జైశ్రీరామ్.
శ్రీ కృష్ణమ్ వందే జగద్గురుమ్.
ఆర్యులారా! నేడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మాష్టమి. ఆపరమాత్మ యొక్క పాదారవిందములకు త్రికరణ శుద్ధిగా ప్రణమిల్లి, తనను విశ్వశించు వారి యోగక్షేమములను వహించు విషయములో ఉపేక్షించ వలదని మనసారా కోరుకొంటున్నాను. ఆ పరమాత్మ యొక్క దృగమృతము మీకు ప్రాప్తించుగాక.దేవకీ గర్భ సంజాత! దేవదేవ!
నిన్ను నమ్మిన భక్తులందున్నవాడ!
మేలు కూర్చఁగ సంకోచమేలనయ్య?
కాచి మమ్ముల రక్షించు కరుణ చూపి.
చిన్నికృష్ణయ్య మాయన్న యన్నవారు,
కన్నయా! యని నినుఁగనుచున్నవారు,
తమ్ముడా! మాకు నీవె మొత్తమ్మటంచు
నమ్మి యున్నట్టి యక్కల నయతఁ గనవొ?
నీదు పుట్టిన రోజని మోదమలర
నిన్నలంకరించుచు చూచుచున్నవారు,
బెల్లమటుకులు నీకిచ్చి యుల్లమందు
పొంగిపోవుచు నిన్జూతురంగనలిట.
చిలిపి కృష్ణుఁడ! మా దరి చేరి నిలుము.
నీవు కలవన్న ధైర్యంబు నేర్పునన్ని.
బ్రతుకగలవారమీవున్నభక్తిఁ జూపి,
వరములిమ్మని కోరము. సరస నున్న.
సప్తవింశత్యధిక ద్వివిధ కంద, గీత, గర్భ చంపకమాల.
భర! కనవేమిరా! పరమ పావన కృష్ణుఁడ బ్రోవ వేమిరా?
చిర ఘన తేజసా! తిమిర జృంభణ బాపర! దీన బంధువా!
స్థిర! వినవేమిరా! నృహర! తృప్తిని నిన్గన నేర్పి యేలుదే?
వర గుణధీ నిధీ! సుగుణ భావన లీయవ? శోభఁ గూర్పవా?
చంపక గర్భస్థ తేటగీతి.
పరమ పావన కృష్ణుఁడ బ్రోవ వేమి?
తిమిర జృంభణ బాపర! దీన బంధు!
నృహర! తృప్తిని నిన్గన నేర్పి యేలు!
సుగుణ భావన లీయవ! శోభఁ గూర్ప!
జైహింద్.
1 comments:
నమస్కారములు
శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భముగా అందరికీ శుభా కాంక్షలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.