జైశ్రీరామ్.
ఆర్యులారా! గానానుకూల ఛందస్సమన్వితములైన రగడలను గూర్చి తెలుసుకొందాము.
రగడలు ద్విపదలు. వీనికి ప్రాస మాత్రమే కాక అంత్యప్రాస కూడ అవసరము.యతి తప్పక నుండవలెను.
అనంతామాత్యుని ఛందోదర్పణములో
ఆద్యంతప్రాసంబులు - హృద్యంబుగ రెంట రెంట నిడి పాదములు
ద్యద్యతులఁ గూర్పఁదగునన - వద్యంబగు రగడలందు వారిజ నాభా.
అని రగడను నిర్వచించి, తెలుగులో 9 రకములైన రగడలు చెప్పెను. 1.హయప్రచార రగడ - 4(త్రిమాత్రలు)సూ.గ, 7వ మాత్ర యతిస్థానము. (త్రిశ్ర, 1.1, 3.1)
ఉదా. హన చతుష్టయంబు ఋతుల
జనిత యతుల జరుఁగుఁ గృతుల.
2.తురగవల్గన రగడ - 8(త్రిమాత్రలు)సూ.గ, 13వ మాత్ర యతిస్థానము. (త్రిశ్ర, 1.1, 5.1)
ఉదా. శ్రీసతీశు పరమ పురుషుఁ జిత్తమునఁ దలంచువారు
వాసవాది నిఖిల దివిజ వంద్యునాశ్రయించువారు.
3.విజయమంగళ రగడ - 16(త్రిమాత్రలు)సూ.గ, 13-25-37వ, మాత్రలు యతిస్థానము.(త్రిశ్ర, 1.1, 9.1)
ఉదా. శ్రీధరాయ శిష్ట జననిషేవితాయ భక్త లోక జీవితాయ గర్వితోరు సింధురాజ బంధనాయ
గాధి పుత్ర యజ్ఞ విఘ్నకర మహా సురీ మహోగ్ర కాయశైల దళననిపుణఘన సురాధిపాయుధాయ.
4.ద్విరదగతి రగడ - 4పంచమాత్రలు, 11వ మాత్ర యతిస్థానము. (ఖండ, 1.1, 3.1)
ఉదా. శ్రీ యువతి నిజ యువతిఁజేసి యెంతయు మించి,
కాయజునిఁ దన తనయుఁగా నెలమిఁ బాటించి.
5.జయభద్ర రగడ - 8పంచమాత్రలు, 11-21-31వ మాత్రలు యతిస్థానము. (ఖండ, 1.1, 5.1)
ఉదా. శ్రీకి నొడయండనఁగఁ జిత్తజుని గురుఁడనఁగ శేషశయనుండనఁగఁ జెలువుగఁ జతుర్భుజుఁడు
నాకౌకసులనేలునముచిసూదను పూజ నడుమఁదాఁగైకొన్న నంద గోపాత్మజుఁడు
6.మధురగతి రగడ - 4చతుర్మాత్రలు, 9వ మాత్ర యతిస్థానము. (చతురస్ర, 1.1, 3.1)
ఉదా. శ్రీవనితాధిపుఁజేరి భజింపుఁడు
భావజ జనకుని భక్తిఁదలంపుఁడు.
7.హరిగతి రగడ - 8చతుర్మాత్రలు, 17వ మాత్ర యతిస్థానము. (చతురస్ర, 1.1, 5.1)
ఉదా. శ్రీరామా కుచ కుంకుమ పంకము చేఁ బొలుపగు విపులోరఃఫలకము
తార తుషార పటీర సమానోదక వాహిని యొదవిన పద కమలము
8.హరిణగతి రగడ - త్రి చతుర్ త్రి చతుర్ మాత్రలు, 8వ మాత్ర యతిస్థానము. (మిశ్ర, 1.1, 3.1)
ఉదా. శ్రీనివాసు భజింతు నేనని
పూని కుజనుల పొంతఁ బోనని
9.వృషభగతి రగడ - త్రి చతుర్ త్రి చతుర్ త్రి చతుర్ త్రి చతుర్ మాత్రలు., 15వ మాత్ర యతిస్థానము. (మిశ్ర, 1.1, 5.1)
ఉదా. శ్రీ మనోహరు నంబుజోదరుఁజిత్త జాత గురుందలంచెదఁ
గామితార్థవిధాయి నిర్జిత కాళియాహినినాశ్రయించెద.
మాత్రాబద్ధమైన పద్యములు, పాటలు పాడుటకు అత్యుత్తమమైనవి.
మూడు మాత్రల నడకను త్రిశ్రగతి యందురు. త్రిశ్రగతికి రూపక తాళము,
నాల్గు మాత్రల నడక చతురశ్రగతి యగును. చతురశ్రగతికి ఏక తాళము,
ఐదు మాత్రల నడక ఖండగతి యనబడును. ఖండగతికి జంపె తాళము,
మూడు, నాల్గు మాత్రలతో మిశ్రితమైన నడక మిశ్రగతి యగును.
మిశ్రగతికి త్రిపుట తాళము వాడుకలో నున్నవి.
చతుర్మాత్రలకు అట తాళము,
పంచమాత్రలకు ధ్రువ, మఠ్య తాళములు కూడ వాడబడినవి.
నమశ్శివాయరగడ .- చక్రపాణి రంగనాథు
శ్రీగిరీశ వశ్యమంత్ర సేకరము నమశ్శివాయ
ఆగమోపదిష్ట విధి మహాకరము నమశ్శివాయ
పంచవర్ణ పంచరూప భాసురము నమశ్శివాయ
అంచితానురక్త జిత గజాసురము నమశ్శివాయ
నయనరగడ - చక్రపాణి రంగనాథు
శ్రీశైల వల్లభుని శిఖరంబుఁ బొడగంటి
కాశీ పురాధీశు గౌరీశుఁ బొడగంటి
సర్వలోకేశ్వరుని సర్వేశుఁ బొడగంటి
సర్వసంరక్షకుని సర్వంబుఁ బొడగంటి.
సుదర్శన రగడ - తాళ్లపాక (అన్నమాచార్యుల కుమారుఁడు) తిరుమలయ్యంగారు
ఓంకారాక్షరయుక్తము చక్రము
సాంకమధ్యవలయాంతర చక్రము
సర్వఫలప్రదసహజము చక్రము
పూర్వకోణసంపూర్ణము చక్రము.
జైహింద్.
2 comments:
నమస్కారములు
రగడల గురించే తెలుసుకోవాలని చాలా రోజులుగా ఉన్న నాకోరిక ఇప్పడికి నెరవేరింది ధన్య వాదములు
రగడ గణ విభజనల గురించి చక్కటి సమాచారం అందించారు... కృతజ్ఞతలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.