పాల సముద్రం వంటి తమ విజ్ఞాన సాగరాన్ని మథించి, అందుండి యుద్భవించిన జ్ఞానామృతాన్ని లోకాని కందించిన తెలుగు కవులు లెక్కకు మించి వున్నారు. మన దురదృష్ట వశాత్తు వారందించిన జ్ఞానామృతాన్ని మనం ఆస్వాదించ లేకపోతున్నాము.మనలో విషయ పరిజ్ఞాన లోపమే యిందుకు కారణం.మన పాఠ్య ప్రణాళికలలో భాషా పరిజ్ఞానాన్ని కలిగించే అంశాలపై తగిన శ్రద్ధ తీసుకోకపోవడమే మన యీ దుస్థితికి మూల కారణం.
కారణం యేదైనా మనకు కలిగిన నష్టాన్ని మనం పూడ్చుకోడానికి లోకంలో పెక్కు మార్గాలున్నాయి. కవి పండిత శిఖామణులనేకమందున్నారు. ఈ నాటి వారి పరిశోధనాత్మక వ్యాసాలనూ, వారి ఉపన్యాసాలనూ, వారి రచనలనూ, మనం లక్ష్యంతో గ్రహించే ప్రయత్నం చేయగలిగితే ఆ లోపం మనకు దూరమౌతుంది.
నాకు లభించిన మహనీయుల సాహితీ కృషి ఆంధ్ర పాఠక లోకానికందిచే యీ నా ప్రయత్నం ఆంధ్రామృతాన్నాసక్తితో గ్రోలదలచుకొన్నవారందరికీ ఆనందప్రదం కాగలదని ఆశిస్తున్నాను. ఈ పరంపరలో భాగంగా కవి సామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారి " రామాయణ కల్ప వృక్షం" కావ్యంలోగల {కావ్యాత్మని}ధ్వనిని " కవి వతంస" బిరుదాంకితులయిన శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గావించిన ఉపన్యాస సారాన్ని మీకందించే ప్రయత్నం చేయడానికి సాహసిస్తున్నాను. సహృదయంతో గ్రహింతురు గాక.
కవి సామ్రాట్ విశ్వనాథ భావుకత.:-
కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి " రామాయణ కల్ప వృక్షం"లో కిష్కింధా కాండలోని కొన్ని పద్యాలలో గల ధ్వనిని పరిశీలిద్దాం. శ్రీ రాముడు సీత జాడ తెలుసుకో దలచి లక్ష్మణ సమేతుడై పంపా సరోవర పరిసర అరణ్యంలోకి ప్రవేశిస్తాడు.అక్కడి దృశ్యాలను కవివర్ణిస్తూ యిలాగంటాడు.
శా:-ఆకుల్ పూవులు, తప్త కుంభ శిఖర వ్యాకీర్ణముల్గా దృశాం
తాకుల్యాకృతి దైన్య ధైర్య రమణీయంబై విడంబింపగా
ఆకూతిన్ జనెడున్ ప్రియా విరహితా మత్తానేకపంబొండు. పం
పా కేళీ వన మంద్ర ఘీంకృతి రవ వ్యాహార సాహస్రియై.
ఈ పద్యంలో కవి ప్రియురాలి విరహాన్ని పొందిన మదగజం పంపా నదీ తీరాన విహరించడం వర్ణిస్తాడు.చూడండెలా వర్ణించాడో.
"పంపా సరోవర అరణ్య ప్రాంతంలో ఓక ప్రియురాలి విరహాన్ని పొందిన మదగజం విహరిస్తోంది. దాని కుంభ స్థలంపై ఆకులూ పూవులూ పడివున్నాయి. అది క్రీగంటి చూపులతో దైన్య, ధైర్య, రమణీయంగా వుంది.పైగా మంద్ర స్వరంలో తనలో తాను ఏదో గొణుగుకుంటున్నట్లు ధ్వని చేస్తూ ముందుకు పోతున్నది."
ఇదీ యీ పద్య భావం.
సాధారణంగా మన సాహిత్యంలో ఋతు వర్ణనలు కథాగతికి తోడ్పడే విధంగా కాకుండా ప్రకృతి వర్ణనలతో నాయికా నాయకుల విరహాన్ని ఉద్దీపింప జేసే విధంగా వుంటాయి. సంస్కృత కావ్యాలలోనయితే నాందీ ప్రస్థావనాదులలో భావి కథా సూచిగా ఆ కవులు వ్రశారు.
ఇక్కడ మనం విశ్వనాధ వారి ధ్వని ప్రయోగ వైశిష్యాన్ని పరిశీలిద్దాం.
శ్రీ రామునికి సీత దూరమయింది.ఆమె కొరకు వెదుకుతున్నాడు.ప్రియా విరహంతో దందహ్యమాన హృదయుడై యున్నాడతడు. కవి ప్రియావిరహితుడైన గజరాజును వర్ణిస్తున్నాడా! లేక రాముని వర్ణిస్తున్నాడా! గమనిస్తే శ్రీరాముని పరిస్థితికి అనుకూలమైన విధంగా ప్రకృతి వర్ణన జోడించిచేసినాడనడమే సముచితం. ఏలనంటారా!
శ్రీరాముని తలపై అంటుకొన్న ఆకులూ పూలూ ఒక దారీ తెన్నూ లేకుండా అతడు తిరగడం తెలియజేస్తోంది. భార్య దొంగిలింపబడడంతో అవమాన మగ్నుడైన అతనికి క్రీగంటి చూపులే మిగిలాయి." ఆకూతి " అంటే మనసులోనే ఏదో అభిప్రాయం పెట్టుకొని వుండడం. ప్రస్థుతం రాముని స్థితి అదేకదా! అటు మద గజానికైన, ఇటు రామునికైనా దైన్య, ధైర్య, రమణీయ మైన స్థితే గదా! సీతను కోల్పోయిన దీనత్వము, సహజ ముగానున్న ధైర్యత్వము, ఈ రెండు భావాలూ సమ్మిళితమై అందగిస్తున్నాడు రాముడు. మంద్ర స్వరంలో ఏదో గొణుగుకోవడం తన దురవస్థని తలచుకొవడమో, ఆత్మ నిందో, లేక గీత దటినసీతను నిందించడమో,ఆవిషయంలో పాఠకుల భావనా పటిమకే తోచేలా వ్రాశాడీకవి.
సారాంశమేమిటంటే .....ప్రకృతి వర్ణనలో ప్రస్తుతము శ్రీరాముని ప్రకృతి ధ్వనించే విధంగా వ్రాసిన విశ్వనాధ హృదయాన్ని గ్రహించ గలగడం పాఠకుని జ్ఞాన పటిమకొద్దీ వుంటుంది. ఇలాంటివి ఈ సందర్భంలో నలభై దాక పద్యాలున్నాయి మరో పర్యాయం మరో పద్యం తెలుసుకుందాం.