గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

మిమిక్రీ శ్రీనివాస్ కు అభినందనలు.

జైశ్రీరాం
ఆర్యులారా! నిన్న సాయంత్రము జరిగిన మా మనుమరాలి పుట్టిన రోజు శుభ సందర్భముగా విచ్చేసిన స్వ మాంత్రికుఁడు  శ్రీ శ్రీనివాస్ ను అభినందిస్తూ అందఁ జేసిన పంచరత్నావళిని చూడండి.
శ్రీరస్తు                             శుభమస్తు                      అవిఘ్నమస్తు.                
తే.15-0215-2014 ని మియాపూర్ లోని మా నివాస గృహమున చిరంజీవులైన చింతా వేంకట సన్యాసి రామ శర్మ లక్ష్మీ శైలజల ఏకైక పుత్రిక చిరంజీవి శ్రీ విజయ లహరి యొక్క 3వ పుట్టినరోజు సందర్భముగా మా ఆహ్వానమును మన్నించి, మా ఆతిథ్యమును స్వీకరించ విచ్చేసిన శ్రీ చించపట్టణగోమఠం శ్రీనివాసు చిరంజీవిని దీవించి, తనకుఁ గల శబ్దానుకరణ విద్యా నైపుణ్యమును ప్రదర్శించి, మమ్ములను, ఈ కార్యక్రమమునకు విచ్చేసిన అందరినీ అలరింపఁ జేసినందులకు మా ఆనందమును తెలియఁ జేసుకొనుచు అందఁ జేసిన

పంచ రత్నావళి
శబ్దానుకరణ విద్యా ప్రకాశా! శ్రీనివాసా

శ్రీ మృదు వాఙ్మనోజ్ఞతకు శ్రీధవుఁడే వివశుండు నీకు. యాం
ధ్రామృతవాక్ప్రసార సుమహాద్భుత తత్వవివేకపూర్ణ! భా
షామృత పూర్ణ శబ్దము లహా! యని మెచ్చఁగ భిన్న రీతులౌ
నీ మృదు కంఠ సుస్వరమనేకుల సంతస హేతువిద్ధరన్!

స్వరములు నీ గులాములుఁగ సర్దుకు పోవును నీదు పల్కులన్,
సురుచిర మాధురీ భరిత సుస్వరముల్ మహిమాన్వితంబులై
మరువఁగ రాని వింతలయి, మామది దోచు, ననన్య సాధ్యమౌ
నిరుపమ శబ్దమాంత్రికుఁడ! నిన్ను గణింపఁగ నాకు సాధ్యమా?

శబ్దంబుల్ జనియించు కంఠమున, నిశ్శబ్దార్హమౌ చేతిలో
శబ్దంబెట్లు జనింప చేయుదువు? భాషామాత నీ తల్లియా?
శబ్దబ్రహ్మవొ? కానిచో, కలుగు నే శబ్దంబు నీ జేబులో?
శబ్దోద్భాసిత మాంత్రికా! జగతిలో సత్కీర్తినార్జించితే!

భౌతిక శాస్త్ర పాఠమున పన్నుఁగ నీ మహనీయ నైపుణిన్,
ఖ్యాతిని, తెల్పి, నేర్వమని, గౌరవమొప్పఁగ వ్రాసినారు. నీ
వాతెఱ చేయు గారడినవ్వాక్కులమౌదుమదేమి చిత్రమో!
ఖ్యాతిని జాతికిన్ గొలిపఁ గల్గితివద్దిర! శ్రీనివాసుఁడా!

మంగళ వాగ్వరా! శుభము. మంగళ సంస్కృతి మార్గదర్శివై
మంగళ భావనా చయమమంగళముల్ తొలఁగింప బూని,
న్మంగళ వాక్సుధారసము మాన్యులు మెచ్చగ నందఁ జేయుమా
మంగళ శబ్ద మాంత్రికుఁడ! మాన్య గుణాస్పద! శ్రీనివాసుఁడా!

అభినందనలతో చింతా రామ కృష్ణా రావు మరియు, కుటుంబ సభ్యులు.
మంగళం              మహత్             శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ
    జైహింద్
Print this post

1 comments:

అజ్ఞాత చెప్పారు...

I like looking through an article that can make men and women think.
Also, many thanks for allowing for me to comment!

Visit my blog he said ()

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.