గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, ఫిబ్రవరి 2010, ఆదివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 90.

0 comments

ఆంధ్రామృత పాన లోలులారా! ఆంధ్ర భాషాభిమానులారా!
హితం మనోహారిచ దుర్లభం వచ: అని విన్నాం కదా! ఇప్పుడు మరొక చక్కని శ్లోకంలో మనలను మేలుకొలుపుతున్నాడీ కవి. చూద్దాం.
శ్లోll
లభ్యతే ఖలు పాపీయాన్ నరో సుప్రియ వాగిహ
అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభఃll
గీll
తీపి మాటలు చెప్పుచు పాపులిలను
మోసగింతురు. కనుఁ డది మోస మనుచు.
కఠిన సత్యము పలుకఁగ, కరుణ వినగ;
కలుగు వారలు తక్కువ కలరు భువిని. 
భావము:-
తీయని మాటలచే మోసపుచ్చు పాపులు ఈ లోకంలో సర్వత్రా ఉన్నారు. కాని కటువైనను పథ్యముగా ఉండే మాటలు చెప్పు వారు, విను వారు  కూడా లోకంలో అరుదుగానే ఉంటారు కదా!
తీపిగా మాటాడే మోసగాళ్ళున్నారని గ్రహించుదాం. వారి మాటల మత్తులో పడితే మోసపోవడం ఖాయం.
మన క్షేమమును కోరుచు  యదార్థమును చెప్పెడి వారి మాటలు కఠినతరమైనను అప్రియమైన వైనను ఓర్పుతో విని; నిజాన్ని గుర్తించి అనుసరించడం మనకు శ్రేయస్కరం.
జైహింద్.

27, ఫిబ్రవరి 2010, శనివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 89.

1 comments

ఆర్య సంస్కృతీ సంపన్నులారా! 
భగవద్భక్తి పారవశ్యమున మనము దైవ దర్శనార్థమై గుడులూ గోపురాలూ ఎక్కడెక్కడున్నా తెలుసుకొని, శ్రమ దమాదులకోర్చుకొని, వెళ్ళి దర్శించుకొని వస్తాము. ఇది చాలా మహత్తర విషయమే. ఐనప్పటికీ అక్కడ దర్శనం కోసం లంచాలు చెల్లిచడం, దర్శనం సరిగా జరగకపోతే చింతించడం, లాంటి సంఘటనలు మన నిత్య జీవితంలో అనుభవైక వేద్యమే కదా! 
ఐతే ఈ దైవ దర్శన పరమార్థం ఏమిటి? అనే విషయం మనకి తెలుసుననుకొంటుంటాం. మనం చేస్తున్న దైవ దర్శనమే చాలా గొప్పదని మనం అనుకొంటే మాత్రం  అది అధమాధమ మని చెప్పుతున్న శ్లోకం చూడండి.
శ్లోll
ఉత్తమా తత్వ చింతాచ మధ్యమం శాస్త్ర చింతనం
అధమా మంత్ర చింతాచ తీర్థ భ్రాంత్య z ధమాధమం.
గీll
తత్వ చింతన శ్రేష్ఠము. తలచి చూడ!
శాస్త్ర చింతన మధ్యమ. చక్కనెఱుఁగ
మంత్ర చింతన మధమము మనుజులకును
తీర్థ చింతనయధమాధమర్థి నెఱుఁగ.
భావము:-
తత్వ విచారము ఉత్తమ మార్గము. శాస్త్రచింతన మధ్యమాధికారము. మంత్రోపాసనము అధమ మార్గము. ఇక తీర్థ పర్యటనాభినివేశము అధమాధమము.
ఈ శ్లోకాన్నితప్పుగా అర్థం చేసుకొనే పని లేదు. మనం పై మెట్టెక్కడానికి ప్రారంభం క్రింద మెట్టునించే అని మరువ కూడదు. మనం చేస్తున్న దైవ దర్శనాలు క్రిందిమెట్టుపై వేస్తున్న తొలి అడుగుగా మనం గుర్తించాలి. తద్వారా సంపాదించిన ఆధ్యాత్మిక శక్తితో పైమెట్టుకు, ఆపై మెట్టుకు క్రమంగా తత్వ చింతనకూ చేరాలి. 
తత్ త్వం. ఆపరమాత్మయే నీవని గ్రహించాలి. అప్పుడు క్రింది మెట్టులతో పని ఉండదని గ్రహించాలి. అంతే కాదు తప్పైతే నన్ను క్షమించాలి.
జైహింద్.

26, ఫిబ్రవరి 2010, శుక్రవారం

ABN ఆంధ్రజ్యోతొ TV చానల్లో మన జ్యోతక్క కార్యక్రమం.సోమవారం 1:30PMకు.

4 comments

ప్రియ పాఠకులారా!
తేదీ. 01 - 03 - 2010 సోమవారం  మధ్యాహ్నం  గం.1:30 నుండి 2:00 వరకు ప్రముఖ తెలుగు బ్లాగ్ సోదరీమణి
శ్రీమతి వలబోజు జ్యోతి గారు పాల్గొన్న కార్యక్రమంను మనం ABN ఆంధ్ర జ్యోతి T.V.చానల్ లో చూసే అవకాశం మనకు కలుగుతోందని తెలియఁ జేయడానికి సంతోషంగా ఉంది.
ముఖ్యంగా మహిళల ముందడుగు ఇలాంటి కార్యక్రమాలు రుజువు చేస్తున్నాయి.
తప్పక ఈ సదవ కాశాన్ని సద్వినియోగించుకొందామా?
జైహింద్.

25, ఫిబ్రవరి 2010, గురువారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత .32.

0 comments

కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు రామాయణ కల్ప వృక్షంలో  కవిసమ్రాట్ విశ్వనాథ భావుకతఅను అంశంపై  చేసిన ఉపన్యాసమునుండి ఇప్పుడు 32 వభాగమును మీ ముందుంచుతున్నందుకు ఆనందంగా ఉంది.
చదివి, మీరూ ఆనందించ గలరని నా నమ్మకం. ఇక చదవండి.
మునికాళ్ళ నిలిచి కుందెలు
నను పరకాయించి చూచు నలినాక్షి కథల్
తనకుం దెలిసినఁ జెప్పను
తన చేతం గాకపోవు దక్షిణ దిశలన్. (వి.రా.క.వృ.కి.కాం. 1-32.)
ఈ కుందేలు "ముని కాళ్ళ ఎత్తి నిలిచి నావైపు పరకాయించి చూస్తూ సీత జాడ చెప్పఁ దలంచి, చెప్ప లేక దక్షిణ దిశకు పరుగెత్తుతున్నది." తన చేష్ట ద్వార రావణుని ఉనికిని కుందేలు తెలియఁ జేస్తున్నదని రాముని భావము.
అరణ్యమున సంచరించిన సీతా రాములకు అచ్చటి వృక్షములు జంతువులు కూడా బంధు గణములోనివే. చేతనా చేతనమైన సర్వ ప్ర కృతియు వారి  ఆత్మ బంధువే. రామాయణమున వాల్మీకి ఇట్లే వర్ణించాడు. సీత ప్రకృతి స్వరూపిణి. శ్రీరాముడు పురు షోత్తముఁడు.
రావణుఁడు  సీతను అపహరించుకొని పోవు సందర్భమున సీత తన దురవస్తను గోదావరికి, వనదేవతలకు, అన్ని ప్రాణులకు, మృగాలకు విన్నవించుకొని శరణు వేడుకొంది. దుఃఖించింది.
యాని కానిచిదప్యత్ర సత్వాని నివసంత్యుత
సర్వాణి శరణం యామి మృగ పక్షిగణానపి. (వాల్మీకి)
ఈ అరణ్యంలో నివసించే అన్ని ప్రాణులను మృగాలను పక్షి గణాలను శరణు వేడుకొంటున్నాను. నన్ను రక్షించండి. రావణుఁడు నన్ను అపహరించుకొని పోతున్నాడని నా రామునికి తెలపండి. అన్నది ఆమె.
సూక్ష్మ భావుడైన విశ్వనాథ ఈ ఘట్టమున ఒక అల్ప ప్రాణియైన కుందేలు సీతాపహరణ వార్త రామునకు చెప్పగా ప్రయత్నించి, నోరు లేని ఆ ప్రాణి నిస్సహాయంగా దక్షిణ దిశకు పరుగెత్తినదని , చేష్టా స్ఫురితంగా జరిగిన వృత్తాంతాన్ని తెల్పినదనీ వర్ణించారు. ఇది పరమ రమణీయమైన వర్ణన. ఇట్టి వర్ణనతో విశ్వనాథ కావ్య రస నిర్వహణ యందు తన అగ్రీయతను చాటుకొన్నాడు.
శ్రీమద్రామాయణ కావ్యము నందు 
బోయవాని బాణపు దెబ్బకు క్రింద పడిన ఆడ పక్షి (క్రౌంచి)విలపించినది.ఇది సహజమే. దానిని చూచి, మగ పిట్టయు ఏడ్చినది. 
"భార్యాతు నిహతం దృష్ట్వా రురావ కరుణాంగిరం."
అనంతరమున శ్లోకమున రామాయణము ఇట్లు చెప్పినది.
"తత: కరుణవేదిత్వా అధర్మోయమతి ద్విజ:
నిశామ్య రుదతీం క్రౌంచీ మిదం వచన మభ్రవీత్".
ఆడ పిట్ట తనకు తగిలిన దెబ్బ గురించి కాకుండా తన వియోగము వలన  తన భర్తయైన పెంటి పక్షికి కలిగిన దు:ఖమును చూచి, దు:ఖించు చున్నందు వలననే (అట్లు తలపోసినందువలననే) వాల్మీకి ఉద్విగ్నుడైనాడు. ఇక్కడే కరుణ రసము యొక్క మహా రహస్యము దగి యున్నది.
పరగత సుఖ దుఃఖముల యందు తాదాత్మ్యం కలగడం సత్వము. ఆ సత్వ గుణ ప్రథానమైన అంతఃకరనమునందు పొంగిన సహానుభూత భావమే కరుణము. ఇక్కడ అంతఃకరణమే ముఖ్య భూమిక వహించును కాని ఉపాధులతో పని లేదు. కరుణ వేదిత్వమే ప్రథానము.
సృష్టి లోని సమస్త ప్రాణులును ప్రకృతి పురుషుల ఎడబాటుకు తల్లడిల్లుతున్నవని విశ్వనాథ ఉద్దేశ్యము. అందునను సీతా విషయిక వియోగ దుఃఖితుడైన శ్రీరాముని వేదనకు అల్ప ప్రాణులైన జంతువులు సైతము కరుణ వేదిత్వ గుణమును వహించినవని కల్ప వృక్ష తీర్మానము.
రస ప్రస్థానము నందు విశ్వనాథ - కాళి దాసు్, భవభూతి వంటి ఉత్తమ కవుల కోవకు చెందిన వాడు.
బులుసు వేంకటేశ్వర్లు.
సెల్. 9949175899.
జైహింద్.

24, ఫిబ్రవరి 2010, బుధవారం

DON`T MISS TO SEE I NEWS;LIVE WITH SRIDHAR. TO DAY.

0 comments

ప్రియ పాఠకులారా!
ఈ రోజు  ఉదయం (ఫిబ్రవరి 24, 2010) 9 గంటల నుండి 9.30 వరకూ ఐ న్యూస్ లో శ్రీ నల్లమోతు శ్రీధర్ తో లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. తప్పక చూడగలరు. 

21, ఫిబ్రవరి 2010, ఆదివారం

కవి వతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లుతో కళా తపస్వి శ్రీ విశ్వనాథ.

1 comments

"సుమధురం" అనే చలన  చిత్రం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో నిర్మిస్తున్న   సందర్భంగా 
కళా తపస్వి శ్రీ విశ్వనాథ దంపతులు  అక్కడ మకాం చేసి;  గడచిననాలుగు రోజులూ కవివతంస 
శ్రీ బులుసు వేంకటేశ్వర్లును కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్ప వృక్షముపై ఉపన్యసించమని కోరి, వారు దీక్షగా విన్నారు. ఆ సందర్భంలో తీసిన చిత్రాలను ప్రదర్శిస్తున్నాను. 

5=4x6-2c.jpg
కళా తపస్వి శ్రీ విశ్వనాథ దంపతులు కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు చే కవిసమ్రాట్ విశ్వనాథ రామాయణ కల్ప వృక్షం పై ఉపన్యసింపఁ జేసి ఆలకిస్తున్న దృశ్యం.

6=4x6-2c.jpg
కవివతంసకు కళా తపస్వివిశ్వనాథ దంపతులు నూతన వస్త్రాలు బహూకరిస్తున్న దృశ్యం.

4=4x6-2c.jpg
కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లుతో, కళా రపస్వి శ్రీ విశ్వనాథ దంపతులు.

కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు మనకు చిర పరిచితులు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్ప వృక్షం పై అనర్గళంగా ఇచ్చిన ఉపన్యాసాల్లోంచి మనం ముఖ్యమైన వాటిని ఆంధ్రామృతంలో వరుసగా సుమారు  31  భాగాలింత వరకూ తెలుసుకొన్నాం.
అతని కీర్తి చంద్రికలు తాకి; కళా తపస్వి విశ్వనాథకు కవివతంస నోట విశ్వనాథ రామాయణం స్వయంగా వినాలనే కోరికతో అతనిని పిలిపించుకొని అన్నవరం దైవ సన్నిధిలో ఆ కోరికను ఇన్నాళ్ళకు తీర్చుకొని, పులకించిపోయారు. అట్టి మహనీయుని ఉపన్యాస భాగాలను మిగిలిన వాటిని కూడా త్వరలో వరుసగా ప్రకటించడం జరుగుతుందని మనవి చేయు చున్నాను.
జైహింద్.

20, ఫిబ్రవరి 2010, శనివారం

చిత్రము కాక మరేమిటౌనయా?

0 comments

http://i.telegraph.co.uk/telegraph/multimedia/archive/01374/Ride-a-lion_1374985i.jpg

సింహము జూలు పట్టుచు, హసించుచు నెక్కిన  యీమె యెవ్వరో?
సంహితలందు లేదెచట; చక్కనిటుల్ మహిషాసురాధమున్
సంహరణంబు సేయ మహిషాసుర మర్ధిని పోలి యుండుటల్.
సింహమదేల యూరుకొనె? చిత్రము కాక మరేమిటౌనయా?
జైహింద్.

18, ఫిబ్రవరి 2010, గురువారం

"వేణు గోప" అనే మకుటంతో ఉన్న ఈ చంపకంలో ఎన్ని పద్య సుమాలున్నాయంటారు?

3 comments

http://images.exoticindiaart.com/panels/krishna_as_venugopal_wf94.jpg
कृष्णं वंदे जगद्गुरुम 
ప్రియ సాహితీ బంధువులారా! మీ సాహితీ పిపాసను అభినందిస్తున్నాను.
కొంత కాలంగా సాహితీ పరంగా మన మధ్య అంతరం పెరగడానికి కారణం నాయెడ క్షంతవ్యమైన కుటుంబ కారణాల వలన ఆవహించిన  నా నిర్లిప్తతయే.  సరే ఇప్పుడైనా మీ ముందుకు రాగలిగినట్లు ఆపరమాత్మ చేసినందుకు ధన్యుఁడను.
ఆ పరమాత్మ వేణు గోపుని  ఈ క్రింది విధంగా  ఆ సరస్వతీ మాత కటాక్షీంచి, ప్రార్థింపఁజేసింది.
 నను కనుమా! ప్రభూ! కృపను, నా కను పాపల తృష్ణ తీర గా;
నిను కనుచున్; సదా మనము నీ గుణ చింతన మానకుండ కూ
ర్మిని వినుచున్; మహా మహిత! మేదిని గావుమ! మాన్య! నన్ను తీ
రున మనగన్. హరీ! విపుల రుగ్మ నివారక! వేణు గోపకా!
ఈ చంపక మాలలో ఎన్నెన్ని ఏయే పద్యాలు నిబిడీకృతమై యున్నాయో మీరిప్పటికే గ్రహించి ఉంటారు.
మీరు గుర్తించినవి వేరు పరచి, మీ వ్యాఖ్యద్వారా నాకు తెలియఁ జేసి, గుణ దోషాలతో పాటు, మంచి అభ్యుదయ స్పోరకమైన సూచనలను కూడా ఇవ్వ వలసినదిగా మనసారా కోరుకొంటున్నాను.
పద్యాలు వ్రాయండి. పద్యాన్ని పునరుద్ధరించండి, అని చెప్పే చాలా మంది సన్మిత్రుల మాటలే నాకు ఉత్తేజకాలు.
దయతో మీరూ అనుసరించ గలరని నా విశ్వాసం.
జైహింద్.

14, ఫిబ్రవరి 2010, ఆదివారం

నల్లమోతు శ్రీధర్ లైవ్ ప్రోగ్రాం ఐన్యూస్ లో.

1 comments

ప్రియ సాహితీ బంధువులారా!
ఇంతకు ముందు టపాలో భువనవిజయం ప్రచురించాను చూడ గలరు.


రేపు ఉదయం (ఫిబ్రవరి 15) 8.30 గంటల నుండి 9 గంటల మధ్య ఐ న్యూస్ ఛానెల్ లో  శ్రీ నల్లమోతు శ్రీధర్ తో లైవ్ ప్రోగ్రామ్ ప్రసారం కాబోతోంది.
తప్పక మనకు ఉపయోగ కరంగా మలచుకో గలం
జైహింద్..

భువనవిజయము.

3 comments


శ్రీరస్తు                  శుభమస్తు         అవిఘ్నమస్తు
//భువన విజయము//
నాంది. (ప్రార్థన)
శ్రీ కృష్ణుండసమాన తేజమున నిక్షేపించె నీ నేలపై
భూకాంతుల్ సుకవీశ్వరుల్ కృతులలో పూజ్యంబుగా నిల్వగా ! 
లోకంబున్ భువనాఖ్యసద్విజయ స్వర్లోకంబుఁ గావించె. నీ
శ్రీకారంబును చుట్టు నేటి సభకున్ శ్రేయంబు చేకూర్చుతన్. 
ప్రస్తావన. విదూషకుఁడుll
విజయ నగర చక్రవర్తి యగు శ్రీ కృష్ణ దేవరాయలు  సమరాంగణా సార్వభౌముఁడుగా, గొప్ప చక్రవర్తిగా, భువన విజయ పతాకలు ఎగురవేసి, తాను గావించిన భువన విజయమునకు గుర్తుగా ఒక సభను ఏర్పటు చేసాడు. ఆ సభ భువన విజయ సభగా పిలువఁబడే 
కవన విజయ సభగా రూపు దిద్దుకొన్నది. 
ఖడ్గంతో ఎంత సునాయాసంగా విజయం సాధించ గలడో అంతే సునాయాసంగా కలం పట్టి కవనంలోను విజయం సాధించ గలడు మన కృష్ణదేవరాయలు. తాను కలం పట్టి మదాలస చరిత్ర, సత్యావధూ ప్రీణనం, సకల కథా సార సంగ్రహం, జ్ఞాన చింతామణి, రసమంజరి అనే కావ్యం, అంతే కాక `జాంబవతీ పరిణయం, ఉషా పరిణయం, గంగావతరణం  అనే సంస్కృత నాటకాలు', తెలుగులో ఆముక్తమాల్యద అనే దివ్య ప్రబంధము  వ్రాసాడు.  అందుకే అతఁడు సాహితీ సమరాంగణాసార్వభౌముడయ్యాడు. 
ఆ రాయలవారు రూప కల్పన చేసిన ఆ భువన విజయం ప్రదర్శనను  నేడు మనం కన్నుల పండువుగా తిలకిద్దాం. మనసారా విని, రసాస్వాదనాపరులమై ఆనందిద్దాం.
ఇక ఆ సభకు అష్ట దిగ్గజ కవులను, పిదప తిమ్మరిసు మంత్రి వర్యులను, ఆపిదప రాయల వారిని, స్వాగతిద్దాం.
ముందుగా అందరికీ పెద్దన్న ఐన పెద్దన కవికి స్వాగతం పలుకుదాం.
ఆంధ్ర కవితా పితామహా! 
శ్రీ అల్లసాని పెద్దన కవీ! స్వాగతం, సుస్వాగతం!
గురువు శఠకోపయతికని కూర్మి మీర 
హరికథాసారమను గ్రంథ మంకిత మిడి,
ఆశుకవితల సభికుల నలరఁజేయు
అల్లసానికవీశ్వరా! స్వాగతమ్ము.
(అల్లసాని పెద్దన తన స్థానాన్ని అలంకరిస్తారు)
ముక్కు తిమ్మన కవికి స్వాగతం, సుస్వాగతం.
ఘనుడ! వాణీ విలాసమన్ గావ్య రచన 
నందఁ జేసిన సత్కవీ! నంది కులజ!
తీయ తేనియ పలుకుల తిమ్మనార్య!  
స్వాగతమ్మయ! మీకు సుస్వాగతమ్ము!
(ముక్కు తిమ్మన తన స్థానాన్ని అలంకరిస్తారు)
మాదయ గారి మల్లన కవికి స్వాగతం, సుస్వాగతం.
అప్ప మంత్రి వదాన్యుని యాజ్ఞఁజేసి,
రాజ శేఖర సుచరిత్ర వ్రాసినట్టి
మాదయంగారి మల్లనా! మహిత మూర్తి!
స్వాగతమ్మయ! మీకు సుస్వాగతమ్ము!
(మాదయగారి మల్లన తన స్థానాన్ని అలంకరిస్తారు)
ధూర్జటి కవికి స్వాగతం, సుస్వాగతం.
కాళ హస్తీశ్వరుని, భక్తి మేళవించి
శతకమును వ్రాసి మెప్పించి, యతులితమగు 
స్తుతమతివియైన ధూర్జటీ! సుకవి మాన్య!
స్వాగతమ్మయ! మీకు సుస్వాగతమ్ము.
(ధూర్జటి కవి తన స్థానాన్ని అలంకరిస్తారు)
తెనాలి రామకృష్ణ కవికి స్వాగతం, సుస్వాగతం.
ఉద్భటారధ్య చరితమ్ము నద్భుతముగ
వ్రాసి లోకాన సుకవిగ వాసి గన్న
రామలింగడ! కవితాభిరామ కృష్ణ !
స్వాగతమ్మయ! మీకు సుస్వాగతమ్ము.
(రామకృష్ణ లవి తన స్థానాన్ని అలంకరిస్తారు)
అయ్యలరాజు రామ భద్ర కవికి స్వాగతం, సుస్వాగత.
అసమ సంగీతకళలరహస్య నిధివి.
రమ్య రామాభ్యుదయ కావ్య రచన చేసి
రహినిగనిన అయ్యలరాజు రామభద్ర!
స్వాగతమ్మయ మీకు సుస్వాగతమ్ము.
(రామభద్రకవి తన స్థానాన్ని అలంకరిస్తారు)
పింగళి సూరన కవికి స్వాగతం, సుస్వాగతం.
ఘన మగు గిరిజా కల్యాణ కావ్య కృతుఁడ!
వినుత మయిన రాఘవపాండవీయ కృతుఁడ!
ఘనుఁడ! పింగళి సూరనా! కవి వరేణ్య!
స్వాగతమ్మయ! మీకు సుస్వాగతమ్ము.
(పింగళి సూరన తన స్థానాన్ని అలంకరిస్తారు)
రామ రాజ భూషణ కవికి స్వాగతం, సుస్వాగతం.
రమ్య నరసభూపాలీయ రచనఁజేసి,
సరస సంగీతమునుకావ్యపరము చేసి,
వసుచరిత్రము వ్రాసిన భట్టు మూర్తి!
స్వాగతమ్మయ! మీకు సుస్వాగతమ్ము.
(రామరాజ భూషణుఁడగు భట్టుమూర్తి తన స్థానాన్ని అలంకరిస్తారు) 
ఆరుపదుల వయసు దాటినా అత్యద్భుతమైన శారీరక మానసిక ధైర్య, స్థైర్యాలతో, నిశితమైన తన చూపులతో జనరంజకంగా అలరారే మంత్రివర్యులు తిమ్మరుసు గారు వేంచేస్తున్నారు.
ఆ తిమ్మరుసు గారికి స్వాగతం పలుకుదాం.
అసమాన చాతుర్య గణ్యా! 
తిమ్మరాజ మహామంత్రి వరేణ్యా! స్వాగతం సుస్వాగతం.
అయ్య యనిపించుకొంటివి
నెయ్యంబున కృష్ణ రాయ నృప పుంగవుచే
అయ్యా! నీసరి లేరిల.
తియ్యని విలుకాడవయ్య తిమ్మరుసయ్యా!
(తిమ్మరుసు మహామంత్రి సభికుల కభివాదం చేసి, తన ఆసనాన్నలంకరిస్తారు)
(తెర వెనుక- - - - రాజాధిరాజా! రాజ మార్తాండా! విజయ నగర సామ్రాజ్యాధీశా! సాహితీ సమరంగణా సార్వభౌమా! శ్రీ కృష్ణ దేవరాయా! జయహో! జయహో!)
అదిగో  మనం మాటాడుకుంటుండగానే మన కృష్ణ దేవరాయల వారు వేంచేస్తున్నారు. వారికి స్వాగతం చెప్పుదాం. 
ఆంధ్ర భోజులు 
శ్రీ కృష్ణ దేవ రాయల వారికి స్వాగతం, సుస్వాగతం.
(కృష్ణ దేవరాయలు ప్రవేశించి, అందరికి అభివాదం చేసి, తన సింహాసనంపై కూర్చుంటాడు)
సభా సరస్వతికి నమస్కారం.
ఇశుభ సందర్భంలో మీ అందరికీ నా హృదయానందకర విషయాన్ని  తెలియఁజేస్తున్నాను.
శ్రీకాకుళం ఆంధ్ర మహా విష్ణువు నా కలలో కనబడి ఇలా గన్నారు.
తెలుగదేలయన్న దేశంబు తెలు గేను 
దెలుగు వల్లభుండ దెలుగొకండ
యెల్ల నృపుల గొలువ నెఱుగవే బాసాడి 
దేశ భాషలందు తెలుగు లెస్స.
ఇలాగని  నా కలలో పలికి తన కంకితంగ ఒక కావ్యం వ్రాయమన్నారు. 
నేను వారి ఆజ్ఞానుసారమే ఆమహా విష్ణువుకు సంబంధించిన ఒక కథను గైకొని ముక్తమాల్యద అనే ప్రబంధాన్ని వ్రాసాను.
అంతటి మహోన్నత భాష ఐన మన తెలుగు భాషలో ఉద్దండ పండిత కవులు నా భువన విజయ సభ నలంకరించడం మా పురాకృత పుణ్య ఫలమే కదా! కవీశ్వరులకందరికీ అభినందనలు తెలుపుకొంటున్నాను.
(శ్రీకృష్ణ దేవరాయల నుద్దేశించి కవుల అభినందన) 
పెద్దనll
కృష్ణరాయ భూపా!
తునియలు తొమ్మిదియ. 
పదునెనమండ్రట మోచువా రనేకప, కిటి, కూ 
ర్మ, నగా,హు లేటి లావరు 
లని తావక బాహు వొకటి యవని భరించెన్.
తిమ్మరుసు.ll
ఓహో! పెద్దన కవీ! ఎంత బాగా చెప్పారు. అష్ట దిగ్గజాలు, సప్త కులపర్వతాలు, వరాహ, కూర్మ, ఆదిశేషు లనే 18మందీ మోస్తున్న భూమిని మీరొక్క చేత్తో పాలిస్తున్నారని.
సర్వ దిగ్విజయం చేసి పరిపాలన సాగిస్తున్న మన ప్రభువును సముచితంగా సందర్భోచితంగా ప్రశంసించారు ! బాగుబాగు.
ముక్కు తిమ్మనll
భువనైక మాన్య! కృష్ణ రాయ! జయము.
యాదవత్వమున సింహాసనస్థుఁడు గామి - సింహాసనస్థుఁడై చెన్ను మెఱయ.
గొల్ల యిల్లాండ్రతో గోడిగించుటఁ జేసి - పర కామినీ సహోదరతఁ జూప.
మరి జరా సుతునకై మధుర డించుటఁ జేసి - పర వర్గ దుర్గముల్ బలిమిఁ గొనఁగ.
బారి జాతము నాసపడి పట్టి తెచ్చుట - నౌదార్యమున దాని నడుగుపరుప,
గోరి తొలి మేన దనకైన కొదువలెల్ల 
మాన్చుకొన వచ్చి భువనైక మాన్య లీల
నవతరించిన కృష్ణుడౌననగ మించె 
నరస విభు కృష్ణ రాయ భూనాయకుండ!
తిమ్మరుసుll
కృష్ణావతారంలో యాదవుడవైన కారణంగా సింహాసమధిష్టించ లేకపోయినందునను, 
గోపకాంతల మనోహరుడుగ సంచరించి నందున ఇప్పుడు స్త్రీలను సోదరీ మణులుగ గౌరవించుట కొరకును, 
జరాసంధునికి మధుర వీడిన కారణంగా ఇప్పుడు శత్రు జయము చేయాలనే పట్టుదలతోను, 
ఆనాడు పారిజాతము గొప్పదని దాని తేడానికి కష్ట పడిన కారణంగా ఇప్పుడు దానిని అధిగమించడం కోసము, 
ఆ కృష్ణావతారంలో కలిగిన లోపాలన్నిటినీ సరిదిద్దుకోవడం కోసం ఇక్కడ కృష్ణ రాయలుగా, ఆ కృష్ణుడే యీ కృష్ణ దేవరాయలు అనేలాగ వెలసిన ఓ మహారాజా! అని మీరు ఈ రాయలెవరో కాదు ఆ శ్రీ కృష్ణుడే అని ఎంత మనోజ్ఞంగా సెలవిచ్చారు!!! 
ముక్కు తిమ్మన కవీ అమోఘం. 
అందుకే అంటారందరూ ముక్కు తిమ్మనార్యు ముద్దు పల్కు వినాలని.
మీరు రచించిన పారిజాతాపహరణ ప్రబంధంలోని ఒక 
పద్యం చదివి సభికులనానందపరచండి.
ముక్కు తిమ్మనll
అటులనే మహామంత్రీ!
శ్రీ కృష్ణు డొసగిన పారిజాత పుష్పాన్ని ధరించిన రుక్మిణి నిలా వర్ణించాను చూడండి.
మగ మీల నగ జాలు తెగ గీలుకొను వాలు కనుగవ కొక వింత కాంతి యొదవె.
వలి జక్కువల పెక్కు వలుదక్కు వగ నిక్కు చనుదోయి కొక వింత చాయ దోచె.
నెల తుమ్మెదల దిమ్ము వెలజిమ్ము చెలువమ్ము గల వేణి కొక వింత నలువు మీరె. 
నల చెందొవల విందు చెలువెందు వెదచిందు మొగమున కొక వింత జిగి దొలంకె.
జక్కదనమున కొక వింత చక్కదనము.  
జవ్వనంబున కొక వింత జవ్వనంబు.
విభ్రమంబున కొక వింత విభ్రమంబు.  
గలిగె నద్దివ్య కుసుమంబు కతన సతికి. 
అలాగే సత్య భామకు వచ్చిన యలుక పోగొడదామని కృష్ణుని ప్రయత్నం దాని ప్రతిఫలం వినండి.
పాటల గంధి జిత్తమున బాటిలు కోప భరంబు దీర్ప నె
ప్పాటను బాటు గామి; మృదు పల్లవ కోమల తత్ పదద్వయీ 
పాటల కాంతి మౌళి మణి పంక్తికి వన్నియ బెట్ట; నా జగ
న్నాటక సూత్ర ధారి యదునందనుడర్మిలి మ్రొక్కె,మ్రొక్కినన్;
జలజాతాసన వాసవాది సుర పూజా భాజనం బై తన
ర్చు లతాంతాయుధు గన్న తండ్రి శిర మచ్చో వామ పాదంబునం
దొలగం ద్రోచె లతాంగి. యట్ల యగు నాధుల్ నేరముల్ సేయ బే
రలుకం జెందిన యట్టి కాంత లుచిత వ్యాపారముల్ నేర్తురే?
తిమ్మరుసుll
ఓహో ఎంతటి లోకానుభం ఎంతటి తాదాత్మ్యత. ఆహా! మహాకవీ! అభివాదములు.
మాదయగారి మల్లనll
కృష్ణ రాయలు వారికి శుభములు కలుగు గాక!
తిమ్మరుసుll
గుత్తి దుర్గంలో అధికారి, నా  మేనల్లుడూ ఐన అప్ప మంత్రి రాజశేఖర చరిత్ర తన కంకితంగా వ్రాయమన్నారట కదామహాకవీ?
మల్లనll 
ఔను మహామంత్రీ. 
నీవిపుడు చెప్ప దలచిన 
భావ రసోద్యన్ మహా ప్రబంధము నాపై
గావింపుమంకితమ్ముగ. 
గోవిద హృదయ ప్రమోద గుంభిత ఫణితిన్.
అని నన్ను అడుగగా నేను రాజ శేఖర చరిత్ర వ్రాసి వారికంకితమిచ్చాను.
తిమ్మరుసుll (సభికులవైపు చూస్తూ)
ఇది మల్లనగారి స్వకపోల కల్పిత గాధ గా భావిస్తున్నాము. 
వీరి గ్రంథం గ్రామీణ వివాహ వ్యవస్తకు అద్దం పట్టడాన్ని మనం గమనిస్తాం.
(ఇప్పుడు మల్లన వైపు చూస్తూ)
ఔనండీ మల్లన్న గారూ! మీ రామ చిలుక కూడా మహా పాండిత్య ప్రకర్ష కలిగి, 
వ్యాసుడితోనైనా సరే వాదిస్తుందిట కదా?నిజమేనా?
మల్లనll  
ఔను మంత్రివర్యా!. 
వాదింతున్ బహు వేద శాస్త్ర కలనా వైయాత్య సంసిద్ధి న
వ్వేదవ్యాసులతోడ నైన మది సంవీక్షించి యెచ్చోట నే
గాదన్నన్ మరి నిర్వహింప నశక్యంబేరి కస్మద్వచ
శ్శ్రీ దాంపత్యము నాక నాక యనుకో సిగ్గయ్యెడున్ భూవరా!
తిమ్మరుసుll
ఆహా ఎంత గడుసుగా తన వ్యక్తిత్వాన్ని 
స్వయముగా తెలుపుటకు సిగ్గుపడి 
తన గ్రంథంలో చిలుక పలుకులు పలికించారు మాదన్నగారు?
తిమ్మరుసుll
ప్రజలకు మీరుచెప్పే సులభమైన భక్తి మార్గం ఏమిటి?
మల్లనll
నీల కంఠుని శిరసుపై నీళ్ళు జల్లి, 
పత్తిరిసుమంత నెవ్వడు పారవైచు
గామ ధేనువు వానింట గాడి పసర 
మల్ల సురశాఖి వారింటి మల్లెచెట్టు.(రా.శే.చ.1- 65)
తిమ్మరుసుll
శివ హృదయాన్ని ఎంత చక్కగా వివరించి, సులువైన భక్తి మార్గాన్ని తెలియఁజేసారు.
మహద్భాగ్యా! అభినందనలు.
ధూర్జటిll
కావ్య నాటకాలంకార మర్మజ్ఞా! ధర్మజ్ఞా! కృష్ణ దేవరాయ! విజయోస్తు.
క్షితినాధోత్తమ! సత్కవీశ్వరుఁడు వచ్చెన్ మిమ్ములన్ జూడగా
నత డేమింట కవిత్వ వైఖరిని సద్యః కావ్య నిర్మాత త
త్ప్రతిభ ల్మంచివి తిట్టు పద్యములు చెప్పం డాతడైనన్ మమున్
గ్రితమే బూనెను బొమ్మటంచు నధముల్. శ్రీ కృష్ణ రాయాధిపా! 
తిమ్మరుసుll
ధూర్జటి కవీ! మీ ప్రతిభా పాటవాల్ని ఆ పరమ శివుడే గ్రహించిననాడు అధములతో పనేముంది చెప్పండి.
మీరు శ్రీ కాళహస్తీశ్వర శతకంలో మీ హృదయాన్ని పూర్తిగా అవిష్కరించి, సామాజికులలో మీకు నచ్చనివి పరమశివుడికి మొరపెట్టుకున్నారుట కదా?
ధూర్జటిll
మహామంత్రీ! ఆ పరమశివునికి విన్నవించుకోవడంలో తప్పేముంది.
చదువుల్ నేర్చిన పండితాధములు స్వేచ్ఛా భాషణ క్రీడలన్
వదరన్ సంశయ భీకరాటవుల ద్రోవల్ దప్పి వర్తింపగా
మదన క్రోధి కిరాతులందు గని భీమ ప్రౌఢిచే దాకినన్ 
జెదరున్ జిత్తము జిత్తగింప గదవే! శ్రీ కాళ హస్తీశ్వరా! 
అని అనేక బాధాకరంగా ఉన్న విషయాల్ని విన్న వించుకున్నాను.
తిమ్మరుసుll
ధూర్జటీ! మీరు శ్రీకాళహస్తి మాహాత్మ్యం అనే గ్రంధాన్ని వ్రాసారు కదా! వివరిస్తారా?.
ధూర్జటిll
ఆ పరమేశ్వరుడే
ఈ శుభ కావ్య రత్నమున కీశు నధీశు జేసినన్ మహా
దేశిక సర్వ భౌముడు మదిం ప్రమదంబు వహించి, ధూర్జటీ!
నీ శివ భక్తి కావ్య సరణిన్ గడు ధన్యత బొంద నవ్య భా
షాశయతా నిగుంభన రసస్థితినొప్పు దలిర్ప జెప్పుమా!
అని అడిగాడు. అందువలన శ్రీకాళ హస్తీశ్వర మాహాత్మ్యం కావ్యంగా రచించాను.
రాయలుll
స్తుత మతి యైన్ యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల కల్గెనో
యతులిత మాధురీ మహిమ?
రామలింగడుll
హా! తెలిసెన్ భువనైక మోహనో
ద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి సం
తత మధురాధరోదిత సుధారస ధారలు గ్రోలుటం జుమీ !!
తిమ్మరుసు.ll
ఏమిటి ధూర్జటీ! తెనాలి రామకృష్ణకు మీకు అంత లోతైన అవగాహనున్నట్టుంది? మీ యిద్దరూ మంచి పైలా పచ్చీసు వయసులో కలసి తిరిగేవారనుకొంటాను అక్కడకీ యిక్కడికీ! ఆ అనుభవంతోనే మీ లో గుట్టంత విప్పిమరీ వివరంగా చెప్పినట్టున్నారు?
ధూర్జటిll
అవో రోజుల్లెండి మహామంత్రీ! ఇప్పుడవన్నీ ఎందుకు లెండి.
తిమ్మరుసు.ll
సరే! చాలా సంతోషం. అభినందనలు.
తిమ్మరుసుll
తెనాలి రామకృష్ణ కవీ !  వినండి! కృష్ణ దేవరాయలు వారు ఇచ్చిన సమస్య, దానికి భట్టు మూర్తి పూరణ.
సమస్యll రవి గాననిచో కవి గాంచునే కదా!
భట్టుమూర్తి పూరణ.
ఆ రవి వీరభద్రుని పదాహతి డుల్లిన బోసి నోటికిన్ 
నేరడు రామ కృష్ణ కవి నేఠిచెబో మన ముక్కు తిమ్మరాట్ 
కౄర పదాహతిం బడిన కొక్కిరి పంటికి దుప్పికొమ్ము ప
ల్గా రచియింప నౌర రవి గాననిచో కవి గాంచునే కదా?
తిమ్మరుసుll
ఇది నిజమేనా? ఎంత రహస్యమైనా కవులు
కనిపెట్టెస్తారుకదా?
రామకృష్ణll
ఏ విషయం మహా మంత్రీ!
తిమ్మరుసుll
అదే. ఒక నాడు ఊయలలో కూర్చున్న ముక్కు తిమ్మనను మీరు శ్లేష ఉట్టిపడేటట్లు "ఊతునా" అని అడిగినట్లు,. తిమ్మన సరేనన్నట్లు, అంతే వారిపై మీరు ఉమ్మినట్లు,  వెంటనే ఆ తిమ్మన తన పావుకాలుతో పళ్ళు రాలకొట్టినట్లు, ఆ పన్ను మళ్ళీ దుప్పి శల్యముతో చేయించి, కట్టించుకున్నట్లూ తెలుస్తోంది. 
మీ రేమంటారు?
రామకృష్ణll
జీవితం గురించైనా సరే; కవిత్వం గురించైనా సరే; నన్నెవరైనా ఏదైనా అంటే సహించేది లేదు మహామంత్రీ!
ఒకని కవిత్వమందెనయు నొప్పులు తప్పులు నా కవిత్వమం
దొకనికి దప్పు పట్ట పని యుండదు, కాదని తప్పు పట్టినన్ 
మొకమటు క్రిందిగా దివిచి ముక్కలు వోవ నినుంప కత్తితో
సిక మొదలంట గోయుదును. జెప్పున గొట్టుదు. మోము దన్నుదున్ 
చూడండి మహా మంత్రీ!
కవి యల్లసాని పెద్దన కవితిక్కన సోమయాజి గణుతింపంగా
కవి నేను రామకృష్ణుడ. గవియను నామంబు నీటి కాకికి లేదే?
తిమ్మరుసుll
సరే మహాకవీ! శాంతించండి.
భట్టరు చిక్కాచార్యులవారి శిష్యుడై రామకృష్ణ గా పేరు మర్చుకున్నారటగా రామలింగకవీ!
రామకృష్ణll
ఔను మంత్రివర్యా!
తిమ్మరుసుll
మీరు కందర్ప కేతు విలాసం-హరి లీలా విలాసము. పాండురంగ మహత్యం. మొదలైన కావ్యాలు వ్రాసారట కదా! అందు పాండు రంగ మహత్యం నుండి మంచి పద్యాలు రెండు చదివి సభికుల నలరింప జేయ మనవి.
రామ కృష్ణll
అలాగే మహా మంత్రీ!
భ్రష్టుడైపోయిన తమ్మునితో నిగమ శర్మ అక్క పలికిన సందర్భంలోని పద్యాలు వినండి.
పరమేష్టి నుండి నీ తరము దాక విశుద్ధ తరమైన వంశంబు దలపవైతి.
తరి దక్కియున్న యీ తలిదండ్రులన్ జాల పరచవై సంతోష పరచవైతి.
వగ్ని సాక్షిగ బెండ్లి యాడిన యిల్లాలి నిల్లాలితాకార నొల్లవైతి.
ధర్మ శాస్త్రార్థ విత్తముల విత్తములచే నలరించి విఖ్యాతినందవైతి.
శీల మఖిలంబు నీది పిల్లి శీల మనుచు 
చదువు లివి యెల్ల
జిల్కల చదువులనుచు
దోడి వారలు నవ్వ నాతోడ! యేల 
బేలవైతివి? యీ గుణంబేల నీకు.
వీరావేశము దాల్చి సర్వ ధనమున్ వెచ్చించగాకేమి ము
క్కారుంబండు నఖండ సేతు వృతముల్ కాశ్మీర ఖండంపు  గే
దారంబుల్ దెగ నమ్మగా జనునె? నిర్ దారుండవే? వెన్క నె
వ్వారున్ లేరె సహోదరాదులు? కుల ధ్వంసంబు నీ కర్హమే?
పెద్దనll
రామకృష్ణ కవీ నిగమ శర్మ అక్కకు నామకరణ చేయలేదేమి?
రామకృష్ణll
ఆంధ్ర కవితా పితామహా! నిగమ శర్మ వంటి దుష్టుడు తమ్ముడయిన కారణంగా అక్క పేరుకు కూడా దౌష్ట్యం ఆపాదింప బడి నిందార్హమౌతుందని, ఆమెను నిగమ శర్మ అక్కగానే ఉంచేసాను.
తిమ్మనll
బాగుబాగు. రామకృష్ణ కవీ! అసాధ్యుడవే సుమా!!!
ఆ కాళిదాసు వలే నీవునూ వశ్యవాణివి.
అభినందనలు.
తిమ్మరుసుll
ఆంధ్ర కవితా పితామహా! అల్లసాని పెద్దనా! 
తమరు హరికథా సారము, రచించి తమ గురువగు శఠకోప యతికి అంకితం చేసారటకదా!
పెద్దనll 
ఔను మహామంత్రీ!
తిమ్మరుసుll
మీరు కృతి వ్రాయడానికి అవసరమైన ప్రత్యేక  ఏర్పాట్లు కల్పించాలిట?
పెద్దనll
ఔను మహామంత్రీ! కవిత్వం ఊరకనే వస్తుందేమిటి?
నిరుపహతి స్థలంబు, రమణీ ప్రియ దూతిక తెచ్చి యిచ్చు క
ప్పుర విడె మాత్మ కింపయిన భోజన ముయ్యెలమంచ మొప్పుత
ప్పరయు రసజ్ఞు లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్
దొరకిన కాక యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే?
తిమ్మరుసుll
తమరు పద్యం ఎంత గొప్పగా చెప్ప గలరో గద్యం కూడా అంత బాగా చెప్ప గలరని అనికుంటారు పాఠకులు.
పెద్దనll 
ఔను. నిజమే గదా!
తిమ్మరుసుll
మీరు రచించిన ఒక  
గద్యమును  చెప్ప గలరా?
పెద్దనll 
ఓ తప్పకుండా.  - - -   చెప్పుతున్నాను. వినండి.
ఒక రాక్షస పాత్ర వ్రాయ వలసి వచ్చినప్పుడు అతడు తిన్న జంతుసంతతిని అతడు ఇలా చెప్పుతున్నట్లు వ్రాస్తాను. 
జటియనక, వటువనక, యతి యనక, వ్రతి యనక, గృహి యనక, సతి యనక, శిశు వనక, భక్షించి, భక్షించి, కుక్షింభరిత్వంబునం బ్రవర్తిల్లితి నదియట్లుండె వినుము. తారలకు, వర్ష ధారలకు నిసువు నకుఁ గసవునకు, లెక్క గలిగినం గలుగు గాని, మదీయ జఠరానల జీర్ణ జంతు సంతానంబునకు లెక్క యిడ నక్కమలగర్భుండును సమర్థుండు గాఁడు.
తిమ్మరుసుll
ఓహో! అత్యద్భుతం పెద్దనకవీ! మీరు కవి లోకానికే పితామహులు సుమా! మీకు మా హృదయ పూర్వక అభినందనలు.
తిమ్మరుసుll
రామ భద్ర కవీ! ధ్వని చాలని కావ్యం -   అపత్య దూర సంసారం ఒక్కతీరు అనే కదా అంటాడు మీ రామాయణంలోని దశరథుడు!!! మీ అభిప్రాయం?
రామభద్రకవిll 
ఔను. ఏం సందేహమా?
తిమ్మరుసుll
మీ కావ్యంలో ధ్వని ప్రథాన పద్యాలు కోకొల్లలై ఉన్నాయని విన్నాము. ఒక్కటి ఉదహరించ గలరా?
రామభద్రకవిll
ఓ అలాగే. చిత్తగించండి.
సుగ్రీవుని పట్టాభిషేక సమయంలో బ్రహ్మాండమైన వర్షం పడుతోంది. అది ఇలా చెప్పాను. చూడండి.
ధారా శుద్ధి ప్రసిద్ధి గాంచి, ఘన శబ్ద స్ఫూర్తి వర్తిల్లగా
దోరంబైన రస స్థితిన్ దరళ విద్యున్మాలికా లక్షణో
దారంబై కవి సేవ్యమై వన మయూరారూఢి బ్రాపించి,  వ
ర్షారంభంబు ప్రబంధమ ట్లఖిల పద్యాక్రాంత మయ్యెన్ దగన్.
పెద్దనll
సుద్ధమైన వర్షధార,వలన ప్రసిద్ధి గాంచి,గొప్ప ఉరుములతో వర్ధిల్లగా,ఎడతెరిపి లేని నీటితో,మెరిసే మెరుపుల సముదాయంతో,పక్షులు సేవించుకొనే విధంగా, వనమయూరముల ఆరూడిని పొందునట్లుగా,వర్ష ప్రారంభము గొప్ప బంధమువలె,సమస్త ప్రదేశములను తగిన విధముగా ఆక్రమించుకొనెను.
సుద్ధమైన కవితా ధార, వలన ప్రసిద్ధి గాంచి, గొప్ప శబ్దములతో వర్ధిల్లగా,అంతు లేని రసస్ఫూర్తితో,ప్రకాశిత మయే విద్యున్మాలాది లక్షణ యుక్తమై, కవులు సేవించుకొనే విధంగా,వనమయూరారూఢితో,పద్యవర్ష ప్రారంభము ప్రబంధమువలె తగిన విధముగ సమస్తమైన పద్యములకు స్థానమయ్యెను.
ఓహో ఇలా వర్షాని వర్ణిస్తూ దానిలోనే మీ కవితా 
లక్షణాన్ని ఎంత అద్భుతంగా చెప్పారు రామభద్రకవీ! అత్యద్భుతం మీ నైపుణ్యం. మీకు మా అభినందనలు.
తిమ్మరుసుll
పింగళి సూరన కవీశ్వరా! మీరచనలు లోక ప్రసిద్ధములు ఐనను మీరు సభాముఖముగా మాకు తెలియ జేయ వలసినదిగా కోరుచున్నాము.
పింగళి సూరనll
మహా మంత్రీ! గిరిజాకల్యాణము,  ప్రభావతీ ప్రద్యుమ్నము, కళా పూర్ణోదయము, రాఘవ పాండవీయము అను ద్వ్యర్థి 
కా
వ్యము, నారచనలు.
తిమ్మరుసుll
మహా కవీ! మీ కవితా లక్షణాలేమిటి? 
పింగళి సూరనll
వినండి చెపుతున్నాను.
పొసగ ముత్తెపు సరుల్ పోహణించిన లీలదమలోన దొరయు శబ్దముల గూర్చి,
యర్థంబు వాచ్య, లక్ష్య, వ్యంగ్య, భేదంబు, లెరిగి నిర్ దోషత సెసగ జేసి,
రసభావములను నర్హంబుగ వైదర్భి మొదలైన రీతు లిమ్ముగ నమర్చి,
రీతులనుచితంబులై తనరారేదు ప్రాణంబులింపుగ బాదుకొల్పి,
నమరనుపమాదులును యమకాదులునగు 
నట్టి యర్థ శబ్దాలంక్రియలుఘటించి,
కవిత జెప్పంగ నేర్చు సత్ కవి వరునకు 
వాంఛితార్థంబు లొసగనివారు కలరె?
తిమ్మరుసుll
చాలా బాగా చెపారు కవి వర్యా! తెలుగు పద్యంలోనే సంస్కృత శ్లోకం కూడా పొందుపడే విధంగా చిత్ర కవిత్వం చెప్పడంలో దిట్టలు కదా! అలా వ్రాసిన పద్యానొకదానిని వివరించగలరా?
పింగళి సూరనll
ఓ తప్పకుండా!
వినండి.
మాయమ్మానసునీవే
రాయలవైకావదేవరాజేజేజే
మాయాతుమలానినయది
పాయకసంతోసమున్నపలమిలసామీ. 
చూచారు కదా!
వివరణ:-
ఈ కంద పద్యము నేను రచించిన కళా పూర్ణోదయము అనే మహా కావ్యములోనిది.
ఈ పద్యం తెలుగు పరంగాను, సంస్కృత పరం గాను రెండర్థాలు దేని కదే కలిగుంది.
ముందుగా తెలుగు పరంగా చూద్దాం.
పదచ్ఛేదము:-
మాయమ్మ - ఆన - చు - నీవు - ఏ- రాయలవు - ఐ - కావన్ - దేవరా - జేజేజే - మాయాతుములు - ఆనినయది - పాయక - సంతోసము - ఉన్నపలము - ఇలసామీ. 
అన్వయ క్రమము:-
దేవరా - జేజేజే - సామీ - రాయలవై - కావనే - సంతోసము - పాయక - మాయాతుములు - ఆనినయది - ఉన్నపలము - మాయమ్మానసు.
ప్రతిపదార్థము:-
దేవరా = ఓ ప్రభువా!
జేజేజే = మీకు ముమ్మాటికీ జయము.
సామీ = ఓ భూ నాయకా! నీవు
రాయలవై = రాజువై
కావనే = రక్షించుట చేతనే
సంతోసము = ఆనందము
పాయక = విడివకుండగా
మాయాతుములు = మా ఆత్మలను, మనస్సులను
ఆనినయది = అంటి యున్నది.
ఉన్నపలము = ఇది మాకు సిద్ధించి యున్న ఫలము.
మాయమ్మానసు = మా తల్లి తోడు సుమా! ( మేము చెప్పినది యదార్థము )
తాత్పర్యము:-
ఓ ప్రభువా! ముమ్మాటికీ నీకు జయము.ఓ భూ నాయకా! 
నీవు రాజవై రక్షించుట చేతనే ఆనందము విడువ కుండగా మా ఆత్మలనూ, మనస్సులనూ అంటి యున్నది. ఇది మాకు సిద్ధించి యున్న ఫలము.మా తల్లి తోడు సుమా! 
ఇప్పుడు సంస్కృతపరంగా చూద్దాము.
మాయమ్మానసునీవే
రాయలవైకావదేవరాజేజేజే
మాయాతుమలానినయది
పాయకసంతోసమున్నపలమిలసామీ. 
పదచ్ఛేదము:-
మా - ఆయం - మాన - సునీవే - రాః - అలవా - ఏకా - అవత్ - ఏవ - రాజే - ఆజేజే - మా - ఆయాతు - మలాని - న - యది - పాయక - సంతః - అసముత్ - న - పల - మిల - సా - అమీ.
అన్వయ క్రమము:-
హే సునీవే - ఆయం - మామాన - అలవా - రాః - ఏకైవ - అవత్ - అజేజే - రాజే - మా - ఆయాతు - మలాని - న - హేపాయక - సంతః - యది - అసముత్ - నపల - మిల - అమీ - సా.
ప్రతి పదార్థము:-
హే సునీవే = శుభప్రదమైన మూల ధనము గల ఓ రాజా!
ఆయం = రాబడిని,
మామాన = లెక్క చేయకుము. { రాబడిని నమ్మ వద్దు. దానిని నమ్ముకొని మొత్తం ఖర్చు చేయవద్దు}
అలవా = ఛిన్నాభిన్నము కానట్టి 
రాః = ధనము
ఏకైవ = ఒక్కటియే.
అవత్ = కష్ట సమయమందు రక్షీంచిన దగును.
అజేజే = బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నారాధించునట్టి, {లెదా} ఛాగ పశువుతో యజ్ఞము చేయునట్టి
రాజే = రాజుకొఱకు
మా = లక్ష్మీ
ఆయాతు = వచ్చెడును.
మలాని = పాపములు 
న = పొందవు.
హేపాయక = ఓ రక్షకా!
సంతః = సత్ పురుషులు
యది = దర్శింప వచ్చిరేని,
అసముత్ = సంతోష రహితుడవై
నపల = దర్శనమివ్వకుండ పోకుము.
మిల = వారితో కలియుము.
అమీ = కన వచ్చిన ఈ పండితులు
సా = ఆ లక్ష్మి. యని నమ్ముము.
భావము:-
శుభ ప్రదమైన మూల ధనము గల ఓ రాజా! రాబడిని లెక్క చేయకుము. రాబడిని నమ్ముకొని మొదలంటా ఖర్చు చేయకుము. ఛిన్నాభిన్నము కానట్టి ధనము ఒక్కటియే కష్ట సమయమందు రక్షించిన దగును.{ కావున మూల ధనమును సమూలముగవెచ్చింపకుము. } బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నారాధించునట్టి, { లేదా } ఛాగ పశువుతో యజ్ఞము చేయునట్టి రాజు కొఱకు లక్ష్మీ వచ్చెడును. { అట్టి రాజును సిరి ఆశ్రయించు నని భావము.} పాపములు పొందవు. 
ఓ రక్షకా! సత్ పురుషులు దర్శింప వచ్చిరేని సంతోష రహితుడవై దర్శనమివ్వ కుండ పోకుము. వారితో గలియుము. ఏలననగా కన వచ్చిన యీ పండితులు ఆ లక్ష్మి. { కోవిదులగు సత్ పూరుషులకు వేదమే లక్ష్మి యనియు, వారి నోట లక్ష్మి నివసించుననియు వేదములు చెప్పు చున్నవి. } కాబట్టి అట్టి వారికాశ్రయమిచ్చి 
యజ్ఞములాచరించి యింకనూలక్ష్మికాశ్రయభూతుడవు కమ్ము అని భావము. 
విన్నారు కదా!
తిమ్మరుసుll
ఓహో! ఎంతటి పాండితీ ప్రకర్ష ప్రదర్శించారు సూరనకవీ!
అభినందనలు.
తిమ్మరుసుll
రామ రాజ భూషణా! భట్టుమూర్తి మహాకవీ! 
మీరు వసు చరిత్ర అనే శ్లేష కావ్యాన్ని, నరస భూపాలీయమనే అలంకార శాస్త్రాన్ని, రాఘవ పాండవీయమనే ద్వ్యర్థి కావ్యాన్ని  వ్రాసిన అద్భుతమైన మహా కవిగా లోకంలో సుప్రసిద్ధులు. కవిగా మీసామర్థ్యం మాకు తెలియ చేస్తారా?
భట్టు మూర్తిll
అలాగే మహామంత్రీ! వినండి చెప్పుతున్నాను.
శతలేఖినీ పద్య సంధాన ధౌరేయు; ఘటికా శత గ్రంథ కరణ ధుర్యు;
నాశు ప్రబంధ బంధాభిజ్ఞు; నో
ష్ఠ్య
 నిరో
ష్ఠ్య
జ్ఞు; నచల జిహ్వోక్తి నిపుణు;
తత్సమ భాషా వితానజ్ఞు; బహు పద్య సాధిత వ్యస్తాక్షరీ ధురీణు;
నేక సంధోదిత శ్లోక భాషా కృత్య చతురు; నోష్ఠ్య నిరోష్ఠ్య సంకరజ్ఞు; 
నమిత యమకాశుధీ ప్రబంధాంక సింగ 
రాజసుత తిమ్మ రాజ పుత్ర , ప్రసిద్ధ
నరస వేంకట రాయ భూషణ సుపుత్రు
నను. బుధ విధేయు శుభ మూర్తి నామ ధేయు.(నరస.1- 13)
తిమ్మరుసుll
మిమ్మల్ని, మీకవితా సామర్ధ్యాన్ని సీసంలో చాలా చక్కగా  ఆవిష్కరించారు.
అసలు ఇంటిపేరేంటి మహా కవీ?
భట్టు మూర్తిll
ప్రబంధాంకం వారు.
మాకుటుంబీకుల పని ప్రబంధాలౌ చదవడమే అయిన కారణంగా ఆ పేరుండేది.
ఐతే మా పూర్వీకులకు భట్టుపల్లె అనే గ్రామాన్ని ఇవ్వడంతో ఆ నాటినుండి భట్టుమూర్తి వారుగా మాపెద్దలు మారారు. అల మాయింటిపేరు భట్టుమూర్తి ఐంది.
తిమ్మరుసుll
మీరు వ్రాసిన గ్రంథాలు ?
భట్టు మూర్తిll
నరసభూపాలీయము అనే కావ్యాలంకార సంగ్రహాన్ని వ్రాసాను.
తిమ్మరుసుll
మీరలాగంటే గుర్తుకొచ్చింది - - - - మీరు నాలుక కదపనక్కర లేకుండా అచల జిహ్వం ఉదాహరణతో సహా వ్రాసారుకదా? మాకాపద్యాన్ని తెలియజేస్తారా?
భట్టు మూర్తిll
ఓ తప్పకుండా మహామంత్రీ! వినండి.
భోగాంబు వాహ వాహ వి 
భాగేహాభావుకాంగ భావ భవ మహా
భాగ మహీ భాగమహా 
భోగావహ భాహు భోగి పుంగవ భోగా!.
తిమ్మరుసుll
అబ్బబ్బబ్బబ్బ ఎంతటి నిపుణత!!!!!
కేవల ఊష్మాంతస్థములతోనే మీరు పద్యం చెప్పినట్టుగా మీకు మంచి గుర్తింపుంది. అట్టి పద్యాన్ని చెప్పగలరా?
భట్టు మూర్తిll
చెప్పుతున్నాను వినండి.
హారహీరసారసారిహారశైలవాసవో
ర్వీరుహాహిహారశేష వేష హాస లాలస
శ్రీరసోరు యాశసాంశు శీల వైరి వీర సం
హార సారశౌర్య సూర్య హర్య వార్య సాహసా!
తిమ్మరుసుll
చాలా అద్భుతము మహాకవీ!
మీరు రచించిన వసుచరిత్ర ప్రబంధంలొ మీ సంగీత సాహిత్య వైదుష్యం ద్యోతకమౌతుందని ప్రతీతి. ఒక్కపద్యం చెప్ప గలరా?
భట్టు మూర్తిll
చెప్తున్నాను. వినండి.
లలనా జనాzపాంగ వలనాzవస దనంగ తులనాzభికాzభంగ దోః ప్రసంగ
మలసాzనిలవిలోల దళ, సాసవ, రసాల ఫల సాదర శుకాzలపన విశాల
మలినీ గరు దనీక మలినీ కృత ధునీ కమలినీ సుఖిత కోక కుల వధూక
మతి కాంత సలతాంత లతికాzన్‍తర నితాంత రతికాంతరణ తాంత సుతను కాంత
మzకృతకాzమోద కురవకా, zవికల వకుల
మకుల సకల వనాంత ప్రమోద చలిత.
కలిత కలకంఠకుల కంఠ కాకలీ వి
భాసురము వొల్చు మధుమాస వాసరంబు. ( 1-125 )
పింగళి సూరన  పై పద్యానికిలా వ్యఖ్యనం చెప్పును.
ఓహో! ఎంతటి 
కమనీయ రమణీయ గణనీయ వనశోభ
వసుచరిత్రంబున వరలఁ జేసె!!!
పింగళి సూరనll
రామ రాజ భూషణా! భట్టు మూర్తీ! మీరు వసంతాగమనాన్ని ఎంత శ్రోత్ర పేయంగా, సంగీత రస స్పోరకంగా చెప్పారు.
దానిలోని తాత్పర్యం ఎంత చక్కగా ఉంది!
వసంతమునందు పొగడలు, గోరంటలు పూచియు, బొగడలు మొగ్గలు తొడిగియు నుండ గోకిలలు కూయ సగెను. కాముకులు కౌగిలింతల సుఖమనుభవింపసాగిరి. చిలుకలు తీయ మామిపై చేరి, మధురముగ భాషింప  
సాగెను. తుమ్మెద ఱెక్కలచే నల్లనైన తమ్మి తీవియలలో జక్కవలు మెలగ దొడగెను. స్త్రీ పురుషులు వసంత వశమునపుష్పితములై మనోహరముగానున్న పొదరిండ్లలో నలసట గలుగునటుల గామ కేళికల దేలిరి.
వసంతం ఎప్పుడు వచ్చేదే ఐనా మీ వర్ణనలో వచ్చిన వసంతం హృదయానికి పులకింత కలిగిస్తోంది.
మీరు వ్రాసిన హరిశ్చంద్ర నలోపాఖ్యానమనే ద్వ్యర్థి కావ్యము కూడా అత్యంత రమణీయ ప్రబంధము. పరస్పర సంబంధము లేని, కరిశ్చంద్ర,, నల మహారాజుల వృత్తాంతములు గ్రహించి, కథాగమనానికేమాత్రము లోపము వాటిల్లకుండా వ్రాయగలిగిన మీ నిపుణతను అభినందిస్తున్నానుఈ కృతి నేను రచించిన రాఘవ పాండవీయమున కేమాత్రము తీసిపోదు సుమా!
{ మీరు శాపానుగ్రహ సమర్తులని అంటారు. ఈ విషయంలో మీరు ఒక ఉత్పల మాలికను కూడా ఆశువుగా చెప్పారని విన్నాను. 
అదేదో ఇప్పుడొక్కపరి వినిపింపఁగలరా?
భట్టు మూర్తిll
వినండి.
లొట్ట యిదేటి మాట పెను లోభులతో మొగమోట మేల తా
గుట్టక యున్నవృశ్చికము గుమ్మడి పుర్వని యందురే కదా?
పట్టపు రాజు పట్టి సరిపల్లె సరాసరి యీయకున్న నే
దిట్టక మాన. నా మతము తీవ్ర మహోగ్ర భయంకరంబుగా
దిట్టితినా మహాగ్రహమతిన్ మరక గ్రహ జర్జరీ భటా
పట్టపు దట్ట ఫాల ఫణి భర్తృ బహూకృత పర్జటస్ఫుటా
ఘట్టన దట్టణాలక విఘట్టనిరర్గళ రాజ భృత్యకీ
చట్ట చటార్భటీ నయన జర్జర కీలక రాలగా వలెన్.
జుట్టరికంబునం బొగడ జూచితినా రజతాద్ర్యధిత్యకా
పట్టణ మధ్య రంగ గత భవ్య వధూ వదనానుషంగ సం
హట్ట శిరస్థగాంగ ఝర హల్లక జాల సుధా తరంగముల్
చుట్టుకొనన్ వలెన్ భువన చోద్యముగా పయదంబుగా మరిన్
దిట్టితినా సభా భవన ధీంకృతి భీమ నృసింహరాడ్ధ్వజా
తాట్ట మహాట్టహాస చతురాస్య సముద్భ్రుకుటీ తటీ నటీ
కోట్టణ రోష జాల హృత కుంఠిత కంఠ గభీర నాద సం
ఘట్ట విజృంభ మాణ గతి గావలె. దీవన పద్యమిచ్చి చే
పట్టితినా మణీ కనక భాజన భూషణ భాసురాంబరా
రట్ట తురంగ గంధ గజ రాజ దమూల్య ఘనాత పత్ర భూ
పట్టణ భర్మ హర్మ్య భట పంక్తిచిరాయురనామయంబు నై
గట్టిగ దోడుతో వెలయగావలె నెక్కువ ఠీవిఁ జూడుడీ
యట్టిటు మందె మేలముల నందరనుంబలె జుల్క జూచి యే
పట్టుననైన గౌరవము పల్కకుడీ పయిపెచ్చునంచులన్
గొట్టుదు దుష్కవి ద్విరద కోటుల బంచముభోద్భటాకృతిన్
బెట్టుదు దండముల్ సుకవి బృందముకే నతి భక్తి సారెకున్
గట్టితి ముల్లెలేబదియు గాగల నూట పదారు లెయ్యెడన్
రట్టడి భట్టు మూర్తి కవి రాయని మార్గ మెఱుంగ జెప్పితిన్. }(చాటుపద్య మణి మంజరిl)
తిమ్మరుసుll
ఆహా!!! మీ సామర్ధ్యాన్నిగ్రహించాము. అభినందనలు.
రాయలుll
ముద్దుగ గండ పెండియరమున్ గొనుడంచు బహూకరింపగా
నొద్దిక నాకొసంగుమని యొక్కరు గోరగ లేరు. లేరొకో?
పెద్దనll
పెద్దన బోలు పండితులు పృథ్విని లేరని నీవెఱుంగవే?
పెద్దన కీ దలంచినను పేరిమి నాకిడు కృష్ణ రాణ్ణృపా!
రాయలుll
సరే సభాసదులు మెచ్చునట్టు కవిత్వం ఎలాగుండాలో వివరించి చెప్పండి.
పెద్దనll
చిత్తగించండి మహారాజా!
పూత మెరుంగులున్ బసరు పూప బెడంగులు జూపు నట్టివా
కైతలు? జగ్గు నిగ్గు నెన గావలె గమ్మన గమ్మనన్ వలెన్.
రాతిరియున్ బవల్ మరపు రాని హొయల్ చెలి యార
జం
పు ని 
ద్దాతరి తీపులో యనగ దారసిలన్ వలె లో దలంచినన్.
బాతిగ బైకొనన్ వలెను బైదల కుత్తుక లోని పల్లటీ 
కూత లనన్ వలెన్ సొగసు కోర్కులు రావలె నాలకించినన్.
జేతి కొలంది కౌగిటను జేర్చిన కన్నియ చిన్నిపొన్ని మే
ల్పూతల చన్ను దోయి వలె ముచ్చట కావలె బట్టి 
చూ
చి
నన్; 
డా తొడ నున్న మిన్నుల మిటారపు ముద్దుల గుమ్మ కమ్మనౌ
వాతెర దొండ పండు వలె వాచవి గావలె బంట నూదినన్;
గాతల దమ్మి చూలు దొర కైవసపుం జవరాలి సిబ్బెపు
న్మేతెలి యబ్బురంపు జిగి నిబ్బర పుబ్బగు గబ్బి గుబ్బపొం 
బూతల నూనెకాయ సరి పోడిమి కిన్నెర మేలుబంతి సం
గాతపు సన్న తంతి బయకారపు గన్నడ గౌడ పంతుకా
సాతత తాన తాన నల పసందివుటాడెడు గోట మీటు బల్
మ్రోతలనుంబలెన్ హరువు మొల్లవు గావలె, నచ్చ తెల్గు లీ
రీతిగ. సంస్కృతంబుపచరించెడుపట్టున భారతీ వధూ
టీ తపనీయ గర్భ నికటీభవ దానన పర్వ సాహితీ 
భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మత ప్రభా 
పాత సుధా ప్రపూర బహు భంగ ఘుమంఘుమ ఘుంఘు మార్భటీ 
జాతక తాళ యుగ్మ లయ సంగతి చుంచు విపంచికా మృదం
గాతత తేహితత్త హిత హాధి తధం ధణు ధాణు ధింధిమి
వ్రాత నయానుకూల పదవార కుహూద్వహ హారి కింకిణీ
నూతన ఘల్ఘలాచరణ నూపుర ఝాళ ఝళీ మరంద సం
ఘాత వియద్ధునీ చక చద్వికచోత్పల సార సంగ్రహా
యాత కుమార గంధ వహ హారి సుగంధ విలాస యుక్తమై
చేతము చల్ల జేయ వలె జిల్లన జల్ల వలెన్ మనోహర
ద్యోతక గోస్తనీ ఫల మధుద్రవ గో ఘృత పాయస ప్రసా
దాతి రస ప్రసార రుచిర ప్రసరంబుగ సారె సారెకున్.
రాయలుll
భళా భళా! అత్యద్భుతం పెద్దన కవీంద్రా! అత్యద్భుతం.
మీ ఎడమ పాదానికి ఈ గండ పెండేరం స్వయంగా అలంకరిస్తున్నను. అంగీకరించండి సరస్వతీ మూర్తీ! అంగీకరించండి.
(పెద్దన వినమ్రతతో కూర్చుండగా రాయలు అలంకరిస్తాడు)
{కవుఅందరికీ సత్కారాలు చేస్తారు}
భరత వాక్యముll {అందరూ హారతి యిస్తూ పఠిస్తారు}
మంగళమొందు! సత్కవుల మన్నన కార్యము బూను వారలన్.
మంగళమొందు! మాన్యులను మంచిగచూచెడి మంచివారలన్.
మంగళమొందు! రమ్య కవి మాన్యుల,  సత్ కవి రామకృష్ణులన్.
మంగళ మొందు! ప్రేక్షకుల మాన్య ప్రదర్శన నిచ్చు 
వా
రలన్.  
సమాప్తం
రచనll
చింతా రామ కృష్ణా రావు.
సెల్. 9247238537.
http//andhraamrutham.blogspot.com
జైహింద్.