గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, అక్టోబర్ 2013, మంగళవారం

శ్రీ గుత్తి (జోళదరాశి) చంద్రశేఖర రాయలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! బంగారు పాళ్ళానికైనా గోడ చేర్పు కావాలి. ఎంతటి మహనీయుఁడైనా అతనిని గుర్తించి, సమాజంలో వెలుఁగ జేసే ప్రతిభాశాలి కావాలి. అప్పుడే ఆ మహనీయుని ప్రతిభా పాటవాలు లోకులకు తెలియఁబడతాయి.
అలనాడు సాహితీ సమరాంగణా సార్వభౌముడైన శ్రీ కృష్ణ దేవరాయలవారు తన ఆదరణతో అష్ట దిగ్గజ కవుల ప్రతిభాపాటవాలను ప్రజ్వలింప జేసి, ఆంధమాతకు అపురూపమైన కావ్యరాజముల సృష్టికి మూలమై ఆంధ్ర సారస్వత కీర్తి చిరస్థాయిగా చేశారు. శతాబ్దాలు గడిచినా ఆ గ్రంథాల తేజస్సు కాని, ఆ రాజ కవి కీర్తి కాని ఏమాత్రం తగ్గలేదు. 
ఐతే ఈ నాడు బ్రతుకు బండిని ఈడ్చుట కొఱకు, ప్రపంచీకరణ మాయాజాలంలో తామూ ప్రతాపము చూపాలనే ప్రయత్నంతోను, అనివార్య పరిస్థితి వలనను అన్నిప్రాంతముల వారితో పాటు ఆంధ్రులు కూడా ఆంగ్లభాషాధ్యన , ప్రసార మాధ్యమిక భాషగా ఆంగ్లముపై దృష్టి పెట్టుచున్నందున మాతృభాషా మధువును గ్రోలనవకాశము లేకయున్నారు. కారణమేదైనా మన పూర్వులు చేసిన భాషాపరమైన మహనీయ కృషి అడవికాచిన వెన్నెలైపోవుచున్నదనుటలో సందేహము లేదు. ఐతే ఈ నాటికి కూడా ఆంధ్రభోజుని ఘన కీర్తికి అద్దంపట్టుతున్నమహనీయులనేకమందిలో మన సాహితీ ప్రియ మిత్రులు శ్రీ గుత్తి జోళదరాశి చంద్రశేఖర రెడ్డిగారి సాహితీ సేవను మనం మరువ జాలనిది. 
ప్రతీ సంవత్సరమూ శ్రీ కృష్ణ దేవరాయ పట్టాభిషేకదినోత్సవమును మియాపూర్ లో గల తన యింటిముందు సుమారు 7అడుగుల శ్రీకృష్ణ దేవరాయలవారి కి పూజాదికములు జరిపించుచు, పండిత గోష్టి నిర్వహించి, అష్టదిగ్గజ కవి సత్కారము పేర శ్రీకృష్ణ దేవరాయలు పైనా, అతని కావ్యములపైనా కృషి చేయుచున్న మహన్రీయులను గుర్తించి వారిని  ఆహ్వానించి, ఇతోధిక సత్కారము చేయుచూ కృష్ణ దేవరాయలుపై తనకు గల అభిమాన గౌరవాలను ప్రకాశింప జేయుచున్నారు.
శ్రీ అంజయ్యావధానికి శ్రీ గుత్తివారు చేయుచున్న సత్కారం.
ఈ కాలంలో మనం చూస్తుంటాము. తనను ప్రతిభునిగా గుర్తించి తనకు సాత్కారం ఎవరైనా చేస్తే బాగుండునని చూచేవారు అధికంగా ఉండే రోజుల్లో అట్టి స్వార్థ దూరులై ఇతరులలో ఉండే ఏ కొద్దిపాటి ప్రతిభనో గుర్తించి అసాధారణ ప్రతిభగా గుర్తింపచేసి, వారిని సత్కరించుట ద్వారా ఆ ప్రతిభను ద్విగుణీకృతం చేస్తున్న మన చంద్రశేఖరరెడ్డిగారి సాహితీ సేవను ఎవరైనా సరే మనసారాభినందించక మానరు.
ఇట్టి మహనీయ తత్వమొక రాజయోగమే. సత్కరింపబడే వారు కవులైతే సత్కరించేది కవిపోషకులైన వారెవరైనా అలనాటి రాజులతో సమానులే కదా! ఇట్టి సాహితీ సంసేవనా తత్పరత, సాహిత్యాభిలాష కలిగినవారి సంఖ్య పెరిగితే మహనీయ కవి కృషీవలురు సాహితీ కల్పధృమ సుమ సౌరభాలతో మన సాహితీ జగత్తును ఆనందభరితం చేస్తారనడంలో ఏమాత్రం సందేహమక్కరలేదు. నేను సహృదయ సాహితీ మిత్రులైన శ్రీ చంద్రశేఖర రెడ్డిగారిని మనసారా అభినందిస్తున్నాను.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.