జైశ్రీరామ్.
ఆర్యులారా! తెలుగు సాహిత్య కళా పీఠం వారు ౨౯-౮-౨౦౧౫ న ముషీరాబాద్ జ్ఞాన సరస్వతీ మందిర ప్రాంగణమునతెలుగు భాషాదినోత్సవం చక్కగా నిర్వహించి సముచిత సత్కారాలు చేసి తెలుగు కవులగౌరవాన్ని పెంచారు.
ఈ సందర్భంగా నేను పఠించిన నా రచన..
1.ఉ. అక్కలు, చెల్లెళుల్, మరియు అన్నలు తమ్ములు, నేస్తగాండ్రు, పెం
పెక్కిన పాటగాండ్రు, మురిపించెడి కైతలనల్లు వారలున్,
ఠక్కున మంచి చెడ్డల నెడం గన తిన్నియ నున్నపెద్దలున్,
మక్కువ వెల్గుచుండిరిట. మంచిగ నా కయి మోడ్పులందుడీ!
2. షడరర చక్ర బంధ శార్దూలము.
ఇందు పైనుండి 3వ వృత్తములో రామకృష్ణ కవి, 6 వ వృత్తములో రామదాసు చిక్కా అని వచ్చును.
దివ్యా! రాణ్మణి రామచంద్రుఁడ! సుమేదిన్ సున్దరోష్ణప్రభా!
భవ్యా! మన్మది మన్దిరస్థుఁడ! రమావైచిత్ర్య సత్ కల్పకా!
సవ్యా! కృష్ణ! మదార్తిహారుఁడ! సుధోత్స్రక్కావ్య సంవిత్ప్రభా
భావ్యా! మేదిని సంభవించు సదయన్! భానూత్సుకా! సత్యభా!
3. సీ. విరజాజి కుసుమాళి సరిపోలు ఘన వర్ణ సౌరభాన్విత తెల్గు జగతి వెల్గు
రమణీయ మహనీయ కమనీయ మధుపాళి రసరాగ రమ్య సుశ్రావ్య, తెల్గు.
తెలుగన్న నిలనున్న వెలుగన్న నిజమెన్ని తెలఁబోయి చూచిన తెల్లవారు
మరుగైన కవిపాళి సరిలేని ఘనకావ్యతతిఁ గాంచి ముద్రణోద్ధరణులైరి.
గీ. నన్నయాదిగ నేటి సినారె వరకు - రాజ మర్యాదలందిన రమ్యభాష
గిడుగు రామ్మూర్తి మదినెంచి వెలుగు భాష - పద్య సాహస్ర కంఠుని హృద్య భాష.
4. మ. నర నారాయణు లెన్నుసంస్కృతిఁ గనన్ నాకస్థులౌ దేవతల్
మురిపంబొప్ప జనించి యాంధ్ర కృతులన్ ముద్దారగా చేసి, సం
స్కరణోద్భాసులు తెల్గువారలనుచున్ గావ్యంబులంజూపి, మా
ధురులం బంచిరి తెల్గు కావ్య కవితా ధుర్యాత్ములై భారతిన్.
5. సప్తవింశత్యధిక ద్వివిధ కంద గీత గర్భ చంపక మాల.
విన తెలుఁగున్ భువిన్ చలువ వెన్నెల వెల్గులు జల్లుచుండునే!
కన విలువన్ మదిన్ వలచు కన్నెల పల్కులు పంచుచుండునే,
మును తెలియున్ గదా మనకు పొన్నల తెల్గులు, మన్ననంబునన్
కను తెలుఁగున్ సదా కనఁగ కన్నుల వెల్గులు కాకపోవునో! స్వస్తి.
ఈ విధంగా తెలుగు భాషాభిలాషతో నిరంతరం శ్రమిస్తున్న సాహిత్యకళాపీఠాన్ని మనసారా అభినందిస్తూ, ధన్యవాదాలు తెలియఁ జేస్తున్నాను.
జైహింద్.