జైశ్రీరామ్.
షోడష గీత రత్న మాలిక
రచన. వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
1.తే.గీ.తల్లి భూమాత కెనయైన తల్లి మగువ
బాల్య కౌమార్య యవ్వన భాగ్య రాశి
శక్తి రూపిణి సంతాన చతురురాలు
కన్న పిల్లల శ్రేయంపు కాంక్షదనరు.
2తే.గీ.పతిని దైవముగా నెంచు పరమ సాధ్వి
పది నెలలు మోసి కనిపెంచు పట్టుకొమ్మ
కొమ్మ యలివేణి పూబోణి కూర్మి పరద
వరదయానిధి శ్రీలక్ష్మి వనిత పుడమి.
3.తే.గీ.సేవలందించు దాసిగా సిరులతల్లి
మంచి సలహాల నిచ్చును మంత్రి పగిధి
భోజ్య సమయాన మాతగా భుక్తి దీర్చు
శయన తరుణాన రంభగా సరగు నామె.
4.తే.గీ.మనసు సుమసమ మనబొల్చుజనని యామె
కాయ కష్టాల కోర్చుచు కడవరకును
కదులు చుండును సుతరుల కష్ట మెంచి
మదిని బాధిలు నాపెను మరువ రాదు.
5.తే.గీ.జనని లేకున్న జన్మంబు జగతి లేదు
ఆది గురువామె పుడమిని యన్నపూర్ణ
సుతుల ప్రాపు నేపును జూచు సుగుణరాశి
మరచి జీవించు జన్మంబు మట్టి ముద్ద.
6.తే.గీ.బద్ధకంబును పోజేసి బ్రతుకు తెరవు
నుగ్గు పాలతొ నేర్పెడి నువిద తల్లి
ప్రకృతి కాంతగ భాసిల్లు ప్రాభవాన.
చాన కులకాంత సీతమ్మ సమము సుమ్మ.
7.తే.గీ.ఆది పితరుల సమమైన యమ్మ నాన్న
పార్వతీ పరమేశ్వర భాతి నెంచి
దైవ సమముగ భావించి దనరువారు
వర సుఖంబుల వరలెడు వారు సుమ్మ.
8.తే.గీ.నీతి నీమాల నడిపించు నీతిచరణ
మాత జగదైకమాత నీమంత్రణమున
భవిత కీర్తులు పెంపొందు భరతనారి
సుగుణ సంపన్న మాయమ్మ శుభగదాయి.
9.తే.గీ.భద్ర కర్ణుండు గణపయ్య భద్రమేర్చ
వల్లభేశుడు వరదాల వరలనీయ
తల్లి నర్ధింతు ననుబ్రోవ ధరణి యందు
పరమ దీర్ఘాయు రారోగ్య భాగ్యములను.
10.తే.గీ.భారతావని వరకాంత పట్టుగొమ్మ
సిరుల నెలవైన సీమగ చిగురు బొడమి
పరుల దృష్టియు సోకగా పాడుపడెను
స్వేచ్ఛవాయువు గానక చిన్నతల్లి.
11.తే.గీ.అట్టి మనయమ్మ కీనాడు నందె స్వేచ్ఛ
పట్టి దిగ ద్రొక్క కీర్తిని వలదు సుమ్మ
తల్లి శాపము నందుట తప్పుతప్పు
బానిసత్వము రప్పింప బాగు గాదు.
12.తే.గీ.పరుల మోసము జేయుట పాపమౌను
నీతి వీడుట ముప్పగు జాతి కెల్ల
మాతృ శోకంబు గల్గింప మాయు కీర్తి
తెలివి నిస్వార్ధ పాలన తేజ మలరు.
13.తే.గీ.గండు యంత్రాల సాయాన గడిని మీరి
గర్భ నిక్షిప్తములు లాగి కలత గూర్చి
తల్లి శోకింప జేయంగ దనరు కతన
కలత నందెను భూమాత తాళ లేక.
14.తే.కోరకనె యిచ్చు ఫలములు కూర్మి తరులు
తినగ తిండిని యందించు దివమహములు
జలములొసగును మేఘుడు జనజగతికి
ప్ప్రకృతి వరదామ భూమాత రమము గూర్చు.
15.తే.గీ.వర చరాచర జగత్తు వాసి గాంచె
పుణ్యములపంట మనతల్లి పుడమి కాంత
మాత దైవము కీర్తింప మనుగడకును
శాంతి సుఖములు జేకురు సత్య మిదియె.
16.తే.గీ.తల్లి భూమాత గోమాత తరుల కాంత
తల్లి గంగమ భూజాత తరుణి సీత
మాత పార్వతి మాతృక మనెడు జనుడు
వర మనీషిగ పేర్కొన బడును భువిని.
జైహింద్.
1 comments:
నమస్కారములు
స్త్రీ యొక్క ప్రాభవాన్ని వర్ణించిన షోడష గీత రత్న మాలిక రసరమ్యముగా నున్నది.శ్రీ వల్లభవఝుల వారికి అభినందనలు .అందించిన సోదరులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.