జైశ్రీరాం.
సహృదయులారా!నిన్నను నామనసును బాధ పెట్టిన ఒక సంఘటనను మీతో చెప్పి మిమ్మల్ని కూడా బాధపెట్టడం సరి కాదు. ఐనా పరిష్కారం సూచించడానికి మీకంటే ఎవరుంటారు చెప్పండి. అందుకే మీకా విషయ తెలియ జేయ లేకుండా ఉండలేకపోతున్నాను. తప్పైతే మన్నించండి.
నిన్నను సాయంత్రం నడుచుకొంటూ గుడికి వెళ్ళుతున్న సమయంలో ఒక చెరువు ఒడ్డున చక్కటి దేవుళ్ళ పటాలు అద్భుతమైనవి అద్దాలతో చక్కని పటాలుగా ఉన్నవాటిని పెంట కుప్పలమీద పడేసారు. ఎవరో తెలియదు. నాకైతే చాలా బాధనిపించింది.
కడుపులో చేయిపెట్టి కెలికేసినట్టనిపించింది. మనం ఎంతో భక్తిభావంతో ఆరాధించే దేవతల ప్రతిరూపాలుగా భావించే పటాలు, ఎంతో పవిత్రంగా మనం చూసుకొనే చిత్రపటాలు దుర్గంధ భరితమైన ఒక అపవిత్ర ప్రదేశంలో అలా విసిరివేయబడ్డాయి.
ఒకటి కాదు రెండు కాదు కనీసం పదిహేనో ఇరవయ్యో అక్కడ అలా విసిరి పారవేయబడి ఉన్నాయి. అందులో రాతి బొమ్మలు కూడా ఉన్నాయి.
నాకు ఏమి చెయ్యాలో తోచలేదు. వాటిని చూస్తూ అలా వదిలేసి వెళ్ళిపోవడానికి కాళ్ళు రాలేదు. నా అర్థాంగి కూడా కన్నీళ్ళపర్యంతమయింది ఆపరిస్థితి చూసి.
తప్పో ఒప్పో నాకు తోచిన పని నేను చేయకుండా ఉండలేకపోయాను.
ఆ పటాలను ఆ ఒడ్డున ఉన్న కుళ్ళు పెంట కుప్పల మీదనుండి తీసి ఆ చెరువులోనికి పడవేసాను. పాపమో, తప్పో, ఒప్పో అనే విచారణ నేనప్పుడు చేయ దలచుకో లేదు.
ఆ పని నేను నా అర్థాంగి చేస్తూ ఉంటే బాటసారులు మమ్మల్ని వింత పసువుల్ని చూసినట్టు చూడడం కొసమెఱుపు.
విన్నారు కదా? చెప్పండి. మేమప్పుడేం చెయ్యాలి? మేము చేసినది తప్పా?
ఈ సంఘటన ద్వారా నేను సమాజానికి నామనోభావాలని వివరించి నా అభిప్రాయాన్ని సూచించ దలిచాను.
ప్రకృతిలో సృష్టింప బడిన ప్రతీ వస్తువుకీ అంతం ఉంటుంది.
మనం ప్రతీ సంవత్సరం అనేకమైన క్రొత్తక్రొత్త దేవుళ్ళ చిత్ర పటాలు, విగ్రహాలు సేకరిస్తూ ఉంటాము. వద్దన్నా మనకి అవి ప్రాప్తిస్తుంటాయి.
కొంత కాలం గడిచే సరికి అవి మాసిపోతుంటాయి, ఛిద్రమైపోతుంటాయి. అలాంటి వాటిని మనం కసవుగా భావించి నిర్లక్ష్యంగా అలా విసిరివేయడం అనేది మన నమ్మకాన్ని మనమే చెరిపేసుకున్నట్టౌతుంది.
ఈ బొమ్మలని కాబట్టి మనం అంత నిర్లక్శ్యంగా పారవేయ గలుగుతున్నాము. అదే మన తల్లిదో, తండ్రిదో, బంధులదో ఆఖరికి మనకత్యంత ప్రీతిపాత్రమైన కుక్కదో పటమై ఉంటే అలా పారవేయగలమా చెప్పండి? దేవుళ్ళ పటాలకి ఆమాత్రం విలువ కూడా యివ్వని మనకోసం దేవుడెందుకు మన బరువు తన నెత్తిని వేసుకోవాలి?
మనం క్లిష్ట పరిస్థుల్లో ఉంటే పాపం ఆ దేవుళ్ళే మనకు సహాయపడాలి. మనకే సమస్యా లేకపోతే మాత్రం ఆ దేవుళ్ళెక్కడున్నా మనకి పట్టదు. ఇదేం న్యాయం?
అర్ధ రహితమైన పనులు చేసి అనర్ధాలను కొనితెచ్చుకోవడం ఎంతవరకూ న్యాయమంటారు?
నా హృదయం ఎంత ఆవేదనకు గురికాకపోతే నేను మీతో ఇలా విన్నవించుకుంటానో మీరూ ఆలోచించండి.
ఈ విషయంలో నేను సూచించే పరిష్కారం ఆమోదయోగ్యమో కాదో మీరు చెప్పండి.
౧) కళ తప్పిన దేవుని చిత్రపాటాలు మనకు అక్కర లేదనుకొంటే వాటిని ఆ అగ్నిహోత్రునకు సమర్పించడం ఒకపద్ధతి.
౨) ఆ పటాలను గంగా మాత ఒడిలో ఉంచడం మరొక పద్ధతి.
అంతేకాని అక్కరలేదని చెప్పి పెంట కుప్పలమీద, అపవిత్ర ప్రదేశాలలోను, పడవేయరాదు.
మనం చేసే పని మన మనస్సుకెలాగున్నా ఇతరుల మనసుకు నొప్పి కలిగించ కూడదు. ఇతరుల నమ్మకం పాడు చేయరాదు.
ఇక చెప్పండి. మీరేమంటారు?
జైహింద్.
12 comments:
ఇది నిజంగా బాధాకర విషయమే. వివిధ రకాల వస్తువుల (సాంబ్రాణి ప్యాక్స్, కర్పూరం వంటివి) మీద కూడా దేవుని బొమ్మలు ప్రింట్ చేస్తున్నారు. అవసరం తీరిన తర్వాత వాటిని పడేయాలంటే ఇబ్బందిగా ఉంటోంది. నాకు తెలిసినంత వరకు పాడైపోయిన దేవుని పటాలను ఫ్రేముల నుంచి తొలగించి నీటిలో కలిపేయడం మేలు. కాల్చడం మంచి పద్ధతి కాదు.
శ్రీ వాసుకి గారూ!.భస్మం చేయడం శాస్త్ర బద్ధమే. ఐనా మీఅభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నానండి. మీ స్పందనకు ధన్యవాదములు.
చాలా కాలం క్రిందటి సంగతి. బీడీ ప్యాకెట్ల మీద దేవుడి బొమ్మ విషయం కోర్టుకు యెక్కింది (గణేష్ బీడీ అనుకుంటాను). మొదటి అభ్యంతరం ఇలాంటి వస్తువుల మీద దేవుడి బొమ్మ వేయటం గురించి. రెండవది చెత్తగా ఎక్కడ పడితే అక్కడ పడవేసే బీడీ ప్యాకెట్ కవర్లమీద దేవుడి బొమ్మలు తరచు మనుష్యుల పాదాల క్రిందకు వస్తుంటాయన్నది. నాకు గుర్తున్నంతవరకు శ్రీకోర్టువారు వ్యాజ్యాన్ని కొట్టివేసారు.
ఇబ్బడిముబ్బడిగా పేరుకొనే దైవమూర్తులు పటాలను సగౌరవంగా చూడటం చాలా అవసరం అన్నమాటతో యేకీభవించుతాను. ముఖ్యంగా పాడయిన దైవమూర్తులు పటాలను జాగ్రత్తగా సాగనంపాలి.
పటాలు కాల్చటానికి ఏమన్నా పద్ధతి ఉందాండీ? తప్పుకాదా?
nijamenaandi sambrnai karpuram packets pina valla photos vunte avi dachi chivarku kalvalo kalpatam jarguthondi.
రామకృష్ణారావుగారు చెప్పారు కదా, భస్మం చేయడం శాస్త్ర బద్ధమే. మీరే ఆలోచించండి - యితరులు తెలిసో తెలియకో తమ కాళ్ళ క్కరింద త్రొక్కటానికి అవకాశం కలిగేలా విసరివేయటం కన్నా యిలా భస్మం చేయడం మంచి పధ్ధతి కదా.
మీరు చూసిన చిత్రపటాలు పాతబడ్డవి కావు. అన్ని పటాలు ఒక్కసారిగా పాతబడవు. దాని వెనుక కచ్చితమైన కారణం ఉంది.
అవి క్రైస్తవమతం పుచ్చుకున్న హిందూకుటుంబానికి చెందినవి. క్రైస్తవులు ఇతరమతాల బొమ్మలను సైతాను బొమ్మలు అంటారు. క్ర్రైస్తవుల ఇళ్ళల్లో సైతాను బొమ్మలు ఉండవు కదా! అందువల్ల క్రైస్తవాన్ని స్వీకరించిన హిందూకుటుంబం అంతవరకూ పూజించిన హిందూ పటాలను, చిహ్నాలను అలా చెత్తకుప్పల పాలు చేస్తారు.
ఇలాంటి సంఘటనలు సాధారణమే.
నాకు తెలిసిన ఒక కుటుంబం అలా మతం మారి తమ ఇంట్లో ఉన్న హిందూ దేవుళ్ల పటాలను కట్టకట్టి ఒక హిందూ దేవాలయంలో వదలి వచ్చారు. ఇది కొంత నయం.
ఇక రకరకాల వస్తువులను ప్యాకింగ్ చేసిన కవర్లమీద, డబ్బాల మీద దేవుళ్ల బొమ్మలను ముద్రిస్తారు. వస్తువును వాడిన తర్వాత ఆ డబ్బానో, కవర్నో చెత్తలో పారవేస్తుంటారు.
హిందూ ధార్మిక సంస్థలు పూనుకొని, కోర్ట్ ద్వారానో, ఉద్యమాల ద్వారానో దీనిని అరికట్టాలి.
మీకు చేతనయినంత వరకు మీరు మంచి పని చేసారండి. ఇప్పుడు చాలా వస్తువుల పైనా దేవుని బొమ్మలు ముద్రించటం జరుగుతోంది. దానిని భక్తి అనాలో ? అనకూడదో ? తెలియటంలేదు. నీళ్ళలో మాత్రం ఎన్నని కలుపుతాము ? విదేశాల వాళ్ళు దేవుని బొమ్మలను చెప్పుల పైన ముద్రిస్తే గోలగోల చేసే మన వాళ్ళు రోజూ మనం కాళ్ళ క్రింద తొక్కుతూన్న దేవుని బొమ్మలగురించి పట్టించుకోరు.
ఇలాంటివి బయట వేసేటప్పుడు నేను ఏమనుకుంటానంటే... ఆ పాపం ముద్రించిన వారికే కానీ నాకు రాకూడదని అనుకుంటాను. . దేవుని చిత్రాలను అవసరమైనంతవరకూ ముద్రించుకుంటే చాలు. సాధ్యమయినంత వరకు దైవాన్ని మనసులో ఆరాధించాలి. దైవానికి ఇష్టమయినట్లు సత్ప్రవర్తనతో జీవించాలి. అంతేకానీ ఇలా ప్రతిదాని పైనా ముద్రిస్తేనే భక్తి ఉన్నట్లా ? సరిగ్గా చెప్పాలంటే ఇలా చేయటం వల్ల పుణ్యం రాకపోగా పాపం వస్తుంది. ఏంటో ప్రజలు మరీ అతిగా తయారవుతున్నారు..
గురువుగారూ, ఈసమస్యను ప్రతి ఒక్కరూ యోచించ వలసినదే. ఆస్తికులైనవారి భావాలను కించపరచే విధంగానూ, మతభావములను రెచ్చగొట్టే విధముగాను కొందరు హేతువాదులు, యితర మతస్తులు ఇలాంటి పనులు చేస్తుంటారు. ఇటీవల సెల్ ఫోనులలో వేద మంత్రాలను అపస్వరాలతో రింగ్ టోనులుగా పెట్టుకొని ఎక్కడపడితే అక్కడ విన్నపిస్తున్నది. మనము చెప్పినపుడు మనలను అనాగరికులవలె చూస్తున్నారు. నేను హిందువునని గర్వపడమన్నారు పెద్దలు. కానీ నేటి పరిస్థితులలో నేను హిందువునని చెప్పుటకు భయపడుతున్నారు.
శంకరయ్యగారు చెప్పినది నిజమే. కాని అలా దేవుళ్ళ పటాలను విసిరికొట్టేవారు క్రైస్తవం పుచ్చుకొన్నవాళ్ళే కానక్కరలేదు! కొన్ని కొత్తగా పుట్టుకొచ్చిన / పుట్టుకొస్తున్న హిందూ ఉపమతాలు కూడా విగ్రహారాధనావ్యతిరేకత పేరుతో యిలాంటి పనులకు పురికొల్పుతున్నాయి జనాన్ని. మా బంధువుల కుటుంబం ఒకటి రామచంద్రామిషన్ లో చేరారు. ఇంటిలో అదవరకూ నిత్యపూజాదికాలు అందుకొంటున్న దేవతామూర్తులను కట్టగట్టి హుస్సేన్ సాగర్ లో విసిరేసారు! దీని వెనుక కారణం యీ మిషన్ వారు ఒక్క జన్మలోనే ఖచ్చితంగా మోక్షం యిప్పిస్తారట. ఆ యింటి ఆడుపడుచుకు మోక్షం సంపాదించుకున్నావని ఒక సర్టిఫికెట్ గూడా యిచ్చారు - దానిని ఆమె గోడకు వ్రేలాడదీసి ప్రదర్శించుకుంటున్నది.
నేడు మన జాతీయపతాకం పరిస్థితి కూడా యిదే. వ్యాపారం కొరకు ప్లాస్టిక్ జెండాలను తయారుచేసి పసిపిల్లలచేత బలవంతముగా కొనిపించి అవసరం తీరగానే చెత్తకుప్పలలో చేరుతున్నాయి. అభిమాన కికెటర్ ఔట్ అయినా జెండాలు కాళ్ళక్రింద నలుగుతున్నాయి.
నిజమే ! చాలా మంది " తాము నాస్తికుల మన్నట్టు , పూజలు ,చేసే వారిని హేళన చేసి , చులకన చేస్తూ ఉంటారు. ఇక పఠాలను చింపెయ్యడం , పెంటకుప్పల మీద పారెయ్యడం , పూజ చేసిన వినాయకుడి బొమ్మని గార్బేజ్ లొ పడెయ్యడం [ ఇక్కడ ] మరీ ఘోరం. వారిని భగ వంతుడే క్షమించాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.