ఓం శ్రీమాత్రే నమః.
సీతారామాన్వయముగా ఇరువది పద్యములు.
౧.
అంబురుహము. భ..భ..భ..భ..ర..స..వ. యతి.౧౩వ అక్షరము.
శ్రీరఘు రాముని, చిన్మయ
తేజుని, సీత భార్యగ చేరెగా,
దారుణమైన విధంబుగ వర్తిలు ధర్మబాహ్యులఁ బాపగా,
శ్రీరఘు వంశప్రశస్తిని పెంచగ, చిద్విభాసులఁ
గావగా,
ధారుణిపై వర ధర్మ
సురక్షయు తత్వబోధయు చేయగా.
౨.
మోహప్రలాప. భ .. భ .. త .. ర .. గ….యతి..౫వ అక్షరము.
సీతను చూచిన శ్రీరామచంద్రుఁ డౌరా,
ఖ్యాతిగ నిత్యము నామెను చూడనెంచెన్,
సీత పునీత శుభాలంకృతిన్ రహించెన్
నీతియు క్షోణిని నిత్యంబు తేజరిల్లెన్.
౩.
కౌముది….న..త..త..గ…..యతి ౬వ అక్షరము.
సహజ సంభాస సద్గాత్రులున్
మహిత సంక్షేమ సచ్ఛీలురున్,,
యహరహంబున్ శుభానీక స
త్స్పృహను కల్గించి పాలింతురే.
౪.
నందిని...భ..త..జ..గ….యతి ౬వ అక్షరము.
భూమిజ భావంబు మదిన్ గనెన్
రాముఁడు భూభారము పాపగా
కాముకుఁడౌ మూర్ఖజ రావణున్
ధీమతి విఖ్యాతిగ చంపెనే.
౫.
మేఘవిలసితము….మ న న స…. యతి ౬వ అక్షరము౭.
ధర్మంబున్ గనెదమితని మదిలో
మర్మంబే కనుమరుగితనినుతిన్,
కర్మంబుల్ విడఁగలుగుదుమితనిచే
ధర్మాత్ముండు బుధవరుడితఁడెగా.
౬.
పణవము…. మ న య గ ….. యతి.. ౬వ అక్షరము.
రామాయన్న కరమునందించున్,
ప్రేమన్ గాచు వినయముంజూపన్,
క్షేమంబిచ్చు జితమతిన్ గొల్వన్
ధీమాన్యున్ జగతినుతింత్రౌరా.
౭.
భ్రమర విలసితము.
మ భ న వ.
యతి ౬వ అక్షరము.
రక్షోరాజ్యంబు వ్రయమయెనుగా,
శిక్షల్బెక్కుల్ నుసియొనరిచెగా
రక్షోవంశోద్ధరగణమణగెన్
దక్షుండారామధరణిపతియే.
౮.
శుద్ధవిరాటి … మ
స జ గ.
యతి..౬వ అక్షరము.
శ్రీమన్మంగళ చిత్తమే సదా
రామాలంకృత రామునెన్నెడున్,
క్షేమంబున్ గన జేయు
రాముఁడే,
నీమంబొప్పగణించుమునీశులన్.
౯.
మణిరంగము…
ర స స గ…..
యతి… ౬వ అక్షరము.
ప్రేమతోగను విశ్వ విధాతన్
రామునెన్నెడి రాక్షసులైనన్
భూమిపైన ప్రపూజ్యులె యెన్నన్,
ధీమతాళికితేజమితండే.
౧౦.
మత్త హంసిని….. జ
త స జ గ.
యతి..౭వ అక్షరము.
పునీతమౌనే రిపుగణంబు ధాత్రిపై,
మునీశులట్లీ విభుని గొల్చుచుండినన్
మునీశుడౌ రామకథవిన్నఁ జెప్పినన్
పునీతమౌనీ వపువు, ముక్తి
కల్గెడున్.
౧౧.
శిఖండి విరుతము.(స్త్రీ)
జ స త త గ….
యతి ౭వ అక్షరము.
జయంతుఁడునుతోచండీతనిన్ బోలగా
నయోద్ధతిని గానంజాలరన్యుల్ ధరన్,
భయావహుఁడు దుర్భాగ్యాఢ్యదౌష్ట్యాళికిన్,
శ్రేయస్కరుఁడు ప్రాశస్ర్త్యంబునన్ నిల్చుచో.
౧౨.
మణిమాల.
త య త య.
యతి ౭వ అక్షరము.
ధీరాత్ముఁడుదేవాధీశుండు తలంపన్
శ్రీరాముఁడు రాకాశిధ్వంశుడు ధాత్రిన్,
ప్రేరేపణగొల్పున్, విజ్ఞానము గొల్పున్,
క్షీరాబ్ధిసుతన్భాసిల్లన్ దగఁ జేసెన్.
౧౩.
సుముఖి.
న జ జ ల గ.
యతి ౭వ అక్షరము.
రఘుపతి సుస్థిర శోభనిడున్,
రఘుపతి సుందర భావమిడున్,
రఘుపతి రమ్యరసాప్తినిడున్,
రఘుపతి బంధుర భావమిడున్.
౧౪.
భద్రకము.
న న ర వ.
….యతి…౭వ అక్షరము.
జయకరుఁడుప్రజాపతీశుఁడే,
నయవినయగుణంబులిచ్చెడున్.
భయమును విడువన్ గ జేసెడున్,
ప్రియము కలిగి వేల్పుగా కనున్.
౧౫.
ద్రుతవిలంబితము. న భ భ ర. యతి…౭వ అక్షరము.
మహిత భావన మార్గ రాముఁడే,
సహిత వాగ్హరి సంపద రాముఁడే.
నిహితముంగల నెచ్చెలి రాముఁడే,
సహనసుందర సత్ కృప రాముఁడే.
౧౬.
కుసుమవిచిత్ర. న య న య …. యతి ౭వ అక్షరము.
ప్రగణిత రామా!
భవ హర రామా!
జగదభిరామా జయ గుణ
ధామా!
సుగుణ శుభాబ్ధీ! సురనుత
రామా,!
నిగమసువేద్యా నిరుపమ రామా!
౧౭.
మనోరమ.
న ర జ గ. … యతి ౭వ అక్షరము.
దురభిమానులన్ దురాత్ములన్,
శరణు గోరినన్ క్షమింతువే,
నిరుపమానుఁడా! నిరాశ్రితుల్
దరిని నిల్చినన్ తరింతురే.
౧౮.
వృత్త.
న స త త గ. యతి
.. ౭వ
అక్షరము.
జనకజ సుతన్ సత్కల్పనా ధీమతిన్,
గుణగణ సతిన్, కూర్మిన్
సుధావర్షిణిన్,
ప్రణవ కలితన్రామాభిరామాన్వితన్,
క్షణమున ననున్ గావంగనే వేడెదన్.
౧౯.
మౌక్తికమాల. భ త న గ గ యతి
.. ౭వ
అక్షరము.
జీవము నీవేను శ్రిత సుధాబ్ధీ!
భావము నీవేను, ప్రణవ
రామా!
కావుము మమ్మీవు, కరుణతోడన్,
నీవన నేనేను నిరుపమాక్షా!
౨౦.
హరిహర.
భ జ న త. యతి
.. ౭వ
అక్షరము.
రామునిగ కావర,
పరమాత్ముండ!
శ్రీమహిత సీత,
చెలగ నిద్ధాత్రి,
ప్రేమను మమున్విహితపు ధర్మంబు
క్షేమమును గొల్ప క్షితిని కాపాడు.
భారతాన్వయముగా ఇరువది పద్యములు.
౨౧.
మందర.
భ భ న న గ యతి
.. ౭వ
అక్షరము.
శ్రీ నిధి భారత శ్రితజన గృహమున్
జ్ఞానులనేకులు కలిగిన ధరణిన్,
మౌనులనేకులు మను శుభ పృథివిన్
నేనిటఁ గొల్చెద నిరుపమ మతితోన్.
౨౨.
కోకనదం.
భ భ భ స…..
యతి ౭వ అక్షరము.
శ్రీకర భారత చిన్మయ ధరణిన్
ప్రాకటమొప్పగ భారత సమరం
బాకలిప్రేరణనప్పుడు జరిగెన్,
మీకది తెల్పెద మేలుగ వినుడీ.
౨౩.
మౌక్తికమాల. భ త న గ గ …… యతి ౭వ అక్షరము.
ప్రాకటమై పృథ్విఁ బరఁగ గీతన్
శ్రీకర కృష్ణుండు చెలఁగి చెప్పెన్,,
భీకర పోరాట విధియె సాగెన్,
లోకపు ధర్మంబులు నిలుపంగన్.
౨౪. పంక్తి. భ భ భ గ. యతి…..౭వ అక్షరము.
కౌరవ పాండవ గణ్యు లటన్
బోరిరి రాజ్యము పొందుటకై,
దారుణమైనమదాంధతతో
కౌరవపక్షము కల్సె భువిన్.
౨౫.
తోవకము. లేక పాదపము.
భ భ భ గ గ. …యతి….౭వ అక్షరము.
ధర్మము కావగ ధాత్రిని కృష్ణుం
డర్మిలి భారత మందున వెల్గెన్,
కర్మలు చేయుట గౌరవమంచున్
గూర్మిని బోధన గొప్పఁగ చేసెన్.
౨౬. చంపకమాలిక. భ మ స గ. యతి
…౭వ
అక్షరము.
భారత యుద్ధం బా పరమాత్మన్
జేరుచు గీతోక్తిన్ చెవి సోకింపన్,
సారస భావాళిన్, సత్యము
నెన్నన్,
ప్రేరణ గల్గింపన్, విని
చూడన్
౨౭.
భోగ విలసితము.
భ స జ గ. యతి….౭వ అక్షరము.
కౌరవులిలపై ఘనంబుగా
శూరులటుల నీచులై భువిన్,
కోరిచెడుగులై కులాంతకుల్
పోరుపథములోమునింగిరే
౨౮.
శాలిని.
మ త త గ గ. య్తి
౭వ అక్షరము...
హానిన్ తా కొల్పంగ
యా ధార్త రాష్ట్రుల్
దీన స్త్రీయౌ ద్రౌపదీవస్త్ర మూడ్చన్,
మౌనంబూనెన్ రాజు మాటాడకుండన్
హీనంబై వంశం బహీనార్తి నింపెన్.,
౨౯.
వాతోర్మి.
మ భ త వ. యతి….౭వ అక్షరము.
ధర్మోద్ధారుల్ వసుధన్ పాండవులే
ధర్మగ్లానిన్ గని దానిన్ నిలుపన్
ధర్మాత్ముండాహరి తా చెప్పె వినన్
మర్మాత్ముల్ గాంచక మాయన్ మడియన్.,
౩౦.
మత్త.. (హంసశ్రేణి.)
మ భ స గ … యతి ౭వ
అక్షరము.
ధర్మాధర్మంబుల తలచంగా
కూర్మిన్ గృష్ణుండె ద్విగుణ రీతిన్
మర్మంబున్ జూపెను, మహనీయుల్
ధర్మార్తిన్ మెల్గిరి, ధరపైనన్.
౩౧.
చంచరీకావళి. మ మ ర ర గ. యతి
౭వ అక్షరము.
దుష్టుల్ ధ్వంసంబైరే, దుర్మదాంధంబు
వాసెన్,
శిష్టుల్ ధర్మోద్ధారుల్,
శీఘ్రమే
మేలు కల్గున్,
స్పష్టంబయ్యెన్ ధాత్రిన్ సాధు సుజ్ఞానులెన్నన్
క్లిష్టంబౌవేళన్ శ్రీకృష్ణుఁడే కాచునంచున్.
౩౨.
మయూరసారి
(భాషిణి.) ర జ ర గ. యతి
౭వ అక్షరము.
పాండవుల్ ధరిత్రిపై స్వధర్మం
బండయంచు నిల్చిరావిధంబే
కొండనైన వారు కూల్చిరట్లే,
యండనుండి కృష్ణు డార్తి గావన్.
౩౩.
శ్యేని.
ర జ ర వ. యతి
౭వ అక్షరము.
ధర్మమే నిజంబధర్మమేలనో,
నిర్మలాత్మలోన నిత్యదీప్తమౌ
ధర్మమార్గమెన్ని, ధాత్రి పైన స
ద్ధర్మ వర్తనంబు తత్వ మార్గమౌ.
౩౪.
స్వాగతము.
ర న భ గ గ. యతి ౭వ
అక్షరము.
భీమసేనుఁడట వీరుఁడెయైనన్
ప్రేమనన్నకెదురే పలుకండే,
నామసంస్మరణ నవ్యపుతేజం
బే మహాత్ములకు
నిద్ధర గల్గున్.
౩౫.
చంద్రవర్త్మ. ర న భ స. యతి
౭వ అక్షరము.
ధర్మరాజునకు తగ్గ మహాత్ముల్
కర్మనిష్టులిల కానగ రారే,
మర్మ హీనుఁడును మాన్యుఁడు తానే
ధర్మరూపమని తల్చుట యొప్పున్.
౩౬.
రసాలి.
ర న ర గ. యతి
౭వ అక్షరము.
అర్జునుండన మహాత్ముడేగా
నిర్జితుల్ రిపులు నిత్యమెన్నన్,
దుర్జనాళికిల ధూర్తుఁడేగా,
యార్జితంపు పరమార్థమదేయౌన్.
౩౭.
రథోద్ధతము.(పరాంతిక)
ర న ర వ. యతి
౭వ అక్షరము.
ద్రౌపదీ సతియె ధర్మమెన్నగన్,
శ్రీపరాత్పరుని చెల్లెలే కదా,
ప్రాపుగా హరియె ప్రక్కనుండుటన్
దీపకాంతివలె తేజరిల్లెగా.
౩౮.
సగ్విణి.
ర ర ర ర. యతి
౭వ అక్షరము.
భారతంబెన్నగా పాపహార్యంబెగా
ధీరులున్ శూరులున్, దివ్య
సజ్జ్ఞానులున్
భారతాత్మజ్ఞులై భక్తితోఁ గొల్తురే,
కోరి యీ ధాత్రిపై
కూర్మితో పుట్టెడున్.
౩౯.
ఉపేంద్రవజ్ర. జ త జ గ గ.
యతి ౮అ అక్షరము.
పరాత్పరుండెన్నెడి భవ్య ధాత్రిన్,
నిరంతరాయంబుగ నిత్య పూజల్
సురాదులే వచ్చుచుచూచుచుండున్,
కరావలంబంబగు కల్పకంబే.
౪౦.
వంశస్థము.
జ త జ ర. యతి
౮వ అక్షరము.
సుపూజ్య భావంబది చూచినంతనే
కపీశునైనన్మది కల్గుచుండునే,
ప్రపూజ్య శ్రీభారతభాగ్య ధాత్రికై
తపింతునిత్యంబును ధర్మరక్షకై.
భాగవతము
౪౧.
జలోద్ధత గతి.
జ స జ స
. యతి ౮వ అక్షరము
మురారి తలపుల్ ప్రమోద మొసగున్,
నిరంతరముకృష్ణునే తలచుచున్
పరంబునిహమందవచ్చు ధరణిన్,
కరంబునను పట్టి కాచు నతఁడే.
౪౨.
వరలక్ష్మి.
త భ భ భ య.. యతి.
౮వ అక్షరము.
శ్రీరామ భక్తుల కాశ్రిత కల్పక మతండే
ధీరాత్ముడున్, నుత చిద్విభవుండును, బుధాళిన్
శ్రీరామ రక్షగ కోరి సతంబు నిలకాచున్,
వీరాధి వీరుఁడు భావిని గొల్పు మది నిల్పన్.
౪౩.
ఉపస్థితము.
త జ జ గ గ. యతి
౮వ అక్షరము.
ఆ రామ
భక్తుఁడు వ్రాయడె, పోతన మహాత్ముం
డే రమ్య
కావ్యము లేదికయంచనగ ధాత్రిన్
కారుణ్య మొప్పగ భాగవతంబును సభక్తిన్
ధీరాత్ములీ కృతి భాతిని గాంతురు పఠింపన్.
౪౪.
కలితాంతము.(గీతాలంబన)
త జ జ ల గ. యతి. ౮వ
అక్షరము.
శ్రీకృష్ణుని గాధలు చేరగనే
శ్రీకాంతులు వీనుల జేరు కదా,
లోకాన జనావళిలోఁ గలుగున్
వేకాంతులు శాంతియు ప్రీతి యిలన్.
౪౫.
ఇంద్రవజ్ర.
త త జ గ గ. యతి
౮వ అక్షరము.
ఏలెన్ గజేంద్రుండిల భీల కాగా,
పాలింప వేడన్ హరి భక్తుఁడంచున్,
శ్రీలక్ష్మితోడై విరచించు కార్యం
బేలేటి వానిన్ నడిపింపబ్రేమన్.
౪౬.
ఇంద్రవంశ. త త జ ర. యతి
౮వ అక్షరము.
ప్రహ్లాదుడన్రాక్షసవంశ సంభవుం
డాహ్లాదమొప్పారగ నాముకుందునిన్
ప్రాహ్లాదమున్ దేల్చగ భక్తితోడుతన్
కహ్లారపుష్పార్చనణ్ గంచుఁ జేసెనే.
౪౭.
వసంత తిలకము. త భ జ జ గ.. యతి
౮వ అక్షరము.
శ్రీ రుక్మిణీ సతిని చేరెను ప్రేమతో
ధీరాత్ముఁడాకృష్ణుఁడు తీరుగ తృప్తిగా,
పోరాడి రుక్మిణి ప్రమోదముపొందగా
వారించు రుక్ముని ప్రభావమడంచుచున్.
౪౮.
తామరసము (తోదకము) న జ జ య. యతి ౮వ
అక్షరము.
హరిని సుధామ, మహాత్ముఁడు
చేరన్,
నిరుపమ సంతస నిర్భరుఁడై తా
కరుణను రమ్మనిగౌరవమొప్పన్
హరి వరదుండయి యాశ్రయమిచ్చెన్.
౪౯.
ప్రభాతము.
న జ జ ర గ.
యతి ౮వ అక్షరము.
కడవలనుండెడి కమ్మనైన వెన్నన్
గడసరి కృష్ణుఁడు గాంచినంత చేతన్
వడివడి గొంచు ఘనంబుగన్ భుజించున్.
చడియును చప్పుడుసల్పకుండ నాహా!
౫౦.
పృథ్వి.
న న జ వ. యతి
౮వ అక్షరము.
కలవరమది జగంబుననే
కలుగదు కన ప్రకాశముతో
వెలయ హరి భువి విస్తృతమై
సులలిత సుగుణశుద్ధ హరీ!
౫౧.
క్షమ (క్షప) న న త త గ. యతి
౮వ అక్షరము.
మదిని సతము సమ్మాన్యతన్ శ్రీహరిన్
పదిలపరచు సద్భాగ్య సౌశీలురే
ముదమునుగనుచున్ ముక్తులౌ శ్రీహరీ!
విదితమిదియె ప్రావీణ్యతన్ గాంచగా.
౫౨.
ప్రహరణ కలిత.
న న భ న వ. యతి
౮వ అక్షరము.
మకరము కరినే కలతపరచగా
బ్రకటిత మదినా మకర గ్రసితునిన్
సుకరముగనటంశుభకరు డయె నా
వికలహృదయునే ప్రియమున కనుచున్
౫౩.
ప్రహేయము. న
న మ య. యతి
౮వ అక్షరము.
కరుణ కలుగు శ్రీకాంతున్ దలంచన్
వరములొసఁగ దైవంబే గుదెంచున్,
శరణమనిన ధీశక్తిన్ రహించన్
కరుణనొనరుచున్ కామ్యార్థ మర్ధిన్.
౫౪.
గజవిలసితము. భ ర న న న గ.
యతి ౮వ అక్షరము.
వామనుడై బలిన్ భవరహితుగ నొనరిచెన్,
క్షేమము నీయగన్ తగిన వరములనొసగున్,
ధీమతు లెన్నికన్ మదిని నిలిపి కొలుతురీ
శ్రీమహితాత్మునిన్, సరిగ కనునితడనుచున్.
౫౫.
మత్త మయూరము.
మ త య స గ. యతి
౮వ అషరము.
భూమిన్ జుట్టన్ జాపగ,
మూర్ఖుండగు దైత్యున్
భూమిన్ గావన్ ప్రేమను మూర్ఖున్ బరిమార్చెన్,
శ్రీమంతున్ మన్నించుచు శ్రీ భాగవతంబున్
ధీమంతుల్ సేవింతురు తేజంబును గాంచన్.
౫౬.
ప్రహర్షిణి. మ న జ ర గ. యతి
౮వ అక్షరము.
శ్రీమద్భాగవతము,క్షేమమౌన్ బఠింపన్
శ్రీమద్భాగవతుల చిత్త సంస్థితుండౌ
ప్రేమోద్భాసిత నృహరిన్ ధృతిన్ స్మరింపన్,
ధీమంతుల్ కనుదురు తృప్తిగాను ముక్తిన్.
౫౭.
ఏకరూప.
మ భ జ గ గ. యతి
౮వ అక్షరము.
లక్ష్మీనారాయణుల లాలితంబౌ
సూక్ష్మార్థంబెంచుచు ను శోభనెంచన్
లక్ష్మీతేజంబుగని లక్ష్య సిద్ధిన్,
లక్ష్మీ సత్ప్రేమను తలంచిపొందున్.
౫౮.
విశ్వదేవి.
మ మ య య. యతి
౮వ అక్షరము.
మోక్షంబే సద్భాగ్యంబు, మోక్షార్థికెన్నన్,
మోక్షార్థిన్ రక్షించున్ బ్రపూజ్యుండు ప్రేమన్,
దీక్షాదక్షుల్ నిత్యంబు దేవున్ స్మరించన్
శిక్షాదూరంబౌసూచిచేరంగనౌగా.
౫౯.
చంద్ర రేఖ.
మ ర మ య య. యతి
౮వ క్షరము.
ధర్మార్థంబుల్ పరంబున్ ధైర్యంబునిచ్చున్ దలంపన్,
కర్మన్ బాయంగజే యున్ గాంచంగ
మోక్షార్థికెన్నన్
మర్మంబున్ బాయగా క్షేమంబున్ కృపన్ గొల్పుచుండున్,
భర్మంబే దేవదేవున్ భావింపగా గల్గ ధాత్రిన్.
౬౦.
భుజంగ ప్రయాత.
య య
య య. యతి
౮వ అక్షరము.
శుభాధిక్యముల్ గొల్పుశుద్ధాత్ములర్థిన్,
ప్రభారాశియౌ కృష్ణుఁ బ్రార్థించుచున్, ధీ
ప్రభల్ భక్తపాళిన్ స్థిరంబై రహించున్,
ప్రభూకృష్ణదేవా! విభో మంగళంబుల్.
సామాజికాంశము ౧.
౬౧.
భద్రకము. ర
స వ.
యతి లేదు.
శ్రీకరంబగు శ్రీ సతిన్
లోకులందరు కొల్చుటన్
ప్రాకటంబుగ భక్తులన్
లోకమందున కాచుగా.
౬౨.
సింహరేఖ. ర జ గ గ. యతి
లేదు.
పేదవారి బాధ లెన్నో,
శ్రీధవుండు పాపలేడా?
వేదనల్ నశించిపోవా,
లేదొ నిష్కృతీధరానన్
౬౩.
అచలము.
న న ల ల.
యతి లేదు.
జగతినిప్రగతికి
మగువల కృషి గన
జగదభినుత హరి
జగతిని పొగడడె?
౬౪.
మత్తేభ విక్రీడితము. స
భ ర న మ య వ. యతి.
౧౪వ అక్షరము.
కలికాలంబిది, కామితార్థఫలమే కాంక్షింత్రు, సద్ధర్మమున్
నిలుపన్ యోచననైనఁ జేయరకటా, నిర్భాగ్యలౌ
మానవుల్,
ఫలితంబెన్నగ పాపదుష్ఫలితమే బాధించించుచున్నన్ గనం
గలలోనైనను యత్నమున్ సలుపరే, కాపాడలేరెవ్వరున్.
౬౫.
వనమంజరి.
న జ జ జ జ భ ర. యతి. ౧౪వ
అక్షరము.
కలియుగమందు దురంత దురాగత క్రౌర్య దౌష్యములంతటన్
సులలిత చిత్తులు చూడగ రానివి చూచు దుర్గతిఁ గొల్పుచున్,
మలినమనస్కులు సల్పుచునుండిరి, మంచియున్ జెడుగానరే,
లలిత మదంబ సహింపదు దుష్టుల లక్ష్యముల్ ప్రహరించెడున్.
౬౬.
శార్దూలము.
మ స జ స త త గ.
యతి ౧౩వ అక్షరము.
దుర్మార్గంబును దుష్టులెన్నునెడ నా దుర్మార్గులున్ దుష్టులున్,
దుర్మార్గంబును వీడి మంచి గని మేదుర్భావసంస్కారులై
ధర్మాధర్మవిచారణన్ బ్రతిభులై తత్వజ్ఞులై సత్ క్రియల్
ధర్మాత్ముల్ కని మెచ్చఁ జేయుత హరీ!
దక్షుండ! చేయించుమా.
౬౭.
కరిబృంహితము. భ న భ న భ న ర.
యతి ౧౩వ అక్షరము.
దుర్గతిఁ జనెడి దుష్టులఁ గనిన తోడనె నిజముతెల్పి, స
న్మార్గము దెలిపి, మంచివారలుగ,
నచ్చి వర్తిలఁగ జేయు స
న్మార్గ సుజనుల మర్మ రహితుల మార్గము జనుల మార్గమౌన్
దుర్గ సుజనుల నెన్ని సతతము తోడునిల్చుచు కాచెడున్.
౬౮.
భారవి. భ ర భ ర భ ర వ. యతి
౧౩వ అక్షరము.
నేరము చేయుచున్, మంచిని
త్రుంచుచున్, నిత్యము దుష్టులై
భువిన్
క్రూరులు మెల్గుటన్, మంచికి
చేటగున్, కూర్మిని పంచుచున్,
హితుల్
నేరవిదూరులై దుర్గతి వీడగా నేర్పున దుష్టులన్ మదిన్
గోరుచు నిల్పుచున్ మంచిగ మార్చుతన్, ఘోరము
లాపుతన్ బుధుల్.
౬౯.
మందాక్రాంత. మ భ న త త గ గ. యతి
౧౧వ అక్షరము.
నేరాలేలన్ నిరతము భువిన్ నిత్యకృత్యంబనంగా
ప్రేరేపించందొడఁగుదురు సత్ ప్రేరణన్ గొల్పరాదో?
క్రూరాత్ముల్ వాక్సరళిని ప్రజన్ కూలఁద్రోయంగనేలన్?
రారా రామా!
సుజన తతినే రక్ష సేయంగనింకన్.
౭౦.
మేదిని, (వాణి).
న జ భ జ ర గ. యతి
౧౧వ అక్షరము.
పరువది పోవుచుండె కుల పాంశు లిద్ధరిత్రిన్
నిరుపమరీతి దుష్కృతులు నిర్భయంబుఁ జేయన్,
భరతసుధాత్రికీర్తినిప్రపంచమెన్నువేళన్.
కరుణను సత్పథంబునిలగాంచుడీధరిత్రిన్.
సామాజికాంశము ౨.
౭౧.
చంపకమాల.
న జ భ జ జ జ ర. యతి
౧౧వ అక్షరము.
ధరణిని పెద్దలన్ గన ముదంబున
వందనమాచరించు సుం
దర సుమనస్కులుండిరి,
మదంబునెఱుంగని వారు నాడు, నే
డరుదుగ కానిపింతురు, మహాత్ములు, చూడగ
నేడు గర్వితుల్
భరత సుధాత్రినిండిరి, ప్రపంచవిధానమె మార్చివేసిరే.
౭౨.
మణిభూషణము. ర న భ భ ర. యతి
౧౦వ అక్షరము.
పెద్దలన్ గనిన భక్తిగ విజ్ఞతఁ జూపుచున్,
శ్రద్ధతో హితము కూర్పగ చక్కగ వారికిన్,
బుద్ధి నిల్పుచును సేవలు ముచ్చటఁ గొల్పగా
నిద్ధరిత్రిపయి చేయుత, హృద్యముగానికన్.
౭౩.
పద్మనాభ.
త త త త త త త గ గ. యతి
౧౩వ అక్షరము.
వృద్ధాప్యమందున్ లసద్జ్ఞాన హీనంబు పృథ్విన్ గలుంగున్ తలంపన్మహేశా!
శ్రద్ధన్ కుటుంబంబు సన్మాన్యతన్ జూడ శక్తిప్రదంబౌ కనంగన్ నిజంబే,
రాద్ధాంతమే లేక వృద్ధాళినే కాచ బ్రార్థింతుపుత్రాదులన్ నేను భక్తిన్,
వృద్ధిల్ నిధుల్ గాంచ వృద్ధుల్ మహద్ జ్ఞాన వృద్ధుల్ ధనంబౌను జ్ఞానంబు చేతన్.
౭౪.
ఆటవెలది.
వయసుమళ్ళినంద బంధువుల్ కన రారు,
చేయలేక సేవ చేర రారు
కన్నబిడ్డలయ్యు, కారుణ్య హీనులై,
దైవశక్తి కాచు ధరణిపైన.
౭౫.
తే.గీ.
తమను వృద్ధాశ్రమములకు తరలఁజేయు
తనదు సంతానమున్ గని తల్లడిల్లు
వయసుమీరిన పితరులు,బాధపడుచు
చేయజాలరదేమియు చేవ చచి.
౭౬.
కందము.
పుట్టుటదెందుకు బిడ్డలు,
నెట్టకపితరులను చూచి నేర్పున కావన్
గట్టితలంపును విడుచో
పట్టక బంధములు మదికి, వ్యర్థపు
జీవుల్.
౭౭.
ఉత్సాహ.
పెద్దలన్న భక్తి గల్గి ప్రీతితోడ గాచుతన్
సుద్దులెన్ని చెప్పనేల చూడ వలయు ప్రేమతోన్,
బుద్ధిగల్గి వంశ కీర్తి పొంగఁజేయువారలే
పెద్దవారలింటికగును పేరునొందు పృథ్విపై.
౭౮.
మధ్యాక్కర.
౨ఇం..గ. ౧సూర్.గ.
౨ఇం.గ.౧సూ.గ.
యతి ౪వగణం ౧వ అక్షరం.
సుజ్ఞానులౌ తెల్గువారు, శోభిల్లు
సత్కీర్తి తోడ,
విజ్ఞాన భాండారమీరు,, పృథ్విన్
లసత్జ్ఞానమెన్న,
సుజ్ఞానగర్వాంధ దూర శుద్ధాంత రంగుల్ కనంగ,
హే జ్ఞానదా
రామ వీరి నేరీతినీవేలుదువొగ.
౭౯.
జలధరమాల. మ భ స మ. యతి
౯వ అక్షరము.
ప్రేమాబ్ధిన్ దేల్చవలెను బ్రీతిన్ స్తుత్యుల్,
క్షేమంబున్ బెద్దలనిల, చేరనదగుంగా,
శ్రీమాత్రాత్మన్బొగడును చిన్మూన్యాణిన్,
ధీమంతుల్పెద్దలకృప తీపిన్ గాంచున్.
౮౦.
కందుక వృత్తము. య య య య గ. యతి
౮వ అక్షరము.
జయంబుల్ జనాళిన్ లసత్తేజమొప్పారన్
ప్రియంబున్ ధరిత్రిన్ వరించున్ మహత్శక్తిన్,
భయభ్రాంతులన్ వీడి భాసింపఁ జేయుంగా
నయోద్భాస సద్భావనా దృష్టినొప్పారున్.
అప్రసిద్ధ నూతన వృత్తములలో సామాజికాంశము.
౮౧.
నాగమణి …జ. ర
..భ.. యతి లేదు.
జయంబునే వరించన్ గను
నయాచితంపు లాభంబది
ప్రయత్నమున్నచో గల్గెడు
ప్రయాసకాదుగా ధీనిధి!
౮౨.
పంక్తిరథ.
త జ య గ. యతి
౬వ అక్షరము.
శ్రీమాతను గొల్చిన రక్షించున్,
క్షేమంబగు భావిని సూచించున్,
ధీమార్గము ప్రీతినొసంగున్, హే
హేమాద్రిజ! పాహి
యనన్ నిల్పున్.
౮౩.
జయా.
త భ త గ ల. యతి
౫వ అక్షరము.
శ్రీ దేవి సుస్మిత బింబాధరంబు
మోదంబుఁ గొల్పును బ్రార్థించినంత,
ఖేదంబు సోకినఁ బాపున్ క్షణాన
నాదేవి జ్ఞానద, ముక్తిప్రదాత్రి.
౮౪.
కోల౧.
జ స స య. యతి ౭వ
అక్షరము.
భువిన్ వెతలఁ బాపునతండు దైవం
బు,
విజ్ఞతనునొప్పుబుధుండె
యెన్నన్,
కవీశ్వరులు లోకములోని బాధల్
కవిత్వమున వేగమె బాపుటొప్పున్.
౮౫.
సురుచిరా, రుచిరా౩.
జ భ స ర
గ. యతి
౭వ అక్షరము.
దురాత్ములందున దురితంబే నశించన్
నిరాశ్రయుల్ భువిని,వసింపన్
గృహంబుల్
వరంబుగా గొలుపగ దైవంబు నిల్చున్
నరాకృతిన్ బరిణతి తోడన్ సతంబున్.
౮౬.
హరిలీల.
త త భ స ల ల.
యతి ౯వ అక్షరము.
పేద ప్రజన్ బ్రోవ సత్కవిత రచింపుడు
మోదంబుతోడన్ కవుల్ విపులముగన్ ధర,
యేదారియున్ లేదు నిల్ప నెవరు లేరిల,
ఖేదంబునేబాపినన్ సుకృతులుపేదలు.
౮౭.
శిశు
త జ స స య. యతి
౧౦వ అక్షరము.
రైతన్న శ్రమించ ధరయున్ రతనాలు పండున్,
భూతాళికి నాకలినిబాపు మృడుండె రైతౌన్,
ధాతా!
భువి రైతుకుప్రభాత కళల్ రచింపన్
ఖ్యాతిన్ గడియించనగువేగమె కాంచుమింకన్.
౮౮. మానస భంజని భ ర య స జ గ యతి
౯వ అక్షరము.
మానవ ధర్మమెన్ని, ప్రేమంగనుటొప్పగున్
ధరన్
జ్ఞాన సుధా స్రవంతి లోకాన రహింపగన్ ప్రభన్
దీనజనాళియున్ బ్రశాంతిన్ స్థిరమై రహించుతన్
శ్రీనరసింహమా దయాశ్రీకురిపించుమా కృపన్.
౮౯. సురాసురవంద్య. జ జ జ జ జ ల గ, యతి
౯వ అక్షరము.
ఉమాధవుఁడేలనురాడొ కనంబడ పేదలకున్
బ్రమోదమొ వారికి భారము మోపుట కష్టములన్
సమంచిత వృద్ధిఁ బ్రశస్తముగా నిడి పేదలకున్.
సమస్త సుఖంబులు శాశ్వతభోగము గొల్పదగున్.
౯౦.
అచల.
జ త భ య స త.
యతి ౧౨వ అక్షరము.
పరాత్పరుండేలు ధాత్రిని, స్వభావంబుల
భేదంబేల
సరోజనేత్రుండు కొల్పెనొ, గ్రహించన్
దగడేమో తాను,
ధరాధముల్, మూర్ఖులుద్ధతిని
బాధల్ కలుగం జేయంగ
నరోత్తముల్ దుఃఖమున్ పడుచుదీనంబుగ నుంటేమందు.
౯౧.
నందనం.
న జ భ జ ర ర.
యతి ౧౨వ అక్షరము.
కవులు సుధాస్రవంతి యన చక్కనైన
సత్కావ్యముల్
భువిని మనోజ్ఞరీతిని వరంబుగా లిఖింపన్ బ్రజల్
కవులకు నంజలించి, సుగుణైకవర్ధనుల్,
నిర్మలుల్
కవులని మెచ్చుచుండుదురనేకసత్కృతుల్ చేయుచున్.
౯౨.
వసుమతీ.
జ జ న న న న ల. యతి
౧౩వ అక్షరము.
వివాహము లేలను జరుపుదురు వెతలను గొలుప?
నవీనపు జీవనము నడవక నలత పడుచును,
ప్రవర్ధనహీనతను నడువక రసరహితముగ
నవారిత దుఃఖితులగుచు విడి నరకముగనరె.
౯౩.
హిమాంశు ముఖీ. జ
జ భ ర స జ ల గ. యతి ౭.౧౩. అక్షరములు.
ముదావహమౌను పూజ్యుల జీవనమ్ము, గ్రహింపగల్గినచో,
సదా నవనీత సామ్యము వాగ్ఝరుల్ జయమార్గ దర్శములే,
మృదోక్తులతోడ మించెడి నేర్పునే మితిమీరనిచ్చునుగా,
మదిన్ గని దివ్యమాన్యత నెన్నుచున్ మహి గౌరవించనగున్.
౯౪.
సుధా. జ
జ జ జ జ జ ల ల వ. యతి. ౭.౧౬. అక్షరములు.
సుధీమతి నొప్పు సుశోభిత చిత్తము లెన్నుచు సత్యముఁ గనవలెన్.
స్వధామము దేహవరాలయమెన్న న సాదృశజీవికి
గనగా,
బుధోత్తము లెన్ను పునీత వచోగతి నిత్యము సత్యము కనగా
సుధామయవృత్త సుశోభిత పద్యమునెన్నుచునేర్పుడు కృపతోన్.
౯౫.
మహా స్రగ్ధర. త జ త న స ర ర గ. యతి
౧౬వ అక్షరము.
పాపాత్ములు హెచ్చి యుత్సాహముగ తిరుగుచున్ భవ్యులన్ వేచుచుండన్
శ్రీపాదములెన్నుపుణ్యాత్ములు కలవరమున్ చెందుచున్ దేవదేవీ!
నీపాదములెన్నుమాకీవె శరణు, దురితుల్ నిత్యమున్ వ్రేచుచుండన్
పాపాత్ములనెన్నిచంపన్ దలచవొ జననీ ప్రార్థనల్ తీర్చలేవో?
౯౬.
వసురత్న.
భ భ భ భ భ త జ ల గ. యతి
౧౬వ అక్షరము.
బాలుర బాధలు చూడరు పెద్దలు, చింతలఁ
బాపంగతలంపరుగా,
జాలిని పొందరు బాలుర చిత్తము నెన్నరు సచ్చింతలనెన్నరుగా,
పేలవ దృష్టిని బాలురఁగాంచుచు, కల్గిన విజ్ఞానమునెన్నరుగా
బాలురె భావికి భద్రత, కావున
బాలురఁ ప్రఖ్యాతినిపెంచతగున్.
౯౭.
మకరంద ౧(మంజరీ) జ జ జ జ జ జ జ మ. యతి. ౧౦.౧౯అక్షరములు.
ప్రయాసగ నెంచక నిశ్చల భక్తిని సత్కవనప్రభనంద నందించున్
నయంబును జూపుచు నూతన వృత్తము చేయుచు సాధన చక్కగావిజ్ఞుల్,
ప్రియంబున తోపెలవంశ వివర్ధక పండిత శర్మకృషిన్ంశుభంబంచున్
జయంబికనిశ్చయమెన్న, జనాళికి నిర్మల సారస సత్సుధన్ గ్రోలన్.
౯౮.
నిర్ఝరధ్వని. త భ య జ స ర న త యతి ౧౩.౧౯అక్షరములు.
ధర్మాత్ములన్ గనుచు మర్మంబునే యెదను వీడన్ వలెన్ తలపునన్నిల్పి
మర్మంబునే విడిన, మంచిన్
సదా క్షమనుపొందంగనౌన్ మనమునందెన్ని,
కర్మల్ పొనర్చుచు స్వధర్మప్రవృత్తిఁ గల సన్మార్గులే కరువయెన్ జూడ,
ధర్మార్థ కామములెసన్మోక్షభాగ్యదములీశానిమోద ఫలమైకల్గు.
౯౯.
వీణార.
త జ జ జ జ జ జ జ . యతి ౧౦.౧౯ అక్షరములు,
లోకంబున ధర్మము వర్ధిలు మార్గము నీశ్వరు నిచ్చలు తెల్ప, గ్రహించి,
శ్రీకారమునందున నారసి మూలము చిత్తము పొంగ చిదాత్ముని గాంచి,
లోకాత్ముని చెంతను వర్తిలు చిత్తము శాంతిగ వర్ధిలు, దక్షత
తోడ
లోకాన రచించుచు వెల్గులు మెల్గెడిమూర్తుల, మేలుగ నిద్ధరఁ గొల్తు.
౧౦౦.
మునిమత,
న జ న స న న న జ. యతి ౧౦.౧౯ అక్షరములు.
సుజనులుమంగళముల శుభశోభలను జగతి చొరబడఁ జేసి
ప్రజలకు సౌఖ్యము తనరగఁ జేయుచు బుధులు ధరణిని రహింత్రు.
సుజనుల మేలు ధరకు శుభముల్, హరి
కరుణనుశుభతతి తోడ
నిజము గ్రహించి విడువని గతిన్ నడచిపరమ నిధి కననెంతు.
స్వస్తి.
చింతా రామకృష్ణారావు.
వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.