గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఏప్రిల్ 2024, సోమవారం

ఉగాది వసంతోత్సవం.

జైశ్రీరామ్.
వేదికపై కవులు నిర్వాహకులు

నేను గానం చేసిన నా రచన.

 శా.  శ్రీమద్బ్రహ్మ వరిష్ఠ తేజ విలస చ్ఛ్రీబ్రాహ్మణోత్తంసులన్,

క్షేమంబే సతతంబు లోకములకున్ జింతించు మేధావులన్,

శ్రీమాతావరపాదపద్మములనే  జిజ్ఞాసతోఁ గొల్చు, నా

క్షేమంబున్ గనువారలన్ గొలిచెదన్, శ్రీదేవి కాచున్ మిమున్.


శా.  శ్రీమన్మంగళ భావనా లహరులై చెల్వొందుచున్నట్టి యా

రామద్రావిడ సంఘ సభ్యుల నిలన్ రాజిల్లగాఁ జేయుచున్,

బ్రేమన్ గావుమ క్రోధి వత్సరమ! మా విశ్వాసమున్ నిల్పుమా,

క్షేమంబున్ శుభ సంహతుల్ గొలుపుమా, శ్రీమాత సద్రూపమా!


శా.  శ్రీమద్బ్రాహ్మణ దివ్యతేజమనగా చెల్వొందు మక్రోధివై,

ప్రేమన్ నిల్పుము నాల్గుపాదములపై విఖ్యాతిగా ధర్మమున్,

నీ మంచిన్ మరువంగరాదు సుజనుల్, నీవింక యక్రోధివై

శ్రీమంతంబుగ స్త్రీల నిద్ధరను రాజిల్లంగ దీవింపుమా.


ఉ.  వేలకు వేల దుష్టులను వేచగ వచ్చిన నీవు మంచిగా

నేలుము మంచివారల ననేకవిధంబుల శోభఁగూర్చి, నీ

పాలన పుణ్యకర్ముల కపార శుభావహమై రహించి గో

పాలుడె నీవనన్ వెలుగు, భవ్య గుణావహ! క్రోధి! సన్నుతుల్.


ఉ.  శ్రీమన్మంగళ క్రోధి వత్సరము రాశీభూత శోభాళికిన్

శ్రీమన్మంగళ సద్గుణాళికి లసచ్ఛ్రీమార్గమై నిల్చుతన్,

మీ మార్గంబు జయప్రదంబగుచు, భూమిన్ మీకు మేల్జేయుతన్,

ప్రేమన్ వర్ధిలుడార్యులార! కననా శ్రీదేవి సత్ప్రేమతోన్.


ఉ.  మంగళమౌత శ్రీపతికి, మంగముల్ శుభక్రోధికిన్, సదా

మంగళమౌత సద్గుణ సమంచితులౌ వర సజ్జనాళికిన్,

మంగళమౌత హిందువుల మంగళ భావన పాళి కెల్లెడన్,

మంగళమౌత శ్రీహరికి, మంగళముల్ మన భారతాంబకున్.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.