గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2017, ఆదివారం

దేవరాజ వృత్త గర్భిత సీసము. .. .. .. రచన. శ్రీమతి పావులూరి సుప్రభ.

జైశ్రీరామ్. 
దేవరాజ వృత్త గర్భిత సీసము. రచన. శ్రీమతి పావులూరి సుప్రభ.
వాణి, వరదనంచు భావమునను బల్కుదీవు కరుణతోడ నిందువదన
యెంచి మురిసిపోయి యేనిడుదును మొక్కులెన్నొ బగితితోడ నీవిధాన
పారి పరుగుదీయు పద్యములవ బాసలన్ని సొగసుగానె యనుదినమ్ము
కోరి వరము నిచ్చు కొమ్మవనుచుఁ బ్రస్తుతింతు నిజము గాద తెలుపవమ్మ
తే.గీ
పలుకు నాది నమ్ముదెవరు పలుకు తల్లి
పలుకులతిశయోక్తులనుచుఁ దలఁచకుండఁ
జెలిమి సత్యమనుచు నెంచఁదెలుఁగులంతఁ
బలుకవమ్మ వడివడిగా వెలుఁగుఁ జూపి /వెలసి తెరను
సీస గర్భస్థ దేవరాజ వృత్తము
గణములు --న ర న జ భ స ... య తి 11
వరదనంచు భావమునను బల్కుదీవు కరుణతో
మురిసిపోయి యేనిడుదును మొక్కులెన్నొ బగితితో
పరుగుదీయు పద్యములవ బాసలన్ని సొగసుగా
వరము నిచ్చు కొమ్మవనుచుఁ బ్రస్తుతింతు నిజముగా
సుప్రభ

09-18-2017
నేను ప్రచురించిన కంద,గీత గర్భ ఉత్పలమాల కు స్పందనగా, శుభకామనలతో చింతా రామకృష్ణారావు గారు వ్రాసిన దేవరాజగర్భిత సీసమును జూచి, వారినడిగి లక్షణములను తెలిసికొని, చూపిన గర్భస్థమైన దేవరాజ వృత్తమును గూడ పరిశీలించి అది మర్చిపోకముందే వ్రాస్తే బాగుంటుందని అనుకున్నాను. లోపలినుండి ప్రశ్న వచ్చినది.. ఇప్పుడే వ్రాయాలా? అని. నిద్రించే సమయమని, వేళ మించిపోతున్నదని తెలిసినా పెంకెగా )-: సమాధానమిచ్చాను --అవును.మరి. వ్రాయకపోతే వాణికూతుర్నంటే నమ్ముతారా? అని :-) ఏమనుకున్నారో యేమో కాని, యిక మాటాడలేదు. అదే అంగీకారముగా దీసికొని నా యత్నము నేను మొదలుబెట్టాను. అందిన/ అందించిన పలుకులు పైవి.
ఇంకొక గర్భకవితకు స్ఫూర్తి నొసగిన రామకృష్ణారావుగారికి ధన్యవాదశతములు. వ్రాయవలసినదే నని యన్నంత మాత్రాననే ప్రేమతో సాయము జేసిన వారికి వందనసహస్రములు. స్వస్తి.
చిత్రకవితానంద సంభరిత శ్రీమతి సుప్రభను మనసారా అభినందిస్తున్నాను.
అప్రతిమాన యత్నమున హాయిగ చిత్ర కవిత్వ సాధనన్
క్షిప్ర గతిన్ రచించు విదుషీమణి సుప్రభ యాంధ్రభాషలో
కప్ర మనోజ్ఞ సౌరభము కాంచును చిత్ర కవిత్వమింకపై.
సుప్రభ చిత్ర పద్యకృతి చూడగ తెల్గుకు సుప్రభాతమే
జైహింద్
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సుప్రభ గారూ ! అదృష్ట వంతులు . అభీష్ట సిద్ధి రస్తు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.