గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, అక్టోబర్ 2017, బుధవారం

శ్రీ హరి.వేం.స.నా.మూర్తి. గారు రచించిన కందద్వయ రుగ్మవతీ కమలవిలసితగర్భ క్రౌంచపద వృత్తము.

  జైశ్రీరామ్.
ఆర్యులారా!
శ్రీ హరి.వేం.స.నా.మూర్తి. గారు రచించిన 
కందద్వయ రుగ్మవతీ కమలవిలసితగర్భ క్రౌంచపద వృత్తము.
తిలకించండి.
కందద్వయ రుగ్మవతీ కమలవిలసితగర్భ క్రౌంచపద వృత్తము.
(ఆధారము - అప్పకవీయము)

క్రౌంచపదవృత్తము
గణములు - భ మ స భ న న న య
యతి - 1,11,19
భావజనాశా! భాగ్యవిభావా! భవహర! పురహర! వరగుణ దాతా!
తావకనిష్ఠా ధారుల తావున్ స్తవముల గొలువగ దగునని రావా
సేవలు చేయన్ క్షేమము చేవల్ శివములు నరుసము చిరముగ నీవా
దేవ! హరా! సద్దీప్తిని దేవా దివిజుల భువిజుల స్థిరతను దేవా.

దీనిలో గర్భితమైన మొదటి కందము.
భావజనాశా! భాగ్యవి
భావా! భవహర! పురహర! వరగుణదాతా!
తావక నిష్ఠాధారుల
తావున్ స్తవముల గొలువగ దగునని రావా.

దీనిలో గర్భితమైన రెండవ కందము.
సేవలు చేయన్ క్షేమము
చేవల్ శివములు నరుసము చిరముగ నీవా
దేవ! హరా! సద్దీప్తిని
దేవా! దివిజుల భువిజుల స్థిరతను దేవా.

దీనిలో గర్భితమైన రుగ్మవతీ వృత్తము.
గణములు - భ మ స గ
యతి - 1,6
భావజనాశా! భాగ్యవిభావా!
తావకనిష్ఠాధారుల తావున్
సేవలు చేయన్ క్షేమము చేవల్
దేవ! హరా! సద్దీప్తిని దేవా.

దీనిలో గర్భితమైన కమలవిలసిత మను వృత్తము.
గణములు - న న న న గగ
యతి - 1,9
భవహర! పురహర! వరగుణదాతా!
స్తవముల గొలువగ తగునని రావా
శివములు నరుసము చిరముగ నీవా
దివిజుల భువిజుల స్థిరతను దేవా.

రచన.  ..  ..  ..  హ.వేం.స.నా.మూర్తి.
గర్భకవితానురక్తితో రచనకు సాధన చేయుచు కృతకృత్యులగుచున్న మూర్తిగారిని మనసారా అభ్నందిస్తున్నాను.
జైహింద్.
Print this post

3 comments:

Unknown చెప్పారు...

శ్రీ మూర్తి గారు రచించిన
కందద్వయ రుగ్మవతీ కమలవిలసితగర్భ క్రౌంచపద వృత్తము అద్భుతమైన ప్రయోగం, వారికి అభినందన వందనములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ పండితులవారి అద్భుత రచనకు శిరసాభి వందనములు

Ganti Lakshmi Narasimha Murthy చెప్పారు...

శ్రీరామకృష్ణరావు గారు అద్భుతమైన బంధ కవిత్వాన్ని ప్రచురించేరు. తమకు కవిగారికి కూడా అభినందనలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.