గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జులై 2011, గురువారం

శ్రీ వేణు గోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. పద్యము 8 / 21 వ భాగము

చ:- నిను కని భక్తితో మదుల నిల్పు నిరామయ! మాన్యపాళిఁ బొం
      దను శిలలే సదా ఎదురు తప్పక చూచెడు; నెన్ని  చూడ; బా
      ధను మనమందునన్ నిలిపి తాము నిరంతర నిశ్చలాత్మమున్
      గనవె?  హరీ! సదా వెలయఁ గల్గును; నీ కృప! వేణు గోపకా ! 36.
      భావము:-
      ఓ వేణు గోపకుఁడా!  ఓ నిరామయా! ఓ శ్రీ హరీ!  ఎన్నికతో చూడగా;  నిన్ను చూచి; భక్తితో తమ
      మనస్సులలో నిన్ను నిలిపెడి మాన్యులను పొందుట కొఱకు బండ రాళ్ళే తప్పక ఎదురు
      చూచుచు దేవుని గుడి మెట్లుగా రూపు దాల్చును. అవి వారు తమపై పాదములు
      మోపు చున్నందు వలన కలిగెడి బాధను మనస్సు నందే నిలిపి; అవి నిరంతర నిశ్చలాత్మను
      చూడవా? అందు వలననే అవి ఎల్లప్పుడూ వెలియఁ గలుగును. అది నీ కృప చేతనే సుమా!

క:- కని భక్తితో మదుల ని  -  ల్పు నిరామయ మాన్యపాళిఁ బొందను శిలలే
      మనమందు నిన్ నిలిపి తా  -  ము నిరంతర నిశ్చలాత్మము న్గనవె?  హరీ! 36.
      భావము:-
      ఓ నిరామయా! ఓ శ్రీ హరీ!   భక్తితో తమ మనస్సులలో నిన్ను నిల్పు మాన్యులను చూచి;
      వారిని పొందుట కొఱకు  బండ రాళ్ళే మనస్సునందు నిన్ను నిలిపి తాము నిరంతర
      నిశ్చలాత్మమును చూడవా?

గీ:- మదుల నిల్పు నిరామయ మాన్యపాళిఁ -  ఎదురు తప్పక చూచెడు; నెన్ని  చూడ;
      నిన్ నిలిపి తాము నిరంతర నిశ్చలాత్మ - వెలయఁ గల్గును; నీ కృప! వేణుగోప! 36.
      భావము:-
      ఓ నిరామయా!  ఓ వేణు గోపుడా! నిన్ను తమ మనస్సులలో నిల్పెడు మాన్యులు ఎన్నికతో
      నిన్ను చూచుటకు తప్పక ఎదురు చూచును. నీ కృప కారణముగా నిన్ను నిలిపి
      నిశ్చలాత్మతో వారు వెలయును.

చ:- పలకల లోపలన్ కనగ బండల లోపల కల్గు దీవు. ట
      క్కులు సరిలే! భువిన్ కనుల కుం దగఁగా మముఁ గాన రావు. లో
      కుల పలు మాటలన్ మదులు కొందలమందెడు మమ్ము జూడు. ద
      ర్పిలఁగ హరీ! సదా వినుత ప్రేమ గుణావృత! వేణు గోపకా! 37.
      భావము:-
      ఎల్లప్పుడూ పొగడఁ బడెడి ప్రేమ గుణము చేత ఆవరింపఁ బడిన  ఓ వేణు గోపకుఁడా!
      ఓ శ్రీ హరీ! కనిపెట్టి చూడగా  పలకలలోపలను; బండలలోపలను కూడా నీవు ఉందువు కదా!
      భూమిపై కనులున్నందులకు తగు విధముగా కనుటకు వీలుగా కనఁబడవు కదా!
      నీ టక్కులిక చాలించు. లోకులు నీ అస్థిత్వమును శంకించుచూ ఆడెడి పలు మాటలకు
      మా మనస్సులు క్షోభించు చుండెను. మేము గర్వ పడే విధముగా మమ్ములను చూడుము.

క:- కల లోపలన్ కనగ బం  -   డల లోపల కల్గు దీవు. టక్కులు సరిలే!
      పలు మాటలన్ మదులు కొం  -  దలమందెడు మమ్ము జూడు. దర్పిలఁగ హరీ! 37.
      భావము:-
      ఓ శ్రీ హరీ!  మేము నిన్ను కలలో చూడగా అది సత్యమై బండలలోపల దర్శనమిచ్చెదవు.  నీ
      టక్కులిక చాలించు. లోకులు నీ అస్థిత్వమును శంకించుచూ ఆడెడి పలు మాటలకు మా
      మనస్సులు క్షోభించు  చుండెను. మేము గర్వ పడే విధముగా మమ్ములను చూడుము.

గీ:- కనగ బండల లోపల కల్గు దీవు. -  కనుల కుం దగఁగా మముఁ గాన రావు.
      మదులు కొందలమందెడు మమ్ముఁజూడు-వినుత ప్రేమ గుణావృత! వేణుగోప!37.
      భావము:-
      పొగడఁ బడెడి ప్రేమ గుణము చేత ఆవరింపఁ బడిన ఓ వేణు గోపుఁడా! కనుగొనగా బండల లోపల
      విగ్రహ రూపములో నీవుందువు. మా కనులకు తగునట్లుగా చూచెదమన్న  మమ్ములను
      చూచుటకు రావు. మానసికముగా క్షోభిస్తున్న మమ్ములను చూడుము.

చ:- దశ దిశలందునన్ పరగు ధర్మ శతహ్రద భాష్యమీవ! మా
      వశమగుదే? మహా మహిత భావ పరంపర మాన్యుడీవ! మా
      దశ భృశమై కనన్ కనుల దాగి; శయించెడి కాంతి వీవ! కృ
      ష్ణ! శివ హరీ! మహా వినుత శౌర్య పరాత్పర! వేణు గోపకా! 38.
      భావము:-
      గొప్పగ పొగడ బడెడి శౌర్య పరాత్పరుఁడా ! ఓ వేణు గోపకా! ఓ నల్లనయ్యా! శుభంకరుడవైన
      ఓ శ్రీహరీ! దశ దిశలందూ ఒప్పుచున్నటువంటి ధర్మమనెడి మెఱపునకు భాష్యము నీవే !
      ( అన్నిదిశలందూ ప్రకా శించు ధర్మము నీవే ) అట్టి నీవు మా వశమగుదువా?
      చాలా గొప్ప దైన భావపు దొంతరలో నుండే మాన్యుఁడవు నీవే. మా యొక్క మంచి దశ అధికమై;
      నిన్ను చూడగా; మా కళ్ళలోనే దాగి విశ్రమించెడి కాంతివి నీవే అయి యున్నావు.

క:- దిశలందునన్ పరగు ధ  -  ర్మ శతహ్రద భాష్యమీవ! మావశమగుదే?
      దశ భృశమై కనన్ కనుల దా  -  గి; శయించెడి కాంతి వీవ! కృష్ణ! శివ హరీ! 38.
      భావము:-
      ఓ నల్లనయ్యా! శుభంకరుడవైన ఓ శ్రీహరీ! దశ దిశలందూ ఒప్పుచున్నటువంటి ధర్మమనెడి
      మెఱపునకు భాష్యము నీవే ! ( అన్ని దిశలందూ ప్రకా శించు ధర్మము నీవే ) అట్టి నీవు మా
      వశమగుదువా? మాయొక్క మంచి దశ అధికమై నిన్ను చూడగా; మా కళ్ళలోనే దాగి
      విశ్రమించెడి కాంతివి నీవే అయి యున్నావు.

గీ:- పరగు ధర్మ శతహ్రద భాష్యమీవ! -  మహిత భావ పరంపర మాన్యుడీవ!
      కనుల దాగి; శయించెడి కాంతి వీవ! -  వినుత శౌర్య పరాత్పర! వేణు గోప! 38.
      భావము:-
      గొప్పగ పొగడఁ బడెడి శౌర్య పరాత్పరుఁడా ! ఓ వేణు గోపుఁడా! దశ దిశలందూ
      ఒప్పుచున్నటువంటి ధర్మమనెడి మెఱపునకు భాష్యము నీవే ! ( అన్ని దిశలందూ
      ప్రకాశించు ధర్మము నీవే ) చాలా గొప్ప దైన భావపు దొంతరలోనుండే మాన్యుఁడవు నీవే.
      మా కళ్ళలోనే దాగి విశ్రమించెడి కాంతివి నీవే అయి యున్నావు.

చ:- భవ జనులందునన్ పరమ పావన  భక్తుల పాద ధూళి ప్రా
      భవమలరన్ గ తా శిరము పైనను దాల్చిన; చిత్ర మొప్ప గా
      నివి  ఘనతన్ మహా వరము లిచ్చును  కొల్చిన భక్తి తోడ; చూ
      డవయ హరీ! మహా విదితుఁడా! యిది నీ కృప; వేణు గోపకా! 39.
      భావము:-
      గొప్పగా వ్యక్తమయేవాఁడా! ఓ వేణు గోపకా! శుభప్రదమైన జనులలో పరమ పవిత్రుల యొక్క
      పాద ధూళి గొప్పతనము ఉట్టి పడే లాగున ఎవరైననూ సరే తాను శిరముపై ధరించినట్లైతే భక్తితో
      ప్రార్థించినంతనే ఈ పాదరేణువులు విచిత్రముగా ఘనతతో కూడిన గొప్ప వరములనిచ్చును.
      ఓ శ్రీహరీ! ఇది చూడుము. ఇది నీ కృపయే కదా!

క:- జనులందునన్ పరమ పా  -  వన  భక్తుల పాద ధూళి ప్రాభవమలరన్
      ఘనతన్ మహా వరము లి  -  చ్చును  కొల్చిన భక్తి తోడ; చూడవయ హరీ! 39.
      భావము:-
      ఓ శ్రీ హరీ! ఇది చూడుము. శుభప్రదమైన జనులలో పరమ పవిత్రుల యొక్క పాద ధూళి
      భక్తితో ప్రార్థించినంతనే గొప్పతనము ఉట్టి పడే లాగున ఘనతతో కూడిన
      గొప్ప వరములనిచ్చును.

గీ:- పరమ పావన  భక్తుల పాద ధూళి -  శిరము పైనను దాల్చిన; చిత్ర మొప్ప
      వరము లిచ్చును  కొల్చిన భక్తి తోడ; -  విదితుఁడా యిది నీ కృప; వేణు గోప! 39.
       భావము:-
       గొప్పగా వ్యక్తమయేవాఁడా! ఓ వేణు గోపకా! పరమ పవిత్రుల యొక్క పాద ధూళి శిరముపై
       ధరించినట్లైతే ఈ పాదరేణువులు భక్తితో ప్రార్థించినంతనే  విచిత్రముగా ఘనతతో కూడిన గొప్ప
       వరములనిచ్చును. ఇది నీ కృపయే కదా!

చ:- హరి పరమాత్ముఁడా! సుమధురాక్షర రూపముఁ జూడ నీదెగా !
      మురహరుఁడా! కనన్; నికర మోక్ష రమాకృతి నీవె గాదె! శ్రీ
      హరి సుర సేవితా! సుమధురాక్షర హారతి చూడ నీకెగా!
      శరణు హరీ! మహావినుత! ఛంద సుగోచర! వేణు గోపకా! 40.
      భావము:-
      పరమాత్ముఁడవైన ఓ శ్రీ హరీ! ఓ వేణు గోపకుఁడా! మంచి మధురమైన అక్షరమైన రూపము
      చూడగా అది నీదే అగును కదా! మురహరుఁడా! ఓ శ్రీ హరీ! చూడగా నికరమైన
      మోక్ష రమాకృతి యన్నఅదియు నీవే కదా! మంగళ ప్రదులైన ఇంద్రాది దేవతా సేవితుడా!
      నే నర్పిస్తున్న సుమధురాక్షర హారతి అది నీకే గదా! గొప్పగా వినుతింపఁ బడెడివాఁడా!
      ఈ నా ఛందమున సుగోచరమయే శ్రీ హరీ! నీవే నాకు శరణు.

క:- పరమాత్ముఁడా! సుమధురా  -  క్షర రూపముఁ జూడ నీదెగా !మురహరుఁడా!
      సుర సేవితా! సుమధురా  -  క్షర హారతి చూడ నీకెగా!శరణు హరీ! 40.
      భావము:-
      ఓ పరమాత్ముఁడా! మంచి మధురమైన అక్షరమైన రూపము చూడగా అది నీదే అగును కదా!
      మురహరుఁడా! మంగళ ప్రదులైన ఇంద్రాది దేవతా సేవితుఁడా! నే నర్పిస్తున్న సుమధురాక్షర
      హారతి అది నీకే గదా! గొప్పగా వినుతింపఁ బడెడి ఈ నా ఛందమున సుగోచరమయే శ్రీ హరీ!
      నీవే నాకు శరణు.

గీ:- సుమధురాక్షర రూపముఁ జూడ నీదె ! -  నికర మోక్ష రమాకృతి నీవె గాదె!
      సుమధురాక్షర హారతి చూడ నీకె!  -  వినుత!  ఛంద సుగోచర! వేణు గోప! 40.
      భావము:-
      గొప్పగా వినుతింపఁ బడెడివాఁడా! ఈ నా ఛందమున సుగోచరమయే  ఓ వేణు గోపకుఁడా! మంచి
      మధురమైన అక్షరమైన రూపము చూడగా అది  నీదే అగును కదా! నికరమైన మోక్ష రమాకృతి
      యన్న అదియు నీవే కదా! నే నర్పిస్తున్న సుమధురాక్షర హారతి అది నీకే గదా! 
        ( సశేషం ) 
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.