గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, జులై 2010, బుధవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 98.

శ్లోll
సతాం ధనం సాధుభిరేవ భుజ్యతే; 
దురాత్మభిర్దుశ్చరితాత్మనాం ధనం 
శుకాదయః చూతఫలాని భుంజతే. 
భవంతి నింబాః ఖలు కాక భోజనాః.
తే.గీll
మంచిగలవారి సంపద మంచి వారి;
చెడ్డ గలవారి సంపద చెడ్డ వారి;
యనుభవంబగు. చిలుకకు నమర ఫలము
కాకికిని నింబ ఫలమును; గలుగు తినగ.
భావము:
మంచి వారి సంపదలు మంచి వారికే అనుభవానికి వస్తాయి. దురాత్ముల ధనములు దుష్ట చరిత్రులకే వినియోగ పడుతాయి. మామిడి పండ్లు చిలుకలకే భుక్తం అవతాయి. వేప పండ్లు కాకులకే భుక్తం అవతాయి. ఇది లోకంలో జరుగుతున్నదే కదా!
మనము మంచి మార్గమున సంపాదించిన సొమ్ము అనుభవించే మన వారు కూడా మంచివారు గానే తీర్చి దిద్దఁ బడుదురు. చెడ్డ మార్గమున సంపాదించిన మన ధనము ననుభవించు మన కుటుంబీకులు చెడ్డగనే దిద్దఁ బడుదురు. కావున ఋజు మార్గముననే సంపాదించాలని మనము మరువ రాదు.
జైహింద్. Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నిజమె మంచి మార్గ ముననే సంపాదించాలి ఏ పనినైన ఋజు మార్గముననే చేయాలి కానీ ఈ రోజుల్లో ఎందరున్నారు ? కాకపోతే మంచిని బోధించటం విజ్ఞుల ఔన్నత్యం.వినడం వినకపోవడం వారి వారి ఖర్మం [ బుద్ధీ ఖర్మాను సారిణీ ]అన్నారు కదా ?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.