గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జనవరి 2012, సోమవారం

హలో! హలో! హలో! నా సందేహం తీర్చండి.

జైశ్రీరాం.
ప్రియ ఆంధ్రామృత పాఠక మిత్రులారా! మకర సంక్రాంతి వేడుకలు మిమ్మల్ని ఆనంద పారవశ్యంలో ముంచెత్తాయనుకొంటాను.
చాలా సంతోషం. ఆ పరమాత్మ సహృదయుల హృదయాలలోనే నివసిస్తూ, వారి యోగ క్షేమాలు చూస్తాడనడానికి మీ ఆనందానుభూతే నిదర్శనం.
ఇక
నాకో చిన్న సందేహం వచ్చింది.
మనం మనకు ఎక్కడి నుండైనా దూరవాణి వస్తే దానికి సమాధానంగా మనం హలో అని పలుకరిస్తాము.
ఈ హలో అర్థమేంటో నాకైతే అర్థం కావటంలేదు.
ఇలా పలకరించడం ఎంతవరకూ సముచితంగా ఉంది? అని నాకు నా మనసులో ఒక ప్రశ్న కలిగింది.
మీకు తెలిస్తే  దయచేసి నాకు చెప్ప కలరా?
హృదయము గొన్న మిత్రుడొ, మహిన్ విలసిల్లెడి యాత్మ బంధువో,
బుధజన వర్యుఁడో, కలిత పుణ్య మనస్కుఁడొ, యెవ్వరేనియున్
మదిపడి పిల్చుచుండ, విని, మన్ననతో నట దూరవాణిలో
మొదట "హలో"యనందగునె? ముక్తిని, భుక్తిని కొల్పునా హలో?
జై శ్రీరామని పల్కరించి, యెవరో చెప్పుండు. నే నెట్లు మీ
సుశ్రేయాళి సువృద్ధి హేతువగుదున్?  చెప్పుండనం,  గ్షేమ, మా
త్మశ్రీ శోభిలు. మైత్రి  వృద్ధి యగు. సన్మాన్యత్వ సద్వృద్ధియౌన్.
సుశ్రావ్యంబుగ పల్కుడట్లు యికపై శోభిల్ల మీరెల్లరున్.
అని నే పల్కగ సాహసింప తగునా? యాలించి నన్ దిట్టరే?
వినినన్ నవ్వరె? వెఱ్ఱి మాటలనరే? విద్వాంసుడధ్వాన్న సూ
చనలన్ జేయు టిదేమి బుద్ధి యనరే? సత్యంబు చెప్పుండు. నే
విన నేర్తున్ సుజనాళి సూచనలిలన్ విన్పింపుడీ! సత్కృపన్.
కొత్తపాళీ గారు ఇదే అంశం తీసుకొని వ్రాసిన వ్యాసం ఈ క్రింది దానిపై క్లిక్ చేస్తే వస్తుంది. చూడండి.
http://kottapali.blogspot.com/2012/01/blog-post_12.html
జైహింద్.
Print this post

5 comments:

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

టెలిఫోన్ ను కనుగొన్న గ్రాహంబెల్ ప్రియురాలి పేరు హలో.
ఆయన తొలి టెలిఫోన్ తయారుచేసాక మొదట మాట్లాడింది ఆమెతోనే. ఆయన మొదట పలికిన పదం - హలో. ఆమెను పిలిచాడన్న మాట.
ఆయన కోరిక మేరకు ఎవరు ఫోనెత్తినా ముందు ఆయన ప్రియురాలి పేరును పలకడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ విషయం రెండేళ్ళ క్రితం మా అమ్మాయి లండన్ లో ఉన్నప్పుడు ఏదో పత్రికలో చదివి నాకు చెప్పింది.

vasanth చెప్పారు...

మీకవిత్వం చాల బాగుంది

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు .
చింతా వారి సందేహం , నాకైతే ఎప్పుడు కలగ లేదు. " హలో " అన్న పలకరింపు ఎలా వచ్చిందో ? అనే ఆలోచనే రాలేదు. కానీ వారితొ బాటు మాకు , సందేహ నివృత్తి చేసిన శ్రీ ఆచార్య ఫణీంద్ర గారికి చింతా వారికీ , ధన్య వాదములు.

Zilebi చెప్పారు...

చింతా వారు,

హలో ముక్తి ని భుక్తి ని కోల్పునా లేదా అన్నది తెలియదు గాని, 'యుక్తి' ఐన పదం. అటు వైపు 'దూర' వాణి, వాణి యా లేకా 'వారా' అనునది మనకు తెలియదు కాబట్టి తటస్థమైన పదం లా ఐపోయింది ఈ హలో! ఇక దీని పుట్టు పూర్వోత్త రాల గురించి శ్రీ కొత్తపాళీ (నారాయణ స్వామీ ఎస్) వారు ఒక టపా కూడా ఈ మధ్యే రాసారు. వీలైతే చూడ గాలరు వారి కొత్తపాళీ బ్లాగు.

హలో కూడా మీ కలం నించి శ్రీ శోభిల్లు తేట తేనియను జాలువారించడం అదే చింతా వారి కవితా మాజిక్ !!

చీఎర్స్
జిలేబి.

Kottapali చెప్పారు...

చాలా బాగుంది మాస్టారు.
ఇక్కడ అమెరికాలో గుజరాతీ హిందువులు పరస్పరం "జై శ్రీకృష్ణ" అని పలకరించుకోవడం చూశాను. అలాగే శ్రీ చిన్మయానంద అనుయాయులు హరి ఓం అని సంబోధిస్తారు.

@ ఆచార్య ఫణీంద్ర గారు, బెల్ ప్రియారిలి పేరిట ప్రచారమైన కథ అది - నిజం కాదు. హెలో పదం కింద డీక్ష్నరీలలో దాని పుట్టుపూర్వోత్తరాలు వివరంగా ఉన్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.