జైశ్రీరామ్.
Print this post
చదువులవన్నియు చదువుటదేటికి
చదువగ నీదగు చదువులేక
పౌరుషమేలనపౌరుషేయాఖ్యల
నామ్నాయ మొనరింప నాశ లేక
దుంపల పిలకల దుంపగ లంపట
మెట్లైన తొలగించు నిచ్ఛ లేక
ఏరేరి దురితమ్ము లేరేరి పోకార్చు
గురువులేరనుటకు గురుతు రాక
జన్మలన్నింట నుత్తమ జన్మ యేల
పతిత పావన నినుజేరు గతిని మరువ
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 51
కాంతి కల్గంగను కారణమ్మగుటచే
భాస్కరుండను పేర బలకరింతు
బ్రహ్మాండ మంతయు బ్రతికించెదవు గాన
మార్తాండుడను పేర కీర్తి కలిగె
హరియించ తమమును హంస యంటిని నిన్ను
పోషించెదవు గాన పూష యంటి
లక్షణమ్మును బట్టి లక్ష్యించుటకు గాను
పెట్టుకొన్నవి పేర్లు పెక్కు గలవు
అసలు నీ పేరు తెలుసుకొని మసలు కొనగ
పుట్టు పూర్వోత్తరమ్ముల గుట్టు తెలుపు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 52
ఘన ఘనాఘన గత ఘనరసమ్మిల పైన
జల జలా జారంగ జగతి మురియ
గంగ కృష్ణ యమున తుంగభద్రలనుచు
పేర్లు పెక్కుగ పెట్టి వేరు సేయ
నుండబట్టగ లేక యురికి యురికి వేగ
నుదధి లోనికురికెనునికి సమయ
నీదు శక్తియు లేక నీరు నీరదమౌనె
నీరదమ్మగునొకో నీరు గాను
మొరలు వినుమద్వయానందకరుడ వనగ
తనరు మాయల తొలగించు ఘనుడవనఘ
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 53
కనిపించనట్టిది కల్పించుచున్నదే
కనిపించునది యంత కలిగినట్లు
కదలాడు చుండెనే క్షణ కాలమాగక
కలదాని కనకుండ కళ్లు గప్పి
పట్టి బంధింపగ పలుమారులెత్నించ
పట్టు బట్టితి గాని పట్టు బడదె
కలలన్ని కరిగించి కలదాని పరికించ
కట్టి వేయగ రాదె కరుణ తోడ
చంచల నచంచలను జేసి చంచరీక
గతిని నీ పాద పద్మమ్ము కడను నిల్ప
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 54
భిక్షాన్నమేలన్న వినయ మబ్బుటకండ్రు
గురుని యెంగిలి ముద్ద గోచి పాత
ఇంద్రియమ్ముల వాని యిష్టాని కొదలక
నిగ్రహించుక నుంచు నియతి కొఱకు
అభ్యసించిన విద్య అర్ధించినది విద్య
సత్యమైనది విద్య శ్రద్ధ విద్య
పెద్దలందున భక్తి వేదమందనురక్తి
పరహితమాసక్తి సరస యుక్తి
కఠిన మైనను క్రమశిక్ష గరపి నడుపు
గురుకులము నిన్నెఱుఁగుటకు గురుతు కొఱకు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 55
నీ లీల విభవాన నింగి చేరిన నీరు
చిరు చుక్కలై భువి చేరు వేళ
లోక హితముగూర్చు మీకు శుభమనుచు
నుదుట ముద్దు వెట్ట మదిని మురిసి
దరహాస మొనరింప హరి విల్లుగా మారె
ఆకాశమంతట నావరించి
నేనొక బిందువు నీ యందు కానటో
ననుగూడ దయజూడు నయముగాను
అహరహము వికసింతు నా దహరమందు
సుప్తమౌ తేజముదయింప సప్త గతుల
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 56
నీ స్ఫూర్తి కల్గించు నీదు చర్చల విన్న
రిపులన్నగాని గరిపొడవవలె
మాయ పొరల దృష్టి మరలించి కన్నుల
నీ దివ్య రూపమ్ము నే కనవలె
లౌకిక విషయమ్ములనుగాక వీనుల
నీ భవ్య లీలల నే వినవలె
జాగ్రదాదులయందు జాగరూకత కల్గి
నీ సత్య నామమ్ము నేననవలె
యిన్ని మాటలెందుకు గాని నిన్నడిగెద
వదలకయె నుండు నాలోని శ్వాస వోలె
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 57
గంధమద్దెదమన్న గగనాన నీవాయె
పుడమి తత్త్వంబెట్లు పొసగ గలదు
పూల పూజలు చేసి పులకించుదామన్న
ఆకాశ తత్త్వమట్లందవాయె
అగరు ధూపమ్ముల నందించ లేనయ్య
వాసనా సంపత్తి పంపగలను
దినమణి నీముందు దీపమ్ము లేపాటి
ఆర్ద్ర తేజముతోడ నాదరింతు
ఆత్మనర్పించు వైనమే ఆరగింపు
సమయ ద్వంద్వమ్ములది పూజ సకల విధుల
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 58
అస్తి నాస్తి యనుచు ననుమానములు ముందు
వివరమరయుచుందు వెతలు పడుచు
గుణములాపాదింతు గుణరహితుడవందు
గుడుగుడు గుంజంపు గోల లోన
శకలమ్ము నీవందు సకలమ్ము నీవందు
బహు భూషలందున్న పసిడి పగిది
అన్ని నీవేయందు అంతట నీ వందు
చూపుల చూచెడి చూడ్కి గలుగ
చర్మ చక్షువుకందని మర్మమెఱుఁగ
నీవె చాక్షుష్మతీ విద్య నేర్ప వలెను
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 59
కర్జూర కాయను, కాకున్న లేకున్న
పోక చెక్కలు గాని, పూలు గాని
పసుపు కొమ్మును గాని పండునైనను గాని
అదియు కాకున్నచో నక్షతలను
బుద్ధి పుట్టిన దాని పొల్పార చేకొని
ఆకునందుననుంచి యర్చ చేయ
వస్తు గుణము పోవు వచ్చి చేరెదవీవె
అద్వైతమునకిదే ఆది బోధ
భళిర పర్జన్య గర్జయు పారిపోవు
చేత శబ్దము కన్నను శ్రేష్టమందు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 60
కుక్క జూడ భయము కోతి జూడ భయము
పదియావులెదురైన భయము భయము
జలము చూడ భయము, జనులచూడఁగ భయం
బొంటిగా గుంపుగా నుండ భయము
చీకటన్న భయము, సీమ దాట భయము
భయములిన్ని కలిగి బ్రతుకు వేళ
నద్వైతినన్నచో నాత్మ వంచన యౌను
బలముగాదది వట్టి వాపు గాని
మాయ నన్నావరించగ మసలు చుంటి
మాయ జీల్చి యభయమిచ్చి సాయ పడవె
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 61
సకల ప్రాణులు చేయు సర్వ యజ్ఞాదుల
సర్వ కర్మల యొక్క సార రూప
నీవె యాధారమ్ము నిఖిల జీవులకును
నీవు లేకను జీవి నిలువ లేదు
వస్వాదులకు మధు పాన చిత్తమటుల
యజ్ఞ ఫలమునందు యనిమిషులటు
నా బోంట్లు బహువిధానందమనుభవించి
క్రమ ముక్తి బొందంగ శ్రమను పడక
మధులిహమ్మునై మధుపాన మత్తు పోలి
భావ చిత్తాన చరియించు వరము నిమ్ము
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 62
ఊహకందని వాని నూహించ సాధ్యమే
చిత్తాన నిన్నెట్లు చింత జేతు
కర్ణపేయముగాను వర్ణించుదామంటె
చూపుకందదు నీదు రూపు రేఖ
కాలుసేతులు పట్టి కాపాడుమనుటకు
అంగంబులేలేక నంకవాయె
నిన్ను నా స్వామిగా నెన్నుకొంటిని గాని
సేవించుట మటుకు చేతకాదు
చేత గాని వానిని నీవె చేదుకొనుము
ధ్వాంత మాసాంతమణగంగ స్వాంత పరచి
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 63
జపతపమ్ముల జేతు జాగరూకతనుందు
సాధనా సంపత్తి సడలనీక
షడ్రిపు సంఘమ్ము సడికూడ వినబోను
సద్వృత్తి చరియింతు సాక్షి వీవు
ఒరులు నాదరిజేరి యొక్కింత పొగడంగ
మరల వినగ కోరు మనసు పుట్టు
శక్తిహీనుడనిట్టి సాత్వికాహంకార
ధాటి తాళగలేను దయను గనవె
ధాన్య రాశిలో దాగిన దర్భ వోలె
హాని కాకున్ననయ్యది అడ్డు కాదె
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 64
మరల మరల పుట్టి మరునాడుగా నేడు
జనన మరణ రూప చక్రమటుల
నలుసంతగా పుట్టి తొలి యున్కి చూపెట్టి
నేర్పుగా వర్ధిల్లి మార్పు చెంది
దశ దశల్ దాటుచు తాను క్షీణించుచు
సమసిపోవుననెడి భ్రమలు తొలగ
భూ మాత గర్భాది భూగర్భ పర్యంత
చలనమందున నీవచలుడవౌచు
మార్పులన్నింటి కావల మారనట్టి
నిన్నెఱిగిన చాలందును నిత్య సత్య
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 65
జాయతే, అస్తి, వర్ధతే,
విపరిణమతే, అపక్షీయతే, మ్రీయతే
అంతటా నీవుండ నావాహనమ్మేమి
ఆసనమ్మెచ్చోట అర్చనేమి
యనగ నాబోంట్లకు నర్హత కల్గునే
భేషజమ్మో లేక వేషమగును
ఆత్మ తత్త్వజ్ఞులై యానంద చిత్తులై
బ్రహ్మ భావనయందు వఱలువారు
తద్భావ ఫలితమౌ తాదాత్మ్యతనుపొంది
మనసు లయముగాగ యనగ నోపు
తెలియకుండ తప్పులు చేయగలను గాని
చేతనగునట్లు నను నీవె చేదుకొమ్ము
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 66
మౌన ముద్రను పట్టి మాట్లాడకున్నను
పరుగులాపక పోయె పాడు మనసు
పెదవి మెదపకున్న హృదయంపు లోలోన
శబ్ద ఘోష మటుకు సాగు చుండు
తపమాచరించగా తపన కలదు గాని
తను మనములొకచో తగులవాయె
బంధింప నెంచుచు బంధింప పడుచుంటి
జ్ఞాన ఖడ్గమొకటి కానకుంటి
ఎటుల తప్పించుకొనుట నే నెఱుగ కుంటి
త్వరత రక్షింప నీకిక తప్పదయ్య
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 67
ఎప్పటి రధమది యిప్పటికింకను
వాడెదవేలనో వీడ రాదొ
గుఱ్ఱమ్ములైదింటి గూర్చితి, నడిపించు
మనసనూరునివోలె, మాట నమ్ము
మేరు దండమ్మును మేటిగ నిల్పితి
చూచెడునంతలొ చుట్ట వచ్చు
హృదయముంచితి నీకరదమట్లు, చాలదో
కనువిందు సల్పంగ కమలములకు
కేలు సాచి వేడెదనయ్య జాలి లేదొ
వీలు చేసుకు రావయ్య మేలు సేయ
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 68
కాంతిని కాంచగా కాంతారమునజొచ్చి
చీకటేమిటనుచు చిందులేల
దప్పిదీర్చుకొనంగ నుప్పు సంద్రపు నీరు
త్రావనేగుట తన తప్పు గాదె
వైరాగ్య మాశించి పేరాశ పరుగుల
విషయసంచయమేల విసుగు లేక
రమ్మన కున్నను నిమ్ముగ గాలాన
పోయి జిక్కిన చేప వోలె లేదొ
పొంద నెంచిన దొకటైన పొందునొకటి
పొంద నిన్నెట్లొ తెలుపుము కుందనీక
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 69
కట్టు బొట్టును బట్టి పుట్టు చోటును బట్టి
కులమతమ్ముల పేర కొట్టు కొంద్రు
మతము మదిని పుట్టు, మనకు నచ్చగ బొట్టు
కోరి మేమొక రీతి కూడ కులము
మనషి పుట్టక యున్న మనసెట్లు పుట్టేను
మనసుకునికి లేదు మనిషి లేక
అట్టిదానిని పట్టి కొట్టుకొనుటయేల
పట్టనీ పాదమ్ము పాడి కాదె
మనసు మాయకు చిక్కక మసలు కొనుచు
మలిన రహితమౌ భక్తిని మాకు నిమ్ము
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 70
నా చిన్ని చేతిని నా గుండెకానించి
నా పేరు పల్కుచు నన్ను జూపి
నా చిన్ని నోటితో నా పేరు చెప్పించి
తెలివి కలదు గాన తెలిసెననిరి
సోహమ్మని మరచి దేహభానము నేర్పి
అదియె తెలివనుచు నందురేల
నామ రూప జగతి నశ్వరమ్మని చెప్పు
విజ్ఞానమివ్వరే విశద పరచి
మోహమదియెంత గొప్పది మోసకారి
నిజము తెలియగ నీయందు నిశ్చయముగ
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 71
ఒక్క పాపంబునకొక్క పుణ్యంబని
చెల్లు వేసుకొనంగ చెల్ల బోదు
ఏది పాపంబగు నెయ్యది పుణ్యమో
ధర్మ మరసి జూడ తనకు తెలియు
ధర్మమేమిటగును ధర్మ సూక్ష్మంబేది
దరిగొన దగునేది తగని దేది
ఈ రీతి విచికిత్స నేటికి కుందుట
తెలిపెడి వారేరి తేట పరచి
మరల జన్మమ్ము రాకుండ మసలు కొనగ
చ్యుతిని గానీక రక్షించు ద్యుతివి నీవు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 72
పుట్టిన తోడనే పొట్ట నింపుకొనంగ
పాలకై స్తన్యంబు పట్టుకొంటి
ఎదిగెడి వయసున నెదలోన మెచ్చిన
బంధు మిత్రుల చేయి పట్టుకొంటి
వంశ వృద్ధికనుచు పాణిగ్రహణమంచు
భళిర సంసారము పట్టుకొంటి
వయసు మీద పడెను వదలుటెట్లంచును
గట్టిగా నావారిఁ బట్టుకొంటి
పట్టినది నేను నన్నది పట్టెనందు
పట్టు సడలించి నీ చేయి పట్ట నిమ్ము
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 73
పరులకు బోధించు వచనాలు దొడ్డవై
వ్యాసునకించుక తీసిపోవు
తానాచరించక తప్పించు కొనుటకు
ఎల్లెడ సాకులు కొల్లలుండు
పేరు తెలిసినంత పెద్ద పండితుడట్లు
గ్రంథ వ్యాఖ్య సేయు ఘనత గలదు
కనపడు ప్రతివాడు తన శిష్యుడేయంచు
గొప్పలు చెప్పంగ కొరత లేదు
అయ్య నేనిట్టివారల నియ్యకొనక
సత్య మార్గాన నడిపించు నిత్య వర్తి
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 74
ఇందునగాక వేరెందుండెదవనుచు
కుజనులు కొండొక భజన పరులు
బుధజన వచనాలు బుద్ధినంటగనీక
గురుతర సత్యమ్ము నెఱుఁగలేక
శుక్ర శోణిత రూపు శుద్ధ తత్త్వంబను
మంద బుద్ధి నొకచో మార్చు కొనక
అపసవ్య చారులై విపరీత మార్గాల
సంచరించెడి వేళ సాయ పడవొ
గ్రహగతులు దాటి నిజ తత్త్వ గమనమెఱిఁగి
నిన్ను జేరగ దిక్కన నీవె గాదె
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 75
నది బుట్టు తావున నలుసంత మాత్రమై
పల్లమెఱిఁగి తాను పారు వేళ
వర్ష జలము తోడ వాగు వంకల తోడ
ఉపనదులును కల్గు నునికి లాగు
నిర్గుణాత్మకుడైన నీకు రంగుల నద్ది
రూపరహితునకు రూపులిచ్చి
తత్త్వజ్ఞులితరులున్ తమ భావ బలిమితో
భిన్నరూపాలతో నిన్ను కొలువ
ఎఱుఁగ జగదేక పూజ్యుడవీవనంగ
మూల తత్త్వమ్మునెఱిఁగించు మేలు
గలుగ
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త
వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 76
నీనుండి పుట్టితి నీలాగు లేనేల
యను శంక తొలగంగ నరిగినట్టి
ఉప్పు బొమ్మొకటి తా నుదధిలోనురుకంగ
నునికి సమసి పోయె నొక్కటాయె
తోడుండ పెరుగును వేడంగ దరిజేరి
తోటి పాలను తన బోటి జేయు
నిను పట్టుకొనుటకు తనువచ్చి చేరినా
తనను పట్టగ నీవె తరలి యైన
ఎవరి కడకెవ్వరేగిన నేమిటంట
కడకు చూడ నద్వయ సిద్ధి కలుగునంట
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 77
మత్పురాకృత పుణ్య మాహాత్మ్య పరిపాక
ఫలితమాకారమ్ము బడసినట్లు
సత్కృపా రస ధార సానుకంపంబుతో
చెలగి విస్తారమ్ము చెందినట్లు
హృత్సరోజ వికాస మెదనిండ కన్పట్ట
శుభద శ్రీకారమ్ము చుట్టినట్లు
తత్సుధా జలధిలో తాదాత్మ్యమొంది నా
యునికి సాకారమ్ము నొంద గాను
చింతలుడుగంగ నీపైన చింతనొకటె
వెంట నీవుండ వెతలు నా వెంట పడునె
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 78
రాగి చెంబెడు నీట రక్త చందనముంచి
ఎర్ర గన్నేరులనెంచి యుంచి
దూర్వాంకురములుంచి తోడునక్షతలుంచి
కుదురుగా చేపట్టి నుదురుకాన్చి
మోకాళ్ళ పై నిల్చి ముదమార నిను తల్చి
హంసాది నామాల నర్ఘ్యమీయ
దారిద్ర్య దుఃఖాలు దరిదాపులకు రావు
వాని జేరగలేవు వ్యాధులసలు
నీటితో పూజ మెచ్చి కన్నీటినంత
చేత తుడిచెడి నిను గొల్తు చేతులెత్తి
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 79
సౌషుమ్న కిరణమ్ము చంద్రుని కందించి
సంపద్వసువును భూజాతునకును
విశ్వకర్మ బుధుని వీర్యమై వెలయించి
దేవ గురునికి యుదావసువిడి
విశ్వవ్యచస్తేజ విస్తారము కవికి
శనికి సురాట్తేజ శక్తినిచ్చి
నక్షత్ర క్షాత్రమై నడయాడు తేజమ్ము
హరికేశ నామక కిరణమిచ్చి
సకల దీప్తుల దీపించు శక్తివీవు
విశ్వ గమనమ్ము గమనించు విశ్వరూప
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 80
జగతినుద్దీపించి జనుల మేల్కొలిపించు
పద్మినీ శక్తి నీ పట్ట మహిషి
వారించ రోగాల ప్రాభాత శక్తియే
ఉషయన్న పేరుతో నునికి కలిగె
ఏది యెయ్యది యన్న నెఱుక గల్గించు
శక్తికిచ్చిన పేరు సంజ్ఞ యనుచు
నీ వెల్గు వెంబడి నీడయై నిల్చుండు
శక్తి బిల్తుము మేము ఛాయ యనుచు
వారి నీ భార్యలనుచు ముద్దార పిలువ
మాతృమూర్తులౌదురు తండ్రి మాకు వారు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 81
సారఘసార కాసార కాంతారాది
సంచార వేళలన్ సారము గొని
పూల పుప్పొడులన్న జోలికింబోక యా
కాంక్షిత లక్ష్యమౌ గమనమట్లు
సదసద్వివేకమ్ము సర్వాత్మ భావమ్ము
సద్గురు ధ్యానమ్ము సకలమగుచు
దేహభానమ్ము సందేహతప్త మనమ్ము
సంసార దుఃఖాది సడిని గనక
నీదు పాద పద్మాలపై నిశ్చలముగ
వ్రాలి ననుముక్తి మధువును గ్రోలనిమ్ము
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 82
కాపాడమన్నచో కష్టమిచ్చెదవేమి
కరుణ లేదేమంచు కలక కలుగు
సుఖము గల్గిన వేళ సుఖములాగనియట్లు
వరములీయగ నిన్ను వదలరసలు
సుఖదుఃఖ ప్రారబ్ద శూన్యమగునటుల
అనుభవించుట గొప్ప యవసరమ్ము
వలయు, వలదనుచు వాంఛలున్నపుడెట్లు
వాంఛితమ్మగు ముక్తి బడయనగును
అనుభవించెదనంతయునమిత భక్తి
నౌదలందాల్తు నీ యాజ్ఞననవరతము
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 83
వంకలనెంచ నా వంకజూచుచు దోష
పంక్తినుటంకించు పండితులను
మాటల నేపాటి పాటి సేయకయుందు
నీవు నా యంతట నిండియుండ
రసమయ మన్మధ రాజ శరాసన
మ్ము మెలికల్ దిరిగియు మేలగు రుచి
గోలుపోవని రీతి కూర్మినణువణువీ
వేయుండ వంకలకేల వెరపు
నీవు కట్టిన యింటను నీవు నిలువ
వేరు పిలుపు గావలెనేమి వేగ రార
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 84
నేను నేనను నేను నేనని నేననన్
నేనన్న నేనన్న నిన్ను నిన్నె
నా మనమన్న నీ నామమ్మనిన్ నమ్ము
నీ నామ మననమ్ము నెమ్మి నిమ్ము
సుమ సమానము మానసమనుమానము మాని
నా మనో సుమమాసన మనుమన్న
నీ యెద దాగని నీ దయ నేగొందు
నాదగు నయ్యది నాదెయందు
వేనవేల మాటలవేల వేడికొందు
నెల్ల వేళల నుండు నా యుల్లమందు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 85
నేనొక దాసుడ నీవు దైవంబని
రక్షణా దక్షుని రవిని తలచి
నీ చేత కల్పించు నీ చేతనమ్మును
నీ కొఱకర్పింతు నిండు మనము
నిను బట్టి నిజముగ నీవారు నడువరే
నీ యొక్క కరుణయే నీదు యునికి
నీ యందు మది నిల్పి నీయందు చేరగా
ఆదిత్య భాస్కర యనుచు పిలువ
ఈ విభక్తులు యుక్తులనేవి లేని
ప్రబలమాసాంతమవిభక్త భక్తి నిమ్ము
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 86
సార్వవిభక్తిక సీసము
గుణములగని దోష గుణమని నిందించు
కుత్సిత బుద్ధిని ఘోరమందు
దోషంబు కానట్టి శేషించు గుణముల
గణియింప యోచింప గారవమ్ము
చిన్న సుగుణమైన మిన్నగా పరికించ
సల్లక్షణంబందురెల్లరకును
గుణ దోష మీమాంస గుడుగుడు గుంచంపు
పోలిక యాటల గోల లేక
సగుణ నిర్గుణాత్మకమైన సకలమందు
మూల మెఱుఁగుట భవరోగమునకు మందు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 87
కన్ను ముక్కుల తీరు కమనీయమై తోచు
కదలికల్ కనిపించు కళ్ళ ముందు
బింబమ్మువలె ప్రతిబింబముండును గాని
అద్దమందలి ఛాయ లసలు కాదు
కదలాడు జగమంత కాదటో నీ ఛాయ
అవ్యక్త మాహాత్మ్య మరసి చూడ
జడమనంగను చెల్లు చైతన్యమనరాదు
కార్య కారణ గతి కనుగొనంగ
సర్వ చైతన్య కారణ శక్తి వనుచు
నిన్నెఱిఁగి నేను తరియించ నిన్నె గొలుతు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 88
నామాక్షరమ్మైన నాల్కపై నిల్చినా
చవులు పుట్టించుచూ చెవిని పడిన
కరిగి నీరైపోయి కనిపించనంతగా
కళ్ళ వెంబడి నీరు కారనిమ్ము
అణువణువున కణకణమున నానంద
ముప్పొంగ నా యొంటి నొణకనిమ్ము
కోర్కెల పుట్టగు కొంటె మనసునంత
నీవాక్రమించుచు నిండిపొమ్ము
చేరనెంచ నీకడకది జీవితమ్ము
నేననునది లేనంతగా నీవె కమ్ము
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త
వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 89
ఉద్యోగమను పేర నూరొదిలి కొడుకు
అత్తింటిలోనుండి యాడపిల్ల
పెరవానిగా చూచు పిల్లనిచ్చినవారు
కష్టాల వినలేని కన్నవారు
కలిగి కలగకున్న కలహాన జ్ఞాతులు
ఏమి లాభమ్మంచు నితర జనులు
ఈ జన్మ బంధమ్ములీవిధమ్ముగనుండ
గతజన్మ వివరాల గణనలేల
వెరసి ననుగాచువాడవు వెదకి చూడ
సర్వగతుడవనాద్యంత సాక్షి వీవె
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త
వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 90
కులము కులమని వ్యాకులమందనేలనో
కలహ కారణమైన కులమదేల
మతము మతమని సమ్మతి కోరనేలనో
మమత నింపకయున్న మతమదేల
భూత పంచక జడభూత దేహమునందు
నే భూతమేకులమెట్లు తెలియు
చైతన్యమన్నింట చేరి నీవై యుండ
కులమతమ్ముల తీరు కొలుచుటెట్లు
నామ రూపాల రంగుల నటన దాటి
శుద్ధ చైతన్య తేజమ్ము చూపవయ్య
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 91
బహిరంతరింద్రియ వశవర్తినౌచును
శాస్త్రాల విశ్వాసశాలినగుచు
సజ్జన సేవయు శరణాగతత్త్వమ్ము
వివరమరయుటకు విసుగులేమి
సద్బుద్ధి గురుసేవ సద్వర్తనంబును
శుశ్రూష సేయుట శుభదమంచు
ఇసుమంతయు నసూయనియ్యకొనక సిగ్గు
పడకుండ గురునికి ప్రణతులిడగ
సిద్ధ పరచుము సాధనా క్షేత్రమింక
నాధ జ్ఞానాంకురమ్ముల నాటుమయ్య
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 92
నేను నాదను దేహ భానమౌ భావమ్ము
బంధ హేతువటంచు వదలగొట్టి
మానావమానాల మనసునంటగనిక
శత్రుమిత్రులనక సమత నింపి
ఆత్మకు కర్తృత్వమంటగట్టగనీక
అజ్ఞాన చర్యలనదుపుజేసి
దేహమనిత్యము దేహి సత్యమనెడి
నిగమోక్త వివేక నియతి గలిగి
అమల నిశ్రేయస పథమ్మునాశ్రయించ
సర్వ శ్రేయస్కరమ్మని సన్నుతింతు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 93
చిక్కక బ్రహ్మమే చిక్కుచు జీవుడై
చొక్కాలనైదింట చిక్కి సొక్కి
వేషధారణ చేత వేరుగా భావించి
వేషమే నేనంచు వెతల బడుచు
తను పదార్ధమనుచు తన యథార్ధమరయ
తను విచారించగ తలపు మరచి
తాను సత్యమనియు తానె జ్ఞానమనియు
ఆనంద రూపమ్ము తానె యనియు
నిజమెఱుఁగడాయె నినుజేర నేరడాయె
మమ్ము రక్షింప మాయల మానరాదె
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 94
ముక్కాలములయందు ముజ్జగంబులయందు
కలయాడు కళవన్న జ్ఞానమిమ్ము
నీవు నాలో నిండ నేను నీవేనన్న
స్ఫూర్తి నింపుము తండ్రి పూర్ణ గతిని
నష్వర జగతిని శాస్వతమెయ్యది
నీ చేతనేయన్న నిజము తెలుపు
వెలుగేది గలిగిన వెలిగేను ప్రాణు లా
వెల్గునీవేనన్న వివరమిమ్ము
వేద శీర్ష శిరో వాక్య వేదినగుచు
ననుభవానందమందంగనండ నీవు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 95
పరమాత్మ నీపాద సరసీరుహమ్ముల
నెల్లవేళల కొల్వనుల్లమందు
కవచమై కాపాడు కారుణ్య మూర్తిరో
కామితమ్ములడుగు కాంక్ష లేదు
అష్టాక్షరీ ధ్యానమక్షయమ్ముగ చేయ
నజ్ఞాన తిమిరమ్ములణగి పోవు
నీవు నా తోడున్న నిముసమందే నాకు
భయము తొలగిపోవు బలము గలుగు
నీవు నేనైననో నేను నీవెయైన
అడుగ పనిలేకనమృతత్వమమరునయ్య
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 96
జన్మలందున మర్త్య జన్మముత్తమమండ్రు
మంచి చెడుగుల తానెంచు గనుక
సదసద్వివేకమ్ము చలిచీమకుండును
పంచదారనిసుక నెంచు వేళ
పేడ పురుగు కన్న పెద్ద వైరాగ్యమా
కర్మ చేయుచు తాను కట్టుబడదు
పుష్పము కడకేగు భృంగంపు లక్ష్యము
మధు సంచయన వేళ మనకు తెలియు
లక్ష్య మెఱుఁగని జన్మలు లక్షలేల
లక్ష్య శుద్ధినీరాదటో లక్షణముగ
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 97
అఘటనా ఘటనుడవన్ననయ్యది స్వభా
వోక్తిగాని యతిశయోక్తి కాదు
సకల చరాచర సంస్థితుడవనుట
ఉత్ప్రేక్ష కాదది యున్న మాట
పోల్చుట సరికాదు పొసగునొక్కటనగ
నీవు నేనెవరన్న నిజమునరయ
అవయవగతుడౌచు నవ్యయుడననుట
నేను సగుణుడైయ్యు నిర్గుణుడని
తెలియు తెలివిని పొందంగ దేవ దేవ
చూడదగినది చూడంగ చూపు నిమ్ము
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 98
మందేహ దైత్యుల సందోహమును బాప
నర్ఘ్యమ్ము నిమ్మని యడుగు లీల
విహిత కర్మల చేయ విస్మరించగనీక
సద్వర్తనము నేర్పు చారు చర్య
స్వామి కష్టానికి భక్తుని స్పందన
తిన్నని భక్తిని తేట బరుచు
సందిగ్ధ సంధ్యలో సంశయ క్షాళనే
తిమిర హరమనుచు తెలుపు సొగసు
అంతియేగాని పరమాత్మకాపదనగ
దివ్య తేజమ్ము ముందర తిమిరమట్లు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 99
మధ్య
నిలువు " అనంత కృష్ణ భాస్కర శతకము"
అవునంతియే గీతలన్నియు స్వీయాకృ
తిం దప్పి యే మృగతృష్ణ వెంట
పరువెత్తి సోలక భాసుర పరిపూర్ణ
నిరుపమహస్కర నియతి నిల్పు
శుభచిహ్న సారమై శోభావహమ్ములై
నిల్చు శక్తిని పొంద నీదగు దయ
తప్ప యితరమెద దలప కన్పట్టదు
ముఖ్య గుణమటుల ముఖము పైన
ముచ్చట నుదుట వ్రాయక మునుపు దేవ
నతులు గొని సమ్మతిని జూపుమతులితముగ
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 100
ము చ్చ
ట ను దు ట వ్రా య క ము ను పు దే వ
న తు లు గొ ని
స మ్మ తి ని జూ పు మ తు లి త ము గ
భా స్క రా ది త్య ఘృ ణి సం జ్ఞ భ క్త వ ర ద
ది వ స క ర వ రే ణ్య స వి తా తి గ్మ కి ర ణ
పదముల గుప్పించి పదుగుర మెప్పింప
పదముల గుప్పించి పదుగుర మెప్పింప
పద్య రచన జేయ, ఫలితమేమి
పగతురు నాలోన వలదన్న వదలరు
వార లార్గురె యైన పోర లేను
పరిపరి విధముల పరిగిడు నా మది
నేవిధి గెలుతును ఎయ్యది గతి
పరుగులు వారించి సరగున నిను గన
చిలికిన భావన చిలుక పలుకు
స్వీకరించుము నా నమోవాకములను
మోకరిల్లెద నీవుండ నాకమేల
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 101
అప్పయ్య దీక్షితుడమిత భక్తిని గూర్చె
నీపైన స్తోత్రమ్ము నియతగతిని
భట్టమయూరుండు బహుశోభలను పల్కె
నీమీది శతకమ్ము నేర్పు తోడ
ఎందరో కవి భక్తులేంతయో స్తుతియించి
రానంద మందించి రందరకును
దివ్య భావాల దీధితి జగతి వెలయ
పొల్పార బంగారు పుష్పములుగ
చేతనైనట్టు చెప్పితి స్వీకరించు
కాళ్ళ కడనుంచితిని కొన్ని గడ్డి పూలు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 102
సర్వ కారణ భూత శక్తిగా గురునకు
విన్నపాలొనరించి వేయి మార్లు
లాలించి పాలించు లలితాఖ్య రూపుకు
నోరార శతపద్య నుతులు జేసి
వరదాయక కనరా ద్విరదాననా యంచు
ఉత్పలమ్ములనిడి తత్పదాల
నావైన భావాల నీ వెల్గులను గూర్చి
శబ్దార్చనమ్మిది శతవిధాల
ఉంటివీరీతి ప్రియమార మింటి రేడ
కంట కనిపెట్టి నను నీవె కాచుకోర
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద
దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 103
సమాప్తము.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.