జైశ్రీరామ్.
శ్లో. రేఖాః ప్రాగాయతాః పంచ రేఖాః పంచోదగాయ తాః
రేఖే ద్వే కోణతాః కోణే తిర్యగ్రేఖా చతుష్టయమ్ I
పశ్చిమే కలశాకారం పురతో గజ కుంభవత్
పదాత్ పార్శ్వ గతో యేన యిదం స్వస్తిక లక్షణమ్ II
ఈ శ్లోకము పూజా సమయంలో స్వస్తిక్ గుర్తు, దానికి తూర్పున ఏనుగు కుంభస్థలాకారము, పశ్చిమమున కలశాకారము వచ్చునట్లు రేఖలు వేయుటను గూర్చి వ్చివరించునది.
ప్రతిపదార్థము.
ఆయతాః = పెద్దవైన, పంచ రేఖాః = ఐదు గీతాలు, ప్రాక్ = తూర్పునకు;ఆయతాః = పెద్దవైన, పంచ రేఖాః = ఐదు గీతాలు, ఉదక్ = ఉత్తరమునకు (మధ్యలో కలియునట్లు వేయవలెను).
రేఖే = గీతలలో, ద్వే కోణే = రెండు మూలలయందు ( తూర్పు రెండు మూలలు, ఉత్తరము రెండు మూలలు ప్రత్యేకముగా రేఖలు అని అర్థము స్వీకరించవలెను), చతుష్టయం = నాలుగు దిక్కులు కలియునట్లు రెండు గీతలు (కలియునట్లు వేయవలెను). పదాత్ = మార్గముల నుండి, పార్శ్వగతః = ప్రక్కలకు వెళ్ళునట్లుగా, తిర్యక్ = అడ్డముగా, రేఖాః = గీతలు ( వేయవలెను). యేన = ఈ ప్రకారముగా గీయటచే, ( ఏర్పడు ఆకారము), స్వస్తిక లక్షణమ్ = స్వస్తిక అను (గుర్తు) బంధము ఏర్పడుటకు లక్షణము. (ఈ స్వస్తిక గుర్తునకు) పురతః = ముందు భాగములో ఏనుగు కుంభస్థలము వలె, పశ్చిమే = పడమర వైపునకు, కలశాకారం = కలశము ఆకారములో, రేఖాః = గీతలు, ( వేయవలెను).
ఈ శ్లోకానికి చక్కని వివరణను అవధానిశేఖరులు డా.మాడుగుల అనిల్కుమార్ అందఁజేశారు.
వారికి
అగణితమైన స్వస్తికకు నార్యులు చెప్పిన శ్లోక భావమున్
జగమున కెల్ల తెల్లమగు చక్కని రీతిని తెల్పినారలో
సుగుణ వరేణ్య! సంస్కృత సుశోభిత మాడ్గుల వంశ చంద్రమా!
నిగమసువేద్యుఁడెల్లెడల నిత్యము మిమ్ములఁ గాచుఁగావుతన్.
అని నా ధన్యవాదాలు తెలియఁజేయుచున్నాను.
జైహింద్.
1 comments:
నమస్కారములు
కలసాకారమును , స్వస్తిక్ గుర్తును , రేఖల్తో చిత్రీక రించుటను గురించి చక్కని శ్లోకమును వివరించి నందులకు శ్రీ మాడుగుల అనిల్ కుమార్ గారికి శతాధి వందనములు . అర్ధ తాత్పర్యములతో మాకందించిన శ్రీ చింతావారికి ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.