గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జనవరి 2012, గురువారం

యువజన దినోత్సవము సందర్భంగా యావద్భారతీయులకూ శుభాకాంక్షలు.

స్వామీ వివేకానందుని నూట యేభయ్యవ జన్మ దినం సందర్భంగా యావద్భారతీయులకూ, 
ఉత్తేజం ఉరకలు వేసే యువతకు యువజన దినోత్సం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకొంటున్నాను.
అలరె నొకండె తా పరమ హంసకు శిష్యుఁడుగా రహించి. భూ
వలయమునందు భారతికి ప్రస్ఫుట కీర్తిని గొల్పెనొక్కడే.
వెలయగ చేసె దైవపర విజ్ఞత యుక్త వయస్కులందు. ధీ
కలిత రవీంద్రుఁడాతనికి గౌరవమొప్పగనంజలించెదన్.
యువజనులార! మీకుఁ గల యుక్తి విశిష్టతఁ గాంచరేల? మీ
భవిత మహోజ్వలంబుగ ప్రపంచమునన్ వెలుగొందునట్లుగా
ప్రవర గుణ ప్రపూజ్యమగు వర్తనచే వరలింప జేయుడీ!
ప్రవర నరేంద్ర భావనలు వర్ధిలు గావుత మీ ప్రవర్తనన్.
మీకు శుభంబులౌత! కను మేలు మిముం గని భారతాంబయున్.
శ్రీకర భావ భాగ్యములు, క్షేమము మీకు లభించు గావుతన్.
లోకమునందు మీ చరితలున్ తలమానికలై వెలుగొందు గావుతన్.
మీ కమనీయ భావనలు మేలగు నాంధ్ర సుధాబ్ధి గావుతన్.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

6 comments:

Pandita Nemani చెప్పారు...

అయ్యా! శ్రీ రామకృష్ణా రావు గారూ!
స్వామి వివేకాననంద గురించి మీరు రచించిన 3 పూల మాలలు చక్కగా అలరించుచున్నవి. అభినందనలు.

రామకృష్ణుని శిష్యుడా స్వామి యగుట
వానిపై మీకుగల యభిమానము మెయి
మంచి పూవుల చక్కని మాల లల్లి
సత్కరించిన మీకు ప్రశంసలిడుదు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అద్భుతంబైన మీ పద్య మమరి, నాదు
కృతికి సత్కీర్తి గొలిపెను. కేలు మోడ్చి
యంజలింతును మీకునో యమృత హృదయ!
పూజ్య నేమాని వంశజ! బుధవరేణ్య!

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

భరతమాతకు మకుటపు వజ్రమతడు
రామకృష్ణుని ప్రియశిష్యరత్నమతడు
వేదసింహంపు ఘర్జన విశ్వమందు
వ్యాప్తి గావించినట్టి ప్రాజ్ఞుడతడు

వేగంబౌ తన వాక్ప్రవాహ ఝరితో వేదాంతసింహంబుగా
నూగించెన్ గురు రామకృష్ణ ప్రభతో నుప్పొంగి భూగోళమున్
ఆగంభీర మహామనీషి (తలపే) మదిలో నాహ్లాదమందించగా
శ్రీగౌరీశు పదాబ్జ సేవ ఫలమే సిద్ధించు శీఘ్రమ్ముగా

"స్వామివివేకానంద" అన్నది ఒక నామము కాదు. నా దృష్టిలో ఒక మహామంత్రము. ఆ మహానుభావుని స్మరణమాత్రమునే ఆహ్లాదమైన పులకింత కలుగుతుంది. ఆమహానుభావుని దివ్యచరణారవిందములకు నేను సదా సాష్టాంగనమస్కారముల నాచరించెదను.
"Arise Awake and Stop not till the Goal is reached"

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

గురువుగారూ యువతను చైతన్యపరచే విధముగా మీ పద్యములు చక్కని శైలి కలిగియున్నవి. "ధీకలిత రవీంద్రుడు", "ప్రవర రవీంద్ర భావనలు" అన్న చోట రవీంద్ర అంటే నరేంద్ర (వివేకానందస్వామి) అని అర్థమా? వివరింప ప్రార్థన.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీపతి శాస్త్రిగారూ! అది నరేండ్రే. పొరపాటు సరి చేసాను. ధన్యవాదాలు.

Sanath Sripathi చెప్పారు...

చాలా బాగున్నవి పద్యాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.