జైశ్రీరామ్.
అనే శీర్షికతో విశ్వ ముఖ మత్స్యత్రయ బంధ చిత్రమి ఏ విధముగా ఉంటుందో తెలియ జేయ వలసినదిగా విన్నవించుకొంటూ మొన్న 17వ తేదీన ఆంధ్రామృతములో ప్రచురించి యున్నాను. ఆ పరంధాముని సూచన మేరకు ఈ క్రింది విధముగా ఉండునని ఊహించి మీ ముందుంచుచున్నాను. ఇంతకు మించి మెఱుగుగా బహుళార్థ సాధకముగా ఉండే విధమైన చిత్రమును ఎవరైనా సూచింతురేని, వారికి సర్వదా కృతజ్ఞుఁడనై యుందునని మనవి చేయుచున్నాను. ఈ క్రింది పద్యమును దానికి సంబంధించిన చిత్రమును చూడ గలరు.
విశ్వ ముఖ మత్స్యత్రయ బంధము.
చ: కరి నుత చిద్విలాస. యనఘస్మరఘస్మర మిత్ర బాంధవా.
శరజ విలోచనా విజయ.సత్వరసత్వర తాత్మ శైశవా.
విరచిత శీల రాఘవ రవిగ్రహ విగ్రహ వర్తి మాధవా.
విరళ కథోత్సవా నిఖిల విద్విభవా. జగదీశ కేశవా.
శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారుమహోన్నత కార్య సాధనలో భాగముగా 18 వ శతాబ్దమునకు చెందిన మహనీయ కవి కాణాదం పెద్దన సోమయాజి కృత " అధ్యాత్మ రామాయణము " ను ముద్రించే ప్రయత్నములో భాగముగా ఆ గ్రంథమునందు ప్రయోగింప బడిన బంధ చిత్రములకు రూప కల్పన చేయుచూ, ఎనిమిదింటా ఆరు బంధములకు రూప కల్పన చేసి, "జాంబవత్పాద బంధము - విశ్వ ముఖ మత్స్య త్రయ బంధము" అనే రెండు బంధముల స్వరూపముల కొఱకై సుమారు రెండు దశాబ్దముల నుండి ప్రయత్నించుచు, ఈ మధ్య ప్రొఫిసర్ సత్యానందం గారి ద్వారా తెలుసుకొని నన్ను సంప్రదించినారు. వారి యొక్క మహదాశయము నాద్వారా నెరవేరునని ఆశించుచున్నాను.
అతి త్వరలో జాంబవత్పాద బంధమును కూడా చిత్రీకరించే ప్రయత్నము చేయగలనని సవినయముగా శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారికి విన్నవించుకొనుచున్నాను.
జైహింద్.
1 comments:
మీ శ్రమ బహుధా ప్రశంసనీయం. అయితే చిత్రంలో స్పష్టత లోపించింది. చిత్రాన్ని మరింత స్పష్టంగా ప్రకటించవలసిందిగా మనవి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.