గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, అక్టోబర్ 2013, శనివారం

శ్రీ అనంత భాస్కర శతకము. పూర్వార్థము.రచన: శ్రీ ఎన్వీ అనంత కృష్ణ.

జైశ్రీరామ్.
శ్రీ భాను ధ్యానమ్ము చేకూర్చు క్షేమమ్ము
                                         నారోగ్య మైశ్వర్య మమిత శక్తి
ఆదిత్య కిరణమ్ము హరియించు తిమిరమ్ము
                                          సకలార్ధములనిచ్చు సాధకులకు
సప్తాశ్వ నీ మంత్ర సంధానమును జేయ
                                           హృదయంబునానంద సదనమగును
పరమ పావన నీదు పాదముల్ మది గొల్చి 
                                           నీవె దిక్కందును నిత్య సత్య
పద్మ బంధు భక్త జన హృత్పద్మ వాస
స్తుతులు నతులు జేతు ననంత మతుల గతుల
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                                 1  

భూత జాలములన్ని పుట్టె నీ నుండియే
వేద రాశివి నీవె, వేత్త వీవె
వాగాది, శబ్దాది, ప్రాణాది, చర్మాది,
పంచ పంచికలన్ని పరగ నీవె
పుట్టించి, పోషించి, గిట్టించు వైనాన
కాల చక్ర గతికి కర్త వీవె
అరిసంఘ విధ్వంస, పరిపాలనాదక్ష
ప్రత్యక్ష పరమాత్మ ప్రభవు నీవె
మూడు మూర్తులు నీవైన మూల పురుష
నిజము నెఱుగంగ మనసార నిన్ను గొల్తు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                                 2  

నియమాల పనిలేదు నిగమాల విధి లేదు
జాతి వర్ణము లేదు, రీతి లేదు
సంభారములు లేవు సంకోచములు లేవు
భూరి దక్షిణ లేదు, పూజ లేదు
మడిగట్ట పని లేదు, మంత్రాల పని లేదు
వయసుతో పని లేదు, భయము లేదు
వెదుకనక్కర లేదు వెతలోర్చి నిన్ గూర్చి
కొండ కోనల వెంట, గుడుల వెంట
శిరము పైకెత్తి నినుగాంచి కరము మోడ్వ
వర పరంపరనిచ్చు నా స్వామి వీవు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                                 3

నీ రశ్మి జాలాల సారించి ప్రేమగా
నక్కునన్గొనగ నీయందు నేను
పరమాత్మ నాలోన భద్రమై వసియింప
నీవు నా యందన్న నిజమె యౌను
ఎవ్వరెవ్వరి యందొ యెఱుక లేకుండుట
వేరు వేరుగ చూచు తీరు తప్పు
నీవు నేనొకటన్న నిశ్చయమ్మునుపొంది
అద్వైత యోగాన నార్తి దీర

మాయ రాగాది దోషాళి, మాయ తొలగి
ఎంత సుఖమయ్య యీ రీతి ఎఱుక గలుగ
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         4

కమలాలు నినుగాంచి కనువిచ్చునో లేక
నీ చూపు బలిమియో నీకె తెలుసు
పంకస్థ దోషమ్ము పాటిసేయక వాని
నుద్ధరింతువు గదా శుద్ధ తత్త్వ
కారణమ్మేదైన కమలాప్తుడవు నీవు
కమల నీయకుమొక్క కమలమైన
బహు వర్ణముల తోడ, బహుపత్ర కమలాల
నారు దండను గట్టి యరగు చుంటి 
చూడుమవ్వాని, పరిపూర్ణ శోభ వెలయ
మరల వాడగలవు, దృష్టి మరల నీకు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         5

పిలువ ఘృణివటంచు భీతిల్లు తరుణాన
శిరము పై కరముంచి శివము గూర్చు
కొలువ సూర్య పదమ్ము కూర్మి గావుమటంచు
తుదకంట సరిజేయు నుదిటి వ్రాత
తలువ నాదిత్య తా దరిజేరి ప్రణమిల్లి
కాపాడు తన దీప్తి కనులు నిండ
విలువ యోంకారమో వివరింప పనిలేదు
సర్వ సంపదలిచ్చు సౌఖ్య మిచ్చు
చీడలన్నిటి మొదలంట చిదిమి వైచి
మూల శక్తిని నాకిమ్ము ముక్తి పొంద
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         6
(పిలువ, కొలువ ఇత్యాది "మొదలంట చిదిమి వైచి" చూస్తే "మూల శక్తి" కనపడుతుంది)

అరయ నీవేనయ్య ఆదిదైవతమన్న
ఇల మమ్ము బ్రోచు నీ యీక్షణమ్ము
ఉష తోడ ఛాయ తో నూరేగు నా రేడ
ఋజు వర్తనము కోరి ఋద్ధి కోరి
ఏకస్థ చిత్తమై నైహికమ్ముకు గాక
ఓర్మి సాధన జేయ నౌషదమ్ము
అంశుమాలికి సేవ లహరహవృద్ధిగా
హృద్బిందు సంయోగ హేల గనగ
దారి నడిపించు నా చేత జార గలను
వదల నీయకు నీవును వదలఁబోకు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         7
(పాదల ఆద్యక్షరములు, యతి స్థానములు  వరుసగ అచ్చులన్ని వున్నయి.
'హృద్బిందు సంయోగ ము చేత హ్రామిత్యాది బీజక్షరలు గా మారుతాయి)

భక్త చిత్త సరోజ భాగ్యంపు భృంగమై
శర్మము గూర్చెడి ధర్మ మూర్తి
తననంతుడైయ్యుండి వన నులను గూడె
సచ్ఛీల సాకార చక్రవర్తి
కౌశిక మునివరు కారుణ్య ఫల రూప
శస్త్రాస్త్ర శృతి లబ్ధ సత్య కీర్తి
పతికై, యపర్ణాన్న వ్రతమున్న, సీత, హృ
త్సోముడు, శ్రీ రఘు రామ మూర్తి                                                                    
వంశ కర్తవై, నఘ హర్త వైచెలంగి
భర్తవై, తాప హర్తవై భయము దీర్పు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         8

కష్టముల్గలుగంగ నిష్ట దైవము గూర్చి
జప హోమములయందు తపములందు
భక్తితో కైమోడ్చి భగవాను దరి జేరి
వేడుకొందురు దయ జూడుమనుచు
అద్దేవతా నేత్ర మరయంగ నీవండ్రు
రూపమ్ము లేవైన చూపు నీదె
గమనించు నా తండ్రి గతి వీవె యందురే
మనసు పెట్టియు గాని మరచి గాని
కావ మమ్ముల  నిదిచాలు కారణమ్ము
పాహి శరణంచు వదలనీ పాదములను
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         9
 
హంస యనగ జెల్లు నవ్యయమున చించ్య
మద్వయ సత్యమౌ నాద్య శక్తి
హంస యనగ జెల్లు నా శక్తి తెలియంగ
మననమ్ము జేసెడి మంత్రమునకు
హంస యనగ జెల్లు నన్నింట భాసిల్లు
ఖండ రూపమ్మున నుండు జీవి
తెలియ వలసినది, తెలియ జేయునదియు
తెలివితో తెలియంగ తలుచు వాని
తెలియ నొక్క పేరది యేల తెలుపు మయ్య
అదియు నద్వైత బోధయా హంస నామ
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         10
 
ఏమి లేకుండనే యింతింత పోగేసి
ఎండ వానలయందు నెదిగి యొదిగి
మట్టినంతయు బాగ గట్టి పడగ జేసి
జాలి మరచినావు జడము నైతి
శిలలాగ ననుమార్చి శిల్పివి నీవౌచు
కాలు సేతులనిచ్చి కళ్ళ నిచ్చి
కోతిలాగున జేసి కోరినట్లాడించ
అసలైన సంగతి మసక బారె
నిజము తెలియక శిల్పమ్ము నేనెయంటి
రభస చాలించు నీ పాద రజము నేను
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         11

భిన్న ఘటములందు భిన్న పటములందు
ఆకాశమంతట నసలు నొకటె
పాత్రలు వేరైన మాత్రాన చూడగా
జగమంత నిండిన జలమదొకటె
దేహాలు, రూపాలు, దేశాలు, జీవాలు
పుట్ట జేసినయట్టి మట్టి యొకటె
అగ్ని తేజమొకటె యన్నిట, చూడగా
నాయువై చెలగేటి వాయువొకటె
ఛద్మమై బహు గతుల చిచ్చక్తి యొకటె
కల్ల నొల్లక సత్యము కనగ నొకటె
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         12

కుంతి కుమారి తాఁ గొల్చెను నమ్మక
పాండు రాజ సుతుడు, భయము దీర
గీత దాటిన జానకీమాత కై స్వామి
వేద వేద్యులు మూడు వేళలందు
ఋషి భరద్వాజ ప్రభృతులును కొల్చిరే
మంత్ర జపము జేసి, మదిని తలచి
స్తోత్రాల స్తుతియించి, తోయమ్ము చేజార్చి                        
యజ్ఞ యాగాదుల నాచరించి  

ఎందు కొఱకైన, యెట్లైన, యెవరి నైన
చర్చ జేయక స్వాంతన గూర్చువాడ
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         13

మాయను జిక్కుట మది నూహ జేయగా
రానిది తగులగ రాదనంచు   
వారింప శక్యమే, వాక్కున పల్కుటె
టుల, నిశ్చల గతులన్ గలుగు టెటుల
దాయక తెల్పుము తదుపాసనా సుసా
ధ్యమ్మది చెందగ నెమ్మది గొన    
నీ యనుకంపయౌ నిర్గుణ సత్యము
తృటినందెడి విధమున్  తెలియనెంతు
ఆటుపోటులఁ జిక్కక నటునిటులను
బారక గమనమాగని బాట జూపు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         14

ఉపకార మొనరించ నుపదేశ రూపాన
యుక్తమౌ విషయమ్ము వ్యక్త పరచ
నుద్భవించెదరంట యుద్ధరించుటకునై
సంచితమ్ముల నన్ని సమయ జేసి
స్థాయి భేదము బట్టి సాధనా సంపత్తి
సాధ్య పడగ జేయు సద్గురుండు
పొత్తమ్ములను గాక చిత్తమ్ములను బట్ట
సచ్చిదానందమౌ సరణి కలుగు
స్థితి గతుల నెఱుగ స్థిర చిత్తమెఱుగ
గురుతెరిగి నీవె కాపాడు గురుని భాతి
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         15

ధాతకునేలనో రేత స్ఖలనమౌట
నద్దాని నగ్నిని యాజ్యమట్లు
హోమము సేయుట, హోమాగ్ని యందున
వేలకు వేలుగ వాలఖిల్యు
లు, కిరణ పాను లలుప్తాగ్ని తేజస్కు
లంగుష్ట మాత్రులు నస్ఖలితులు
బ్రహ్మచారులు పుట్టి బాయక నీ తోడ
దిరుగాడు వరమొంది ధన్యులైరి
వున్న తావున పరువెత్తుచున్న వాడ
నన్ను సైతము గమనించ విన్నవింతు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         16
 
నిన్ను మరచువేళ నిజమైన లేమియై
శోభిల్ల నీయందు స్ఫురణ ధనము
మనసన్న మోసము మాపాలి రోగమై
మానని నీ సేవ మాకు మందు
స్వార్థము భోగేచ్ఛ వాంఛాలసత్వముల్
క్రిందకు లాగుచు కృంగ జేయు
శ్రద్ధయు భక్తియు సాధు వర్తన దీక్ష
ఉత్తమ గతినొంద నుండ వలయు
ననుచు బోధన సేయంగ నలసి పోను
అనువదించగ చేతల కనికరించు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         17
   
లక్ష్యమొకటెయైన లక్ష్యించు తరుణాన
తానున్న యాశ్రమ ధర్మ మెఱిగి
తన సాధనల జేయ తరియించగా వచ్చు
ధర్మ భంగంబైన తప్పిదమ్ము
మలి యాశ్రమంబున మరల మారగవలె
విధి నిషేధమ్ముల వివర మరసి
ఆశ్రమ మ్మేదైన నేశ్రమయును లేక
నామ స్మరణ జేయు నాల్క కలుగ
మార్గ మధ్యమ్ము నందున మార్పు లేక
చేరు నిశ్శ్రేయస పదము క్షేమముగను
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         18  

అస్థిర దేహమ్ము సుస్థిరమందును
సుస్థిరుడవు నిన్ను చూడనేల
స్వప్న తుల్య జగతి సత్యమందునదేల
నిత్య సత్యుడవైన నిన్ను వదలి
కర్మల చేయుచో కర్త నేనేయందు
నీవె కర్తవనెడి నిజము నెరిగి
సంచరింతువు నీవు సర్వ జీవులయందు
కొందర చూడగ గొడవ పడుదు
తెలిసి తప్పులు చేయుట తెలివి యౌనె
భ్రాంతి తొలగించి యసలైన కాంతి జూపు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         19  

కమనీయమైనట్టి గంధర్వ గానమ్ము
లపురూప నృత్యాల నప్సరసలు
స్తోత్రాలు వేదాలు స్తుతియించి సాగంగ
ముందు వైపున ఋషి బృందమంత
రక్షోహుడాదిగా రాక్షసులందరు
వెన్నంటి నీయొక్క వెనుకనుండ
కళ్ళెమ్ము పట్టుక గ్రామణులు నడువ
తీరుగా సర్పాలు తేరు లాగ
బ్రహ్మ దత్తమౌ బంగరు రథము నెక్కి
తిరుగ దగుగాని నా బోంట్ల మరువ దగునె
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         20  
  
అంతరింద్రియముల నదుపులో నుంచుచున్
బాహిరింద్రియముల పరుగులాపి
శబ్దాదులం దనాసక్తి పెరుగుచుండ
ద్వంద్వాదుల న్సమ దృష్టి గలిగి
గురుని వాక్యమ్మందు గురికల్గి చరియించి
నీయందు మనసును నిలిపి నిలిచి
అగ్ని జిక్కిన చీమ యారడి చందాన
ముక్తికై నాకాంక్ష మొక్క వోక
తత్త్వమస్యాది వాక్యార్థ తత్త్వమెఱిగి
శాశ్వతానంద సంప్రాప్తి సాధ్య పరుచు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         21

ఎవ్వని మండలమెన్నగా దారిద్ర్య
దుఃఖ క్షయకరమ్ము దోషహరము
త్రిగుణాత్మ రూపమ్ము త్రైలోక్య పూజ్యమ్ము
జ్ఞాన ప్రదీపమ్ము నాద యుతము
ధర్మ వృద్ధి కరమ్ము మర్మ ప్రబోధమ్ము
దేవాది పూజ్యమ్ము దీప్తికరము
వేదాది స్తూయమ్మనాది స్వరూపమ్ము
సర్వ పాప హరము సర్వగతము
అట్టి నాస్వామి నిన్నిటు పట్టుకొంటి
చేరగొని నన్పునీతుని జేయుమయ్య
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         22  

అందిన కరమందుకొందనిన్ శిరమిడి
గురుపద సీమపై వరమడుగగ
పొందిన కరదీప చందమౌ సన్మంత్ర
రక్షణ నొందగా దీక్ష నిచ్చి
కన్నోట కుందిన కరవాల సదృశమౌ
దృగ్జాలముల చేత త్రెంచి వేసి
కాలుడు కీలల కాల్చగ జాలక
భయమొందిన కరణి పరుగు వెట్ట
కోరి రక్షించ దక్షులౌ గురువులకును
స్పూర్తి నిచ్చెడి సద్గురు మూర్తి వీవు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         23

ఉంచగ నెంతువా యుంచెదవంతియే
కాదేని యుంచవు క్షణమె కూడ
నీయందు నుండగ నీ నామ స్మరణమ్ము
మెండుగ నామది నుండ వలయు
సరియగు వేళకు మరువక పిలువగ
వలయునవ్యభిచార భక్తి ధనము
చింతల చిక్కక చింతన మానక
సంచిత గంధము త్రుంచి వైచి

నే నిరంతర ధారగ నిన్ను తలచు
చిత్త వృత్తి నిరోధక శిక్ష నిమ్ము
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         24

వారింప జాలమే వారిజాక్షుల పైన
సారింపగా దృష్టి తేరి పార
వారింప జాలమే భూరి దక్షిణలకై
జారేటి మా మతి నేరి కోరి
వారింప జాలమే బీరాల పలుకంగ
మాటి మాటికి దూకు నోటి మాట
వారింప జాలమే కోరి కొండెమ్ముల
                             వినగోరు వీనుల విషయ వాంఛ
పరుగు లాపించు మాచేత వరద హస్త
దారి మరలించి నీ దరి చేరనిమ్ము
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         25

మమతానురాగాలు మఱుచోట ద్వేషాలు
వారు వీరన్నట్టి వేరు చూపు
జాతి లింగములందు నీతి నీమాలందు
వీలు వెంట బిరాన వాలు చుండు
హెచ్చు తగ్గులయందు వెచ్చించు సమయమ్ము
సకలమొకటె యన్న సమత మరచి
తర తమ భేదాలు తన మన భావాలు
తనుగతములె యన్న తలపు మాని
ఏల ద్వంద్వాల నీ చిందులేల నాకు
తెలుపు నిర్ద్వంద్వ మీవయె దిక్కు తండ్రి
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         26
 
సురుచులు దుఃఖాంత సులభ సాధ్యమ్ములు
సుగుణాలు కష్టించ సుఖము గూర్చు
కనరాని వస్తువు కనుగొన మందువు
ముండ్ల వస్తువులుంచి కండ్ల యెదుట
పరువెత్తు మనసును పట్టుకొమ్మందువు
నవ రంధ్రముల నావ నడుమ నిలిపి
సూటిగా చెప్పిన సొమ్మేమి పోవునో
చోద్యమ్ము చూతువు చొరవ మాని
ఏల మాకీ ప్రహేళిక లేలనయ్య
వీలు వెంబడి నడుపుమా కేలు బట్టి
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         27
 
జగమంతయును పుట్టె స్వప్నమ్ము బోలిక
జనుల మనసులందు జడముగాను
కారణమ్మింతియే కన్పింప భిన్నత
నొక్కరూపమ్మైన పెక్కు గతుల
దుడుకు దూకుడునాప దూరమౌ స్వప్నమ్ము
క్షయమౌను మనుసుతో జగతిగూడ
చిన్న నిజమెఱింగి నిన్నెఱుంగుటయెట్లు
మమ్ముంచ నీవిట్లు మాయలోన
మనసు గెల్వనిమ్మిక వేరు మాట వలదు
అడ్డులేక జగజ్జేత నౌదు నేను
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         28

ఆంజనేయుఁడె సాక్షి యాజ్ఞవల్క్యుఁడె సాక్షి
గురువుగా నీవున్న కొదవ లేదు
భావి బ్రహ్మయెయైన భయ భక్తి చరియించి
చదువంగ నీవెంట సాగెనంట
శక్తిమంతులకట్లు సాధ్యమగును గాని
శక్తిహీనులగు మా సంగతేమి
నా స్థితి గమనించి నన్నాదుకోవలె
నీసాటి వాడైన నీవెయైన
వత్తువో పంపనెంతువో పరమ పూజ్య
నిర్ణయమ్మును తెల్పు నా కర్ణమందు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         29

శ్రీకంఠునొక్కని సేవింతురే గాని
శ్రీకాంతుడన్నచో చేరరసలు
చంద్రసోదరి భర్త సంగతి నుందురు
చంద్రశేఖరుడన్న చనరు వినరు
మూర్తి త్రయమ్ములో మొదటివాడే గాని
గుడియైన నున్నట్లు గురుతు లేదు
ముగ్గురంశల దాల్చి మూడు సంధ్యలయందు
వీర భక్తుల పేర పోరు తీర
సర్వ సాక్షివి నీవంచు సమ్మతించ
భళిర మా మాయ రొగమ్ము బాపినావు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         30

నిస్సార కాసార నిర్హేతు సంచార
కుసుమశర వికార కుహర గహన
నిబిడాంధకారవన్నిస్తేజ సంసార
నిర్భీతి ధిక్కార నియత సాధ్య
నిజ దేశికాదేశ నిష్కామ పరిపాక
నిష్ఖేద బ్రహ్మత్వ నికట గమన
హార కేయూర మంజీర రంజిత పాద
యోగ భోగ పరాగ రాగ త్యాగ
సఫల నిర్గుణ తత్త్వ విచార సార
ఘోర పరివర సంసార భార దూర
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         31

(కుసుమశర వికార,నిస్సార కాసార గహన కుహర నిబిడాంధకారవత్ నిస్తేజ సంసార నిర్హేతు సంచార నిర్భీతి ధిక్కారనిజ దేశికాదేశ నిష్కామ పరిపాక నియత సాధ్య సఫల హార కేయూర మంజీర రంజిత పాద యోగ భోగ పరాగ రాగ త్యాగ, నిష్ఖేద బ్రహ్మత్వ నికట గమన నిర్గుణ తత్త్వ విచార సార, ఘోర పరివర సంసార భార దూర, భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద, దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ)

ఇటువారికుదయాద్రె యటువారికస్తాద్రి
చూచు స్థానము బట్టి చోటు మారు
ఏక రూపమ్ముతో నెల్ల వేళల వెల్గు
తేజమ్ము నీవన్న తెలివి మరచి
మానక దిరుగుచో మార్పు నాపాదించి
నిజమైన భ్రాంతినే నిజమనంచు
ఒక కొండ యెగురంగ నొక కొండ యొరగంగ
రెండు కొండల నడుమ రేబవలని
తనకు తోచిన దొక్కటే తత్త్వమనెడి
హ్రస్వ దృష్టిని తప్పించి రక్ష నిమ్ము
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         32

ఎన్నాళ్ళు తిప్పెద వెన్నాళ్ళు తిరిగేను
కొండాడుటందున కొదువ కలదె
కొండంత స్వామికి కొండంత పత్రియా
భావ బలిమి జూడు బాట గాదు
మిన్నున చూడంగ కన్నార కన్పించి
వెన్నంటి నిల్చేటి వేల్పు వంచు
చిన్ననో మిన్ననో చెన్నార పూజింతు
నన్నేలవేలనో సన్నుతించ
నెన్నగాను జగచ్చక్షు వీవ నండ్రు
నేను నీవాడ గానటో కాన రానొ 
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         33 

ఒక రోజు బుట్టంగ నొక రోజు గిట్టంగ
నా రెంటి నడుమదే యాయువంచు
పుట్టి గిట్టుట పేర నట్టిట్టు తిరుగాడి
కొట్టు మిట్టాడు నీ బొట్టె నేను
గట్టిగా యేడ్చినా పట్టించు కొనకున్న
నొట్టి మాటలు నీకు పట్టవంచు
నీ చుట్టు దిరుగుట నీకు నా గతి తెల్పి
తిరుగుడు తప్పించు తెరవు కొఱకు
బెట్టు సేయక చట్టన గట్టి పట్టు
పట్టి గట్టునెక్కించగ దిట్టవంచు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         34

మిత్రుని కంజలి మేల్జోతలు రవికి
ప్రణతి సూర్యునికిడి భాను మ్రొక్కి
ఖగ పూష యంచును కైమోడ్పులర్పించి
పైడి గర్భునికింత ప్రాంజలించి
మా మరీచికి భక్తి మనసార శిరమొగ్గి
ఆదిత్య సవితాఖ్యు నర్చ జేసి
అర్క భాస్కర నాము కభివాదముల్జేసి
వందనంబులు చేతు వంగి వంగి
 దేవ దీర్ఘ రోగమ్ముల దివిచి వైచి
ఆయురారోగ్య భాగ్యాల నంద జేయ
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         35 

ఒంటి చరింతువు జంట బాటల వెంట
మూడు సంధ్యల గొల్వ మూర్తి వంట
వేద చతుష్టయ వేద్యుడ వీవంట
పంచకోశాంతర వాసి వంట
షడృతు కర్తవు నంట సప్తాశ్వ రధివంట
అష్ట కష్టమ్ముల నణతు వంట
నవ విధ భక్తుల నమ్మి గొల్చెడి వారి
నీడవై కాపాడి నిల్తువంట
వేల కిరణాల వేల్పురో వేడుకొందు
ఏల జాగేల నన్నిక నేలు కోమ్ము
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         36

బంధు పోషణయందు బహు నేర్పరివి నీవు
శౌర్య పరాక్రమశాలి వీవు
పర పీడనమ్ముల పరిహరింతువు నీవు
గ్రహబాధలంటమి రక్ష వీవు
ఆత్మ వదందరినాదు కొందువు నీవు
అన్ని వైపుల యందు నభయమీవు
ఎట్టి శూన్యమునైన నిట్టె మాయము జేసి
మట్టు బెట్టెదవెట్టి మాయనైన
కేల కుసుమాల మాలలు చాలి గాదు
లీల నాయందు ననురాగ హేలగాని
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ                         37

భళిర ధరామృతమ్మళి భంగి గొంపోయి
జలధరమ్ములయందు సంగ్రహించి
కలవారి కడదీసి వలయువారికినిచ్చి
జగతి జీవింపగ మిగుల బంచి
తపన స్నపన కేళిదనరంగ గావించి
సకల లోకమ్ములు సంతసించ
కనరాక కన్పట్టి యనుకంప వర్షించు
సాంద్ర కృపానిధీ శరణు శరణు
ఇంద్రుడై వివస్వానుడై యిలను గాచు
నీశ్వరా శాశ్వతానంద మీయ వయ్య
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ         38
 

సత్త్వ రజస్తమాసక్తులు స్త్రీలట
అరయ నావలి వాడె పురుషుడంట
ఈరీతి గమనింప నేడేడు లోకాల
నెల్లవారతివలే యీవు దక్క
నీ ప్రియ భావిని నేనై పరితపింతు
దరిజేర్చి కాపాడు ధవుడవౌచు
సంశోధనలు మాని సంతాపములు దీర్చి
సంసార బంధాల సమయ జేసి
 మదిని నీ యందు రతి గల్గి ముదము నొంద
వరము నిమ్మంచు నా స్వామి వదల నిన్ను
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ         39

దుఃఖ పడుటవల్ల దురితమ్ము తొలగునే
దైవ బలము కల్గ ధైర్యమబ్బు
ఇసుమంత జరిగిన నీశ్వరేచ్ఛయె గాని
నితరమ్ము కాదన్న ఋతము కాదె
సంచితాదుల భుక్తి నుంచక దృంచుచో
దైవ దూషణ జేయ తప్పు గాదె
శరణు జొచ్చిన వారి కరుణించి కాపాడి
రక్షింతువే గాని శిక్ష లీవు
చిత్తమందు నీభావము స్థిరము గాగ
చంచలత్వము లేకుండ నుంచమనుచు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర  వరేణ్య సవితా తిగ్మ కిరణ                40

సత్సంగ ఫలితమౌ స్మరణ శ్రీ గంధంబు
చేత బట్టితి నీదు సేవ కొఱకు
విషయ వాంఛల గోసి విరులుగా భావించి
అర్పింప నెంతునే నార్తి తోడ
బహుజన్మ సంచిత వాసనలన్నింటి
ధూపమ్ముగా జేసి చూపనెంతు
చిచ్ఛక్తి దీపమ్ము సిద్ధ పరచినాడ
నారగింపులు చేయ కోరికలను
హృదయ మందుదయించగ కదలి రమ్ము
వేగ నా పంచపూజలు స్వీకరించ
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర  వరేణ్య సవితా తిగ్మ కిరణ                41
 
అమృతత్వ మొందగ త్యాగ శీలురగుచు
లోని చూపు కలిగి లోతు లెఱిగి
వేదాంత విజ్ఞాన విషయజ్ఞు లౌచును
లంపటమ్ములు లేక లక్ష్యమెఱిగి
ప్రణవార్ధ సంధాన ప్రణవాత్ములైనట్టి
చారు చరితులు నీ సాటి వారు
మచ్చు కొకటియైన మావద్ద లేవంచు
పట్టించు కోకుంట పాడి కాదు
యుక్త విషయగ్రహణ శక్తి యుక్తి గరపి
ముక్తి కాంత కొఱకు  ననురక్తి నిమ్ము
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర  వరేణ్య సవితా తిగ్మ కిరణ                42
 
ఎటులడ్డు లుడుగు, నేనీ మాయ తొలగంగ
నేమి సేయ వలెనో, యెయ్యది గతి
ముడివడు చిక్కుల విడదీయ సాధ్యమో
దుర్భేద్యమో యెటున్ దోచదాయె
సుప్తమౌ హృదిపొంగ లిప్త కాలము జాలు
మాయ నర్తన జేయు మనసు సమయ
తారాధిపు వెరపుల్హోరాది తలపులున్
భ్రమ వెట్టి నన్నేల వదలి పోవు
లెమ్ము హృది నివాసము జేసి కొమ్ము రమ్ము
రయముగ నినుగని మనసు లయము గాగ
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర  వరేణ్య సవితా తిగ్మ కిరణ                43 

ఎచటనాత్మానంద మెచటనాత్మానంద
మంచునే నిటు సంచరించి దుఃఖ
ఘన విరామానంద కళికలున్నీవన్న
యెఱుక లేకుంటినదేమి లీల
ఒగి పరమానంద మొందుట యెట్లంచు
సందియ మందున కుందనేల
సతత పరానంద సంధాన తుందిల
హృదయమ్ము కల్గుట పదిలమంచు
శాంత చిత్తాన సాధన సఫల మనగ
నిట్టి యానంద మావిష్కరించుమయ్య
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర  వరేణ్య సవితా తిగ్మ కిరణ                44

క్షుద్బాధకోర్వక హృద్బాధకోర్వక
నున్నదానిని పెంచి యునికి మార్చి
చింతించు తరుణాన చిత్తమందిసుమంత
శొభనొందదు గాని క్షోభ నొందు
కలుఁగఁ జేసిన గాని తొలఁగఁ జేసిన గాని
నా మంచి కొఱకంచు నమ్మ లేక
పాపముల్ తొలగంప బాధల వెట్టిన
పట్టదనుచు దుయ్య బట్ట తగునె
ఇంత చంచల మీ చిత్తమేల నయ్య
వలదు నాకది నీ వద్ద వదలివైతు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర  వరేణ్య సవితా తిగ్మ కిరణ                45

తమ సొత్తు యన్నట్లు తమకడ్డు లేనట్లు
గగనభాగమ్మంత గప్పివైచి
మినుకు మినుకుమంచు మెఱుగులు చూపించి
సొగసులొలక బోయు చుక్కలన్ని
దొరగారి గాంచిన దొంగల చందాన
పట్టుబడుదుమన్న భయముతోడ
కనినంతనే నిన్ను కన్పింప కుండగా
కనుమరుగగునంట క్షణము లోన
 చిద్గగన మందునుదయించు శీఘ్ర గతిని
ఆరు చుక్కలు కామాదు లంతరించ
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర  వరేణ్య సవితా తిగ్మ కిరణ                46

అర్చించు తరుణాన యర్పింప రాదంచు
మారేడు పత్రన్న మరువ మండ్రు
మారేడ నీపేర మా  రేడు కలడనా
తేనీరు శివమైన త్రిదళములను
అన్ని నీవే యౌచు నన్నింట నీవుండ
చెట్లు చేమల వైర మెట్లు పొసగు
అల్పత్వమందునా అజ్ఞానమందునా
అపచారమందునా రిపువునౌదు
వలయు సాధన సంపద వరములొసగి
స్థిరత నుద్ధరింపుము తండ్రి తిమిర హరణ
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర  వరేణ్య సవితా తిగ్మ కిరణ                47

మోహ వస్తువులన్ని మొగము ముందరయుండ
యూహలందున కూడ మోహ పెట్టు
వాని వెంట మసలి వాని నుండి మరల
చెప్పఁ దేలిక గాని చేయుటెట్లు
ఆలు బిడ్డలటంచు నన్న దమ్ములటంచు
బంధు హితులటంచు పట్టకుండ
నాలోన నేనుగా లోలోన తిరుగాడ
క్రూరాత్ముడందురే కొద్ది మతులు
ఆటలాడించి మురిసేటి పోటుగాడ
చేటులుడిగించి నను నీవె చేదుకోర
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర  వరేణ్య సవితా తిగ్మ కిరణ                48

కశ్యపాత్మజుడంచు కమలాప్తుడంచును
పరమాత్మ నిన్నింత ప్రస్తుతించ
విలాస హాసినీ సమ్మోహ విద్యల
మర్మమరసి రోసి మాయ తొలగి
కనగా శత సహస్ర కౌముదీ  తుల్యమౌ
యానంద యోగమ్ము ననుభవించి
యార్ద్రమై వెల్గొందు యగ్ని శిఖనొకచో
నాద్యంతములు లేని యంత జేసి
భూరి ఫలమిచ్చు నిను నేను పొగడ వశమె
కాదు నా శక్తి నీ యనుకంప గాని
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర  వరేణ్య సవితా తిగ్మ కిరణ                49

కర్మలఁ జేయక కైవల్య మెటులబ్బు
కనుక దానను గొప్ప కనమనండ్రు
సాధించ దగుదాని శ్రద్ధగా జేయుచో
ఫలితమందున దృష్టి నిలుపనేల
భక్తి గల్గక యున్న ముక్తి గల్గదు కాన
మోక్ష సాధనమందు ముఖ్యమండ్రు
నిజ వస్తు జ్ఞానమ్ము నిక్కమ్ము దొడ్డది
నివురు తొలగి పోయి నిప్పు తెలియ
ఒకటికొకటి కావలెనున్న దొకటి తెలియ
వేరనుచు పోరు తెలియమి వెర్రి గాదె
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద

దివసకర  వరేణ్య సవితా తిగ్మ కిరణ                50
(సశేషం)
జైహింద్. 
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.