ఉ:- శ్రీ మధు సూదనా! మిములఁ జేరి ధనాఢ్యులె మిన్న యౌను శ్రీ
చే మనుటన్ సదా. మిములఁ జేరక పేదలె మిన్నకుండు. నీ
వే మదినెంచి; నీ కరుణఁ బేద ధర న్నిను గాంచఁ జేయుతన్!
రామహరీ! సదా వినుత రమ్య గుణాత్మక! వేణు గోపకా! 16.
భావము:-
పొగడఁ బడెడి రమ్య గుణాత్మకుఁడవైన ఓ వేణు గోపకా! అందగాడివైన ఓ శ్రీ హరీ!
శ్రీ యుతుడవైన ఓ మధుసూదనా! ఎల్లప్పుడూ ధనాఢ్యులు శ్రీచేత మను వారగుచున్న
కారణముగా మిమ్ములను చేరి మిన్న యగు చున్నారు. పేద వారు మిమ్ములను జేరకుండా
ఊరకనే ఉంటున్నారు. నీవే నీ మనస్సులో పరిగణించి భూమిపై పేదవారు నిన్ను
ఎల్లప్పుడూ చూచే విధముగా చేయుదువు గాక!
క:- మధు సూదనా! మిములఁ జే - రి ధనాఢ్యులె మిన్న యౌను శ్రీచే మనుటన్
మదినెంచి; నీ కరుణఁ బే - ద ధర న్నిను గాంచ జేయుతన్! రామహరీ! 16.
భావము:-
అందగాడివైన ఓ శ్రీ హరీ! ఓ మధుసూదనా! ధనాఢ్యులు శ్రీచేత మను వారగుచున్న
కారణముగా మిమ్ములను చేరి మిన్న యగు చున్నారు. నీవే నీ మనస్సులో గణించి
భూమిపై పేదవారు నిన్ను ఎల్లప్పుడూ చూచే విధముగా చేయుదువు గాక!
గీ:- మిములఁ జేరి ధనాఢ్యులె మిన్న యౌను - మిములఁ జేరక పేదలె మిన్నకుండు.
కరుణఁ బేద ధర న్నిను గాంచఁ జేయు! - వినుత రమ్య గుణాత్మక! వేణు గోప! 16.
భావము:-
పొగడఁ బడెడి ఓ వేణు గోపకా! ధనాఢ్యులు మిమ్ములను చేరి మిన్నయగు చున్నారు.
పేదవారుమిమ్ములను జేరకుండా ఊరకనే ఉంటున్నారు. నీవే కరుణతో భూమిపై పేదవారు
నిన్ను ఎల్లప్పుడూ చూచే విధముగా చేసెడి రమ్య గుణాత్మకుఁడవు.
చ:- చదువరులెల్ల నిన్ వినుత సార రసాత్ముగ విశ్వసించురా!
చిదనుపమాన్యుఁడా! సకల జీవుల నీయిల చక్క నేలుదే!
బుధ ధర; నీవెగా! కృతుల పొందు రసాకృతిఁ? కీర్తనీయ తో
చెదవు హరీ! మదిన్. వినుత చిన్మయ రూపక! వేణు గోపకా! 17.
భావము:-
ప్రకాశించెడి సాటి లేనివాడా! పొగడ బడెడి చిన్మయ స్వరూపకుఁడవైన ఓ వేణు గోపకా!
ఓ శ్రీ హరీ! చదువరు లందరూ నిన్ను పొగడఁ బడెడి వేదాంత సార రసాత్ముఁడివిగా నమ్ముదురు.
సకల జీవరాశులూ నీవే అయి యుండి చక్కగా పాలింతువే! పండితులను ధరించిన వాడవు
నీవే కదా! ఓ కీర్తనీయుఁడా! కృతులలో పొందియున్న రస స్వరూపుఁడుగా
నీవే మాకు తోచెదవు.
క:- వరులెల్లరున్ వినుత సా - ర రసాత్ముగ విశ్వసించురా! చిదనుపమా!
ధర; నీవెగా! కృతుల పొం - దు రసాకృతిఁ? కీర్తనీయ! తోచెదవు హరీ! 17.
భావము:-
ఓ శ్రీ హరీ! శ్రేష్ఠు లందరూ నిన్ను పొగడ బడెడి వేదాంత సార రసాత్ముడివిగా నమ్ముదురు.
ప్రకాశించెడి సాటి లేనివాడా! ఓ కీర్తనీయుఁడా! కృతులలో పొందియున్న రస స్వరూపుఁడవు
నీవేనని మాకు తోచెదవు.
గీ:- వినుత సార రసాత్ముగ విశ్వసించు; - సకల జీవుల నీయిల చక్క నేలు
కృతుల పొందు రసాకృతిఁ కీర్తనీయ - వినుత చిన్మయ రూపక! వేణు గోప! 17.
భావము:-
పొగడఁ బడెడి చిన్మయ స్వరూపకుడవైన ఓ వేణు గోపకా! ఓ కీర్తనీయుడా! కృతులలో
పొందియున్నరసాకృతీ! వేదాంత సార రసాత్ముడివిగా నిన్ను నమ్ము సకల జీవ రాశులూ
నీవే అయి యుండి; చక్కగా పాలింతువే!
చ:- వన భువనంబులన్ పరమ భాగవతోత్తమ వర్యులందగా
నిను కొలుచున్; కృపన్ వరమునే దయనిత్తువు. భాగ్యమద్ది! దా.
సుని; సవిధంబుగా కరుణఁ జూపవ నాపయి; కాంక్ష తీర్పవా!
వినుత హరీ! మహా విపుల విశ్వ ప్రకల్పక! వేణు గోపకా! 18.
భావము:-
గొప్ప విపులమైన సృష్టిని ప్రకల్పించిన వాడా! ఓ వేణు గోపకుడా! పొగడ బడెడి
ఓ శ్రీ హరీ! గొప్ప భగవద్భక్త శ్రేష్ఠులు నిన్ను పొందుట కొఱకు వనములందు
భువనములందు ఉండి నిన్నే సేవించుచున్నారు. కృపాహృదయము కలవాడవై వారిపై
దయ చూపించి వరములనిచ్చెదవు. అది వారి భాగ్యము. నేను నీ దాసుడను! నామీద
తగిన విధముగా కరుణ జూపవా? నా కోరిక నెరవేర్చవా?
క:- భువనంబులన్ పరమ భా - గవతోత్తమ వర్యు లందగా నిను కొలుచున్;
సవిధంబుగా కరుణఁ జూ - పవ నాపయి; కాంక్ష తీర్పవా! వినుత హరీ! 18.
భావము:-
పొగడఁ బడెడి ఓ శ్రీ హరీ! గొప్ప భగవద్భక్త శ్రేష్ఠులు నిన్ను పొందుట కొఱకు
భువనములందు ఉండి నిన్నే సేవించుచున్నారు. నా మీద తగిన విధముగా
కరుణ జూపవా? నా కోరిక నెరవేర్చవా?
గీ:- పరమ భాగవతోత్తమ వర్యులంద - వరమునే దయనిత్తువు. భాగ్యమద్ది!
కరుణఁ జూపవ నాపయి; కాంక్ష తీర్ప! - విపుల విశ్వ ప్రకల్పక! వేణు గోప! 18.
భావము:-
గొప్ప విపులమైన సృష్టిని ప్రకల్పించినవాడా! ఓ వేణు గోపకుఁడా! గొప్ప భగవద్భక్త శ్రేష్ఠులు
అందుకొనేలాగున దయ చూపించి వరములనిచ్చెదవు. అది వారి భాగ్యము. నామీద తగిన
విధముగా కరుణ జూపవా? నా కోరిక నెరవేర్చవా?
ఉ:- శ్రీ చరణంబులన్ మదిని శ్రీవరులెన్నుచు మాన్యులైరి. వా
రే చరితుల్ గదా! పదిల రేణువదొక్కటి పావనంబుగా
తా చరణంబులన్ తలను దాల్చి రహింతురు ధన్యులౌచు. శ్రీ
రాచ హరీ! దయా వినుత రమ్య గుణాత్మక! వేణు గోపకా! 19.
భావము:-
శుభప్రదమైన రాజ సంబంధుడవైన ఓ శ్రీ హరీ! దయ మొదలగు పొగడ బడెడి
గుణముతో కూడిన మనస్సు కలవాడా! ఓ వేణు గోపకుఁడా! మంగళ ప్రదములైన
నీ పాదములను ధీవరులు మనస్సులో గణించుచూ మాన్యత పొందిరి. నేర్పరులన్న
వారే కదా! స్థిరముగా ఒక్క రేణువే పావనమని; వారు నీ పాదములను తమ శిరమున ధరించి
ధన్యులగుచూ వర్ధిల్లుచున్నారు.
క:- చరణంబులన్ మదిని శ్రీ - వరులెన్నుచు మాన్యులైరి. వారే చరితుల్
చరణంబులన్ తలను దా - ల్చి రహింతురు ధన్యులౌచు. శ్రీరాచ హరీ! 19.
భావము:-
శుభప్రదమైన రాజ సంబంధుడవైన ఓ శ్రీ హరీ! నీ పాదములను ధీవరులు
మనస్సులో గణించుచూ మాన్యత పొందిరి. నేర్పరులన్న వారే కదా! స్థిరముగా
ఒక్క రేణువైనను పావనమే యని; వారు నీ పాదములను తమ శిరమున ధరించి
ధన్యులగుచూ వర్ధిల్లుచున్నారు.
గీ:- మదిని శ్రీవరులెన్నుచు మాన్యులైరి. - పదిల రేణువదొక్కటి పావనంబు
తలను దాల్చి రహింతురు ధన్యులౌచు. - వినుత రమ్య గుణాత్మక! వేణు గోప! 19.
భావము:-
పొగడ బడెడి రమ్యమైన గుణముతో కూడిన మనస్సు కలవాడా! ఓ వేణు గోపుఁడా! స్థిరముగా
ఒక్క రేణువే పావనమని తమ మనస్సులలో ధీవరులు భావించుచు మంగళ ప్రదములైన నీ
పాదములను తమ శిరమున ధరించి ధన్యులగుచూ వర్ధిల్లుచున్నారు.
చ:-హిమ మహిమంబునున్; కడలి హృన్మహిమంబును గాంచఁ జేసినా
వ? మనమునన్ దయన్ శివుఁడివైన మహేశ్వర! శ్రీనివాస వై;
రమ సహితుండవై ఉదయ రాగ హృదంతర ఓంకృతాన గా
వు మము; హరీ! కృపన్ వెలసి; పొందగఁ జేసితె? వేణు గోపకా! 20.
భావము:-
ఓ వేణు గోపకుఁడా! ఓ మహేశ్వరుఁడా! నీవే శివుఁడివై హిమాలయ నివాసివై హిమవంతుని
గొప్పదనమును; శ్రీ నివాసుఁడవై రమా సహితముగా క్షీర సముద్ర మధ్యమున నివసిస్తూ
ఆ క్షీరసాగరుని హృదయ మహిమను మేము మా మనములందు గాంచునట్లు
దయతో చేసితివా? ఉదయించిన అనురాగముతో హృదంతరాళమున ఓంకారముగా నిలిచి
మమ్ములను కాపాడే శ్రీ హరీ! కృపతో మాలో వెలసి నిన్ను మేము పొందునట్లు చేసితివా!
క:- మహిమంబునున్; కడలి హృ - న్మహిమంబును గాంచఁ జేసినావ? మనమునన్
సహితుండవై ఉదయ రా - గ హృదంతర ఓంకృతాన గావు మము; హరీ! 20.
భావము:-
ఓ శ్రీ హరీ! మహిమఎటులుండునో యను విషయమును; క్షీర సాగరుని హృదయ
మహిమమును మేము మా మనములందు గాంచునట్లును చేసితివా? హితము తో
కూడుకొన్నవాడివై ఉదయ రాగము వలె ధ్వనించు హృదంతరాళము నందలి
ఓంకారముగా నిలిచి మమ్ములను కాపాడుము.
గీ:- కడలి హృన్మహిమంబును గాంచఁ జేసి, - శివుఁడివైన మహేశ్వర! శ్రీనివాస
ఉదయ రాగ హృదంతర ఓంకృతాన - వెలసి; పొందగఁ జేసితె? వేణు గోప! 20.
భావము:-
ఓ వేణు గోపకుఁడా! ఆ క్షీర సాగరుని హృదయ మహిమను మేము మా మనములందు
గాంచునట్లు చేసితివా? శుభములను కలిగించు వాడవై గొప్ప ఈశ్వరుడవైన ఓ శ్రీనివాసా!
ఉదయ రాగముతోనొప్పు హృదంతరాళ ఓంకారముగా దయతో నిలిచి;
నిన్ను మేము పొందునట్లు చేసితివా!
( సశేషం )
జైశ్రీరాం.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.