గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, జులై 2011, బుధవారం

శ్రీ వేణు గోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. 1 / 21వ భాగము

శ్రీరస్తు                                  శుభమస్తు                            అవిఘ్నమస్తు.
శ్రీ వేణు గోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము.
రచన:- చింతా రామ కృష్ణా రావు.

ఉ:-శ్రీ మధు సూదనా! నర హరీ! మధు కల్పక! నాద లోల! మా
   వామనుఁడా! రమా ధవుఁడ! పావన నామ! సుధా పయోధి! దే
   వా! మధురాక్షరా! సుహృది వాస! దయాపర! సూక్ష్మ రూప! స
   స్థేమ హరీ! మదిన్ వెలసి క్షేమముఁ గూర్చుమ! వేణు గోపకా!  1.
   భావము:-
   మధువు అనే రాక్షసుని సంహరించిన ఓ పరమేశ్వరా! నరసింహా! అమృత కల్పకుఁడా! మంగళ 
   ధ్వని ప్రియుఁడా! మా వామన మూర్తీ! లక్ష్మీ పతీ! పవిత్ర మైన పేరు కలవాఁడా! అమృత సాగరమా! 
   దేవా!  మధుర మైన అక్షరస్వరూపుఁడా! మంచి హృదయములలో నివసించువాఁడా! దయయే   
   పరముగా కలవాఁడా! సూక్ష్మ స్వరూపుఁడా! బలసహితుఁడవైన ఓ హరీ! ఓ వేణు గోపకా! నా  
   హృదయములో వెలసి నాకు క్షేమమును కలుగఁ జేయుము.  

క:-మధు సూదనా! నర హరీ!  -  మధు కల్పక! నాద లోల! మా వామనుఁడా! 
   మధురాక్షరా! సుహృది వా  -  స! దయాపర! సూక్ష్మ రూప! సస్థేమ హరీ!  1.
   భావము:-
   మధు సంహారకా! నరహరీ! అమృతమును సృష్టించిన వాఁడా! మంగళ ధ్వని లోలుఁడా!
   మా వామన మూర్తీ! మధురమైన అక్షరుఁడా! బలసహితుఁడవైన ఓ హరీ!
   మంచి హృదయములలో నివసించువాఁడా! దయాపరుఁడా! 

గీ:-నర హరీ! మధు కల్పక! నాద లోల!  -  ధవుఁడ! పావన నామ! సుధా పయోధి! 
   సుహృది వాస! దయాపర! సూక్ష్మ రూప! - వెలసి క్షేమముఁ గూర్చుమ! వేణు గోప! 1.
   భావము:-
   ఓ నరసింహా! అమృత కల్పకుఁడా! నాద లోలుఁడా! మమ్ములను భరించువాఁడా! పవిత్రమైన  
   పేరు గలవాఁడా! అమృత సాగరమా! మంచి హృదయములలో నివసించువాఁడా! దయా పరుఁడా! 
   సూక్ష్మ రూపుఁడా! ఓ వేణు గోపుఁడా! నాలో  వెలిసి నాకు క్షేమమును కూర్చుము.

చ:-భృత కల చిత్రముల్ పరగ పింగలి సూరన; భట్టు మూర్తి.  కా
   వ్యత కృతులన్; కడున్ రచన భవ్యముగా నొనరంగ చేసె. స
   మ్మతి వెలయించి రాగురుల మాన్య లసద్గతిఁ గొల్తు  భక్తి హా
   రతిని హరీ! సదా! విరియు రమ్యతఁ గొల్పగ; వేణు గోపకా!  2.
   భావము:-
   ఓ హరీ! ఓ వేణు గోపకా! పింగళి సూరనకవి; భట్టు మూర్తి కవీ;  నింపఁ బడిన; అవ్యక్త మధురమైన  
   చిత్ర కవిత్వ పద్ధతులను కావ్యత్వము కల్పించి; తమ కృతులలో మిక్కిలి గొప్పగా ప్రయోగించిరి. 
   మంచి మనసుతో ఆ చిత్ర కవితా రీతులను వెలయఁ జేసిరి కదా! నా రచనలో
   రమ్యత విరియఁజేయుట కొఱకు పెద్దవారైన ఆ సుకవిశ్రేష్ఠుల మాన్యమైన ప్రకాశించెడి
   కవితా మార్గమును;  భక్తి అనెడి హారతితో సేవింతును.

క:-కల చిత్రముల్ పరగ పిం  -  గలి సూరన; భట్టు మూర్తి.  కావ్యత కృతులన్; 
   వెలయించిరాగురుల మా - న్య లసద్గతిఁ గొల్తు  భక్తి హారతిని హరీ!  2.
   భావము:-
   ఓ హరీ! పింగళి సూరనకవి; భట్టు మూర్తి కవి;  అవ్యక్త మధురమైన  చిత్ర కవిత్వపద్ధతులను  
   కావ్యత్వము కల్పించి; తమ కృతులలో వెలయఁ జేసిరి కదా! పెద్దవారైన ఆ సుకవిశ్రేష్ఠుల 
   మాన్యమైన ప్రకాశించెడి కవితా మార్గమును;  భక్తి అనెడి హారతితో సేవింతును

గీ:-పరగ పింగలి సూరన; భట్టు మూర్తి.  -  రచన భవ్యముగా యొనరంగ చేసె. 
   గురుల మాన్య లసద్గతిఁ గొల్తు భక్తి -  విరియు రమ్యతఁ గొల్పగ; వేణు గోప!  2.
   భావము:-
   ఓ వేణు గోపుఁడా! పింగళి సూరనకవి; భట్టు మూర్తి కవీ;  గొప్పగా ఉండేవిధంగా రచనలు చేసిరి.
   నా రచనలో రమ్యత విరియఁజేయుట కొఱకు పెద్దవారైన ఆ సుకవిశ్రేష్ఠుల మాన్యమైన ప్రకాశించెడి
   కవితామార్గమును భక్తితో సేవింతును.

చ:-కను! సుమనోజ్ఞుడా! వెలసె కందము గీతము వృత్తమందు.నన్
   విన; గననౌన్ గదా! శతక వేలుపు వీవెర! సమ్మతించి ప్రీ
   తిని సుమనోజ్ఞమౌ రచన దీప్యముగా నిట వ్రాసితీవె ప్రా
   ర్థనలఁ హరీ! కనన్ విజయ ధామము నీ మది; వేణు గోపకా!  3.
   భావము:-
   ఓ విష్ణు మూర్తీ! ఓ వేణు గోపకుఁడా! మంచి మనస్సుకు అద్భుతముగా తెలియఁబడేవాఁడా! నా చే 
   రచింప బడిన ఈ వృత్త పద్యములలో కందము తేటగీతి పద్యములు కూడా ఉన్నాయి. చూడుము.
   వాటిని వినుటకు;  చూచుటకు సాధ్యమౌనుకదా! ఈ శతకమునకు మూల పురుషుఁడవు నీవే.
   నా ప్రార్థనలచే ఇష్టపడి; ప్రీతితో;  మంచి మనోజ్ఞమైన రచనను వ్యక్తమయేలాగ ఈ శతకమందు
   రచించినది నీవే. చూడగా నీ మనసే ఒక విజయ ధామము కదా!  

క:-సుమనోజ్ఞుడా! వెలసె కం  -  దము గీతము వృత్తమందునన్ వినఁ; గన; నౌన్! 
   సుమనోజ్ఞమౌ రచన దీ  -  ప్యముగా నిట వ్రాసి తీవె ప్రార్థనలఁ హరీ! 3.
   భావము:-
   ఓ విష్ణు మూర్తీ! మంచి మనస్సుకు అద్భుతముగా తెలియఁబడే వాఁడా! నాచే రచింప బడిన ఈ 
   వృత్త పద్యములలో కందము తేటగీతి పద్యములు కూడా ఉన్నాయి. వాటిని వినుటకు;
   చూచుటకు సాధ్యమౌను! మంచి మనోజ్ఞమైన రచనను వ్యక్తమయేలాగ  ఈ శతకమందు
   రచించినది నీవే.

గీ:-వెలసె కందము గీతము వృత్తమందు.  -  శతక వేలుపు వీవెర! సమ్మతించి 
   రచన దీప్యముగా నిట వ్రాసి తీవె!  -  విజయ ధామము నీ మది వేణు గోప!  3.
   భావము:-
   ఓ వేణు గోపుఁడా!  నా చే రచింప బడిన ఈ వృత్త పద్యములలో కందము తేటగీతి పద్యములు 
   కూడా ఉన్నాయి. ఈ శతకమునకు మూల పురుషుఁడవు నీవే.  రచనను వ్యక్తమయేలాగ ఈ 
   శతకమందు రచించినది నీవే.  ఆలోచించి చూడగా  నీ మనసే ఒక విజయ ధామము కదా!

చ:-బుధ వరులెన్ను నీ పరమ పూజ్య రమాశ్రిత ప్రాభవంబు. సా
   రథివగుచున్; నినున్ మదిని భ్రాంతిగ నిల్పిన మన్ననంబు; స
   ద్బుధ గురులన్ కృపన్ నడుపు బుద్ధి రహస్యము నాకొసంగితే!
   మధుర హరీ! సదా వెలయ మమ్ములఁ గాచెడి వేణు గోపకా!  4.
   భావము:-
   మధురముగా తోచువాఁడవైన ఓ హరీ! ఎల్లప్పుడూ వృద్ధి పొందు విధముగా మమ్ములను కాపాడే 
   ఓ వేణు గోపకుఁడా! జీవన రథ సారథివై పరమ పూజ్య యైన లక్ష్మీదేవిని ఆశ్రయించియున్న నీ  
   ప్రాభవమును పండిత శ్రేష్టులు గణింతురు.ఎల్లప్పుడూ మంచి పండితులను; గురువులను; 
   మనస్సులో భ్రాంతితో నిల్పినటువంటిమన్ననను; ఆ విధముగా కొనసాగించుటకు మూలమైన  
   బుద్ధియొక్క రహస్యమును కృపతో  నాకు ఒసంగితివా!  

క:-వరులెన్ను నీ పరమ పూ  -  జ్య రమాశ్రిత ప్రాభవంబు. సారథివగుచున్. 
   గురులన్ కృపన్ నడుపు బు  -  ద్ధి రహస్యము నాకొసంగితే! మధుర హరీ! 4.
   భావము:-
   మధురముగా తోచువాఁడవైన ఓ హరీ! జీవన రథ సారథివై పరమ పూజ్య యైన లక్ష్మీదేవిని
   ఆశ్రయించి యున్న నీ ప్రాభవమును  శ్రేష్టులు గణింతురు.  గురువులను; ఆ విధముగా
   కొనసాగించుటకు మూలమైన బుద్ధియొక్క రహస్యమును కృపతో నాకు ఒసంగితివా!  

గీ:-పరమ పూజ్య రమాశ్రిత ప్రాభవంబు.  -  మదిని భ్రాంతిగ నిల్పిన మన్ననంబు.
   నడుపు బుద్ధి రహస్యము నాకొసంగి!  -  వెలయ మమ్ముల గాచెడి వేణు గోప! 4.
   భావము:-
   ఓ వేణు గోపుడా! పరమ పూజ్య యైన లక్ష్మీదేవిని ఆశ్రయించియున్న నీ ప్రాభవమును  ఆమెను  
   హృదయముపై భ్రాంతితో నిల్పిన నీకు ఆమె యెడ  గల మన్ననను; ఆ విధముగా
   కొనసాగించుటకు మూలమైన బుద్ధియొక్క రహస్యమును కృపతో నాకు తెలియఁ జేసి;
   ఎల్లప్పుడూ వృద్ధి పొందు విధముగా మమ్ములను కాపాడే వాఁడవు నీవే.

చ:-పలు కలుషంబులన్, పలుకు పల్కుల లోపల పాప మొల్కు, లో
   కులను గనన్ గనే, కలుష కోవిదు లెట్టుల కల్గు చుండ్రి. యం
   చిల పలు మారు నే  కొలిచి; యీ తొలి దోషము కూల్చమందుఁ దో
   యిలిడి హరీ! నినున్.  వినవ! హృద్ స్థిత! రక్షక! వేణు గోపకా! 5. 
   భావము:-
   ఓ హరీ! అనేకమైన కల్మషములతో కూడి; మాటాడే ప్రతీ మాటలోనూ పాపము బైట పడే విధంగా 
   ఉండే లోకులను చూడగనే; ఇటువంటి పాపములలో పండితులైన ఇట్టివారు ఈ భూమిపై ఏ 
   విధముగా ప్రభవిస్తున్నారా  అని భావించి; అనేక పర్యాయములు నిన్ను సేవించి; నమస్కరించి;  
   మొదటగా లెక్కింపబడు ఈ దోషమును  నశింపఁ జేయుమని ప్రార్థింతునయ్యా! హృదయములలో 
   స్థిరుఁడవై రక్షించే ఓ వేణు గోపకా! నా మొర వినవా ఏమి?  

క:-కలుషంబులన్, పలుకు ప  -  ల్కుల లోపల పాప మొల్కు, లోకులను గనన్; 
   పలు మారు నే  కొలిచి; యీ   -  తొలి దోషము కూల్చమందుఁ దోయిలిడి హరీ! 5.
   భావము:-
   ఓ హరీ!  కల్మషములతో కూడి; మాటాడే ప్రతీ మాటలోనూ పాపము బైట పడే విధంగా ఉండే   
   లోకులను చూడగనే; అనేక పర్యాయములు నిన్ను సేవించి; నమస్కరించి;  మొదటగా 
   లెక్కింపబడు ఈ దోషమును నసింపఁ జేయుమని ప్రార్థింతునయ్యా! 

గీ:-పలుకు పల్కులలోపల పాప మొల్కు,   -  కలుష కోవిదు లెట్టుల కల్గు చుండ్రి ?
   కొలిచి; యీ తొలి దోషము కూల్చమందు!   -  వినవ! హృద్ స్థిత! రక్షక! వేణు గోప! 5. 
   భావము:-
   మాటాడే ప్రతీ మాటలోనూ పాపములొలికించే  కల్మష పండితులైన ఇట్టివారు ఈ భూమిపై ఏ  
   విధముగా ప్రభవిస్తున్నారా అని భావించి; నిన్ను సేవించి;  మొదటగా లెక్కింపఁబడు
   ఈ దోషమును నసింపఁ జేయుమని ప్రార్థింతునయ్యా!   హృదయములలో  స్థిరుడవై రక్షించే
   ఓ వేణు గోపుడా! నా మొర వినవా ఏమి?
( సశేషం)
జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

2 comments:

మిస్సన్న చెప్పారు...

వృత్త గర్భమందు విలసిల్లు ధీశక్తి
కంద గీతములను పొందు పఱచి
వ్రాయ మీకె నగును వాణీ యుపాసక
రామ కృష్ణ గురు వరా! నమోస్తు!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! మిస్సన్నగారూ!

రాయి బొమ్మ చేసి ప్రాశస్త్యమును గొల్ప
దైవ మనుచు కొలువ తేజ మొంది
కోర్కె తీర్చు పగిది్ గురువుగా నను మీరు
గనగ నదియె నాకు కవిత నేర్పె.

మీ భిమానానికి ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.