గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, సెప్టెంబర్ 2015, ఆదివారం

అష్టాదశ పురాణాలు . వివరణాత్మక సమాచారం.

జైశ్రీరామ్.
అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు.
శ్లో. మద్వయం భద్వయం చైవ, బ్రత్రయం వచతుష్టయమ్ .
     అ.నా.ప.లిం.గ. కూ.స్కాని, పురాణ్యష్టాదశా స్మృతా .
గీ. మద్వయము భద్వయంబును మరియు బ్రత్ర
యంబు వచతుష్తయంబును ప్రియ అ.నా.ప.
లిం.గ.కూ.స్కాంధ. ముయ్యారు లెక్ఖనుండె
వ్యాస లిఖితమైన పురాణ భాగ్య మమరె.
మద్వయం: మ కారంతో ప్రారంభమయ్యేవి 2. అవి మత్స్య పురాణం. మార్కండేయ పురాణం.
భద్వయం: భ కారంతో ప్రారంభమయ్యేవి 2. అవి భాగవత పురాణం. భవిష్యత్ పురాణం.
బ్రత్రయం: బ్ర కారంతో ప్రారంభమయ్యేవి 3. అవి బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం.
వచుతష్టయం: వకారంతో ప్రారంభమయ్యేవి 4. అవి వాయుపురాణం, వరహా పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం.
అ కారంతో అగ్ని పురాణం, నా కారంతో నారద పురాణం, ప కారంతో పద్మ పురాణం, లి కారంతో లింగ పురాణం, గ కారంతో గరుడ పురాణం, కూ కారంతో కూర్మ పురాణం మరియు స్క కారంతో స్కంద పురాణం రచించిరి.
1. మత్స్య పురాణం: దీనిలో 14000 శ్లోకములున్నవి. మత్స్యావతారమెత్తిన విష్ణువుచే మనువుకు బోధింపబడినది. కార్తికేయ, మయాతి, సావిత్రుల చరిత్రలు. ధర్మాచరణములు, ప్రయాగ, వారణాసి మొదలగు పుణ్యక్షేత్ర మహత్మ్యములు చెప్పబడినవి.
2. మార్కండేయ పురాణము: ఇందులో 9000 శ్లోకములు కలవు. మార్కండేయ మహర్షిచే చెప్పబడినది. శివవిష్ణువుల మహత్మ్యములు, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహత్మ్యములు మరియు సప్తపతి (లేక దేవి మహత్మ్యము) చెప్పబడినవి. చండీ హోమము, శతచండీ సహస్ర చండీ హోమ విధానమునకు ఆధారమయినది ఈ సప్తశతియే.
3. భాగవత పురాణము: దీనిలో 18,000 శ్లోకాలు కలవు. వేద వ్యాసుని వలన శుకునకు, శుకుని వలన పరీక్షత్ మహారాజునకు 12 స్కందములులో మహా విష్ణు అవతారలు శ్రీ కృష్ణ జనన, లీలాచరితాలు వివరించబడినవి.
4. భవిష్య పురాణము: దీనిలో 14,500 శ్లోకాలు కలవు. సూర్య భగవానునిచే మనువునకు సూర్యాపాసన విధి, అగ్ని దేవతారాధన విధానం, వర్ణాశ్రమ ధర్మాలు వివరించబడినవి. ముఖ్యంగా భవిష్యత్ అనగా రాబోవు కాలం. భవిష్యత్తులో జరుగబోవు విషయాల వివరణ ఇందు తెలుపబడినది.
5. బ్రహ్మపురాణము: దీనినే ఆదిపురాణం లేక సూర్యపురాణం అందురు. దీనిలో 10,000 శ్లోకాలున్నవి. బ్రహ్మచే దక్షునకు శ్రీ కృష్ణ, మార్కండేయ, కశ్యపుల చరిత్ర వర్ణనలు, వర్ణధర్మాలు, ధర్మాచరణాలు, స్వర్గ – నరకాలను గూర్చి వవరించబడినవి.
6. బ్రహ్మాండ పురాణము: దీనిలో 12,000 శ్లోకాలు కలవు. ఈ పురాణం బ్రహ్మచే మరీచికి చెప్పబడినది. రాధాదేవి, శ్రీకృష్ణుడు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు. శ్రీ లలితా సహస్ర నామస్తోత్రాలు, శివకృష్ణ సోత్రాలు, గాంధర్వం, ఖగోళశాస్త్రం మరియు స్వర్గ నరకాలు వివరణ ఇందు వివరించబడినది.
7. బ్రహ్మ వైవర్త పురాణము: దీనిలో 18,000 శ్లోకాలు కలవు. సావర్ణునిచే నారదునకు చెప్పబడినది. స్కంద, గణేశ, రుద్ర శ్రీకృష్ణుల వైభవములు, సృష్టికర్త బ్రహ్మ, సృష్టికి కారణమయిన భౌతిక జగత్తు (ప్రకృతి) మరియు దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ మొదలగు పంచ శక్తుల ప్రభావము గురించి వివరించబడినది.
8. వరాహ పురాణము: దీనిలో 24,000 శ్లోకములు కలవు. వరాహ అవతార మొత్తిన విష్ణువుచే భూదేవికి చెప్పబడినది. విష్ణుమూర్తి ఉపాసనా విధానము ఎక్కువగా కలదు. పరమేశ్వరీ, పరమేశ్వరుల చరిత్రలు, ధర్మశాస్త్రము, వ్రతకల్పములు, పుణ్య క్షేత్రవర్ణనలు ఈ పురాణములో కలవు.
9. వామన పురాణము: దీనిలో 10,000 శ్లోకములు కలవు. పులస్త్వ ఋషి నారద మహర్షికి ఉపదేశించినది. శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణము, శివగణేశ, కార్తికేయ చరిత్రలు, భూగోళము – ఋతు వర్ణనలు వివరించబడినవి.
10. వాయు పురాణము: దీనిలో 24,000 శ్లోకములు కలవు. ఇది వాయుదేవునిచే చెప్పబడినది. శివభగవానుని మహాత్మ్యము, కాలమానము, భూగోళము, సౌరమండల వర్ణనము చెప్పబడినది.
11. విష్ణు పురాణము: ఇందు 23,000 శ్లోకములు కలవు. పరాశరుడు తన శిష్యుడయిన మైత్రేయునికి బోధించినది. విష్ణుమహాత్మ్యము, శ్రీ కృష్ణ, ధృవ, ప్రహ్లాద, భరతుల చరిత్రలు వర్ణింపబడినవి.
12. అగ్ని పురాణము: దీనిలో 15,400 శ్లోకాలు కలవు. అగ్ని భగవానునిచే వశిష్ణునకు శివ, గణేస, దుర్గా భగవదుపాసన, వ్యాకరణం, చంధస్సు, వైద్యం, లౌకిక ధర్మములు, రాజకీయము, భూగోళ ఖగోళ శాస్త్రాము, జ్యోతిషం మొదలగు విషయాలు చెప్పబడినవి.
13. నారద పురాణము: ఇందు 25,000 శ్లోకములు కలవు. నారదుడు సనక, సనందన, సనత్కుమార, సనాతరన్ అను నలుగురు బ్రహ్మామానసపుత్రులకు చెప్పినది. అతి ప్రసిద్ధి చెందిన వేదపాదస్తవము (శివస్తోత్రము) ఇందు కలదు వేదాంగములు, వ్రతములు, బదరీ ప్రయాగ, వారణాసి క్షేత్ర వర్ణనలు ఇందు కలవు.
14. స్కంద పురాణము: దీనిలో 81,000 శ్లోకములు కలవు. ఇది కుమారస్వామి (స్కందుడు) చే చెప్పబడినది. ఇందు ముఖ్యముగా శివచరిత్ర వర్ణనలు, స్కందుని మహాత్యము, ప్రదోష స్తోత్రములు, కాశీఖండము, కేదారఖండము, రేవా ఖండము (సత్యనారాయణ వ్రతము ఇందులోనివే), వైష్ణవ ఖండము (వేంకటాచల క్షేత్రము), ఉత్కళ ఖండము (జగన్నాధ క్షేత్రము), కుమారికా ఖండము (అరుణాచల క్షేత్రము), బ్రహ్మ ఖండము (రామేశ్వర క్షేత్రము) బ్రహోత్తర ఖండము. (గోకర్ణక్షేత్రము, ప్రదోషపూజ), అవంతికాఖండము (క్షీప్రానదీ, మహాకాల మహాత్మ్యము) మొదలగునవి కలవు.
15. లింగ పురాణము: ఇది శివుని ఉపదేశములు. లింగరూప శివ మహిమ, దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు. ఖగోళ జ్యోతిష, భూగోళ శాస్త్రములు వివరించబడినవి.
16. గరుడ పురాణము: ఇందు 19,000 శ్లోకములున్నవి. ఇది విష్ణువుచే గరుత్మంతునకు ఉపదేశించబడినది. శ్రీ మహావిష్ణు ఉపాసన, గరుత్మంతుని ఆవిర్భావము, జనన మరణములు, జీవి యొక్క స్వర్గ – నరక ప్రయాణములు తెలుపబడినవి.
17. కూర్మ పురాణము: ఇందులో 17,000 శ్లోకములున్నవి. కూర్మావతార మెత్తి విష్ణువుచే చెప్పబడినది. వరాహ నారసింహ అవతారములు, లింగరూప శివారాధన, ఖగోళము, భూగోళముతో వారణాసి, ప్రయోగక్షేత్ర వర్ణనలు తెలుపబడినవి.
18. పద్మపురాణము: ఇందులో జన్మాంతరాల నుండి చేసిన పాపాలను, కేవలం వినినంత మాత్రముననే పొగొట్టగలిగేది ఈ పద్మపురాణము. అష్టాదశ పురాణాలలోకెల్ల, అత్యధిక శ్లోకాలు ( 85,000 శ్లోకములు) కలిగి అనేక విశేషాలను మనుకు తెలియజేస్తుంది. మరియు మదుకైటభవధ, బ్రహ్మసృష్టికార్యము, గీతార్థసారం – పఠనమహాత్య్మం, గంగామహాత్మ్యం, పద్మగంధి దివ్యగాధ, గాయత్రీ చరితము, రావి వృక్ష మహిమ, విభూతి మహాత్మ్యం, పూజావిధులు – విధాణం, భగవంతుని సన్నిథిలో ఏ విధంగా ప్రవర్తించాలో పద్మపురాణంలో వివరంగా తెలియజేయబడింది.
ఈ విధముగా పురాణములందలి విషయములు క్రమముగా సంక్షిప్త రూపమున వేదవ్యాసపీఠ మందిరము నందు రచింపబడి నైమిశారణ్యమునందు ప్రసిద్ధములైయున్నవి.
వీటిని వ్యాసభగవానుడు మనకు అందించారు. పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని పన్నెండవ స్కందం చెప్తుంది. బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో ఆయన హృదయ గృహనుండి ఒక అనాహత శబ్ధం వెలువడింది. ఆ శబ్ధంలో నుండి అ కార ఉకార మకార శబ్ధాలు కూడిన ఓంకారశబ్ధం ఆవిర్భవించింది. "అ" నుండి "హ" వరకు గల అక్షరాలు ఆశబ్ధంనుండి ఉద్భవించాయి. ఓంకారం సకల మంత్రాలకు బీజాక్షరం అయింది. ఓంకారం నుండి నాలుగు వేదాలను ఉద్భవించాయి. ఆ 'అ'కార, 'ఉ'కార 'మ'కారములనుండి సత్వ,రజో,తమో అనే త్రిగుణాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనే చతుర్వేదాలు, భూ॰ భువ॰ సువ॰ అనే త్రిలోకాలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు జనించాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తనకుమారులైన మరీచి తదితరులకిచ్చాడు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకు ఇచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగిపోతూ ఉన్నాయి. వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక అందుబాటులో లేనివి కనుక వేదవ్యాసుడు వేద ఉపనిషత్తుసారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించారు. పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమహర్షణుకి చెప్పారు. రోమహర్షుడు తిరిగి వాటిని తన శిష్యులైన త్రైయారుణి, కశ్యపుడు, సావర్ణి లాంటి శిష్యులకు అందించారు. ఆ తర్వాత అలా ఒకరి నుండి ఒకరికి సంక్రమించాయి. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అష్టాదశ పురాణములను గుర్తు ఉంచుకోగల విదముగా ఒక్క పద్యరూపంలో వివరించి నందుకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.