గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, డిసెంబర్ 2011, శుక్రవారం

USA లో డాలస్ నగరంలో పురి విప్పుతున్న తెలుగు తేజము.

ప్రియ సాహితీ మిత్రులారా!
మన తెలుగు తేజాన్ని ఖండాంతరాలలో వ్యాప్తి చేస్తున్న  మన తెలుగు తల్లి ముద్దు బిడ్డలు మనకెంతో గర్వ కారణ మౌతున్నారు.
వారి వృత్తి యేదైనా, ప్రవృత్తి మాత్రం తెలుగు కీర్తి పతాక ఖండ ఖండాంతరాలలో యెగురవేయడమే. అట్టి మన సోదర సోదరీమణులందరికీ మనం హృదయ పూర్వకంగా అభినందనలు తెలియ జేయడం మన ధర్మం.   
వారి కీర్తి పత్రికలలో ఎలా ప్రజ్వలిస్తోందో మీరూ చూడండి. 
అందునా తెలుగు పద్య కవి భిషగ్వరేణ్యులు శ్రీ గన్నవరపు నరసింహ మూర్తిగారు ఎలా జగజ్జేగీయమానంగా వెలిగిపోతున్నారో చూడండి.  
టాంటెక్స్ సాహిత్య వేదికపై ఎఱ్ఱన కవితా ప్రశస్తి: 
52 మాసాలుగా నిర్విరామంగా నడుస్తున్న సదస్సు డాల్లస్, టెక్సస్ , నవంబర్ 20, 2011,
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 52 వ సదస్సు ఆదివారం, నవంబర్ 20 వ తేదీ స్థానిక రుచి పాలస్, కేరొల్టన్ లో ఊరిమిండి నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగింది. డాల్లస్ ప్రాంత భాషాభిమానులు, సాహితీ ప్రియులు అత్యంత ఆసక్తి తో ఈ సమావేశానికి విచ్చేసారు.
ముందుగా వెండితెర వేదిక శీర్షికన జువ్వాడి రమణ, 1970, 1980 దశకాల్లో ఇతర భాషల్లోంచి, ముఖ్యంగా కన్నడం లోనుంచి తెలుగు లోకి వచ్చిన సినిమాపాటల మూలాలను చూపించి, తెలుగులో వాటిని గుర్తించమని సభికులకు సవాల్ విసిరారు. ఆ తెలుగు పాటల పల్లవులను మద్దుకూరి చంద్రహాస్ పాడి వినిపించారు. వినూత్నమైన ఈ ప్రదర్శన అందరినీ అలరించింది. నన్నయ భారతంలోనుంచి కొన్ని పద్యాలను మచ్చుకు వినిపించి రమణ తన ప్రసంగాన్ని ముగించారు.
తరువాత ఊరిమిండి నరసింహారెడ్డి శ్రీశ్రీ కి పాఠకుల ప్రశ్నలు వాటికి శ్రీశ్రీ జవాబులు వినిపించారు. సభలోనివారిని రెండు జట్లు గా విభజించి ఒక క్విజ్ నిర్వహించారు. దీనిలో సభాసదులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ గన్నవరపు వరాహ నరసింహమూర్తిని కాజా సురేశ్ సభకు పరిచయం చేస్తూ వృత్తి రీత్యా వైద్యుడు, ప్రవృత్తి రీత్యా భాషాసాహిత్యాభిమాని, పద్య రచయిత, గ్రంధకర్త గా నరసింహమూర్తిగారిని ప్రశంసించారు.
తరువాత ‘ఎఱ్ఱన కవితాప్రశస్తి’ అనే అంశం పై ముఖ్య అతిథి ప్రసంగం కొనసాగింది. ఎఱ్ఱన పాకనాటి ప్రాంతానికి చెందిన గుడ్లూరు గ్రామానికి చెందినవాడని, అది నేటి ప్రకాశం జిల్లా లో ఉందని, మహాభారత రచనతో బాటు ఆయన హరివంశం, నృసింహపురాణం, రామయణంకూడా రచించారని చెప్పారు. అరణ్యపర్వ శేషాన్ని పూరిస్తున్నప్పుడు ఆయన నన్నయ శైలి తో ప్రారంభించి, తిక్కన శైలితో ముగించారని, ఈ రెంటికీ మధ్యభాగంలో ఎఱ్ఱన అసలు శైలి మనకు కనబడుతుందని, నన్నయ తిక్కన శైలులతోపాటు, పురాణ, కావ్య, ఇతిహాస శైలులు మొదలైన బహురూప శైలీ విన్యాసం అయన స్వంతమని అన్నారు.
ఎఱ్ఱన భారతంలోని కర్ణుని జన్మవృత్తాంతం, కుంతీవిలాపం, ఘోషయాత్ర, సైంధవుని గర్వభంగం, సావిత్రీ సత్యవంతుల కధలో ప్రకృతివర్ణన, రామయణ వృత్తాంతం లో మధువనం పాడుచేయడం మొదలైన మధురఘట్టాల్లోనుంచి అనేక పద్యాలను ఉదహరించారు.
తదనంతరం సాహిత్య వేదిక కార్యవర్గసభ్యులు జువ్వాడి రమణ, మద్దుకూరి చంద్రహాస్, కాజా సురేశ్, ఊరిమిండి నరసింహారెడ్డి, అలాగే ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గసభ్యులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, బొడ్డు శేషారావు, పొన్నూరు సుబ్బారావు అందరూ కలసి జ్ఞాపికతో గన్నవరపు నరసింహమూర్తి గారిని సత్కరించడంతో సభముగిసింది. ప్రధాన వక్త డా. మూర్తి గారికి, విచ్చేసిన ప్రేక్షకులకు మరియు రుచి ప్యాలెస్ యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలియజేయడంతో 52వ సదస్సు కు తెరపడింది.
జైశ్రీరాం
జైహింద్.
Print this post

9 comments:

డా. గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి నమస్కారములు. ఆ సభ మీ వంటి కవీశ్వరులతో మరీ వన్నె కెక్కి ఉండేది. నాకు చాతనైనది కృషి. కష్టపడి ఓ పాతిక ఎఱ్ఱన పద్యాలు కంఠతా పెట్టి కాగితాలు చూసుకోకుండానే అక్కడ చెప్పగలిగాను. ఈ వయస్సులో కొంచెము కష్టమే, చిన్నప్పుడు వలె అంత సుళువుగా రావు. ఓపికగా విన్న సభికులను కూడా మెచ్చుకోవాలి. మీరు అమెరికా ఎప్పుడైనా వస్తే తప్పకుండా డాలసులో మీకు సభ ఏర్పాటు చేయిస్తాము. మీరు,శ్రీ శంకరయ్య గారు,శ్రీ పండిత నేమాని వారూ సత్కారములకు అర్హులు. మీతో నాకు పరిచయము కలగడము ఆ శారదా దేవి కృప.

మీ
నరసింహ మూర్తి

Pandita Nemani చెప్పారు...

శ్రీ చింతా రామకృష్ణా రావుగారికి అభినందనలు. ఒక మంచి విషయమును బ్లాగులో ఉంచేరు. నేను చాల సంతోషించేను. శ్రీ నరసింహ మూర్తి (మా తమ్ముడు) అన్నిటా సమర్థుడు - వెలుగులోకి రాని విజ్ఞాన ఖని.

శ్రీ నరసింహ మూర్తి కవిశేఖరు డాదరణీయ శీలి, వి
జ్ఞాన మహాసముద్రుడు, భిషగ్వర భూషణుడుత్తముండు, న
వ్వానికి గూర్తు దీవెనలు, పావన జీవిత పర్వమందు నీ
శాను కృపా విశేషమున సర్వ శుభమ్ములు గాంచి యొప్పగా.

Sanath Sripathi చెప్పారు...

చాలా బాగున్నది. :-). నేమాని వారి పద్యము కూడా..

తెలుగుయాంకి చెప్పారు...

పెద్దలకు నమస్కారము. డా. గన్నవరపు నరసింహమూర్తిగారి గురించి శ్రీ పండిత నేమాని గారు అద్భుతముగా వివరించారు. వీరు మా డల్లాసుపురవాసులవ్వటము, అప్పుడప్పుడు కలుసుకునే వీలుండటము మా అందరికీ ఎంతో సంతోషదాయకము. -కాజ సురేశ్

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

నారాయణస్వామి(కొత్తపాళీ)ఇలాగ అన్నారు.
చాలాబావుంది మూర్తిగారు. సంతోషం మరియు అభినందనలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రావు తల్లాప్రగడ ఇలాగ అన్నారు.
ఆముదము ముదమయి ముదలమై మెదలాడి,
అమెరికాచరితన అమరమవ్వు!
సముదయ దముకువిన, సంతొసమున
స్ఫూర్తి కలిగె మాకు, మూర్తిగారు!
ధ్యన్యవాదాలు
రావు తల్లాప్రగడ

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

నేమాని వారు ఇలాగ అన్నారు.
సంతోషము:తమ్ముడూ!ఆ ముదపు జెట్టు మిక్కిలిసామర్థ్యము గలది దాని
సౌగంధ్యమ్మేమా మానసమ్ములకు నెంతే ముదమిడు నారసింహ మూర్తి సుకీర్తీ
ఇంతింతై వటుడింతయై అన్నట్లు ఇప్పుడది ఆముదపు జెట్టు కాదు - కల్ప వృక్షము

డా. గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

శ్రీ పండిత నేమాని అన్నయ్య గారి వాత్సల్యానికి ,వారి దీవెనలకు సదా కృతజ్ఞుడను. వారికి సాష్టాంగ ప్రణామములు.మిత్రులు శ్రీ కాజా సురేష్ గారికి, శ్రీ నారాయణ స్వామి గారికి,శ్రీ తల్లాప్రగడ రావు గారికి,శ్రీ సనత్ శ్రీపతి గారికి కృతజ్ఞతలు.
' డాలసు నగరములో మహా వృక్షములున్నా ఈ మధ్య ఒక ఆముదపు చెట్టు మొలిచిందనే వదంతి ' అని వార్త పంపిస్తే ఎంతో స్నేహపూర్వకముగా వార్తని తమ బ్లాగులో నిలిపి నన్ను ఆశ్చర్య పరిచారు,శ్రీ చింతా రామకృష్ణా రావు గారు.తెలుగు భాషాభిమానము తప్ప నాకు యింకేమీ అర్హతలు లేవు. నవ తరము వారు తెలుగు భాషలో అనుపమాన ప్రతిభ, శ్రద్ధ చూపిస్తుంటే ఒళ్ళు నిజంగానే పులకరిస్తుంది. మిత్రు లందఱికీ శుభాకాంక్షలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శు భాభి నందనములు .
పండితులు , పూజ్యులు , గురువులు , అందరి అభినందనలు చదువు తుంటే భాష కందని నాకాలం ఆగి పోయింది . సోదరులు మూర్తి గారికి , హృదయ పూర్వక అభి నందన మందారాలు . మాకందిం చిన చింతా వారు శ్లాఘ నీయులు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.