గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, జనవరి 2014, మంగళవారం

భక్త సులభుడైన పరమాత్మను మీ భావనా కుసుమాలతో సేవించండి

జైశ్రీరాం
ఆర్యులారా! అకళంక భక్తి తత్పరులపైన, అవ్యాజ భక్తి తత్పరులపైన అసాధారణ ప్రేమామృతమును కురిపించు భక్త సులభుఁడైన ఆ జగన్నాటక సూత్రధారియగు శ్రీ కృష్ణ పరమాత్మ చిన్ననాటి స్నేహితుఁడైన కుచేలుని సేవిస్తున్న ఈ చిత్రమును చూస్తే మీకూ కవితావేశం పుట్టుకురావటం లేదూ? మరెందుకాలస్యం? మీ శైలిలో మీరు పద్యకవితా కుసుమాలతో ఆ పరమాత్మను ఆరాధించండి. పద్యరూపంలోనే కాక, గద్య, గేయ, చంపూ రూపలలో ఏ విధంగానైనా   మీరు పంపే వ్యాఖ్య ద్వారా ఆ పరమాత్మకు ఆంధ్రామృతం సమర్పిస్తుంది. జైశ్రీమన్నారాయణ.

శ్రీ నేమాని రామజోగి సన్యాసి రావు విరచిత
శ్రీకృష్ణ సుదామ సౌహార్దము

శ్రీరమణీ హృదయేశ్వరు
కారుణ్యామృత పయోధి గను వేడుకతో
ద్వారక కేగె సుదాముడు
పేరు ముదము హృదయసీమ పెల్లుబుకంగా

తన మందిరమును జేరిన 
యనఘుని చిననాటి మిత్రు నానందముతో
గని శ్రీకృష్ణుండెదురుగ
జని ప్రేముడి పల్కరించి స్వాగత మిడుచున్

రమ్ము రమ్ము సుదామ! మిత్రమ! రమ్ము బ్రాహ్మణసత్తమా!
నెమ్మనమ్మున నా గృహమ్మిదె నేడు పావనమయ్యె మో
దమ్ము గూర్చెను నీదు రాకయు ధర్మతత్పర శీల! యం
చమ్మహాత్ముని చేయి పట్టి గృహమ్ము లొనికి జేర్చుచున్ 

చిన నాటి మిత్రుడీతం
డని తెలుపుచు రుక్మిణికి మహానందముతో
కనకాసనమున సఖు గూ
ర్చొన జేసెను కృష్ణుడట్టి శుభ సమయమునన్ 

అర్ఘ్య పాద్యాదుల నాప్త మిత్రున కిచ్చి
....యంఘ్రి పూజల జేసె నచ్యుతుండు 
గురుని సందీపుని గురుకులమ్మును గూర్చి
....తమ చిన్ననాటి నేస్తముల గూర్చి
అఖిల శాస్త్రమ్ముల నధ్యయమ్మును గూర్చి
....చాల సంగతుల ముచ్చటల దేలి
యందందు వివిధ ముఖ్యాంశంబులను గూర్చి
....మరల మరల దెల్పి పరవశించి
సాదరమ్మున గురుని కంజలి ఘటించి
యెంత కాలము గడిచెనో యింత దనుక
ననుచు జ్ఞాపకములలోన మనము లలర
చెలగిరా బాల్య మిత్రులు శ్రీకరముగ 

మాటలాడుచు ప్రేమతో మాధవుండు
చెలుని కొంగున ముడివిప్పి చేతితోడ
నటుకులను గొని మోదాన నారగించె
మేలు మేలంచు నెంతయు మెచ్చుకొనెను 

ఎంతటి ధన్యుడో కద మహీసురు డాతడు ద్వారకేశుడ
త్యంత ముదమ్ముతో సలిపె నంఘ్రి సరోజ సమర్చనమ్ము శ్రీ
మంతుని యాదరమ్మునకు మానసమెంతయు బొంగె నంతటన్
జింతలు దీరి భూసురుడు చెన్నుగ కృష్ణు బ్రశంస జేయుచున్

వీడుకోలు నంది వెడలి ద్వారక వీడి
భూసురుండు నిజనివాసమునకు
నద్భుతమగు రీతి నచ్చోట గాంచెను 
వివిధ సంపదలను వీటిలోన 

వనజాతేక్షణు లీలగా జెలుని సంవాసమ్ము మారెన్ బళా
కనువిందున్ గలిగించు హర్మ్యవరమై క్రాలెన్ సుసంపన్నమై 
కని విభ్రాంతిమెయిన్ సతిన్ సుతుల నా క్ష్మాదేవు డుత్సాహియై
వినుతించెన్ బహుధా కృతజ్ఞతలతో ప్రేమాఢ్యు శ్రీకృష్ణునిన్

జేజే! గోకులనాయకా! ప్రియసఖా! జేజే! సరోజేక్షణా!
జేజే! శిష్టజనావనా! మురహరా! జేజే! ప్రసన్నాననా!
జేజే! ధర్మపరాయణా! శుభకరా! జేజే! ముకుందా! హరీ!
జేజే! భక్త హృదంబుజాత నిలయా! జేజే! యశోదాసుతా! 

నేమాని రామజోగి సన్యాసి రావు గారికి ధన్యవాదములు

జైహింద్ 
Print this post

2 comments:

Pandita Nemani చెప్పారు...

నేమాని రామజోగి సన్యాసి రావు

కంది శంకరయ్య చెప్పారు...

నేమాని వారి ఖండిక ఆద్యంత రసబంధురమై అలరించింది. ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.