గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, అక్టోబర్ 2015, మంగళవారం

శరన్నవరాత్రులు సందర్భముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
యాదేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః.
ఆర్యులారా! శరన్నవరాత్రులు సందర్భముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.
సృష్టికి మూలమై, వినుత శీలుర చిత్త సరోజ వర్తియై
దుష్టుల రూపు మాపు మన దుర్గమ, లోక సురక్షణార్థియై 
కష్టములెల్లఁ బాపుచు, ప్రకాశ మహోజ్వల జీవనంబిడన్
పుష్టిని కల్గఁ జేయ మన ముందుకు వచ్చె శరత్ప్రకాశయై.

రమ్య మనోజ్ఞ సంస్తుత శరన్నవ రాత్రులు వచ్చె మీదు సత్
కామ్యములెల్ల తీర్చఁగను, గౌరవ జీవనమందఁ జేయఁగన్. 
గమ్యము గల్గి జీవనము గౌరవమొప్పఁగ సాగఁ జేయుఁడీ!
సౌమ్య గుణాఢ్యులైన  మిముఁ జక్కఁగ దుర్గమ కాచుచుండుతన్.

కవులకు కల్పనా పటిమ, కాంతలకున్ శుభ కామితార్థముల్,
ప్రవిమల చిత్త వృత్తులకు భవ్యమనోజ్ఞసుఖోపజీవికన్,
భువిఁగల శ్రామికాళికి ప్రమోదముఁ గూర్చెడి సత్ఫలంబులన్,
ప్రవిమల దుర్గమాంబ తన భక్తిలఁ గాంచి యొసంగుఁ గావుతన్.
జైహింద్.
Print this post

2 comments:

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

గురువులు శ్రీ చింతా రామ కృష్ణా రావు గారికి పాదాభివందనములు.
మీకు మరియు మన కవిమిత్రులందరకు శ్రీ శరన్నవరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.

శ్రీమద్దీవ్యపదాంఘ్రి కల్పతరునిక్షేపాశ్రితాసక్తులై
క్షేమంబించ్చెడి భవ్య నామజపమాశీర్వాదమై నిల్వగా
ప్రేమాంతర్గత సౌమనస్కులయి వర్ధిల్లంగ బ్రార్థింతు మా
కామక్రోధములెల్ల బాపుమిదె దుర్గామాతనే వేడెదన్.

చల్లఁగ చూడుమమ్మ హిమశైలనివాసిని భక్తకోటి రం
జిల్లఁగ శాంతిసౌఖ్యములు స్నేహములున్ విలసిల్లజేసి మా
కెల్లను భక్తి భావములు నీప్సిత సిద్ధియు గల్గఁజేయుము
త్ఫుల్ల సరోజ నేత్ర! జయ దుర్గ! మమున్ మరి గావుమెంతయున్.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
దేవీ నవరాత్రుల సందర్భముగా అందరికీ శుభా కాంక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.