గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఫిబ్రవరి 2010, సోమవారం

ఆంధ్ర పద్య రూప పురుష సూక్తము.

ఓం నమో నారాయణాయ.
పురుష సూక్తము 
సీ:-
వేయి తలలు గల్గి వేయి కన్నులు గల్గి,
వేయి పాదములను వెలయుఁవాడు.
అట్టి పురుషుఁ డతం డవని నంతట నిండి,
పది యంగుళ శరీర పరిధి నమరె.
జరిగి పోయినదియు, జరుగఁబోవు నదియు,
జరుగుచున్నయదియు చక్క నతఁడె.
దేవత్వప్రభువుఁ డీదివ్యు డన్నము చేత
మీరి పొందుచు నుండె మేల్తరముగ.
గీ:-
ఇట్టి దంతయు నీతని దిట్ట తనము.
పట్టి చూడగ పరమాత్మ గట్టి వాఁడు
దీని కన్నను వే రెట్లు దిట్ట యతఁడు.
పురుష సూక్తము తెలుపు నీ బోధఁ గనుఁడు. 1.

సీ:-
జీవులు పరమాత్మ పావు భాగము కాగ
ముప్పావు భాగమా పూర్ణుఁ డలరు.
ముప్పాతికగ నున్న పూర్ణుఁడా పరమాత్మ
ఊర్ధ్వము నుత్కర్ష నుండె జగతి.
మరల పాతిక విష్ణు మాయ గాగ, పిదప.
దేవ తిర్యగ్రూప భావ మొంది,
ప్రీతిని చేతనాచేతనంబులు గొల్పి,
మించుచు తానె వ్యాపించె నతఁడు. 
గీ:-
పుట్టె బ్రహ్మాండ దేహ మా దిట్ట నుండి.
పురుషుఁ డుదయించె హరిదేహమునకు పైన
నట విరాట్ పురుషుఁ డధికుఁ డగుచు మించి
భూమి సృష్టించె, దేహ జీవులను జేసె. 2.

సీ:-ఎప్పుడు పురుషుఁడ నెన్ని హవిస్సుచే
యుచు యజ్ఞములను జేయును దివిజులు,
అప్పుడట వసంతుఁ డగు నాజ్యముగ.
గ్రీష్మ మగు నిధ్మముగ, శరత్తగు హవిస్సు.              
ఏడు ఛందములగు నెల్లలుగ, నవియు
నిరువది యొక్కటై నిరుపమగతిఁ
జేయఁబడె సమిధలై యలరునటుల.
సంకల్ప యజ్ఞముఁ సలుపఁ దివిజు
గీ:-
లా విరాట్టుఁ బశువుగాఁగ యతనిఁ గట్టి,
సృష్టి కిని పూర్వుఁడగు వాని, సేవ్యమాన
యజ్ఞ సాధకు నాతని యజ్ఞ మందు
ప్రోక్షణము చేసిరా దివిజు లాక్షణమున. 3.

సీ:-
అట్టి పశువుతోడ నాదేవతల్ ఋషుల్
సాధ్యులు యజ్ఞము సలిపినారు.
సర్వాత్ముఁడతనిచే నిర్వహింపఁబడిన 
హోమ యజ్ఞము నుండి యొదవె నపుడు
పృష దను ఘృతము సమృద్ధిగా.వాయు సం
బంధ పసులు గ్రామ మందు నుండు
నట్టివి చేసె, నా యజ్ఞము నుండియే
సర్వహుతములును, చక్కగ మన
గీ:-
మందఁ, గాయత్రి మొదలగు ఛందములును 
పుట్టినవి. మహిమం బట నుట్టి పడగ.
నట యజుర్వేదమును బుట్టె నద్భుతముగ.
యజ్ఞమది యౌను మానస యజ్ఞమదియె. 4.

సీ:-
ఆ యాగ ఫలముచే నమరె గుఱ్ఱములును,
దంతంబులున్నట్టి జంతువులును,
ఆ యాగ ఫలముచే నావులు కలిగెను,
మేకలు, గొఱ్ఱెలుఁ మేల్తరముగ.
ఎప్పుడు  దేవత లీవిరాట్ రూపమ్ము
సంకల్పమును జేసి చక్కఁగొలిపె,
నప్పుడే కల్పించె నన్ని ప్రకారముల్
విషయము లెలమిని విదితముగను.
గీ:-
ఈ విరాట్టుకుముఖమును, ఇరు భుజములు,
రెండు తొడలును పాదముల్ రెండు. చెప్పఁ
బడెను. ముఖమయె చక్కన బ్రాహ్మణుండు.
క్షత్రియు డయె భుజములుగ. సత్ర మహిమ. 5.

సీ:- 
విష్ణు తొడల నుండి వెలువడె వైశ్యుండు  
పాదాల శూద్రుఁడు ప్రభవమందె. 
మనసువలన చందమామ జననమందె. 
కండ్లలో నుండి భాస్కరుఁడు బుట్టె.
నీశు ముఖము నుండి యింద్రుండు, నగ్నియు
ప్రాణమునను గాలి ప్రబలె పుట్టి.
నాభి నుండి కలిగె నభమద్భుతమ్ముగ
శిరము వలన కల్గె శ్రీ ద్యుజగతి.
ఆ:-
పాదములను బుట్టె భవ్యమౌ భూదేవి.
దెసలు చెవుల నుండి వెసను బుట్టె.
అటులఁ బుట్టఁ జేసె నన్ని లోకంబులు
నావిరాట్టు మూల మన్నిటికిని. 6.

సీ:-
ఏ విరాట్టు కొలిపి యింపునన్నింటిని,
పేళ్ళు పెట్టి యతఁడె పేర్మి నిలిచె
నా విరాట్టుఁ గనఁగ నన్నింట నధికుఁడు
భాను తేజుఁ డనెడి భావ మొదవె.
ఆ విరాట్టు నిలిచె నజ్ఞానమున కటు
యసమాన తేజుఁడై  యసదృశముగ.
ఏ విరాట్టును జెప్పె నెఱుగఁ ప్రజాపతి
ఇంద్రుండు నల్దిక్కు లెఱుక పరచె.
గీ:-
ఎఱుఁగు వాఁడది ముక్తుఁడు. ఇతర మేల?
దేవతలు మానసిక యజ్ఞ దీప్తిఁ గాంచె. 7.
సాధ్య గంధర్వు లేదివిన్ సౌఖ్య మొందు,
ఆ దివి నిటనే పొందుదు రట్టి వారు. 8.

సీ:-
ఆదినారయణుం డంబువుననుఁ బుట్టె
పృథివి రసములను పేర్మిఁ బుట్టె.
అతని వలన గల్గె నాధిక్యమది చూడ. 
ఆ విరాట్కర్తయె అందె దాని.
ఆవిరాట్ సంబంధ యా ప్రసిద్ధ జగత్తు 
సృష్టికాదినె పుట్టె స్పష్టముగను.
ఆ విరాట్టధికుగా యా వెల్గు సూర్యుగా 
తలతు నతని నేను తనివి తీర.
గీ:-
ఆతఁ డజ్ఞాన మవతల నరయ నుండు.
అతనినెఱిఁగిన మృతి లేని యతఁడు ఇతఁడు.
అన్య మార్గము ముక్తికి నరయ లేదు.
లోననుండు ప్రజాపతి జ్ఞాని యరయ.
పుట్టుకయెలేని వాఁడును పుట్టు మిగుల. 9.

సీ:-
జ్ఞానుల్ ప్రజాపతి సద్రూపమెఱుఁగుదు 
ర్బ్రాహ్మల్మరీచాది పదవు లడుగు.
ఎవఁడుదేవతలకై యినుని ప్రకాశుఁడౌన్ 
దేవ హితముఁజేయు దేవుఁడెవఁడొ
దేవతలకు మున్నె దీపించెనెవ్వఁడో 
యట్టి ప్రకాశున కంజలింతు.
దేవతలెల్లరు  దివ్య తత్వమరయ 
సృష్ట్యాదినె పలికె సృష్టి ప్రభుని.
స్వామి ! యే బ్రాహ్మఁడీ సకలమ్ము నెఱుఁగును,
దివ్యు నాతనిఁ జేరు దేవతలును.
హ్రీయు, శ్రీయును, భార్య లై యలర్చును నిన్ను,
రాత్రియు పవలు పార్శ్వములు నీకు.
గీ:-
తార లెల్లను నీదు శరీరమయ్య!
అశ్వినుల కనుచు వికసితా! విరాట్టు!
ఇమ్ము కోరిన దానిని. ఇమ్ము బోధ!.
ఐహికాముష్మికములెల్ల యరసి యిమ్ము. 10.
పురుష సూక్తము ముగిసెను.
ఓం తత్సత్. 
జైహింద్.

Print this post

3 comments:

Unknown చెప్పారు...

చాలా బాగుందండి ఈ పోస్టు.
ధారణ చేసి రోజూ పూజా సమయంలో చదవడానికి అనువుగా ఉన్నాయి మీ పద్యాలు. అభినందనలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
" జీవులు పరమాత్మ పావు భాగము కాగ "
2 యాగఫలముచే గుఱ్ఱములు జంతువులు
3.విష్ణు తొడలనుండి వైశ్యుండు . పాదాలనుండి సూద్రుడు పుట్టె " అంటూ అలతి అలతి పదాలతొ అందరికీ అర్ధమయ్యే రీతిగా చదవుకోడానికి సులువుగా ఉన్నాయి. ఒక్కొక్క పద్యం ఒక్కొక్క ఆణిముత్యం .
" ఐహికాముష్మికము లెల్ల యరసి ఇమ్ము " అంటూ " సీసంలొ " ఒలికించి పలికించారు.ధన్య వాదములు.

అజ్ఞాత చెప్పారు...

రామక్రిష్ణారావ్ గార్కి నమస్సులతో...
భారతమును తెనిగించిన తిక్కన గారు సంస్కౄతంలొని భగవద్గీత ను తెనిగించారో లేదో నాకు తెలియదు...మీతొ తెనిగించబడిన ఈ పురుష సూక్తం అమౄతతుల్యము ..తెనిగించిన మీరు ధన్యులు...చదివిన మేము ధన్యులము..మీతొ ఆ భగవంతుడె పలికించి నట్లు గా వున్నది..ఆ పరమాత్మ మీకు సదా శుభములను కలిగించవలెనని అభిలషిస్తూ...శ్రీనివాస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.