గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, నవంబర్ 2013, గురువారం

కార్తీక పురాణం 4వ అధ్యాయం

జైశ్రీరామ్.
ఆర్యులారా!
శ్రీ అయ్యగారి సూర్యనాగేంద్ర కుమార్ శర్మ వివరించిన శ్రీ స్కాంద పురాణాంతర్గత 
కార్తీక పురాణం 
నాలుగవ అధ్యాయం పఠించండి.

జనకుడడుగుచున్నాడు ’ఓ మునీంద్రా! నీయొక్క వాక్కు అనే అమృతాన్ని తాగుతున్న నాకు ఇంకా తృప్తి కలుగలేదు. కాబట్టి ఇంకనూ ఈ కార్తీక మహాత్మ్యమును తెలుపుము. కార్తీకమందు ఏ దానము చేయవలెను దేనిని కోరి వ్రతము చేయవలెనో తెలుపుము.

విశిష్ఠుడు చెప్పుచున్నాడు " ఓ రాజా! పాపములను నష్టపరచి, పుణ్యమును వృద్ధిపొందించేది అయిన కార్తీక వ్రతమును ఇంకనూ చెప్పెదను వినుము. కార్తీక మాసమందు సాయంత్రము శివాలయములందు దీపారాధన చేసిన అనంతఫలదాయకము. కార్తీక మాసములో శివాలయములో గోపురద్వారమునందు శిఖరమునందు లింగ సన్నిధియందు దీపారాధన చేసిన సమస్తపాపములు నశించును. ఎవరు కార్తికమాసమునందు శివాలయములో ఆవునేతితో కానీ, నేతితో కానీ, నువ్వులనూనెతో కానీ, యిప్పనూనెతో కానీ, నారింజనూనెతోగానీ భక్తితోదీప సమర్పణము చేయునో వాడే ధన్యుడు. వాడు సమస్త ధర్మవేత్త . వాడు ధర్మాత్ముడును అగును. అందులో సందేహములేదు.

పైన చెప్పిన నూనెలు లభించకున్నచో కనీసము ఆముదముతోనైననూ దీప సమర్పణ చేయుట పుణ్య ఫలము. కార్తీక మాసములో మోహంతో కానీ, గర్వంతో కానీ లేదా నిండు భక్తితో కానీ ఏ భావముచేతనైనా దీపమిచ్చువాడు శివప్రీతిని పొందును.

పూర్వకాలమందు పాంచాల దేశమున కుబేరునితో సమమైన ఐశ్వర్యము గల ఒక రాజు ఉండెడివాడు. అతడు సంతానము లేక పవిత్ర గోదావరీ తీరమున తపస్సు చేయుచుండెను. గోదావరీ స్నానార్థమై పైప్పలుడనే ముని వచ్చి రాజుని చూచి ’ ఓ రాజా! ఎందుకు తపస్సు చేయుచున్నావు’ అని అడిగెను. ఆ మాటవిని ఆ రాజు ’ ఓ మినీశ్వరా ! నాకు సంతానము లేదు, కాబట్టి సంతానము కొరకు తపస్సు చేయుచున్నాను’ అని చెప్పెను.

ఆ బ్రాహ్మణోత్తముడు రాజుతో ఇట్లు చెప్పుచున్నాడు’ రాజా భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టుము, అట్లయిన నీకు పుత్ర సంతానము కలుగగలదు.’ అది విన్న ఆ రాజు ఆనంద మగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతికొరకు దీప దానములను చేసెను. తరవాత ఆ పుణ్యమువలన రాజు భార్య గర్భాన్ని దాల్చి పదోనెలలో రెండవ సూర్యుడా అన్నంతగా వెలుగుతున్న కొడుకుకు జన్మనిచ్చినది. ఆరాజువిని ఆనంద పరవశుడై కార్తీక మాహాత్మ్యము సత్యమే, ఈ కార్తీక వ్రతమును ధర్మార్థకామ మోక్షములను పురుషార్థములనిచ్చును సమస్త భూతములకు సుఖము కల్గించునది కార్తీక మాసము అని చాటించెను. ఆ రాజు తన కుమారునకు శతృజిత్ అని పేరు పెట్టి బ్రాహ్మణులకు గోభూదానములనిచ్చి తృప్తి పరచెను.

ఓ రాజా! ఆబాలుడు క్రమముగా వృద్ధిచెంది యువకుడై శూరుడై సుందరుడై అలంకారభూషణుడై వేశ్యాంగనాలోలుడై అంతతో తృప్తి లేక పరస్త్రీలయందు ఆసక్తి కలిగి వారించిన గురువుల బ్రాహ్మణులను ద్వేషించుచూ జాతి సంకరమును కావించుచూ పరులను నిందుస్తూ, నిష్ఠూరములాడుతూ, పాపుడై, బయపెట్టుటకు నిత్యమూ ఖడ్గమును చేత ధరించి దురాగ్రహముతో తిరుగుతూండెడివాడు.

ఒక బ్రాహ్మణోత్తముని భార్య బహుచక్కనిది సింహపు నడుము వలె సన్నని నడుము గలది, పెద్ద కన్నులు కలది, చక్కని అంగసౌష్ఠవము కలది, చక్కని కంఠ స్వరము కలదియై మన్మథోద్రేకము కలది. రాజ కుమారుడు అట్టి బ్రాహ్మణుని భార్యను చూసి ఆమె సౌందర్యమును చూసి సంతోషించి ఆమెయందాసక్తి కలవాడైయ్యెను, ఆమెయును రాజకుమారుని యందాసక్తి కలదయ్యెను. తరవాత బ్రాహ్మణుని భార్య నిశిరాత్రి భర్తను విడిచి రాజకుమారునితో రాత్రిశేషమంతయునూ క్రీడించి ఉదయాత్పూర్వమే తిరిగి ఇంటికి వచ్చుచుండెను. ఈ ప్రకారముగా అనేక దినములు గడచినవి.

ఆసంగతిని బ్రాహ్మణుడు తెలుసుకొని నిందితమైన నడతగల భార్యను ఆమెతో ప్రియుడైన రాజకుమారుని చంపుటకు చేత కత్తిని పట్టుకుని ఎప్పుడు చంపుటకు వీలు దొరుకునా అని కాలముకొరకై నిరీక్షించుచుండెను. ఇట్లు కొంత కాలము గడచిన పిదప ఒకప్పుడు కార్తిక పూర్ణిమా సోవవారము నాడు ఆ రాజకుమారుడు బ్రాహ్మణ భార్యయు తమకు సంభోగ స్థానము దొరకక ఒక శివాలయములోనికి పోయి చీకట్లో క్రీడించుటకు వీలు కాక దీపము వెలిగించుటకై బ్రాహ్మణి తన చీర చింపి వత్తిని చేసెను, ఆరాజకుమారుడు ఆముదమును తేగా ఆవత్తితో వారు వారి సుఖము కొరకై మోహముతో దీపమును వెలిగించి అరుగు మీద పెట్టి తరవాత వారిద్దరూ అత్యుత్సాహముతో క్రీడించుచుండిరి.

అంత ఆ బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారు వేషములో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని నరికి తరవాత భార్యను నరికెను. అంతలో రాజకుమారుడు ఓపిక తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుని నరికెను. ఇట్లు పరస్పర ఘాతములచేత ఆ జీర్ణదేవాలయమందు ముగ్గురూ విగతజీవులైరి. ఆ దినము కార్తీక పూర్ణిమ సోమవారము దైవ వశము చేత అట్టి పర్వమందు వారి ముగ్గురికి శివాలయములో

అంతలో పాశహస్తులై యమ కింకరులు వచ్చిరి, అప్పుడే శివనేత్ర ధారులై శివకింకరులూ వచ్చిరి. శివదూతలు రాజకుమారుని, బ్రాహ్మణిని విమానమును ఎక్కించిరి, యమదూతలు బ్రాహ్మణుని కాళ్లుగట్టి తీసుకొని పోవ ప్రయత్నించిరి. ఇట్లు జారులైన తన భార్య, రాజకుమారుని విమానమెక్కించుట చూసి శివదూతలతో బ్రాహ్మణుడిట్లనె " ఓ శివ దూతలారా! నా భార్య, ఈ రాజ కుమారుడు జారులు, నేను బ్రాహ్మణుడనై సదాచారవంతుడనుకదా, మరి నాగతి ఇదేమి వారికా ఉత్తమగతేమి’ అని అడిగెను.

అనంతరం అతి దీనవదనుడైన బ్రాహ్మణునితో శివదూతలు ఇట్లు పలికిరి. ’ఓ బ్రాహ్మణుడా! నీవన్నమాట సత్యమే, కాని ఇందు ఒక విశేషమున్నది. ఈ నీ భార్య రాకుమారుడు పాపకర్మములు చేసినవారైననూ, కామ మోహముచేత కార్తిక పౌర్ణము సోమవారము నాడు శివాలయమున దీపారాధనము కావించిరి. దీపమునకు వత్తిగా తన చీరను చింపి నీ భార్య ఇచ్చినది, రాకుమారుడు ఆముదమును తెచ్చెను కాబట్టి వారి పాపములన్నీ క్షయములైనవి. ఏ కారణము చేతనైననూ కార్తీక మాసమునందు దీపదానము చేసినవాడు ధన్యుడు సర్వ మహాయోగులందు శ్రేష్ఠుడు అగును. కనుక దీపార్పణము వలన నీ భార్యకు, ఈ రాకుమారునికి కైలాసము. దీపదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించినది.

శివదూతలు ఈ విధముగా చెప్పగా వినిన రాకుమారుడు దయావంతుడై అయ్యో ఈ బ్రాహ్మణుని భార్యతో క్రీడించి, ఈ బ్రాహ్మణునిచేతిలో శివాలయములో హతుడనైన నాకు కైలాసము ఇంత సదాచారవంతునికి నరకమా! ఇది చాలా దుఃఖ కరము. కాబట్టి నా దీపదాన పుణ్యము ఈ బ్రాహ్మణునకిచ్చెదను యేక కాలమున మృతినొందిన మా ముగ్గురికి సమానగతియే ఉండవలెను. అని ఆలోచించి తన దీపదాన పుణ్యమునందు కొంత బ్రాహ్మణుని పరం చేసెను. అంత ఆపుణ్య ఫలమున ఆ మువ్వురునూ దివ్య విమానమెక్కి కైలాసమును చేరిరి. మోహముచేత చేయబడిన దీపదాన పుణ్యమే ఈ మువ్వురినీ కైలాసమునకు తీసుకొని పోయినది.

కాబట్టి కార్తీక మాసమందు కార్తీక ధర్మమాచరించవలెను, అట్లు చేయనివాడు రౌరవ నరకమును పొందును. కార్తీక మాసమందు నిత్యము శివాలయమందుగాని, విశ్ణ్వాలయమందుగాని దీపమాలను సమర్పించిన ఆ దీపదాన పుణ్యముతో జ్ఞానమును పొంది తద్ద్వారా పునరావృత్తి రహిత భగవత్సాన్నిజ్యమును పొందును. సందేహమేమీ లేదు. కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్త్రీ గాని, పురుషుడు గానీ తన శక్తి కొలది దీపార్పణం చేసినచో సర్వపాపనాశనము పొందెదడు. కాబట్టి నీవును శివాలయమందు తప్పక కార్తీకమందు దీపమాలలను అర్పించుము.

ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి నాలుగవ అధ్యాయము సమాప్తము.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.