గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, అక్టోబర్ 2017, ఆదివారం

ఆటవెలదిద్వయ -దేవరాజ వృత్త - ఉత్సాహ గర్భ సీసము రచన. శ్రీమతి పావులూరి సుప్రభ.

 జైశ్రీరామ్.
ఆటవెలదిద్వయ -దేవరాజ వృత్త - ఉత్సాహ గర్భ సీసము రచన.   శ్రీమతి పావులూరి సుప్రభ.

చారు సరసిజాక్షి, సన్మతి, సరసాంగి ప్రేమఁ బడసితిన్‌ పరీక్ష గెలిచి
జనని స్వరము తోనె సార్థకమగు జన్మ సజ్జనముదమై యజస్రమిలను.
కోరి గురుని రీతిఁ గూర్మిఁ గనుచుఁ గొమ్మ దీవనలిడఁగా సుదీక్షఁ బడసి
చేరి చరణమంటి శ్రేయమవఁగ సన్నుతించెద నికపై జితేంద్రియనయి
తే.గీ
సత్యమైనవే మాటలు శంక వలదు
నిత్య కూర్పఁ జేసినవగు నెమ్మి తోడ
సత్యరూపిణి శ్రీవాణి సంతుననుచుఁ
గృత్యమొక్కటి చేతునే కీర్తి మాయ
పై సీసము లో గర్భితమైనవి ---

ఆ.వె 1.
చారు సరసిజాక్షి సన్మతి సరసాంగి
ప్రేమఁ బడసితిన్‌ పరీక్ష గెలిచి
జనని స్వరము తోనె సార్థకమగు జన్మ
సజ్జనముదమై యజస్రమిలను
ఆ.వె 2.
కోరి గురుని రీతిఁ గూర్మిఁ గనుచుఁ గొమ్మ
దీవనలిడఁగా సుదీక్షఁ బడసి
చేరి చరణమంటి చిత్తమలర సన్ను
తించెద నికపై జితేంద్రియనయి
దేవరాజ / ఉత్సాహ (3,4 )
దేవరాజ - న,ర,న,జ,భ,స --యతి 11
ఉత్సాహ - 7 సూ. గురువు - యతి ఐదవగణము మొదటి యక్షరము
సరసిజాక్షి, సన్మతి, సరసాంగి ప్రేమఁ బడసితిన్‌
స్వరము తోనె సార్థకమగు జన్మ సజ్జనముదమై
గురుని రీతిఁ గూర్మిఁ గనుచుఁ గొమ్మ దీవనలిడఁగాఁ
జరణమంటి శ్రేయమవఁగ సన్నుతించెద నికపై
సుప్రభ

ప్రజ-పద్యం కూటమిలో చింతా రామకృష్ణారావు గారు ఆటవెలదిద్వయ -దేవరాజ వృత్త - ఉత్సాహ గర్భ సీసము
శీర్షికతో నొక పద్యమును ప్రచురించారు. చదివి "వావ్‌" యీ సారి దేవరాజ వృత్తమే కాక రెండు ఆటవెలదులు, ఉత్సాహ కూడ చేర్చి క్లి్ష్టతరము చేశారే అనుకొని
యెన్నిగంటలు పడుతుందో యత్నిస్తే అనుకున్నాను. చేయవలసిన పనులు చేసికొని తరువాత సావధానముగా కూర్చుని చూద్దాములే అనుకుంటుండగా లోనుండి వినిపించినది "వ్రాయిస్తానమ్మా" అని . అడగకుండానే దయచూపిస్తున్నారనుకొని, కనీసము అయిదు నిముషాలు సమయము కావాలని, చేయవలసిన దేదో పని చేసికొని "రెడీ" అన్నాను. ఆ పద్యము ముందు బెట్టుకో అన్నారు. అలాగే నని ముందు బెట్టుకొని పరిశీలించాను. అనుకున్నంత కష్టము కాదని తెలిసింది. వెంటనే చారు సరసిజాక్షి అని మనసులో మాట మెదిలినది. కరము కదిలినది. టైపింగ్‌ మొదలయినది. చివరకు అందిన /అల్లించిన పలుకులు పై పద్యరూపములు. షరా మామూలే. వారేమి చెప్పించ దలచుకుంటే అదే. నేను మాత్రము చేయగలిగినదేముంది? )-: ఏది వ్రాయిస్తే అదే పంచుకోవటము.
మరల యింకొక గర్భకవితకు ప్రేరణనిచ్చిన రామకృష్ణారావుగారికి ధన్యవాదశతములు. అయాచితముగానే కరుణతో కలము సాగించి కానుకనందించిన తల్లికి /సద్గురుమూర్తికి కూర్మితో కోటి ప్రణామములు. స్వస్తి.
సుప్రభగారికి అభినందనలు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీమతి పావులూరి సుప్రభ గారికి సాధ్య పడనిదేముంది.? శ్రీ చింతావారి అభినందనలు శ్రీరామ రక్షకదా !
మీ ఇరువురికీ నా ఆశీర్వాద అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.