గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జులై 2011, ఆదివారం

శ్రీ వేణు గోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. పద్యము 11 / 21 వ భాగము

ఉ:- ఆ వసు; దేవకీ సుతుడవై వసుధాస్థలి శోభ పెంచి భా
      గ్యావనిగా! మహా ఘనతఁ గాంచఁగఁ జేసితి కాంక్ష తీరగా!
      నీ వసమైతిగా! కనుమ నీవ! సమాశ్రయు గౌరవించి ప్రా
      గ్దేవ హరీ! భువిన్ వెలయు తీరుగఁ మమ్ముల వేణు గోపకా!  51.
        భావము:-
        ఓ వేణు గోపకుఁడా! ఆ దేవకీ వసు దేవుల పుత్రుఁడవై పుట్టి  భాగ్యావనిగా
        ఈ భూమి యొక్క శోభను పెంచి; అందరి కోరిక తీరే విధముగా గొప్ప ఘనతను 
        పొందే విధముగ చేసితివి. మిక్కిలి ప్రాచీన కాలము నుండియు ప్రసిద్ధుఁడవైన 
        ఓ శ్రీ హరీ! నీ వశమైయుంటిమి. భూమిపై వెలసే విధముగా మమ్ములను 
        సమధిక గౌరవముతో నీవే చూడుము.

క:- వసు; దేవకీ సుతుడవై -  వసుధాస్థలి శోభ పెంచి భాగ్యావనిగా!
      వసమైతిగా! కనుమ నీవ! సమాశ్రయు గౌరవించి ప్రాగ్దేవ హరీ! 51.
        భావము:-
        దేవకీ వసు దేవుల పుత్రుఁడవై పుట్టి  భాగ్యావనిగా ఈ భూమి యొక్క శోభను పెంచి;  
        మిక్కిలి ప్రాచీన కాలము నుండియు ప్రసిద్ధుఁడవైన ఓ శ్రీ హరీ! నీ వశమైయుంటిమి. 
        మమ్ములను సమధిక  గౌరవముతో నీవే చూడుము.

గీ:- సుతుడవై వసుధాస్థలి శోభ పెంచి -  ఘనతఁ గాంచఁగఁ జేసితి కాంక్ష తీర!
      కనుమ నీవ! సమాశ్రయు గౌరవించి -  వెలయు తీరుగఁ మమ్ముల వేణు గోప!  51.
        భావము:-
        రాజువై అందరి కోరిక తీరే విధముగా వెలయు ఓ వేణు గోపుఁడా! ఈ భూమి యొక్క 
        శోభను పెంచి; గొప్ప ఘనతను పొందే విధముగ భూమిపై మమ్ములను 
        సమధిక గౌరవముతో ఒక తీరైన పద్ధతితో నీవే చూడుము.

చ:- పుర ధర! నిన్నుగా! మునులు పొంది రహింతురు మున్ను జూచి; దే
      వర వనుచున్! మదిన్ కనుల పండువుగా నినుఁ గాంచినారుగా?
      ధర వర మీవయై మనుజ తన్వు రహించిన మమ్ము బ్రోచు! నో
      వరిని హరీ! సదా వినుత భాగ్య విధాతవు వేణు గోపకా! 52.
        భావము:-
        ఓ వేణు గోపకుఁడా! ఈ శరీరమును ధరించిన వాఁడవు నీవే కదా!  నీవు 
        దేవుఁడ వని గ్రహించి; మునులు ముందుగా  తమ శరీరములలో నిన్ను చూచి; 
        వర్ధిల్లును. ఓ శ్రీహరీ! నేను వేదనకు లోనైన వాడిని.ఎల్లప్పుడూ భూమిపై 
        ప్రస్తుతింపఁబడు మా భాగ్య విధాతవు.  మాకు నీవే వరముగా అయి మేము
        మనస్సులలో నిన్ను కన్నుల పండుగగా గాంచినారు కదా! మానవ శరీరమును 
        ధరించిన మమ్ములను బ్రోచుము.  

క:- ధర నిన్నుగా! మునులు పొం  -  ది రహింతురు మున్ను జూచి; దేవర వనుచున్!
      వర మీవయై మనుజ త  -  న్వు రహించిన మమ్ము బ్రోచు! నోవరిని; హరీ!  52.
        భావము:-
        ఓ శ్రీహరీ! భూమిపై  మునులు ముందుగా నిన్నే కదా తమ శరీరములలో చూచి;  
        నీవు దేవుఁడ వని గ్రహించి;  నిన్ను పొంది వర్ధిల్లును. నేను వేదనకు లోనైన వాడిని. 
        భూమిపై మాకు నీవే వరముగా అయి మానవ శరీరమును ధరించిన మమ్ములను బ్రోచుము.  

గీ:- మునులు పొంది రహింతురు మున్ను జూచి - కనుల పండువుగా నినుఁ గాంచినారు
      మనుజ తన్వు రహించిన మమ్ము బ్రోచు! -  వినుత భాగ్య విధాతవు వేణు గోప!  52.
        భావము:-
        ఓ వేణు గోపుడా!  మునులు ముందుగా నిన్ను తమ శరీరములలో చూచి; నిన్ను పొంది 
        వర్ధిల్లును. మానవ శరీరము ధరించిన మమ్ము కాపాడే; పొగడఁ బడే మా భాగ్య విధాతవు. 
        కనుల పండుగగా నిన్ను గాంచినారు కదా! మానవ శరీరమును ధరించిన 
        మమ్ములను బ్రోచుము.  

ఉ:- మా గుణ దోషముల్; కలుగు మాదు నవాంచిత కాంక్షలెన్ని తో?
       శ్రీ గుణుఁడా! కృపన్ కలుగఁ జేయుము దేవర! కాంక్ష తీరగా!
       నీ గణనీయులన్ కనెడి నేర్పును జూపుమ! గాంచి మమ్ము; మున్
       వేగ హరీ! భువిన్ వెలయు విజ్ఞతఁ గొల్పుమ! వే్ణు గోపకా!  53.
         భావము:-
         ఓ వేణు గోపకుఁడా! మాలో ఉండే గుణ దోషములను; మాలో కలిగి యున్న 
         నవాంచిత కాంక్షలను గణించితివా? మంగళప్రదములైన గుణములు కలవాఁడా! 
         ఓ శ్రీ హరీ! మా నవాంచిత కాంక్షలు తీరే విధముగా  కృపతో కోరినవి లభించే విధముగా 
         చేయుము. అట్టి మమ్ములను చూచి గణనీయులను కనే నీ నైపుణ్యమును 
         మా విషయమున ప్రదర్శింపుము. ముందుగా మాకు భూమిపై వెలయుటకు 
         అవసరమగు విజ్ఞతను వేగముగా కలిగించుము.

క:- గుణ దోషముల్; కలుగు మా  -  దు నవాంచిత కాంక్షలెన్ని తో? శ్రీ గుణుఁడా!
      గణనీయులన్ కనెడి నే  -  ర్పును జూపుమ! గాంచి మమ్ము; మున్ వేగ హరీ!  53.
        భావము:-
        మంగళప్రదములైన గుణములు కలవాఁడా! ఓ శ్రీ హరీ!  మాలో ఉండే గుణ దోషములను; 
        మాలో కలిగి యున్న నవాంచిత కాంక్షలను గణించితివా? గణనీయులను కనే 
        నీ  నైపుణ్యమును మావిషయమున ముందుగా వేగముగా  ప్రదర్శింపుము.

గీ:- కలుగు మాదు నవాంచిత కాంక్షలెన్ని -  కలుగఁ జేయుము దేవర! కాంక్ష తీర!
      కనెడి నేర్పును జూపుమ! గాంచి మమ్ము- వెలయు విజ్ఞతఁ గొల్పుమ!వేణుగోప!  53.
        భావము:-
        ఓ వేణు గోపకుఁడా! మాలో కలిగి యున్న నవాంచిత కాంక్షలను గణించి; మా 
        నవాంచిత కాంక్షలు తీరే విధముగా కృపతో కోరినవి లభించే విధముగా చేయుము. 
        గణనీయులను కనే నీ నైపుణ్యమును మావిషయమున ప్రదర్శింపుము.  మాకు 
        వెలయుటకు అవసరమగు విజ్ఞతను కలిగించుము.

ఉ:- ఆ నవనీతమే చెలఁగి యాదవు లింట వసించు నీకు తా
      ప్రాణమయెన్ గదా! కలుగ రాదన రాదుగ! గౌరవంబు తో
      డై నవ నీతులన్ గొలుపుటల్సవిధంబుగ కూర్మిఁ జేయు స
      న్మాన హరీ! మహిన్ విమల మాన్యుల కెల్లను వేణు గోపకా! 54.
        భావము:-
        ఓ వేణు గోపకుఁడా! పూజ్యుడవైన ఓ శ్రీ హరీ! ఆ వెన్నయే యాదవులింట ఒప్పిదముగా
        నివసించే నీకు అది ప్రాణమయ్యెను కదా!  ఆ విధముగా అది సంభవించ రాదు అని అనుటకు 
        వీలు లేదు కదా! సరియైన పద్ధతిలో గౌరవ ప్రదమైన;  నూతనమైన నీతులను భూమిపై గల 
        నిర్మలులైన మాన్యుల కందరికీ కలుగఁజేయుట అనే పనులను ప్రేమతోఁ జేయుము.
   
క:- నవనీతమే చెలగి యా  -  దవు లింట వసించు నీకు తాప్రాణమయెన్.
      నవ నీతులన్ గొలుపుట  -  ల్సవిధంబుగ కూర్మిఁ జేయు సన్మాన! హరీ!  54.
        భావము:-
        పూజ్యుఁడవైన ఓ శ్రీ హరీ!  యాదవులింట ఒప్పిదముగానివసించే నీకు  వెన్నయే 
        ప్రాణమయ్యెను. సరియైన పద్ధతిలో గౌరవ ప్రదమైన;  నూతనమైన నీతులను 
        కలుగఁ జేయుట అనే పనులని ప్రేమతోఁ జేయుము.

గీ:- చెలగి యాదవు లింట వసించు నీకు -  కలుగరాదనరాదుగ! గౌరవంబు
      గొలుపుటల్సవిధంబుగ కూర్మిఁ జేయు -  విమల మాన్యుల కెల్లను వేణు గోప!  54.
        భావము:-
        ఓ వేణు గోపుఁడా! యాదవులింట ఒప్పిదముగానివసించే నీకు గౌరవము కలుగ రాదు అని 
        అన రాదు కదా! సరియైన పద్ధతిలో  నిర్మలులైన మాన్యుల కందరికీ గౌరవాదులను 
        కలుగఁ జేయుట అనే పనులను ప్రేమతోఁ జేయుము.

చ:- గమికొనుచున్ భువిన్ ఘడియ కాయను గోవుల కష్టమయ్యు య
      జ్ఞ మనెదవే కదా! యిలను కాసెడి నీకది యిష్ట మాయెగా!
      సమ కొనగాఁ దగున్ పరమ సత్వ నయాన్విత భాగ్య! మమ్ము; భా
      రమొకొ? హరీ! కృపన్ వినుత! రాజిలఁ జేయుమ! వేణు గోపకా!  55.
        భావము:-
        ప్రశంసింపఁ బడెడి వాడా! ఓ వేణు గోపకుఁడా! ఓ శ్రీ హరీ! భూమిపై గోవులను 
        ఒకచో చేర్చుచు వాటిని మేతకుఁ గొని పోయి ఒక్క ఘడియైనను వెన్నంటి 
        కాపలా కాయుట ఎంతయో కష్టమైనపనియే.ఐనప్పటికీ అదే యజ్ఞమని 
        నీ వనెదవే కదా! భూమినే కాసెడి నీకు అది యిష్టమైనదాయెను కదా! నీతితో 
        కూడుకొనిన గొప్ప సత్వ గుణమే భాగ్యముగా కలిగినవాడా! మమ్ములను వహించుట 
        నీకు తగును సుమా! ఇది నీకు భారమైనపనియా యేమి?  కృపా గుణముతో 
        మమ్ములను రాజిలఁ జేయుము.

క:- కొనుచున్ భువిన్ ఘడియ కా  -  యను గోవుల కష్టమయ్యు యజ్ఞ మనెదవే?
      కొనగాఁ దగున్  పరమ స - త్వ నయాన్విత  భాగ్య! మమ్ము భారమొకొ? హరీ! 55.
        భావము:-
        ఓ శ్రీ హరీ! భూమిపై గోవులను వశ పరచు కొనుచు ఒక్క ఘడియైనను వెన్నంటి 
        కాపలా కాయుట ఎంతయో కష్టమైనపనియే. ఐనప్పటికీ అదే యజ్ఞమని నీ వనెదవే కదా! 
        నీతితో కూడుకొనిన గొప్ప సత్వ గుణమే భాగ్యముగా కలిగిన మమ్ములను చేకొనుట 
        నీకు తగును సుమా! ఇది నీకు భారమైన పనియా యేమి?

గీ:- ఘడియ కాయను గోవుల కష్టమయ్యు  -  యిలను కాసెడి నీకది యిష్ట మాయె
      పరమ సత్వ నయాన్విత భాగ్య! మమ్ము - వినుత! రాజిలఁ జేయుమ! వేణుగోప! 55.
        భావము:-
        ప్రశంసింపఁ బడెడి వాడా! ఓ వేణు గోపకుఁడా!  గోవులను ఒక్క ఘడియైనను వెన్నంటి కాపలా
        కాయుట ఎంతయో కష్టమైన పనియే. ఐనప్పటికీ  భూమినే కాసెడి నీకు అది  
        యిష్టమైనదాయెను కదా! నీతితో కూడుకొనిన గొప్ప సత్వ గుణమే భాగ్యముగా కలిగిన 
        మమ్ములను రాజిలఁ జేయుము.
        ( స శేషం )
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.