ఆంధ్రామృతం ఎంత గ్రోలినా ఇంకా గ్రోలాలనే ఉత్కంఠతో ఉన్న సాహితీ బంధువులారా! ఆంధ్రామృత మహా సాగరంలో వెతికిన కొద్దీ అద్భుతమైన ఆణి ముత్యాలు దొరుకుతూనే ఉంటాయి.
ఇప్పుడు రామ కృష్ణ విలోమ కావ్యం లోని ఒక అద్భుతమైన పాద భ్రమక శ్లోకం చూద్దాం.
క్రీ.శ.14. వాడైన దైవజ్ఞ సూర్య కృత రామ కృష్ణ విలోమ కావ్యంలో వ్రాయఁబడిన పాద భ్రమక శ్లోకం ఈ క్రింది విధంగా ఉంది.
తాం భూసుతా ముక్తిముదార హాసం.
వందే యతో లవ్య భవం దయా శ్రీ.
భావము:-
చిఱు నవ్వులు చిందించే లవుని ప్రేమించే దయ గల లక్ష్మి ఐన ఆ సీతా మాతకు నమస్కరించు చున్నాను.
అదే శ్లోకం చివరి నుండి మొదటి వరకు చదివితే అది గీతా ప్రాశస్త్యాన్ని తెలియ జేసే శ్లోకమైంది. ఇది ఎంత అద్భుత సాహితీ ప్రక్రియో చూడండి. ఇతర భాషలలో ఊహకు కూడా అందని సాహితీ సంపద అచ్చంగా మన సొంతం. ఇక చదవండి ఆ శ్లోకాన్ని కూడా.
శ్రీ యాదవం భవ్య లతోయదేవం
సంహార దా ముక్తి ముతా సుభూతాం.
భావము:-
మంగళప్రదమైన ఆకర్షణ గలవాడైన శ్రీ కృష్ణుని గీతా బోధ చెడుని సంహరిస్తూ ప్రాణప్రదమైనది.
చూచారా! దైవజ్ఞ సూర్య కవి తన రామ కృష్ణ విలోమ కావ్యంలో తన మేథాశక్తి నెంతగా ఉపయోగించి, అనంత భావనా సాహితీ విను వీధుల్లో మనలను విహరింప జేసాడో! ఆలోచించే మనసు, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలే కాని, ఎన్ని లేవండి మనం తెలుసుకోవడానికి! అవకాశం దొరికినప్పుడు మరొక పర్యాయం కలుసుకుందాం. అంతవరకూ సెలవా?
అన్నట్టు ఈ శ్లోకాన్ని ముందునుండి వెనుకకు, వెనుక నుండి ముందుకి చదవడమే కాదండోయ్! కంఠస్థము చేసెయ్యాలన్న మాట మరువకండీ? నమస్తే.
జీశ్రీరాం.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.