ఇదిగో నిల్చిన పాటు నిల్చినటు లిట్లే చేరుకొంటిన్ వియ
త్పదమాలంబముగాగ దైత్య పద విధ్వస్త ప్రదేశంబునే
మొదలన్ సర్వ చరాచరంబు విలువంపున్ మీటునన్ దేల్తున
న్నది కాదంటివి. పోవనిమ్మ యిపుడైనన్ నా సతిన్ జూడగన్.
(వి.రా.క.వృ.కి.కాం.నూ.స. 1-50)
సీతా వియోగంతో దుఃఖితుఁడైన శ్రీరామునిలో అత్యుత్కటమైన క్రోధావేశం పొంగిపోయినది.
లక్ష్మణా! నిలిచిన వాఁడిని నిలిచినట్లుగానే నేను ఆకాశము దాకా ఎగిరిపోయి ఆ రాక్షస దేశాన్ని చూసి సీతను కనుక్కొంటాను. ఇంతకు ముందు నా ధనుస్సు చేత ఈ చరాచర ప్రపంచాన్ని నాశనం చేసి; సీతను తీసుకు వస్తానంటే నీవు వారించావు. ఇప్పుడైనా నన్ను పోనీవయ్యా నా సీతను చూడడానికి.
శ్రీరాముని హృదయం ఆవేశ బంధురమై ఉంది. సీతా వియోగం హృదయాన్ని మండింప జేస్తోంది. బాహ్యావరణ విచ్ఛేదం జరిగినప్పుడు రాముని మనసు అన్య విషయాసక్తమైనను అది క్షణికమే.
సముద్ర గర్భం నుండి గర్జించుచూ పరువులెత్తుకొని వచ్చుచున్న మహోత్తుంగ తరంగముల వంటి సీతా స్మృతి పరంపరలచే సంచలితుఁడైన రాముఁడు తాను ఆకాశ మార్గాన పోయి సీతను కనుగొందునని పలుకును. ఇది వరకు స్వామి ప్రపంచమునే నాశనము చేస్తానన్నాఁడుట. ఎప్పుడు(అరణ్యకాండమున) ? రావణుఁడు సీతను అపహరించుకు పోయిన పిదప పర్ణశాలకు వచ్చిన శ్రీరాముఁడు ఆమెను గానక క్రోధాత్ముఁడై సృష్టినే నశింపఁ జేసెద ననెను.
ఈ సందర్భమున భాస్కర రామాయణమున ఇట్లు వ్రాయఁ బడినది.
అస్మచ్చాప విముక్త బాణముల నుద్యద్భూతలంబంతయున్
భస్మీభూతము జేసి యిందు భగణ ప్రద్యోత నాకాశమున్
విస్మిత్యన్విత బాహు శౌర్యమున నుర్వింగూల్చి కల్పాంతకో
గ్రస్మర్తవ్య మహోగ్రతిన్ సకల లోక ప్రాణులం ద్రుంచెదన్.
(భా.రా. 3 - 332)
ఇట్టి క్రోధ మూర్తియైన శ్రీరాముని గతములో లక్ష్మణుఁడు అనునయించి సాంత్వనపరచినాఁడు. ఆ ఘట్టమును స్మరించి శ్రీరాముఁడు ఇప్పుడు నేను ఆకాశము అంత ఎత్తుకు ఎదిగి సీత ఎక్కడుందో చూస్తాను. నన్ను పోనీ. అనుచున్నాఁడు.
ఇది ఔత్సుక్యము అను సంచారీ భావము. ఔత్సుక్యమనగా సమయాక్షమత్వము. అనగా కాల విడంబము (ఆలస్యము)ను ఓర్వకపోవుట. ఇది విప్రలంభ శృంగార నాయకుని స్థితికి పరాకాష్ఠ.
పద్యము వలన సీతారాముల అద్వైత స్థితి మనకు తెల్లమగుచున్నది. రాముఁడు సీతను చూడ లేకపోయినను ఆయన హృదయమున ఆమె లేని క్షణము లేదు. ఒకే దేహమున పార్వతీ పరమేశ్వరులు. ఒకే హృదయములో సీతారాములు. వీటికి ఎడము లేదు. విరహము లేదు. దూరస్థితి లేదు. ఆస్థితి వచ్చినచో జగత్ప్రళయమే.
ఈ రహస్యమును మొదట తెల్లము జేసినాఁడు హనుమంతుఁడు.
అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్యచాస్యాం ప్రతిష్ఠితం.
తేనేయం సచ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి.
(సుం.కాం. 15 - 52.)
( ఈ సీతమ్మ హృదయమున శ్రీరాముఁడు ఆ శ్రీరాముని హృదయమున సీతమ్మ ప్రతిష్ఠితులై ఉన్నారు. కావుననే ఆ ధర్మాత్ముఁడు జీవించి యున్నాఁడు. )
ఒకే తటాకమున చక్రవాకముల జంట ఉన్నది. రెండూ ఒకే తామరతూడును మెసవినవి. ఒకే తామరాకు గొడుగు క్రింద నిద్రించినవి. రెండూ ఒక పద్మమునందలి మధువునే త్రాగినవి. భిన్న ప్రయత్నములతో పర్యాయముగా కూయుచున్న ఆ చక్రవాక మిధునము యొక్క కూత ఏక కంఠముగానే విన వచ్చుచున్నది. శారీరకముగా ద్వైతమై కనిపించుచున్నను ఆ పక్షి జంట అద్వైతమును వ్యాఖ్యానించు చున్నదని ‘ఘన కవి’ వర్ణించి యున్నాఁడు. విశ్వనాథ తన వర్ణనల యందు ఈ రహస్యమును మరువ లేదు.
ఈ విధముగ విశ్వనాథ తన స్వీయ ప్రతిభతో మూల రామాయణమునకు తన కల్ప వృక్షము అనువాదము కాని విధముగా రామాయణమునకు గల ప్రసిద్ధ వ్యాఖ్యానములకు రామ కథా నాటక కర్తల భావములకు అనువాదముగా తీర్చి దిద్దుచునే స్వంత మార్గములో కల్ప వృక్షమును వెలయించినాఁడు.
సీతా వియోగ స్థితిలో నున్నశ్రీరాముని లక్ష్మణుఁడు తన మధుర ప్రియాలాపములతో ఊరడించి ఆయన మనస్సును శాంతపరచును.
ఈ విధముగా వసంతము ఒక వంక అధిక దుఃఖమును; మరొక వంక ఆత్మానందమును కల్పించు చుండగా ఆ శ్రీరామ చంద్రుఁడు పొందిన భావ సంఘర్షణను విశ్వనాథ అనితర సాధ్యమైన భావుకతతో కవితా సృష్టి కావించి యున్నాఁడు.
ఇతి శమ్.
ఓ శ్రీరామచంద్రా!
నీ దయ లేక యేరికిని నిన్ గ్రహియించుట శక్యమౌనె? నీ
పాద సరోరుహ ద్వయము భావన సేయుట శక్యమౌనె? నీ
మేదుర కార్యముల్ మదికి మేలనిపించుట శక్యమౌనె? నా
పై దయ చూపినావొ? ప్రభువా! హృదయమ్మున కల్పవృక్షమై.
జై శ్రీరాం.
ఇంతటితో "ఏబది భాగములు గా నే చెప్పఁ బూనిన ‘శ్రీమద్రామాయణ కల్ప వృక్షము నందలి’ విశ్వనాథ భావుకత" నేటికి సంపూర్ణమైనదని తెలుపుటకు ఆనందిస్తున్నాను.
ఇట్లు
సుహృద్విధేయుఁడు;
బులుసు వేంకటేశ్వర్లు.(సెల్. 9949175899.)
కల్పవృక్షం.
ESIహాస్పటల్ దగ్గర.
చిట్టివలస.
విశాఖపట్టణం జిల్లా.
పిన్. 531162.
హిందూదేశము.
ఆంధ్రామృతాస్వాదనా లోలులారా!
కల్పవృక్షము క్రింద సేద తీరిన కవి వతంసుల కమనీయమగు కంఠధ్వనిగా వెలువడిన విశ్వనాథ భావుకత ఏబది భాగములు రసజ్ఞులగు పాఠక పుంగవుల కందించేలా ఆ శ్రీరామ చంద్రుఁడు నాచే చేయించి తన భక్తులపై తాను చూపించే అవ్యాజానురాగాన్ని రుజువు చేసుకొన్నాఁడు. అట్టి శ్రీరాములవారికి సీతమ్మకు పాదాభివందనం చేస్తున్నాను.
సాహితీ ప్రియులారా!
ఈ ఏబది భాగములూ పరి పూర్ణముగా చదివి మీ అమూల్యమైన వ్యాఖ్యానమును మీరు మీ ఆంధ్రామృతమునకందించినట్లైతే అవి కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లుగారు ముద్రించబోవుచున్న పుస్తకమునందు మీరు చూపిన ఆదరణపై గల గౌరవభావంతో మీ వ్యాఖ్యాన రూపంలో ఉండు వ్యాసాల్ని ప్రచురింపనున్నారు.
కావున అత్యంత శ్రద్ధ చూపి మీరు మీమీ వ్యాఖ్యానాలు వ్రాసి పంప గలందులకు మనసారా కోరుచున్నాను.
ఎంతో శ్రమించి ఎంతో ఉత్సాహంతో నిరంతరాయంగా ఏబదిభాగములుగా ఉపన్యాసాలిచ్చిన ప్రియ సాహితీ మిత్రులగు కవి వతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారికి ఆంధ్రామృతం తరపున అభినందనలతో పాటు హృదయ పూర్వక కృతజ్ఞతలను కూడా తెలియఁజేసుకొంటున్నాను.
ఆదరించిన పాఠక లోకానికి కూడా కృతజ్ఞతలు తెలియఁ జేసుకొంటున్నాను.
జైహింద్.