గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, ఆగస్టు 2017, ఆదివారం

రామాయణం యొక్క విశేషములు ఏమిటి? శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ.

జైశ్రీరామ్.
రామాయణం యొక్క విశేషములు ఏమిటి?
శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ.
మన సంస్కృత వాఙ్మయం లో ,ఎటువంటి పెద్ద పెద్ద ఒత్తులతో కూడిన పదాలు లేకుండా ఏ కాస్త భారతీయ భాషలలో ఏ భాష తెలిసిన వారైనా సరే(ముఖ్యంగా తెలుగు వారు) కొద్దిగా ప్రయత్నం చేస్తే చదవ గలిగిన గ్రందాలు రెండు ఉన్నాయి ఒకటి భగవద్గీత రెండవది రామాయణం.
మన సంస్కృతీ గొప్పదనం ఇప్పటి వరకు నిలబడి ఉంది అంటే కారణం రామాయణ,భారతాలు. మన సమస్త వాగ్మయం కనుమరుగై పోయిన(అమంగలం ప్రతిహతమగు గాక,అటువంటిది జరుగకుండు గాక) రామాయణం ఒక్కటి ఉంటే మళ్ళీ మన సమస్త వాఙ్మయాన్ని సృష్టి చేసుకోవచ్చూ.అంత గొప్పది రామాయణం . కొన్ని సంవత్సరాల పాటు వాల్మీకి తపస్సు చేయగా ఫలితంగా రామాయణం ఆవిర్భవించింది. రామాయణం 24,000 శ్లోకాలతో కూడినది.ప్రతి 1000 శ్లోకాలకు ఒక గాయత్రీ మంత్ర బీజాక్షరం చొప్పున వాల్మీకి మహర్షి కూర్పుతో రచన చేసాడు.రామాయణం "తపస్వాధ్యాయనిరతం తపస్వి వాగ్విదాం వరం(నిరంతరం స్వాధ్యాయం,తపస్సు చేసుకుంటున్న '"అని ప్రారంభమవుతుంది అనగా జీవితంలో ప్రతి పనిని తపస్సుగా చేయమని "తప" అని ప్రారంబిoచారు.అలా చేస్తే ఏమవుతుంది అంటే రామాయణము చివరి శ్లోకం చెబుతుంది "జనశ్చ శూద్రోపి మహాత్వ మీయాత్"(దీని తర్వాత కొన్ని శ్లోకాలు ఉన్నప్పటికీ ఈ శ్లోకాన్ని చివరి శ్లోకంగా పెద్దలు నిర్ణయం చేశారు)అని మహాతత్వాన్ని పొందుతాడు. అనగా జీవితాన్ని తపస్సు లా మలుచుకుంటే వారు మహతత్వాన్ని సాధిస్తారు అని రామాయణ సందేశం.అది ఎలా సాధించాలో కూడా మనకు రామాయణం ఆదర్శం.
ఇక్కడ వచ్చే ప్రశ్న జీవితాన్ని తపస్సు గా మార్చుకోవడం ఎలా?
తపస్సు అంటే ఎదో అడవులలోకి వెళ్లి నాసాగ్రం (భ్రూమధ్యం) మీద ధ్యాస పెట్టి చేసేది కాదు. ప్రతి పని చేస్తున్నప్పుడు చేస్తున్నదప్పుడు "నేను" అనే భావం విడిచి తన కు విధించిన కర్తవ్యాన్ని, వాడు(ఈశ్వరుడు)నిర్ణయం చేసాడు,వాడి కొరకు,వాడి పనిని తన చేత చేయఁచుకుంటున్నాడు అనే భావం రావడం.ఈ భావం కుదురుకున్న వాడు ఎదో పెద్ద మార్పు (బయటి ఆడంబరాల్లో మార్పు)వాడిలో వస్తుంది అనుకోవద్దు రోజు తన పనులు ఏ విధంగా చేసుకుంటున్నాడో అలాగే చేసుకుంటాడు కానీ లోపల తన భావంలో తేడా వస్తుంది.ఉదాహరణకు రోజు భోజనం ఎలా చేస్తాడో అలాగే భోజనం చేస్తాడు కానీ మనసులో - "లోపల (కడుపులో) వైశ్వానరాగ్ని గా పరమేశ్వరుడు వున్నాడు వాడి కొరకు ,వాడు ఇచ్చిన అన్నాన్ని,వాడి ప్రసాదంగా స్వీకరిస్తున్నాను" అని భోజనమ్ చేస్తాడు.ఇలా ఏ పనైన ఆ భావంతో(పరతత్వ భావన) చేస్తాడు.అప్పుడు వాడి నడక ప్రదిక్షణం అవుతుంది వాడి నిద్ర సమాది అవుతుంది,వాడి పలుకు ఈశ్వర వాక్కు అవుతుంది.అటువంటి స్థితికి మన లౌకిక కార్యములు చెడకుండా మహతత్వం వైపు తీసుకెళ్లేదే రామాయణం.
రామాయణాన్ని 3 స్థాయిలలో అర్థం చేసుకోవలసి వుంటుంది.
1. ఆది భౌతిక కోణం
2. ఆది దైవిక కోణం
3. ఆధ్యాత్మిక కోణం
1. ఆది భౌతిక కోణం:
ఇందులో రామచంద్ర మూర్తి ని నరుడిగా భావన చేసి ,సీతమ్మని మానవ వనితగా భావన చేసి వారి హృదయం (రామ హృదయం ను,సీత హృదయం ను)ను అర్థం చేసుకొని వారిని ఆదర్శంగా తీసుకొని వాటిని జీవితానికి అన్వయం చేసుకోవడం వలన జీవితం ధర్మబద్దమవుతుంది.ప్రతి నిర్ణయానికి ముందు కాసేపు ఆగి ఈ situation రాముడికి వస్తే తాను ఏ విధంగా react అవుతాడు (రామాయణం చదువగా చదువగా రామ హృదయం అర్థమైన తర్వాత ఈ స్థితి వస్తుంది)అని ప్రశ్న వేసుకొని ఆ విధంగా చేస్తే మనం ఏ శాస్త్రములు చదువకున్నా మన జీవితం ధర్మ బద్దం చేయబడుతుంది.
రాముడు తండ్రి దగ్గర పుత్రునిగా ఎలా వున్నాడు,తమ్ముడి దగ్గర అన్నగా ఎలా తప్పులను సరిదిద్ధి ధర్మ మార్గంలో తమ్ముళ్లను ప్రవేశ పెట్టాడు,స్నేహితుడికి కష్టం వస్తే తనకే వచ్చినట్టుగా ఎలా ఏడ్చాడు తన స్నేహితుని కష్టం తీర్చడానికి ఏ విధంగా ప్రయత్నించాడు,శరణు అన్నా వారిని ఎలా రక్షించాడు,ఏ విధంగా ఇతరుల పై ప్రేమ చూపించే వాడు అనే అనేక విషయములు రాముని నుండి నేర్చుకోవచ్చు.అందుకే పెద్దలు చెప్తారు"రామాత్ వర్తితవ్యం న రావణాత్(రాముని వలే ప్రవర్తించవలెను రావణుని వలె కాదు)"అని.
స్త్రీ పతివ్రత ధర్మాలు సీతమ్మ నేర్పిస్తుంది.
ఇవే గాక,
1.ఒక అధికారికి గాని,అధికారికి సలహాలు ఇచ్ఛే వారికి గానిస్వార్థపూరిత ఆలోచన వస్తే దేశం ఎలా ఏడుస్తుందో రామాయణం చూపిస్తుంది.కైకేయి తన కుమారుడు రాజు కావాలన్న స్వార్థపు ఆలోచన ముగ్గురిని వితంతువులను చేసింది,నలుగురు కుమారులకు తండ్రి లేకుండా చేసింది,దేశానికి రాజు లేకుండా చేసింది అంతే కాదు ఎవరి కోసం రాజ్యం ఆడిగిందో ఆ భరతుడు 14 సంవత్సరాల పాటు నరక యాతన అనుభవించాడు.కాబట్టీ ఒక రాజకీయ నాయకుడికి స్వార్థం ఉంటే దేశం ఎలా ఏడుస్తుందో చూపిస్తుంది రామాయణం.
2. త్యాగంతో జీవితాన్ని గడిపితే("తేన త్యక్తే న భుంజీత" )చరిత్రలో ఏ విదంగా చరిత్రలో నిలిచి పోతారో చూపిస్తుంది రామాయణం. (రామాయణం మొదట రాజ్య త్యాగం,రామాయణం చివర దారా పరిత్యాగం)
రామాయణంలో ముగ్గురు అన్న తమ్ముళ్లు కనిపిస్తారు రామలక్ష్మణ భరతశత్రఘ్నులు,వాలిసుగ్రీవ,రావణ కుంభకర్ణ విభిషేణులు. రాజ్యం తనకు వచ్చిన స్వీకరించడానికి ఏడ్చి భాదపడిన వాడు ఒకడు, అన్న ను చంపి రాజ్యం తీసుకున్న వాడు ఒకడు, రాజ్యం తనకు రాదని తెలిసి అన్న శత్రువుల వైపు వెళ్లి అన్నను చంపించాడు ఒకడు ఎవరు నిలిచిపోయారు చరిత్రలో?
3. ధార్మిక జీవితాన్ని ఎలాగడపాలో నేర్పిస్తాడు రాముడు "రామో విగ్రహవాన్ ధర్మ:"అని.
2. ఆది దైవిక కోణం:
ఇందులో రాముణ్ణి శ్రీ మహా విష్ణువుగా,సీతమ్మని శ్రీ మహా లక్ష్మి గా భావన చేసి రామాయణాన్ని చదువుతారు.
ఇలా చదివితే రామాయణం ఇంకొక కోణం లో అర్థం అవుతుంది.రాముడు తాను నరుడనే చెప్పుకుంటాడు కానీ ఎవరూ ఆయనను నరుడు అనుకున్నట్టు కనిపించదు.లక్ష్మణుడు ,భరతుడు,విశ్వామిత్రుడు,వశిష్ఠుడు,సుమిత్ర,తార,మండోదరి,మారీచుడు,జటాయువు,హనుమ ,గుహ స్వామి ఇలా ఎందరో రాముని గురించి మాట్లాడినప్పుడు రాముడు నరుడు అన్న భావనతో వారు మాట్లాడలేదు.విశ్వామిత్రుడు అంటాడు "అహం వేద్మిమహాత్మానం రామం దశరాత్మజాం వశిష్టోపీ మహా తేజ ఏ తే మె తపసి స్థితాః"అంటాడు రాముడు ఎవరో నాకు తెలుసు వశిష్ఠుడికి తెలుసు,తపస్సులందరికి తెలుసు అంటాడు.లక్ష్మణుడు ఈశ్వరభక్తి లో ఈశ్వరుని విడిచి పెడితే బ్రతక లేనటువంటి దాస్య భక్తి ని చూపిస్తాడు,స్నేహ భక్తి ని సుగ్రీవుడు, శరణాగతి ని విభీషణుడు,భగవత్ భక్త సేవను శత్రజ్ఞుడు ,శబరి గురు భక్తిని,తపస్సు చేసి ఋషులు ఏతత్ ఫలం రామార్పణం అని వారి తపస్సును రామునికి ఇస్తారు ఇలా ప్రతి ఒక్క పాత్రకు రామాయణం లో రాముని తో ప్రత్యక్ష అనుబంధం.
3. ఆధ్యాత్మిక కోణం:
ఇందులో రాముణ్ణి ఆత్మ గా,సీతమ్మని జీవునిగా భావన చేసి రామాయణాన్ని చదువుతారు.
మొదట జీవుడు పరమాత్మ తో కలిసే ఉంటాడు(గురువు(విశ్వామిత్రుడు)వచ్చి జీవుడిని పరమాత్మ ను కలుపుతారు (సీతారామ కళ్యాణము))తరువాత జీవుడు గుణములకు(సత్వ రజో తమో) లొంగి, విషయ వాంఛల(బంగారు లేడి)కు లోనై పరమాత్మ(రాయుడు) తో వియోగం పొందుతారు . జీవుడిని తీసుకొని వెళ్ళేది మనస్సు(రావణుడు) అప్పుడు జీవుడు మనస్సు కు లొంగకుండా తపస్సు చేస్తే మళ్ళీ పరమాత్మ తో సంయోగం లభిస్తుంది. అని జీవుడిని ఉద్ధరించుకోవాదానికి సాధన రహస్యాల చాలా చెబుతుంది. నేను కథ నంత ఒక దగ్గర పెట్టి overall గా చెప్పాను కానీ ఒక్కొక్క కాండలో సాధన రహస్యాలు ఎన్నో చెప్పబడ్డాయి.
ఉదాహరణకు బాలకాండ తీసుకోండి
ఇందులో
రాముడు-ధర్మమ్
లక్ష్మణుడ-అర్థం
భరతుడు-కామ
శత్రజ్ఞుడు- మోక్షం
మాములుగా వయస్సు ప్రకారం చెప్పాలి అంటే రామ భరత లక్ష్మణ శత్రజ్ఞులు అని చెప్పాలి కానీ మనం రామలక్షమన,భరత శత్రజ్ఞులు అని చెప్తాం ఎందుకంటే అర్థం ఎప్పుడు ధార్మికంగా ఉండాలి,కామం ఎప్పుడు మోక్షం వైపే ఉండాలి అనే విషయాన్ని తెలియచేయడానికి.
ఇలా ఆలోచన చేస్తే మూడు కోణాలతో ఆలోచన చేస్తే రామాయణం గొప్పదనం ఎంతో తెలుస్తుంది.
రామాయణం లో ఉన్న 24వేల శ్లోకాలలో దాదాపుగా 15వేల శ్లోకాలకు పైగా ఈ 3 రకాల అర్థాలను చెప్పవచ్చూ అలా పుస్తకాలు రాసిన మహా పురుషుల వున్నారు.
ఇవే కాక రామాయణం లో గోప్ప గణిత శాస్త్రం ఉంది దానిని రెమెళ్ళ అవదానులు గారు వారి వైదిక గణిత లో వివరించారు.
ఖగోళ శాస్త్రం గురించి సుగ్రీవుడు సీతమ్మను వెతికే సమయంలో చెప్తాడు,సైకాలజీ, తత్వ శాస్త్రం,మేనేజ్మెంట్ .ఇలా అనేక విషయాల సమాహారం రామాయణం.
సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలంకుంటున్న ప్రతి వారి ఇంట ఉండవలసిన గ్రంధం రామాయణం, చడవవలసిన గ్రంధం రామాయణం, ఆచరించవలసిన గ్రంధం రామాయణం
శ్రీ Satyanarayana Choppakatla వారికి ధన్యవాదములు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.