గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, ఆగస్టు 2017, శనివారం

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి.రచన బ్రహ్మశ్రీ పొన్నెకంటి సూర్యనారాయణరావు

జైశ్రీరామ్.



కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి. 

రచన శ్రీ పొన్నెకంటి సూర్యనారాయణరావు

1. బావిని నీవుగావెలసి భక్తజనాళి హృదంతరాళముం


 దావులనింపినావుగద ధన్యతగూర్చుచు కాణిపాకము

న్నోవర సిద్ధినాయకుడ! మోదకహస్తుడ! ఆఖువాహనా!
కావుమ మమ్ముసంతతము గౌరిముఖాంబుజ ద్వాదశాత్ముడా!

2. ఇష్టము నీకనిన్నిల గణేశుడ! తీయనినిక్షుఖండముల్

కష్టమెయైన దెచ్చితిని గైకొనివాని దయార్ద్రచిత్తతన్

స్పష్టపు యోచనల్గలుగ చక్కని బుద్ధిని నాకొసంగుమా

నిష్ఠగ నిన్నుగొల్తునిక నీరజనాభుని మేనగుర్రడా!

3. రైతు పొలాననీవు కడు రాజసమింపెసలార బావిలో

చేతమురంజిలం దమదు సేమముగోరుచు నుద్భవించితో

భూతగణాధినాధుని సుపుత్రుడ!షణ్ముఖ సోదరా ! మహ

ర్జాతక! కాణిపాకనగరాధిప! నీకివె మానమస్కృతుల్.

వందే గణనాయకమ్.

1. ప్రథమ తాంబూలమర్పించి ప్రాంజలింతు

విఘ్నరాజుగ స్తుతియించి వేడుకొందు

కార్యమేదేని తలపెట్టి ఘనతజెంద

దొడ్డగణపయ్య ననుగావు దురితహరణ!

2. అమ్మ పార్వతి మలచిన బొమ్మవీవు

అయ్య కరుణరేఖల వెనకయ్యవీవు

పందెమందున తమ్ముని ప్రక్కనిడిన .

దొడ్డగణపయ్య ననుగావు దురితహరణ!

3. నిన్ను పరిహాసమాడిన నేరమునకు

శాపమందెను నిర్దయ చంద్రుడపుడు

ఘనత మీరగ సతతంబు గారవింతు.

దొడ్డగణపయ్య ననుగావు దురితహరణ!

4. మాతపితలను సేవించు మార్గమొకటె

సకలసౌఖ్యాల గనియంచు చాటినట్టి

జ్ఞానివీవయ్య వెనకయ్య!మానితుండ!.

దొడ్డగణపయ్య ననుగావు దురితహరణ!

5. ఇర్వదొక్కటి పత్రాల నింపుగాను

పూజలందుచు భక్తుల మోదమలర

మోక్షమందించు పరమాత్మ! పుణ్యపురుష!.

దొడ్డగణపయ్య ననుగావు దురితహరణ!

6. గరికపూజకె ముదమంది దురితములను

పారద్రోలెడు పరమాత్మ! భవ్యచరిత!

కార్యసిద్ధిని గూర్చెడు ఘనుడవీవు..

దొడ్డగణపయ్య ననుగావు దురితహరణ!

7. మోదకంబుల నర్పింప మోదమంది

వెనుకముందులుజూడక మనుజులకును

సర్వవిజయాలు గూర్తువు సాధువదన!.

దొడ్డగణపయ్య ననుగావు దురితహరణ!

8. గర్వపడినట్టి తమ్ముని గర్వమణచి

వినయశీలంబె సర్వత్ర విజయమంచు

చాటిచెప్పిన ఘనుడవు మేటివయ్య!.

దొడ్డగణపయ్య ననుగావు దురితహరణ!

9. సర్వసైన్యాధిపత్యంపు సాధనాన

నీవు జూపిన ప్రజ్ఞకు నీరజాక్ష!

మిగుల నాశ్చర్యమొందెను మిన్ను మన్ను.

దొడ్డగణపయ్య ననుగావు దురితహరణ!

10.పంటలన్నియు సతతంబు పాడుసేయు

ఎలుక మీదను నీవుండి యెఱుకగూర్చి

జ్ఞాననేత్రంబునిచ్చిన జ్ఞానివీవు.

దొడ్డ గణపయ్య ననుగావు దురిత హరణ!


స్వస్తి.

దొడ్డ గణపయ్య అనుగ్రహాన్నందుకొనిన సహోదరులకు అభినందనలు.

ధీయుత పొన్నెకంటి కుల దీపిత పండితమాన్య! సూర్యనా

రాయణరావు సోదరుఁడ! రమ్య మహాద్భుత సత్ కవిత్వ బో


ధాయత ప్రార్థనా కలిత హారమునా గణనాథునెన్నుచున్


చేయఁగ జాలినట్టి వర చేతన! నీకు నమస్కరించెదన్.

జైహింద్.

Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారి " వినాయక స్వామి రచన రసరమ్యము గానున్నది .మా కందించిన శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

P.suryanarayana rao చెప్పారు...

1వ పద్యం, 3వ పాదంలో "మూషికాధిపా"కు బదులుగా "ఆఖువాహనా"యని చదువు కొనవలసినదిగా హృదయపూర్వక మనవి.పొరబాటున కు క్షంతవ్యుడను. ....పొన్నెకంటి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.