గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, ఆగస్టు 2017, గురువారం

శ్రీసూక్తము. రచన. శ్రీవల్లఝల శ్రీరామ చంద్ర మూర్తి. చోడవరము.

 జైశ్రీరామ్.
 శ్రీసూక్తము. రచన. 
శ్రీవల్లభవఝల  శ్రీరామ చంద్ర మూర్తి. చోడవరము.
(వీరు శ్రీవల్లభ కవికి సహోదరులు)
1.ఆ.వె. శ్రీ గణాధిపతిగ సిరులను గూర్చుచు
           విద్య బుద్ధు లొసగి వినయ మొప్ప
          నిన్ను గొల్చు నట్టి నిర్మల భక్తుండ
          సాయమౌచు గావు శంభు తనయ.
2.ఆ.వె.తల్లి మాట నిలుప తలపడి తండ్రితో
            ప్రాణ మిచ్చి నట్టి ప్రాజ్ఞు డీవు
             సర్వ రక్ష సేయు సద్యశు రాలామె
           పాద పద్మములకు ప్రణుతు లిడుదు.
3.ఆ.వె. విష్ణు ముర్తి సతిగ విశ్వము నందున
           భూమి రూపు దాల్చె పుణ్య చరిత
          సకల జీవులకు సకలమ్ము గూర్చుచు
          జనము బ్రోచు పృధ్వి సద్యశశ్వి.
4.ఆ.వె. ఒకలుచిల్లుబబెట్టి యొక విత్తు నాటగ
            పెంచి చెట్టు జేసి పేర్మి మీర    
           మధుర ఫలము లిచ్చు మాన్యు రాల.
           జగతి పోషణ కరి జగన్మాత.
5.ఆ.వె. కాలు చేత కుమ్మ కాదన వేనాడు
            హలము తోడ దున్న కలత పడవు
           నాభి వరకు నాళమ్ము జేసిన.
          సుజల ధార నిచ్చు సుగుణ రాశి.
6.ఆ.వె. ప్రాణి కోటి కెల్ల ప్రాణవాయువు నిచ్చి
            కడుపు నిండ తిండి కలుగ జేసి
            గూడు నీడ గూర్చి గుబులు లేనట్టుల
           కాచు పృధ్వి తల్లి కల్పవల్లి.
7.ఆ.వె. అమ్మ పలుకు నట్టి అమృతపు వాక్కులె
            భవితకంత కదియె బంగరగును
           తల్లి మాట వినని తనయు డెన్నటికిని
           కల్ల బాగుపడుట కనుము నిజము.
8.ఆ.వె.అమ్మ క్షుదను దీర్చు ఆకలి కానీదు
           కంటి రెప్పవోలె కాచు చుండు
          ఇల్లు వదలి వెడలఇల్లు చేరుదనుక
         యెదను బెంగ తోడ ఎదురు చూచు.
9.ఆ.వె.ఆవు పాలకన్న అమృతము కన్నను
           జుంటె తేనె కన్న జున్ను కన్న
           పంచదార కన్న పాల మీగడ కన్న
           అమ్మ పాలె మిన్న అవని యందు.
10.తే.గీ. కడుపు పండిన దాదిగ కలలు కనుచు
              జనన మగునట్టి  బిడ్డని స్మరణయందె
              తగిన పథ్యంబు సేయుచు దనరుచుండు
              కలల బిడ్డను కనులార గాంచ దలచి.
11.ఆ.వె. కడుపు లోని బిడ్డ కదలక యున్నను
                కలత చెందు మదిని క్షణము క్షణము
               దిక్కు నీవె యనుచు దేముని మ్రొక్కుచు
              తల్లి మనసు బహుగ తల్ల డిల్లు.
12.ఆ.వె.గర్భమందు బిడ్డ కాళ్ళ చేతుల గ్రుమ్మ
              కనులు చెమ్మ గిల్లు కలత మాయు
              చిన్ని బాబు యొక్క చిన్ని పాదముల
             తగుల తెప్ప రిల్లు తనువు యనుచు.
13.తే.గీ. తాను యేమగు తెలియని తల్లి మనసు
             బిడ్డకిని జన్మ నీయగ ప్రేరితమయి
              ప్రాణములనైన పెట్టును ఫణముగాను
            అమ్మ మనసంత గొప్పదై యవధరించు.
14.ఆ.వె. అమ్మదనము కంటె కమ్మదనమేముంది
               అమ్మ దనమె కోరు నతివ యెపుడు
              లాల పోసి తల్లి లాలించు బిడ్డను
             చీమ కుట్ట మనసు చివుకు మనును.
15.ఆ.వె.కలువ రేకులంటి కనులుండు ననుచును
              కవిత లల్లినారు కవులు మున్ను
              కలువ రేకు వెనుక కరుణార్ద్ర మున్నది
              కాంచు వాడె మిగుల ఘనుడు సుమ్మ.
16.ఆ.వె.పద్మ దళములంచు పరిపరి విధముల
             ప్రస్తుతించి నారు ప్రముఖు లెంతొ
            మాతృభావమరయ మమతలొలుక జేయు
           మమత ఘనము గాదె మగువ కెపుడు.
17.ఆ.వె.ఆడదనమునంత అమ్మదనముజేసి
              కన్న బిడ్డ కెంతొ కరుణతోడ
             చన్ను పాలు కుడిపి చంకన బెట్టెడి
              అమ్మ లాలనెంతొ అద్భు తమ్ము.
18.ఆ.వె.అక్క చేయి బట్టి నడుగులు వేయించి
              ముద్దు పల్కులెన్నొ ముదము నేర్పి
               బడికి దారి చూపు బంగరు దేవిగ.
             వందనీయ మమ్మ వనిత నీవు.
19.ఆ.వె.పుడమి లేక యున్న పుట్టవు జీవులు
             బ్రతువు తెరగు లేప్ప్రాణులకును.
              జీవకోటి కెల్ల జీవము కరువగు 
               బ్రహ్మ సృష్టి యంత భగ్న మగును.
20. ఆ.వె.తనువు నిచ్చి నట్టి తల్లి క్షేమ మరసి
                స్వంత సుఖములెల్ల కొంత వీడి
              తల్లి పాదరజము తలపైనిడుకొనని
               బ్రతుకు వాడె పుడమి భాగ్య జీవి.
21.ఆ.వె. అమ్మ మాట జగతి కానంద మూలంబు
               అమ్మ మాట గూర్చు నెమ్మ నంబ్ 
               అమ్మ మాటె మదికి యలసట రానీదు
                అమ్మ మాటె జూపు నవని దారి.
22 .ఆ.వె.ఆది గురువు యమ్మ ఆత్మ జ్ఞానియె మాత.
              తమము బాపు నట్టి తరుణి యామె
             ఆపదలను మాత అక్కున జేర్చును
             వృద్ధి సేయు నీదు పెద్దరికము.
23.ఆ.వె. అమ్మ పాలతోడ నాయువు జేకూరు
               అమ్మ పాలతోడ యలుపు దీరు
              అమ్మ పాలె బిడ్డ కాధార భూతమ్ము
             అమ్మ పాలు నిండు యమ్మలార.
24.ఆ.వె. తప్పటడుగు లేయ తగదని వారించు
              మంచి నెపుడు జూపు మనకు మాత
             పొల్లు మాట లెల్ల వల్ల కాదనుచును
             మంచి నేర్పు నెపుడు మనకు మాతఆది
25 ఆ.వె. ఆది లక్ష్మి రూపె యవనిలోనాడుది
              కాళి రూపు నామె కాచు చుండు
               ధనము ధాన్య మొసగుధనలక్ష్మి యామెయె
              పాడిపంటలెపుడు బడయ జేయు.
26.తే.గీ. మృదుల మంజుల భాషణ ముదము మీర
               హేమ సుందర రూపున నెనరు చుండు
              సకల సద్గుణ రాశియై సరగు నట్టి
             ఆది లక్ష్మియె ననదగు నతివ నెపుడు.
27.తే.గీ. చేయి పట్టుకు నెన్నడు చెంత నిల్చు
               ఆట పాటలందున యన్న తోడ
               చెలిమి బలిమికి రూపమై చెంత నిల్చు
               చెల్లి ప్రేమయె అన్నకు కల్మిగాదె.
28.ఆ.వె. పుట్టి నింటి కెంతొ పుణ్యాల రాశియై
               మెట్టి నింటి కేగు తట్టు నందు
              మనసు కలత చెందు మమతల బంధాన
               కన్న ప్రేమ వదలి కదులు నపుడు.
29.ఆ.వె. ఆడదే యటంచు నాడి పోయగ రాదు
               ఆడదెప్పుడైన యాది శక్తి
               కరుణ జూపి నంత కల్ములు కురిపించు.
               తల్లి రూపు జూడు తరుణి యందు.
30.ఆ.వె. వలయు పుస్తకములు వరుసనుపేరిచి 
               సంచి లోన బెట్టి చంక బెట్టి
             బడికి వెళ్ళి రార బంగారు నాతండ్రి
            అనుచు సాగ నంపు అమ్మ బడికి.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ వల్లభవఝులవారి సహోదరులు శ్రీ శ్రీరామ చంద్ర మూర్తిగారి శ్రీ సూక్తము ఆటవెలదులతో అద్భుతముగా నున్నది . ధన్య వాదములు

అజ్ఞాత చెప్పారు...

Meaningful poems sir

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.