గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, ఏప్రిల్ 2024, సోమవారం

షష్టిపూర్త్యుత్సవములు .. నోరి నరసింహ శాస్త్రి.[ఆంధ్రపత్రిక_ఖరసంవత్సరాది సంచిక 1951.52]

జైశ్రీరామ్. 

షష్టిపూర్త్యుత్సవములు   ..   నోరి నరసింహ శాస్త్రి.

విజ్ఞులైనవారు షష్ఠిపూర్తికి ఉత్సవ మేమని ప్రశ్నింపవచ్చును. అయితే యీనాడుపలువురు పెద్దలకు జరిగిన, జరుగుచున్న, జరుగనున్న షష్ట్యబ్దపూర్త్యుత్సవములను గూర్చి పత్రికలలో తరుచుగా చదువు చున్నాముగదా! కాబట్టి యామాట మనకు పరిపాటియైపోయినది. అందుచే దానిలోన సంబద్ధ మేమియుస్ఫురింపదు ఐనను గోకులాష్టమికిని, పీర్ల పండుగకును కల సంబంధమే షష్ఠిపూర్తికిని, ఉత్సవములకును గలదనుట సత్యము !

గోకులమున లోకసంగ్రహమునకై శ్రీకృష్ణభగవాను అవతరించిన మహాపర్వమును ఏటేట స్మరించుచు నానందముతో భారతీయులు జరుపు కొను నుత్సవము గోకులాష్టమి. బర్బరదేశములో వీరులు చనిపోయిన వేళను స్మరించుచు ఏటేట ముసల్మానులు దుఃఖముతో వాపోవునది మొహరము. ఒకటి ఆనందకారణమును స్మరించునది, మరియొకటి దుఃఖకారణమును స్మరించునది; ఒంటి భారతీయులది, మరియొకటి ముసల్మానులది. దుబకారణము కనబడినప్పుడు ఉత్సవము చేసికొను వారెవరైన నున్నచో, నట్టివారు షష్ఠిపూర్తిని ఉత్సవవేళగా భావింప వచ్చును.

మూలానక్షత్రముననో, జ్యేష్ఠయందో, కాక ఆ రెండు నక్షత్రముల సంధికాలమగు అభుక్తమూలమందో దంపతులకు కుమారుడు కలిగినచో వారేమి చేయుదురు: అట్టి దంపతులు లోకపూజ్యు అనుకొందము. అట్టి పుత్రు డట్టి వేళ వారికి జన్మించి నందుకు, వారి యదృష్టమునకు వారి నభినందించుచు ఆంధ్రదేశములోని పెద్దలందరును విరాళము లొసగి మహాసభ కావించి గౌరవించి యుత్సవ మొనర్తురా? అట్లు చేసినచో నది యెంత యసంబద్ధముగా నుండునో, షష్ట్యబ్దపూర్తి సమయమున ఉత్సవము జరుపుటయు నంత యసందర్భమే !

మా చిన్నతనములో షష్టిపూర్తికి ఉత్సవములు చేయునాచారము కనిగాని వినిగాని యెరుగము. అప్పటి కింకను ఉత్సవాదులు నిర్ణయించునది తద్విదులగు పండితులే కాని ఉత్సాహోద్రేకపూరిత మగు జనసామాన్యము కాదు. ఇప్పుడు మాత్రము ఈ యుత్సవములు సర్వసామాన్యమైనవి. నామకుడ ననుకొను ప్రతి వ్యక్తియు అరవదియవ పడిలోపడగనే, నా షష్ట్యబ్దపూర్తి యెప్పుడా, యని వృద్ధవరుడు వివాహోత్సవమునకు వలెనే ఉవ్విళ్ళూరుచుండుట చూచుచున్నాము.

ఈ మార్పుకు కారణ మేమి? శ్రీ పానుగంటివారి 'కంఠాభరణమే దీనికి మూలమని నా విశ్వాసము. ఆ నాటకము చదివిన వారును, ప్రదర్శింపగా చూచినవారును షష్టిపూర్త్యుత్సముల కుపక్రమించినట్లు. తోచును. అందులో సుబ్బిసెట్టికి అరవై యేళ్ళు నిండినవి. పాప మాతనికి.. ఉత్సవము చేయువా రెవరును ఊరిలో లేకపోయిరి. అంతట నాతడు, 'ఈ కాస్త భాగ్యానికి ఇంకొకరు చేసే దేమిటి? మనమే చేసికొందామని’ ఉపక్రమించినాడట !

‘షష్టిపూర్తి’ నిజముగా తానే యేదో చేసికొనవలెగానీ, ఇతరులు తన కిప్పు డుత్సవము చేయదగినదికాదని శ్రీ పానుగంటివారు తెలియకవ్రాసిరో, తెలిసియు చమత్కారమునకు వ్రాసిరో, మనము చెప్పజాలము కాని, ఆ భాగము చదివినప్పుడు గాని, ప్రదర్శింపగా చూచినప్పుడు గానీ పాఠకులును, ప్రదర్శకులును కడుపుబ్బ నవ్వకుండ నుండరు. కానివా స్తవ మెరింగినచో, అట్లా పాఠకులును, ప్రేక్షకులును నవ్వుట చూచి, నవ్వుకొన దగినవాడు సుబ్బిసెట్టియే !

షష్టిపూర్తికి చేయదగినది యుత్సవము కాదు, శాంతి. మూలా నక్షత్రాదులలో పుత్రజననమైనచో చేయదగిన దానికంటే తీవ్రతరమగు శాంతి, షష్ట్యబ్దపూర్తికి చేయవలెను. ఏ శాంతికర్మలలోనై నను ప్రధాన మైనవి దానములు, జపములు, హోమములు: దానము లనగానితరులకు ద్రవ్యము తామే యిచ్చుటగాని, యితరుల యొద్దనుండి పరిగ్రహించుట కాదు !

శాంతీకర్మలు ప్రదర్శించు గ్రంథములు పరిశీలించినవారికి ఉగ్రరథశాంతి, భీమరథశాంతి, విజయరథశాంతి అను మూడు శాంతులు గోచరించియుండును. వానిలో అరువదవయేట ఉగ్రరథ శాంతియు, డెబ్బదియవయేట భీమరథశాంతియు, డెబ్బదియెనిమిదవ యేట విజయరథశాంతియు, నాచరింపదగినవి. అందులో షష్టిపూర్తికి చేయవలసిన ఉగ్రరథశాంతినిగూర్చి యొకింత విచారింతము.

నాకు తెలిసినంతవరకు ఈ ఉగ్రరథశాంతికర్మ చేయుటకు మూడు విధానము లున్నవి. ఒకటి శౌనకోక్తము, ఇంకొకటి బోధాయనోక్తము, మరియొకటి శై వాగమోక్తము. ఈ మూడింటి ప్రక్రియలును, మూలసూత్రముల నొకటియేయైనను, తంత్రము న లోనను విశేషభేదము లున్నవి. వానిలో నెల్ల బహువిస్తృతమైనది. దాని నున్నదున్న మహారాజో చక్రవర్తియో! ఐనను యథాశక్తిగా ఆచరింపవచ్చును. అట్టిది ఒకసారి చూడగలిగి యద్భుతరూపము, లీలామాత్రముగనైనను, గో యోక్తి కానేరదు.

ప్రయోగవి స్తృతిలో నెన్ని భేదము విధించినది శాంతియే యనుట కెట్టి సందేహము లేదు. శౌనికుఁడిట్లు చెప్పుచున్నాడు.

‘`జన్మత ష్షష్టి మే వర్షే మృత్యు రుగ్రరథోనృణామ్

షాణ్మాసాన్మృత్యు మాప్నోతి ధనహానిశ్చ జాయతే 

పుత్రనాశోదారనాశో ధననాశ స్తథైవ చ 

తద్దోష శమనార్థాయ శాంతిం కుర్యాద్విచక్షణః 

జన్మాల్దే జన్మమాసేచ స్వజన్మదివసే తథా 

జన్మర్జేచైవ కర్తవ్యా శాంతి రుగ్రరథాహ్వయా 

దేవాలయే నదీతీరే స్వగృహేవా శుభస్థలే....'”

జన్మాదిగా నరువదియవయేట నరులకు, మృత్యువు ఉగ్రరథ రూపమున నావేశించి, వారికేకాక వారి పుత్రులకు పత్నులకు నాశమును ధనక్షయమును కలిగించును !

అదియే శైవాగమములో నిట్లు చెప్పబడియున్నది. ఈశ్వరుని గుహుడు దానినిగూర్చి ముం దిట్లు ప్రశ్నించినాడు:

స్వామి న్నుగ్రరథి నామ సర్వప్రాణిభయంకరః పుత్రిపౌత్రక్షయకరో ధనధాన్య వినాశనః రాజ్యభ్రంశకరో రాజ్ఞాం ఇత్యేవం బహుశశ్ర్శుతమ్.”

అది నిజమే యని యీశ్వరు డిట్లు వర్ణించెను.

'సాధుతే కథయిష్యామి తముగ్రరథమాదరాత్ 

మహామృత్యుసమః ప్రోక్తః ప్రాణినాం సర్వనాశనః . 

మహాకాయో మహాదంష్టో ఘోరరూపే భయానకః 

ఆవిర్భావే యస్యపుత్ర ధనధాన్యాది నాశసమ్ 

భవేత్పీడాచ మహతీ రాజ్ఞాం రాజ్యవినాశనమ్ 

అనావృష్టిశ్చమహతీ శత్రుపీడా తథై వచ 

గజాశ్వరథనాశశ్చ స్వరాజ్యాద్య్రంశనం తథా 

ప్రొ దుర్భావే భవస్త్యేతే దోషా ఉగ్రరథస్యవై

ఉత్పత్త్యబ్ది రుగ్రరథ ష్షష్ఠిమేద్దే ప్రకీర్తితః 

యస్యావిర్భావమాత్రేణ సంసారీ భయమాప్నుయాత్.’

వీనినిబట్టి చూడగా అరువదియవయేడు ప్రవేశించుటయే భయంకర మైనది. అప్పుడు మహామృత్యుసముడగు ఉగ్రరథుడు ఆవిర్భవించును• కావున వెంటనే యథాశక్తిగా నుగ్రరథశాంతి యాచరించుట శ్రేయస్క రము.

ప్రయోగములతో మృత్యుంజయ దేవతా కలశ కలశస్థాపనము, తత్ప్రతిమాస్థాపన పూజనములు ముఖ్యములు. అట్లే దుర్గను, గణేశుని,

విష్ణువును, సముద్రములను, నదులను, దిక్పాలురను, నవగ్రహములను, చిరజీవులను కలశములలో నావాహన మొనర్చి త త్తత్ప్రతిమలు

సువర్ణముతో నొనర్చి పూజాదికము చేయవలెను, మరియు కలశములలో నావాహనచేసి పూజింపదగినవారు — అరువదిమంది సంవత్సర దేవతలు, ఆయన దేవత లిద్దరు, ఋతువులు, మాసములు, పక్షములు, తిథులు, వారములు, తారలు, యోగములు, కరణములు, రాసులు పండ్రెండు, పంచబ్రహ్మలు, స ప్తవాయువులు, అష్టవసువులు, దశదిక్కులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు' — ఈ యధిష్ఠానదేవత లందరిని వేరువేరుగా కలశములలో నావాహన మొనర్చి సువర్ణప్రతిమలుంచి పూజాజపములు వేర్వేర నొనర్చి తిలదూర్వాంకురాదులతో హోమములు చేయవలెను. తుదకు యజమానిని ఆయుస్సూ క్తము, మృత్యుసూక్తము ఇత్యాది

మంత్రములతో కలశోదకముల నభిషేకింపవలెను. ఆ పిమ్మట యజమాని ఆచార్యునకు, ఋత్విక్కులకు ప్రతి మాదికములు దానమొనర్చి, మరియు కంబళదానము, గోదానము, కార్పాసదానము, ఆయసదానము, దశదానములు, నవగ్రహ ప్రీతికరములగు నవధాన్యదానములు ఇత్యాది దానము లొనర్చి, బ్రాహ్మణుల భుజింపజేసి దీనులను అనాధులనుగూడ తుష్టి నొందింపవలయును. ఇట్లు చేసినచో నరువదియవయేట నావేశించు నుగ్రరథుడు శాంతించును; దీర్ఘాయుర్దాయము కలిగి పుత్రపౌత్ర వంతుడై సుఖముండును. ఇట్టిది ముఖ్యముగా షష్టిపూర్తికి చేయవలసిన క్రియ !

యుత్సవ సమయమని ప్రవర్తించుట మాత్ర మంతకంటె వేయిమడుగు లెక్కువ తప్పు; పై పెచ్చు, ఇది ఎంతో ప్రమాదకరమైన పొరపాటు ! నవ్వుకొనునట్టిది కాదు.

శత సంవత్సరములు జీవించినవారును. సహస్ర చంద్రదర్శనము చేసిన వారును గూడ శతాభిషేకమను నొక శాంతి చేసికొనవలెను. అనియు శాంతులే యైనను అందులో ఉత్సవ విశేషము కూడ నున్నది. వానివలన ఫలముకూడ పీడానివృత్తిమాత్రమే కాదు. అందులో శతాభిషేకమైన తర్వాత యజమాని ంథమెక్కి, స్వస్తి వాచనములతో దుందుభిశబ్ద పురస్పరముగా గ్రామము ప్రదక్షిణము చేయును. ఇది`

యొనర్చినచో నాతనికి లభించు ఫలమొక్క పీడానివృత్తియే కాదు. అట్టివాడు తనకు పూర్వులగు పదితరముల వారిని, తన్ను, తన తర్వాత పచ్చు మరి పదితరముల వారిని పునీతుల నొనర్చి, తాను పుత్రపౌత్రు లతో షష్ఠివర్ష సహస్రములు స్వర్గలోకమున నుండి, యా పిమ్మట బ్రహ్మసాయుజ్య సాలోక్యముల నందునట. ఇవి బోధాయన భగవానుల వాక్యములు !

5

నా మిత్రులలో పలువుర షష్టిపూర్తి సమీపించు చున్నది. వారును

ఆ సమయమున తమ్ము ఆంధ్రలోక మెట్టి యుత్సవ మొనర్చి సమ్మా

నించునో యని నిరీక్షించుచు ఉవ్విళ్ళూరుచుండ వచ్చును. వారిలో

కొందరికి, అది యొక వేడుకయేకాక, అవసరమగు ధనసంపాదనకు

మూలమగు మార్గమును కావచ్చును. అట్టివారు ముఖ్యముగా ఈ వ్యాస

రచయితను ప్రత్యక్షముగా గాకున్న మనస్సులోనైన నిందింపకపోరు.

అందుచే నాకు కొంత ప్రత్యవాయ ముండవచ్చును. కాని షష్టిపూర్తి

సమ్మాన సంఘములవారు చేయు బలవంతములకు మోమోటపడి

విరాళము లిచ్చు వారిలో పలువురుమాత్రము అది తప్పిపోయినందుకు,

ఆనంద పూర్వకముగా నాశీర్వదింతురు గదా !

షష్టిపూర్తి దగ్గరపడిన మిత్రు లందుచే దాని స్వరూప మెరిగి, యథాశ క్తిగా తమ ద్రవ్యము వ్యయ మొనర్చి శాంతి గావించుకొని,చిరజీవులై, సహస్రచంద్ర దర్శనులు, శత సంవత్సర జీవులునై, అప్పుడు చేయవలసిన యుత్సవము చూచి యానందింప మా కావకాశ మిత్తురుకాకః వారును పునీతులై ముందు ముందు ఉత్తమలోకములు ప్రాపింతురు గాక !

[ఆంధ్రపత్రిక_ఖరసంవత్సరాది సంచిక 1951.52]

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.