పురాణం ఆరవ అధ్యాయం పఠించండి.
వశిష్ఠ మహర్షి ఇట్లు చెప్పుచున్నారు ’ ఓ మహారాజా! కార్తికమాసములో భక్తితో నెలంతా శ్రీ హరికి కస్తూరితోటి, గంధముతోటి, పంచామృతములతోటి స్నానము చేయించువారు పదివేల అశ్వమేధయాగముల ఫలాన్ని పొంది అంత్యమున ఉత్తమ గతులను పొందెదరు. కార్తికమాసమున సాయంకాలసమయంలో శ్రీ హరి సన్నిధిలో దీపదానమిచ్చువారు విష్ణులోకమును పొందెదరు. కార్తిక మాసంలో దీపదానం చేసినవారు జ్ఞానమును పొంది విష్ణులోకాన్ని పొందెదరు. ఈ కార్తీక మాసంలో పత్తిన చక్కగా ధూళి, నలుసులు లేకుండా విడతీసి వత్తిని చేసి, బియ్యపు పిండితో గాని గోధుమపిండితోగాని చేసిన ప్రమిదలో ఆవునేతిని పోసి వత్తిని తడిపి వెలిగించి ఉత్తమ బ్రాహ్మణుని పూజించి ఇవ్వవలెను.
ఇట్లు ఈ నెలంతా చేసి చివర్లో వెండితో ప్రమిదను చేయించి అందులో బంగారు వత్తిని చేయించి బియ్యపుపిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించినతరవాత బ్రాహ్మణ భోజనము గావించి తరవాత ఈ క్రింది మంత్రమును చెప్తూ దీపమును బ్రాహ్మణునకు దానము చేయవలెను (మంత్రము పైన ఇవ్వబడింది, దాని అర్థము ఇక్కడ పొందుపరచడమైనది) ."దీపము సర్వజ్ఞాన దాయకము, సమస్త సంపత్ప్రదాయకము, ఈ దీపమును నేను దానమిచ్చుచున్నాను, ఈ దీపదానమువల్ల నాకు నిరంతరము శాంతికలుగును గాక". లింగబేధములేక ఎవరైననూ ఈ ప్రకారంగా కార్తీకమాసమందు ఆచరించిన అనంత ఫలము పొందెదరు. దీపంవలన జ్ఞానం కలుగును, దీపంవలన శృత్యాది శాస్త్రఫలము కలుగును, దీపదానమువలన ఆయుష్షును పొందును, దీపము వలన ఉన్నతలోకములకు పొందవచ్చును.
కార్తీక దీపదానమువలన మనోవాక్కాయములచేత తెలిసిగానీ తెలియకగానీ చేయబడిన పాపములు నశించును. ఈ విషయమై పూర్వమొక కథ గలదు. వినుము, పూర్వము ద్రావిడదేశమందు సుతులు కానీ, బంధువులు కానీ లేని ఒక స్త్రీ కలదు, ఆ స్త్రీ నిత్యము భిక్షమెత్తుకొనిన అన్నము తినునది. ఎప్పుడూ దూషితాన్నమునే భుజించెడిది, పరిశుభ్రమైన అన్నము తినునది కాదు. చద్ది అన్నముని తిని రోజూ ఇతరలవద్ద ధనము పుచ్చుకొని వారికి వంట చేయుట, బట్టలు కుట్టుట, రుబ్బుట నూరుట వంటి పనులు చేసెడిది. ఇట్లా ధనము సంపాదించి, దూష్యమైన భోజనము చేస్తూ అధిక ధనము కూడబెట్టినది. ఆస్త్రీ ఎన్నడూ భగవన్నామము ధ్యానించలేదు. హరికథలు వినలేదు, పుణ్య తీర్థములకు పోలేదు, ఏకాదశీఉపవాసం చేయలేదు. అనేక వ్యాపారములచే చాలా ద్రవ్యం సంపాదించినది. కానీ తాను తినలేదు పరులకోసం ఉపయోగించలేదు.
ఇలా అజ్ఞాన సముద్రంలో మునిగిన ఆమె ఇంటికి దైవ వశాత్త్ శ్రీరంగమునకు పోతూ ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి అయ్యో ఈమె అన్యాయంగా నరకము నకు పోగలదని దయకలిగి ఆమెతో ఇట్లనె. ’ఓ మూఢురాలా! ఇప్పుడు నేచెప్పేది జాగ్రత్తగా విను. విని ఆలోచించుము. ఈ శరీరం సుఖదుఃఖముల సమన్వయం. చర్మము, మాంసము, ఎముకలతో గూడినది. ఇది దుఃఖములకు నిలయము. పంచభూతములైన భూమ్యాకాశవాయురగ్నిజలములు వలన కలిగి వాటితో కూడి ఉన్నది. దేహము నశించగానే ఈ పంచ భూతములు ఇంటిపై బడిన వాన చినుకులు ఎలాగైతే వేర్వేరుగా పోవునో అలా వేరువేరగును. ఇది నిశ్చయం.
ఈ దేహము నీటిమీద నురుగువలె నశించును. ఈ దేహము నిత్యము కాదు ఇట్టిదేహము నిత్యమని నమ్మియున్నావు. ఇది అగ్నిలో పడిన మిడుతవలె నశించును. కాబట్టి మోహమును విడువుము.
దేవుడే సత్యమనీ, సమస్త భూతములందు దయగలవాడు అని గుర్తెరుకు. హరిపాదములను ధ్యానించు. కామం-కోరిక, క్రోధము - అత్యంత కోపము, భయము-ఈశరీరమునకు తత్సంబంధమునకు ఏమగునో అని బెంగ ఆత్మాత్మీయము, లోభము- ద్రవ్యచింతన, ఖర్చు పెడితే ఖర్చవుతుందని ఏదో దాచుకోవాలని ఉబలాటం. మోహము- మమత, అనురాగం, అహం, ద్రవ్యాభిలాషణం- ఇంకా ఇంకా ఇంకా సంపాదించవలెనని కోరిక - వీటన్నిటిని వదులి నిశ్చలమైన భక్తితో హరిపాదారవింద ధ్యానము చెయ్యి.
కార్తీక మాసమందు ప్రాతఃస్నానం చేసి, విష్ణుప్రీతిగా దానము చేయుము. బ్రాహ్మణులకు దీపదానము చేయుము అట్లు చేసిన అనేక జన్మ పాపములు నశించును. ఈ విషయంలో ఎటువంటి సందేహము లేదు.’ అని చెప్పి ఆ బ్రాహ్మణుడి తూర్పు దిశగా పయనం సాగించెను. తరవాత ఆ మాటలు నమ్మి విచారణ చేసుకొని, ఆశ్చర్యమును పొంది తాను చేసిన అకార్యములకు బాధ పడి కార్తీక వ్రతమును ఆరంభించెను.
సూర్యోదయ వేళలో చన్నీటి స్నానము, హరి పూజ తరవాత దీపదానము అటు పిమ్మట పురాణ శ్రవణము, ఈ విధంగా కార్తీక మాసము నెలరోజులు కార్తీక వ్రతమాచరించి చివరకు బ్రాహ్మణ సమారాధన చేసెను. ఇతః పూర్వం సరియైన భోజనము లేని కారణము చేతనూ, నెలరోజులు శీతోదకస్నానము చేయుటవలననూ,ఆ స్త్రీకి శీతజ్వరము సోకి గర్భమందు రోగము పుట్టి దివారాత్రులు బాధపడి బంధుహీనయై మృతినొందినైది. అనంతరం ఆమె దివ్య విమానమెక్కి స్వర్గమునకు బోయి శాశ్వత సుఖములను పొందినది.
కాబట్టి కార్తీక మాసమందు అన్నిటికంటే దీపదానము అధికమైన ఫలప్రదము. కార్తీక దీపదానము తెలిసికానీ తెలియకకానీ చేసిన పాపములను నశింపచేయును’ అని పూర్వము సాక్షాత్ శంకరుడే పలికెను. రాజా ఈ రహస్యమును నీకు తెలిపితిని దీనిని విన్న వారు జన్మ సంసార బంధనమును త్రెంచుకొని విష్ణుపదమును పొందెదరు.
ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి ఆరవ అధ్యాయము సమాప్తము.
జైహింద్.
1 comments:
నమస్కారములు
ప్రతి దినము మాకు కార్తీక పురాణమును అందించి చది వించ గలిగిన పుణ్యాత్ములు శ్రీ చితా వారికి అభి నందన ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.