శ్రీ వేణు గోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము తరువాయి భాగములో 6వ పద్యము నుండి 10. వ పద్యము వరకు.
ఉ:- నీ పద పద్మముల్, కనగ నేర దయామయ! కాంక్షతీర! ర
క్షాపరుడా! కృపన్, సుగుణ గణ్యుడ! నిన్ మదిఁ జూడఁ జేసి, దే
వా! పదిలమ్ముగా నిలుపవా మది నెప్పుడు? నిత్య తేజ! మా
ప్రాపు హరీ! సదా విజయ భావన కల్పక! వేణు గోపకా! 6.
భావము:-
దయామయుఁడవైన ఓ శ్రీహరీ! నీ పాద పద్మములను నాకోరిక తీరే విధంగా చూచుట
తెలియనటువంటి వాఁడిని. మంచి గుణములను పరిగణించువాఁడా! రక్షణయే పరముగా
కలవాఁడా! నిత్యమూ ప్రకాశించే మాకాధారమైన ఓ దేవా! విజయ భావనను కల్పించే
ఓ వేణు గోపకా! నేను నిన్ను నా మనస్సులో చూచునట్లుగా కృపతో చేసి; నామదిలో ఎల్లప్పుడూ
దృఢముగా నీ స్వరూపమును నిలుపవా?
క:- పద పద్మముల్, కనగ నే - ర! దయామయ! కాంక్షతీర! రక్షాపరుడా!
పదిలమ్ముగా నిలుపవా - మది? నెప్పుడు నిత్య తేజ! మాప్రాపు హరీ! 6.
భావము:-
దయామయుఁడా! మా కాధారమైన ఓ శ్రీహరీ! నీ పాద పద్మములను నాకోరిక తీరే విధంగా
చూచుటను తెలియనటువంటివాఁడిని. రక్షణయే పరముగా కలవాఁడా! నిత్యమూ ప్రకాశించే నా
మదిలో ఎల్లప్పుడూ దృఢముగా నీ స్వరూపమును నిలుపవా?
గీ:- కనగ నేర దయామయ! కాంక్షతీర! - సుగుణ గణ్యుడ! నిన్ మదిఁ జూడఁ జేసి,
నిలుపవా మది? నెప్పుడు నిత్య తేజ! - విజయ భావన కల్పక! వేణు గోప! 6.
భావము:-
దయామయుఁడా! విజయ భావనను కల్పించే ఓ వేణు గోపకా! నాకోరిక తీరే విధంగా నిన్ను
చూచుట తెలియనటువంటివాఁడిని. మంచి గుణములను పరిగణించువాఁడా! నిత్యమూ
ప్రకాశించేవాఁడా! నేను నిన్ను నా మనస్సులో చూచునట్లుగా కృపతో చేసి; నామదిలో ఎల్లప్పుడూ
నీ స్వరూపమును నిలుపవా?
ఉ:- శ్రీ గురు నామమే, వినుత శ్రీధరు నామము విశ్వ రక్ష. ధా
త్రీ గురుఁడే సదా కరుణఁ దీవన లిచ్చుచు కాచు చుండుఁ గా
దే! గురుఁడే విధిన్ సుగుణ తేజ! రయంబున చొక్కి యుండు, స
ద్యోగ! హరీ! మహా విపుల యోగ ప్రదీపక! వేణు గోపకా! 7.
భావము:-
మంచి యోగము కలవాడవైన ఓ శ్రీహరీ! గొప్ప విస్తారమైన యోగమునుత్తేజము చేయువాఁడవైన
ఓ వేణు గోపకా! మంగళప్రదమైన గురువు యొక్క పేరే లక్ష్మీపతివైన నీయొక్క పేరు సుమా!
భూ లోకమునందుగల ఈ గురుఁడే విశ్వ రక్షకుఁడు.ఎల్లప్పుడూ దీవనలిస్తూ శిష్యులను
కాపాడుచుండును కదా! గురువు ఏదో విధముగా మంచి గుణములు అనే తేజస్సులో వేగముగా
పరవశించి యుండును.
క:- గురు నామమే, వినుత శ్రీ - ధరు నామము! విశ్వ రక్ష. ధాత్రీ గురుఁడే!
గురుఁడే విధిన్ సుగుణ తే - జ రయంబున చొక్కి యుండు, సద్యోగ! హరీ! 7.
భావము:-
మంచి యోగము కలవాఁడవైన ఓ శ్రీహరీ! గురువు యొక్క పేరే లక్ష్మీపతివైన నీయొక్క పేరు
సుమా! భూలోకమునందు గల ఈ గురుఁడే విశ్వ రక్షకుఁడు. గురువు ఏదో విధముగా
మంచి గుణములు అనే తేజస్సులో వేగముగా పరవశించి యుండును.
గీ:- వినుత శ్రీధరు నామము విశ్వ రక్ష. - కరుణఁ దీవన లిచ్చుచు కాచు చుండుఁ
సుగుణ తేజ గణంబుల చొక్కి యుండు, - విపుల యోగ ప్రదీపక! వేణు గోప! 7.
భావము:-
గొప్ప విస్తారమైన యోగమునుత్తేజము చేయువాఁడవైన ఓ వేణు గోపుఁడా పొగడఁ బడే లక్ష్మీ
ధరుని యొక్క పేరే విశ్వ మునకు రక్ష. ఎల్లప్పుడూ దీవనలిస్తూ కాపాడుచుండును! మంచి
గుణములు అనే తేజస్సులో వేగముగా పరవశించి యుండును కదా!
చ:- నను కనుమా! ప్రభూ! కృపను, నా కను పాపల తృష్ణ తీరగా
నిను కనుచున్; సదా మదిని నీ గుణ చింతన మానకుండ కూ
ర్మిని వినుచున్; మహా మహిత! మేదిని గావుమ! మా హరీశ ! తీ
రున మనగన్. హరీ! విపుల రుగ్మ నివారక! వేణు గోపకా! 8 .
( ఇందు నాలుగు కందములు కలవు )
భావము:-
ఓ హరీ! సమస్తమైన రుగ్మతలను నివారించే ఓ వేణు గోపకా! ఓ స్వామీ! మా విష్ణు దేవుడా! చాలా
గొప్ప వాడా! నన్ను కృపతో చూడుము. నా కన్నుల కోరిక తీరే విధముగా నిన్ను చూచుచూ;
ఎల్లప్పుడూ నీయొక్క గుణములకు సంబంధించిన ఆలోచనను చేయుచు; ప్రేమతో వినుచూ; ఒక
పద్ధతికి కట్టుబడి జీవించే విధముగాను చూచి; భూమిపై నన్ను కాపాడుము.
క:- కనుమా! ప్రభూ! కృపను, నా - కను పాపల తృష్ణ తీరగా నిను కనుచున్;
వినుచున్; మహా మహిత! మే - దిని గావుమ! మా హరీశ ! తీరున మనగన్. 8.(1)
భావము:-
చాలా గొప్ప వాఁడా! మా విష్ణు దేవా! నన్ను కృపతో చూడుము. నా కన్నుల కోరిక తీరే విధముగా
నిన్ను చూచుచూ; వినుచూ; ఒక పద్ధతికి కట్టుబడి జీవించే విధముగాను చూచి; భూమిపై
నన్ను కాపాడుము.
క:- వినుచున్; మహా మహిత! మే - దిని గావుమ! మా హరీశ! తీరున మనగన్
కనుమా! ప్రభూ! కృపను, నా - కను పాపల తృష్ణ తీర గానిను కనుచున్ 8.(2)
క:- కనుచున్; సదా మదిని నీ - గుణ చింతన మానకుండ కూర్మిని వినుచున్;
మనగన్. హరీ! విపుల రు - గ్మ నివారక! వేణు గోపకా! నను కనుమా! 8.(3)
భావము:-
సమస్తమైన రుగ్మతలను పోకొట్టెడి వాడవైన ఓ వేణు గోపకుఁడా! నిన్ను చూస్తూ; నా మనస్సు
ఎల్లప్పుడూ నీయొక్క గూణములను గూర్చి; ఆలోచించుచూ; వినుచూ; జీవించే విధముగా నన్ను
చూచు చుండుమా!
క:- మనగన్. హరీ! విపుల రు - గ్మ నివారక! వేణు గోపకా!నను కనుమా!
కనుచున్; సదా మదిని నీ - గుణ చింతన మానకుండ కూర్మిని వినుచున్. 8(4)
గీ:- కృపను, నా కను పాపల తృష్ణ తీర
మదిని నీ గుణ చింతన మానకుండ
మహిత! మేదిని గావుమ! మా హరీశ
విపుల రుగ్మ నివారక! వేణు గోప! 8.
భావము:-
గొప్ప వాఁడవైన ఓ శ్రీహరి దేవా! సమస్తమైన రోగములను నివారించే వాఁడవైన ఓ వేణు
గోపుఁడా! నా కను పాపల తృష్ణ తీరే విధముగా; మనసున నీ గుణ చింతన
మానకుండునట్లుగా; భూమిపై కృపతో కాపాడుము.
చ:- కల కనినట్లుగా మదిని గాంచి, నిరామయ! మంద భాగ్య జీ
వుల పగిదిన్ మదోన్ మతిని; వోఢ నినున్ గన మాలి తేను. రా
జిల గననైతి నిన్ , గనగఁ జేసి ననున్ గృపఁ గాంచుమయ్య! శ్రీ
ఫలద! హరీ! ప్రభూ! విపుల పాప నివారక! వేణు గోపకా! 9.
భావము:-
ఓ నిరామయుఁడా! విరివియైన పాపములను నివారించెడి ఓ వేణు గోపకుఁడా! మా జీవన రథ
సారథివైన నిన్ను నా మనసులో కల కనిన విధముగా చూచి; మంద భాగ్య ప్రాణుల వలె గర్వపు
మత్తుచే చూచుట మానివేసితిని. నేను తేజరిల్లే విధముగా చూడనైతిని. మంగళ ప్రదములైన
ఫలితములను కలుగఁ జేయువాడవైన ఓ హరీ! నిన్ను నేను చూచేటట్లు చేసి కృపతో చూడుము.
క:- కనినట్లుగా మదిని గాం - చి, నిరామయ! మంద భాగ్య జీవుల పగిదిన్
గననైతి. నిన్ గనగఁ జే - సి ననున్ గృపఁ గాంచుమయ్య! శ్రీఫలద! హరీ! 9.
భావము:-
ఓ నిరామయుఁడా! మంగళ ప్రదములైన ఫలితములను కలుగఁజేయువాఁడవైన ఓ హరీ! మా
జీవన రథ సారథివైన నిన్నుప్రత్యక్షముగా కనినట్లు నా మనసులో చూచి; మంద భాగ్య ప్రాణుల
వలె చూడనైతిని. నిన్ను నేను చూచేటట్లు చేసి కృపతో చూడుము.
గీ:- మదిని గాంచి, నిరామయ! మంద భాగ్య - మతిని; వోఢ నినున్ గన మాలి తేను.
గనగఁ జేసి ననున్ గృపఁ గాంచుమయ్య! - విపుల పాప నివారక! వేణు గోప! 9.
భావము:-
ఓ నిరామయుఁడా! విరివియైన పాపములను నివారించెడి ఓ వేణు గోపుఁడా! మా జీవన రథ
సారథివైన నిన్ను నా మనసులో చూచి; మంద భాగ్య ప్రాణుల వలె గర్వపు మత్తుచే చూచుట
మానివేసితిని. నిన్ను నేను చూచేటట్లు చేసి కృపతో చూడుము.
ఉ:- ఓ జన వంద్య! నా కవిత నొప్పు నమేయ ప్రగణ్య భావముల్
రాజిలుగా వుతన్. సుగుణ రక్షక! సద్గణ శోభవీవ కా
గా; జనమందునన్ సకల కారణ మీవుర! సన్నుతాత్మ! రా !
రాజ హరీ! నినున్ పిలువ; రావది యేమిర! వేణు గోపకా! 10.
భావము:-
జనులచే నమస్కరింపఁబడు ఓ వేణు గోపకుఁడా! నా కవితలో ఒప్పి యున్న అంతు లేని మిక్కిలి
గణింపఁ దగిన నిన్ను గూర్చిన భావములు తేజరిలు గాక! మంచి గుణములను రక్షించువాఁడా!
సద్గుణములలో గల శోభ నీవే అయి ఉండగా జనులలోని సమస్తమునకూ నీవే కారణము కదా!
ప్రకాశించు వాడా! ఓ హరీ! ఓ సన్నుతాత్మా! రమ్ము. నిన్ను నేను పిలుచు చుండగా రావేమి?
క:- జన వంద్య ! నా కవిత నొ - ప్పు నమేయ ప్ర గణ్య భావముల్ రాజిలుగా
జనమందునన్? సకల కా - రణ మీవుర! సన్నుతాత్మ! రా! రాజ హరీ! 10.
భావము:-
జనులచే నమస్కరింపఁ బడు వాఁడా! ప్రకాశించెడి వాఁడవైన ఓ హరీ! నా కవితలో ఒప్పి యున్న
అంతు లేని మిక్కిలి గణింపఁ దగిన నిన్ను గూర్చిన భావములు తేజరిలుఁ గాక! జనులలోని
సమస్తమునకూ నీవే కారణము ! ఓ సన్నుతాత్మా! రమ్ము! నిన్ను నేను పిలుచు చుండగా
రావేమి?
గీ:- కవిత నొప్పు నమేయ ప్రగణ్య భావ - సుగుణ రక్షక! సద్గణ శోభవీవ
సకల కారణ మీవుర! సన్నుతాత్మ! - పిలువ రావది యేమిర! వేణు గోప! 10.
భావము:-
ఓ వేణు గోపుఁడా! నా కవితలో ఒప్పి యున్న అంతు లేని మిక్కిలి గణింపఁ దగిన భావముగా
కలవాఁడా! మంచి గుణములను రక్షించువాఁడా! సద్గుణములలో గల శోభ నీ వే అయి ఉన్నావు.
ఈ సమస్తమునకూ నీవే కారణము కదా! ఓ సన్నుతాత్మా! నిన్ను నేను పిలుచు చుండగా
రావేమి?
( సశేషం )
జైశ్రీరాం.
జైహింద్.
1 comments:
లీలా శుకు తలపించెడు
లీలన్ భాసించు చుండె రీతులు మీ గో-
పాలుని నుతులను గురువర!
చాలన్ ముదమౌను మాకు చదువగ వానిన్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.