జైశ్రీరామ్.
తైత్తిరీయోపనిషత్తు
తైత్తిరీయోపనిషత్తు లో 4 భాగాలున్నాయి. అవి
1.శీక్షావల్లి, / 2.ఆనందవల్లి, / 3.భ్రుగువల్లి, / 4.మహానారయణోపనిషత్తు.
1.శిక్షావల్లిలో వేదాభ్యాసంలో ముఖ్యమైన ఆరు
అంశాలు వివరించబడ్డాయి. విద్యార్థిగా అధ్యయనం, గృహస్థుగా అధ్యాపనం, అతిథి సత్కారం, నిత్యకర్మానుష్టానం, దేవపిత్రుకార్యాలు ధర్మాలని ప్రవచించింది .
విద్యార్థులు అధ్యయనం పూర్తి చేసుకుని గురుకులం వదలి గృహస్థాశ్రమం స్వీకరించబోయే
సమయంలో వీడ్కోలుగా గురువిచ్చిన స్నాతకోపన్యాసం, జగత్ ప్రసిద్ధం, ఉత్తేజకరం, మన సనాతన ధర్మ సారం.
2. ఆనందవల్లి ‘బ్రహ్మవిదాప్నోతి పరం’ బ్రహ్మజ్ఞాని బ్రహ్మమే అవుతాడనే ప్రసిద్ధమైన వాక్యంతో
ప్రారంభంఅవుతుంది . బ్రహ్మము నుండి ఆకాశం, దాని నుండి వాయువు, దాని
నుండి అగ్ని, దాని నుండి నీరు,
దాని నుండి పృథివి, దానినుండి ఓషధులు (అన్నం), దానినుండి పురుషుడు ఉద్భవించారని
సృష్టిక్రమాన్ని వివరించింది. మానవునిలో అన్నమయకోశం, ప్రాణమయకోశం, మనోమయకోశం, విజ్ఞానమయకోశం,
ఆనందమయకోశాలనే కోశాలు – ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైనవి – ఉంటాయని, అందులో ఆనందమయకోశంలో ఆనందస్వరూపంగా పరమాత్మ ఉంటాడని
వివరించింది. పరమాత్మ వాన్జ్మానసులకు అవగతమయ్యే వాడు కాడని, సర్వోత్తముడని చెప్పి ఆనందంలో తరతమ భేదాలను
విశదపరచింది.
3. భ్రుగువల్లిలో, భ్రుగువు తన తండ్రి వరుణున్ని తనకు
బ్రహ్మమునుపదేశించమని అర్థించగా, తండ్రి
“అన్నం, ప్రాణం, చక్షువు, శ్రోత్రం,
మనస్సు, వాక్కు దేనినుండి ఉద్భవిస్తున్నాయో, దేనివల్ల వర్ధిల్లి, దేనిలో లయం అవుతున్నాయో అదే బ్రహ్మము, దాన్ని తపస్సు ద్వారా మాత్రమే తెలుసుకోగలవు”
అని ఉపదేశించాడు. భ్రుగువు అలాగే
తపస్సు చేసి ఆనందమే బ్రహ్మమని చిట్టా చివరకు తెలుసుకున్నాడు. ఈ వల్లిలో, అన్నప్రశంస, అతిథి సత్కారం, సృష్టి మూలం, బ్రహ్మోపాసన మొదలైన విషయాలు చక్కగా వివరించ బడ్డాయి.
4. నారాయణోపనిషత్తు.ఈ ఉపనిషత్తు పరిమాణంలో చాలా
పెద్దది అవడం చేతనూ, పరమాత్మను
నారాయణ స్వరూపంగా వర్ణించే ఉపనిషత్తు కావడం చేతనూ, దీనిని మహానారాయణోపనిషత్తని పిలుస్తారు.
ప్రతి పూజలోను మనం పఠించే మంత్రపుష్పం
మంత్రాలు, యతీశ్వరుల సన్నిధిలో
పఠించే మంత్రాలు, సంధ్యావందనంలో
వచ్చే మంత్రాలు, విరజా హోమ
మంత్రాలు, దుర్గాసూక్త మంత్రాలు
మొదలైన అనేక ప్రసిద్ధమైన మంత్రాలన్నీ ఈ ఉపనిషత్తులోనివే.
వేద వేదాంగములను అధ్యయనం చేసి, వేదోక్తమైన కర్మలన్నింటినీ సంగ రహితంగా
అనుష్టించి, ఆధ్యాత్మమార్గంలో
సంపూర్ణంగా లీనమై, పరమాత్మ
తత్వంతో తాదాత్మ్యం చెంది, తన
దేహంలోని ప్రతి అణువణువునూ వేదవేద్యుడు, యజ్ఞస్వరూపుడూ అయిన నారాయణునికి సర్వ సమర్పణ చేస్తూ, ఆత్మసాక్షాత్కారాన్ని అనుభూతిపరంగా పొందే
ఆదర్శవంతమైన ఒక మహాయోగి జీవన విధాన వర్ణన ఒక మహాద్భుత ఘట్టం.
ఆధ్యాత్మ మార్గంలో ఆసక్తి ఉన్న ప్రతివారూ
తప్పక పఠించ వలసిన భాగం ఇది. ఈ సన్నివేశంతో ఈ ఉపనిషత్తు ముగుస్తుంది. కృష్ణయజుర్వేదానికి
చెందిన తైత్తిరీయ శాఖలో ఈ ఉపనిషత్తు ఆఖరి పన్నం అవడం చేత ఈ వేదశాఖ కూడా దీనితో
పూర్తయినట్లే అవుతుంది.
*వేద మంత్రాల ఉచ్చారణ లోని అంతర్భాగాలు
ఏమిటి?
ఓం శీక్షాం వ్యాఖ్యాస్యామః | వర్ణః స్వరః | మాత్రా బలం | సామ సంతానః | ఇత్యుక్తః
శీక్షాధ్యాయః | (1.2)
‘శీక్షా’ అంటే స్వరశాస్త్రం (science of phonetics). వేద మంత్రాల అర్థం, ఫలితం కూడా స్వరం మీద ఆధారపడి ఉంటుంది అందుచేత ఈ
ఉపనిషత్తులోని మొదటి అధ్యాయంలో వేదోచ్చారణ పద్ధతి వివరించబడింది.
ఈ ఉచ్చారణలో భాగాలు
(1) అకారాది వర్ణములు;
(2) ఉదాత్త, అనుదాత్త, స్వరితాలనే స్వర భేదాలు;
(3) హ్రస్వ, దీర్ఘ, ప్లుతము (నిబ్బర గమనం – steady pace) అనే మాత్రలు;
(4) ఉచ్చరించునప్పుడు చేయవలసిన ప్రయత్న విశేషం –
దీన్ని బలం అంటారు;
(5) అతి వేగంగాను, మందంగాను కాక మధ్యస్థ వృత్తిగా పలకడం – దీన్ని సామం అంటారు;
(6) అక్షరాలను అలసత్వం లేకుండా పలకడం – దీన్ని సంతానం అంటారు. ఈ విధంగా మంత్రోచ్చారణ
చెయ్యాలని వేదం శాసిస్తోంది.
* గురు శిష్య సంబంధాన్ని ఈ ఉపనిషత్తు ఎలా
వర్ణించింది?
ఆచార్యః పూర్వరూపం | అంతేవాస్యుత్తర రూపం | విద్యా సంధిః | ప్రవచనగ్ం సంధానం (1.3)
విద్యా విధానంలో ఆచార్యుడు మొదటి స్థానం;
శిష్యుడు రెండవ స్థానం; వీరి కలయిక విద్య; కలిపేది బోధన.
* మహా సంహితలు ఏమేమిటి?
ఈ క్రింది ఐదింటిని మహా సంహితలంటారు.
అధిలోకము; అధిజ్యౌతిషము; అధివిద్యము; అధిప్రజము; అధ్యాత్మము.
జైహింద్..
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.