జైశ్రీరామ్.
నన్నయ వాఙ్మయ వేదిక ఆధ్వర్యవములో రాజమహేంద్రవరం ఆదిత్య డిగ్రీ కళాశాలలో
18.08.2019న జరిగిన అష్టావధానము.
అవధాని: తాతా సందీప్ శర్మ
అధ్యక్షులు: శ్రీ ఎస్ పి గంగిరెడ్డి
సంచాలనం:- శ్రీ ఎఱ్ఱాప్రగడ రామకృష్ణ
పృచ్ఛకులు:- సర్వశ్రీ
నిషిద్ధం. డా యస్వీ రాఘవేంద్రరావు
సమస్య. కొనకళ్ళ ఫణీంద్ర రావు
దత్తపది. పెరుమాళ్ళ రఘునాధ్
వర్ణన. ప్రయాగ సుబ్రహ్మణ్య శర్మ
ఆశువు. పురాణపండ రాఘవ
వ్యస్తాక్షరి. చావలి శాస్త్రి
ఘంటావధానం. కు. వేంకటలక్ష్మి
అప్రస్తుతం. డి.వి.హనుమంతరావు
మ.కో
శ్రీయుతమ్ముగ నక్షరమ్ములు చిన్ననాటనె నేర్పియున్
ధీయుతమ్ముగ పద్యమల్లగ దీప్తినందగ పెంచియున్
నాయెడందను తెన్గునింపిన నారికిన్ వరగౌరికిన్
నాయనమ్మకు పార్వతమ్మకు నా నమస్కృతులిచ్చెదన్
శా.
నిర్దుష్టమ్మగునీవధానమిలలో నిర్దేశముంజేసియున్
స్వర్దైవమ్మయి మమ్ము పంచి, కడు వాత్సల్యమ్ము చూపించుచున్
గీర్దార్ఢ్యమ్మున సంస్కృతాంధ్రములనే క్రీగంట శాసించు చిత్
శార్దూలమ్మయి నిల్చు దివ్యమణికిన్ సాష్టాంగముల్ చేసెదన్
కం.
అనునిత్యమ్మనురాగము
ననునయమున పంచునట్టి అమృతమనస్కుల్
అనఘులు నమ్మానాన్నలు
వినయమునన్ జోతలిడుదు వేదిన్ వార్కిన్
శా.
కుఱ్ఱన్ నేనతడా కురుప్రవయుడై కూర్చున్న దివ్యాత్ముడున్
తఱ్ఱన్ జ్ఞానునిగా మలంచు ఘనుడంతర్యామి ఈనాటికిన్
ఉఱ్ఱూతల్ కలిగించు వ్యాఖ్యనిడి తా నుద్బోధ గావించు శ్రీ
ఎఱ్ఱాప్రెగ్గడ రామకృష్ణునకివే ఇంపైన పద్యార్చనల్
కం.
విధ్యుక్త ధర్మకర్తను
విద్యార్ధుల భవితకుగల పేరిమి పెద్దన్
అధ్యక్షస్థానీయున
సాధ్యుని పెదగంగిరెడ్డి సద్బుధు దలతున్
కం.
మున్నెన్నియొ గురు సభలను
వన్నెలు చేకూర్చ తెలుగు భాషకు, సలుపన్
నన్నయ వాఙ్మయ వేదిక
ఇన్నగరఖ్యాతియెల్ల యెల్లలుదాటెన్
కం.
వసపట్టిన పిట్టగ నేన్
నసపెట్టిన పెట్టకున్న ననుభరియింపన్
వెసజేరిన ప్రేక్షకులకు
బసచేసిన పాత్రికేయవరులకు నతులౌ
****అవధానాంశములు***
నిషిద్ధం: గాంధీతాత గారి పై
కం.
ఈనాటికినా ధన్యుడు
తానై స్వేచ్ఛన్ జయింప తాల్మిన్ పాదై
మౌనమ్మునపోరాడుచు
పూనికతో గెలిచినట్టి పూజ్యుడు గాంధీ.
సమస్య...
రెక్కలు రాని పక్షి ఎగిరెన్ వినువీధిని రివ్వురివ్వునన్
ఉ.
ఒక్కట చక్కనైన వనముజ్వలమైనది పూలునిండ,స
మ్యక్కమనీయ పుష్పమున అర్మిలిగా మధుపంబు వ్రాలి, తా
నెక్కిన పూల తేనె గొనియెన్, వెనువెంటనె పోవ, తోడ పూ
రెక్కలు రాని పక్షి ఎగిరెన్ వినువీధిని రివ్వురివ్వునన్
దత్తపది.
సమంత,నయనతార, రాధిక, సుమలత.....
రామాయణార్ధంలో
తే.గీ.
రోసమంతయు నిండగా క్రూరునణచి
ఆంజనేయ వీరాధిక ప్రాంజలులను
రాముడంది, వినయ నతారణ్యకులకు
అభయమిడి తనుసుమలతన్ అవనిజఁగొనె
వర్ణన: గోంగూరపచ్చడి
శా.
ఎల్లల్ లేనటువంటి గొప్ప చవులూరించున్ సదాంధ్రాళికిన్
ఉల్లిన్ గల్పుచు రోటిలో నునిచి ఓహోయంచు తాలింపులన్
సల్లీలన్ జతచేయగా రసనకున్ స్వర్గమ్ము కన్పట్టెడున్
కుల్లాయుంచిన వాని నోటికయినన్ గోంగూర దివ్యంబగున్
ఆశువు.
1. సమైక్యభారతం
కం.
ఆసేతు హిమాచలమయి
భాసిల్లుచునుండె దివ్య వాహినులురకన్
రోసము నిండిన భూమిగ
వాసింగనెనీ సమైక్యభారతమిలలో
2.అవధానానికి వచ్చిన పెద్దలకు నమస్సులు.
ఆ.వె
చిన్నవాడనైన శేముషిన్ వెలయింప
వేగ వచ్చినారు వేడ్కమీర
ఆశిషమ్ములిడుడు అక్షరక్రీడలో
చివరి వరకు నిలిచి సేసలిడుడు.
వ్యస్తాక్షరి.
శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం.
ఓం నమో నారాయణాయ.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అవధానాంశములు అన్నియు ఆశక్తి కరముగా అద్భుతముగా నున్నవి .ముఖ్యముగా గోంగూర పచ్చడి ఘుమ ఘుమలు మరింత రుచి కరములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.