గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఫిబ్రవరి 2010, శుక్రవారం

సరస వాఙ్మృదు రూపిణి! శారదాంబ! ( కంద - గీత - గర్భ చంపక మాల )



http://meerasubbarao.files.wordpress.com/2008/09/sarasvati.jpg





ll नमः सरस्वत्यै दॆव्यै ll



ఆంధ్ర సాహితీ ప్రియులారా! ఆ శారదాంబ మన ఆంధ్ర భాషార్ణవ రూపంలో విశ్వ సాహితీ వేత్తల కెంతటి సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తోందో అన్న విషయం ఊహించుకుంటేనే మనకు ఒళ్ళు గగుర్పొడుస్తుంది కదూ! అద్భుతమైన వైవిధ్యంతో రచనా వైదుష్యాన్నిప్రకటించిన పింగళి సూరనాది మహాకవులు మన ఆంధ్ర భాషామ తల్లి కీర్తి పతాకను సాహితీ విను వీధిలో ఎగురవేసారు. మనం ఎంత చదివినా ఎంత నేర్చుకొన్నా అది ఏ మాత్రమూ కాదనే విషయం ఆంధ్ర భాషార్ణవంలో ఓలలాడే సాహితీ వేత్తలకు  వివరింపఁ బని లేదు. ఆ శారదాంబ అపార కరుణామృత వర్షమే ఆ మహా కవుల పేళ్ళూ, వారి కావ్యాలు, అజరామరంగా సాహితీ జగత్తులో నిలిచాయి.
అట్టి శారదా మాత కృపంజేసి ఆ యమ కలంకరింప " కంద - గీత - గర్భ చంపక మాల " ను సిద్ధం చేసాని.
అలంకరిద్దామా!
కంద - గీత - గర్భ ll
వర `మృదులోక్తిలో సరస వాఙ్మృదు రూపిణి! శారదాంబ! శ్రీ
వర మదిగా'! 
సుధా మధుర భాషఁ దెలుంగున మమ్ముఁ బ్రోచి, సా
దర `మది లో కృపన్ సతము దాల్చెదవీవటఁ జక్కనమ్మ! శ్రీ
కర మృదులా' 
క్షరాశుభము గాంచెదమే! నువు చూడఁ దానిచే 

బేగ్రౌండ్ కలర్ ఉన్నపాదాలు తేట గీతి.
నీలి అక్షరాలు మినహాయిస్తే ఒకటి, మూడు పాదాలు పూర్తిగా, రెండు నాలుగు పాదాలలో మొదటి ఐదక్షరాలు, కందపద్యం గా గుర్తింప మనవి.
చూచారు కదా! తప్పులున్న మన్నించి, సూచించ మనవి.
జైహింద్. Print this post

3 comments:

Sandeep P చెప్పారు...

మహాద్భుతం నవకవికులతిలక మీ ప్రయోగం!అమ్మ మీద ఎన్ని పద్యాలు వ్రాసినా ఇంకా వ్రాయాలనిపిస్తుంది.

గీతపద్యాన్ని గుర్తించడం సులభంగా ఉంది. కందపద్యాన్ని ఎందుకో నేను గుర్తించలేకున్నాను. దానిని మీరు వివరించగలరు!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ప్రియ సాహితీ బాంధవా! సందీప్! ఆ శారదాంబ కరుణ మనను మన కలాన్ని నడిపిస్తుంది. మనమైతే ఏమీ కాదు. మనదంటూ ఏదీ లేదు.
ఇక కందం విడదీసి వ్రాసాను. పరిశీలించి, సూచనలేమైనా చేయ దలచుకుంటే చేయగలరు.
కంద - గీత - గర్భ చll
వర `మృదులోక్తిలో సరస వాఙ్మృదు రూపిణి! శారదాంబ! శ్రీ
వర మదిగా'! సుధా మధుర భాషఁ దెలుంగున మమ్ముఁ బ్రోచి, సా
దర `మది లో కృపన్ సతము దాల్చెదవీవటఁ జక్కనమ్మ! శ్రీ
కర మృదులా' క్షరా! శుభము గాంచెదమే! నువు చూడఁ దానిచే .
కంll
మృదులోక్తిలో సరస వా
ఙ్మృదు రూపిణి! శారదాంబ! శ్రీవర మదిగా'!
మది లో కృపన్ సతము దా
ల్చెదవీవటఁ జక్కనమ్మ! శ్రీకర మృదులా' !

మీ సాహితీ ప్రియత్వానికి అభినందనలు. అభిమానానికి కృతజ్ఞతలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

తిమిర కంటక ! దివ్యుఁడ! (సం)దీప మిత్ర మా!

ఈ క్రింది చంపక మాలలో ఒక కందము, ఒక తేట గీతి పద్యము, ఉన్నాయి.
గమనించఁగలరు.

చll
నవ `కవి వంశ మున్ తిలకు నౌదు వదాన్యుల దీవనాళి తో
లి, వరమవన్!' సుధా మధుర లీలగ వ్రాయను మంచిఁ జేయ. లా
ఘవ, `సువిధానమై, కృతిని గౌరవ మొప్పగ నెంచి చేతు, రా
ఘవు దయ తో'డుగాన్. తిమిర కంటక ! దివ్యుఁడ! దీప మిత్ర మా!

కll
కవి వంశ మున్ తిలకు నౌ
దు వదాన్యుల దీవనాళి తో లి, వరమవన్!
సువిధానమై, కృతిని గౌ
రవ మొప్పగ నెంచి చేతు, రాఘవు దయ తో.

తేll
తిలకు నౌదు వదాన్యుల దీవనాళి
మధుర లీలగ వ్రాయను మంచిఁ జేయ.
కృతిని గౌరవ మొప్పగ నెంచి చేతు,
తిమిర కంటక ! దివ్యుఁడ! దీప మిత్ర

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.