గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, నవంబర్ 2013, బుధవారం

కార్తీక పురాణం 2వ అధ్యాయం


జైశ్రీరామ్.
ఆర్యులారా!
శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ వివరించిన శ్రీ  స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం ద్వితీయ అధ్యాయం పఠించండి.
కార్తీక పురాణం ద్వితీయ అధ్యాయం 
వశిష్ఠ మహర్షి ఇట్లు చెప్పుచున్నారు " ఓ రాజా! కార్తీక మహాత్మ్యమును వినుము. విన్నంతనే మనోవాక్కాయ కర్మలవల్ల కలిగిన పాపమంతయు నశించును. కార్తీక మాసమందు శివప్రీతికొరకు సోమవార వ్రతమాచరించేవారు కైలాస నివాసిఅగుదురు. కార్తీక సోమవారమునాడు స్నానము గాని, దానము గాని, జపముగాని చేసిన 1000 అశ్వమేధయాగ ఫలమును పొందును. ఇందుకు సందేహములేదు.

కార్తీక సోమవారమునాడు, ౧) ఉపవాసము, ౨)ఏక భుక్తము, ౩) నక్తము-రాత్రి భోజనము, ౪)అయాచిత భోజనము, ౫) స్నానము, ౬)తిలాదానము సమానములని చెప్పబడుచున్నవి.

శక్తి గలవారు కేవల ఉపవాసము చేయవలెను. అందుకు శక్తిలేనివారు నక్తము అనగా రాత్రి భోజనము చేయవలెను. అందుకు శక్తి చాలని వారు ఛాయానక్తము చేయవలెను అనగా (సూర్యకాంతి కొంచెము తగ్గిన తరవాత తనకొలతకు రెట్టింపుగా తన నీడ రాగానే చీకటి పడకముందే భుజించవలెను. అందుకు శక్తి లేనువారు బ్రాహ్మణులను పిలుచుకువచ్చి వారికి పగలే భోజనం పెట్టి తానూ పగలే భోజనం చేయవలెను.

మానవులు కార్తీకమాసమందు కార్తీక వ్రతములలోదేనినైనౌ ఆచరించని వారైన, ఎనిమిది యుగాలు నరకంలో కుంభీపాకంలోనూ, రౌరవంలోను బాధలు పొందుతారు.

కార్తీక సోమవారం నాడు పూర్వసుహాసిని యధావిధిగా ఉపవసించి శివుని పూజించిన శివలోకమును పొందును

స్త్రీలుగానీ పురుషులు గానీ ఎవరు కార్తీక సోమవారమందు నక్షత్రములనుచూసి రాత్రి భోజనము చేస్తారో వారి పాతకములు అగ్నియందుంచబడిన దూదివలె నశించును.

కార్తీక సోమవారమందు శివలింగమునకు అభిషేకము, పూజ చేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును. ఈ విషయమై ఒక పురాతనమైన ఒక కథ ఉన్నది, చెప్పెదను వినుము. ఇది విను వారికి చెప్పువారికి పాపనాశన కారిఅగును.

కాశ్మీర దేశమునందొక పురోహితున కూతురు స్వాతంత్ర్య నిష్ఠురియను ఒక స్త్రీ కలదు. ఆమె చక్కని రూపముతోనుండి మంచి యవ్వనముతో గూడి యుండెను. తలదువ్వుకొని, అలంకరించుకొని అతిగా మాట్లాడు జారత్వమును అవలంబించుచుండెను. ఈమె దుర్గుణములు చూసి తల్లిదండ్రులు అత్తమామలు ఈమెను విడచిరి. ఈమె భర్త సౌరాష్ట్ర దేశస్థుడు. అతని పేరు మిత్ర శర్మ. అతడు వేద వేదాంగ పారీణుడు. సదాచారవంతుడు. సమస్తభూతములందు దయగలవాడు. తీర్థయాత్రలు చేసి తీర్థములను సేవించినవాడు. సత్యవాక్కును కలిగిఉండేవాడు. ఎప్పుడూ శుచిగా ఉండేవాడు. ఇన్ని ఉత్తమోత్తమ గుణములున్నప్పటికీ ఈతనిని భార్య ఐన స్వాతంత్ర్య నిష్ఠురి నిత్యమూ కొట్టుచునుండేది. అలా నిత్యమూ ఆమెచేత దెబ్బలుతిని గృహస్థ ధర్మమునుండి వెల్వడక భార్యను విడువలేక ఆమెవలన కష్టములను పొందుచున్నాడు.

ఆమె పరమ కర్కశురాలైయుండెను. భర్తయైన మిత్రశర్మ ఈమెతో సంభోగవాంచచేత ఈమెతో అనురాగముతో ఉండెను. అంత ఒకనాడు ఈమె దుర్జనులైన తన ప్రియులిచ్చిన ద్రవ్యము ఆభరణములు తీసుకొని, వారి కోరిక మేరకు ఆమెయందు వారికి నిరంతర సంభోగము మిత్రశర్మ వలన భంగము కలుగుతున్నందున అతనిని చంపమని చెప్పగా సమ్మతించినది. ఆ కర్కశ రాత్రి తన భర్తతో క్రీడించి తరవాత తన భర్త నిద్రించగానే తానులేచి ఒక పెద్దరాతిని తెచ్చి భర్తశిరస్సున కొట్టగా మిత్రశర్మ మరణించెను. తరవాత కర్కశ స్వయముగా తన భర్త శవమును వీపుమీద వేసుకొని తీసుకొనిపోయి పాడుబడిన నూతిలో పడవేసెను.

అలా భర్తను చంపి తరుణులను పరస్త్రీసంగమాభిలాషులను కామశాస్త్ర ప్రావీణులను, వర్ణసంకర కారకులు ఐన అనేక జాతి పురుషులతో ఆలింగన చుంబనాదులతో నిత్యము సంభోగము చేయుచుండెను. అంతియేగాక, భర్తయందనురాగముతోనున్న భార్యలను దుర్భోదలచేత యితరులచే సంభోగము చేయించుచు, ఏక పత్నీ వ్రతుల వ్రతమును భంగ పరచి వారితో సంభోగించుచు నిత్యము పరనింద చేస్తూ ద్వేషపూరితయై దేవతలను ద్వేషించుచుండెను.

ఆమె నిరంతరమూ దయాశూన్యమనస్కయై, గర్వముచేకానీ, పరిహాసానికి కానీ హరి నామ స్మరణము , విష్ణు పాదాబ్జముల ధ్యానమూ చేయకుండినది. ఇలా ఉండగానే, ఈమెకు యవ్వనమయు పోయినది, వ్రణములు కలిగి వ్యాధులు ప్రబలినవి. ఆమెకు ఉన్న వ్రణముల నుండి పురుగులు వచ్చి దుర్గంధము వచ్చుచుండెడిది. ఆమె కొరకై వచ్చెడి జారులందరూ రూపవంతులై మదయుక్తులై వచ్చి ఆమెను చూసి నిరాశతో తిరిగిపోయెడివారు.

ఆమె పాపాధిక్యముచేత చాలా బాధనుపొంది ఆ వ్రణ బాధతోనే శరీరము విడిచెను. అక్కడకు భయంకరమైన యమభటులు వచ్చి ఆ కర్కశను పాశములతో బంధించి కట్టి యముని వద్దకు తీసుకొని పోయిరి. అంత ఆ సమవర్తి ఆమెను చూసి కృద్ధుడై ఈమెను భయంకరమగు ముళ్ళతో కూడి, ఎర్రగా కాలి మండుచుండగా దానిని ఆలింగనము చేయించుడని కఠినమైన శిక్షను వేసెను. అంత ఆ ఆజ్ఞమేరకు భటులు ఆ కర్కశకు చేసిన పాపములను చెప్పుచూ ఆ కాలుతున్న స్తంభమును సంభోగించమనిరి.

తరవాత యమ కింకరులు యమ దండములచేత కర్కశ తల మీద కొట్టి తరవాత కుంభీపాకమునందు వేసి బాధించిరి. ఆమె పాదములు రెండు పట్టుకుని రాతిమీద పెట్టి కిట్టిరి, రక్తము కాచి త్రాగించిరి సీసము కాచి రెండు చెవులా పోసిరి. యమ కింకరులు యమాజ్ఞమేరలు చిత్రగుప్తాజ్ఞమీదను అనేక నరక బాధలకు కర్కశను గురిచేసిరి. అలా ఆ కర్కశ తన పితృపితామహులతో కూడ తన ముందు పది తరములు తరవాత పది తరములతో కలిసి ఘోరమైన నరకబాధలను పొంది తరవాత తిరిగి భూమి పై జన్మించినది.

భూమి మీద పదిహేను జన్మలు కుక్కగా జన్మించినది అందులో పదిహేనవ జన్మ కళింగ దేశమందు బ్రాహ్మణుని ఇంట కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగు చుండెను.

ఓ జనక మహారాజా! ఇట్లుండగా ఒకానొకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం రోజున పగలంత ఉపవాసముచేసి ఇంట్లో శివలింగాభిషేక పూజాదులను చేసి నక్షత్రమండలమును చూసి ఇంట్లోనికి పోయొ దేవ నివేదన చేసి ఆ తరవాత భూత బలిదానము కొరకు బచ్చి భూమిమీద బలిని ఉంచి కాళ్ళు కడుక్కొని ఆచమనము చేసి తిరిగి లోనికి వెళ్ళెను.

ఆ కుక్క ఆనాడు పగలంతయు ఏమీ దొరకనందున కృశించినదై కార్తీక సోమవారము నక్షత్ర మండల దర్శన కాలమైన తరవాత ప్రదోషంబున ఆ బలిని భక్షించెను. ఆ బలిని భక్షించుటచే ఆ కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగి బ్రాహ్మణోత్తమా రక్షింపు రక్షింపుమని అరచెను. ఆ మాటవిని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యపోయి, ’ఓ కుక్కా మా యింట్లో ఏమి తప్పు చేసినావు రక్షింపుమని అడిగావు’ అని అడిగెను. అంత ఆ కుక్క ’ ఓ బ్రాహ్మణోత్తమా నేను పూర్వ జన్మమునందు బ్రాహ్మణ స్త్రీని పాపములు చేసినదానను, కులటను, వర్ణసంకరమునకు కారణమైతిని, అన్య పురుషులను మరిగి నా నిజ భర్తను చంపినాను.

ఇన్ని పాపములు చేసిన చచ్చి యమలోకమునకు బోయి అక్కడ అనేక బాధలు పొంది తిరిగి భూమి వచ్చి 15 మాట్లు కుక్కగా పుట్టి నాను. నాకు ఇప్పుడు నా ఆజాతి స్మరణ మెట్లు కలిగెనో చెప్పుము విని సంతోషించెదను

ఆ బ్రాహ్మణోత్తముడీ మాటవిని జ్ఞాన దృష్టితో చూసి, తెలుసుకుని ఇట్లనె. ఓ కుక్కా! ఈ కార్తీక సోమవారమునాడు ప్రదోషసమయము వరకు భుజించక యిప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి కనుక నీకు నీ స్వంత స్మృతి కలిగినది. ఆ మాటలు విని ఆ కుక్క ’వేద వేదాంగ పారీణుడైన ఓ బ్రాహ్మణోత్తమా ఈ కుక్క జాతినుంచి నాకెట్లు మోక్షమో చెప్పుమా అని అడిగెను’

కుక్క ఇలా ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు పరోపకార బుద్ధితో కార్తీక సోమవారములందు తాను చేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యము ఆ కుక్కకు ధారపోసెను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యము ఇవ్వగానే కుక్కదేహమును విడిచి ప్రకాశించుచున్న శరీరము గలదై ప్రకాశించెడి వస్త్రములు కలదై మాలలను, ఆభరణములను ధరించి తన పితరులతో కూడి కైలాసమునకు వెళ్ళి అక్కడ పార్వతీ దేవివలె శివునితో గూడి ఆనందించుచుండెను.

కాబట్టి కార్తీకమాసమందు సోమవార వ్రతమాచరించవలెను. ఎవరు ఈ కార్తీక సోమవార వ్రతమును చేయునో వారికి మోక్షము కరతలామలకము. జనక మహారాచా పుణ్య ప్రదమైన కార్తీక వ్రతంబును నీవునూ చేయుము.
ఇది సాంతపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి రెండవ అధ్యాయము సమాప్తము.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.