గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, అక్టోబర్ 2015, శుక్రవారం

అసలైన సాధన అనంత శక్తి

జైశ్రీరామ్.
ఆర్యులారా! అసలైన సాధన అనంత సక్తి అని ఎవరు వ్రాశారో గుర్తు లేదు కాని 
పఠనీయాంశం కావున మీ ఉందుంచుతున్నాను.
మంత్ర శక్తిని గురించి తమిళంలో ఓ చిన్న కధ వుంది. గురువు దగ్గరనుంచి మంత్రం తీసుకోవాలని ఒకతను రోజూ గురువుగారి దగ్గరకు వెళ్ళేవాడుట. ఆయన మాత్రం మంత్రం ఇవ్వకుండా "పో పో దూరం" అని లేకపోతే "ఇలా రా రా" అనే వారేకానీ మంత్రం ఇవ్వలేదుట. మహానుభావుల మాటలూ వేరు, వాటి అర్ధాలూ వేరు అంటారు కదా. షిర్డి సాయి బాబాకూడా భక్తులని మందలించే వారుట, ఆవిధంగా అహాన్ని, జన్మాంతర కర్మలని కూడా విముక్తం చేసేవారు. సరే మన శిష్యుడి కధలోకి వస్తే ఈ రెండు మాటలు విని విని, అనుకున్నాడుట ఇదే నా మంత్రం అని. అంతే మంత్రసాధన మొదలు పెట్టాడుట. ఓ అడవిలో చెట్టుకింద కూచుని తీవ్ర సాధన చెయ్యడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ళకి అతను చేసిన సాధనకి చుట్టూవున్న ప్రకృతి కూడా స్పందించడం మొదలు పెట్టిందిట. అది విని చూడ్డానికి గురువుగారు కూడా వచ్చారుట. చూస్తే ఆ శిష్యుడు మంత్రం చేస్తున్నాడుట, "పో పో దూరం, ఇలా రా రా" అని. అయితే చిత్రం ఏమిటంటే అతని ఎదురుగా వున్నా చెట్లు పుట్టలు అన్నీ, 'పో పో' అన్నప్పుడు దూరంగా పోతున్నాయిట, 'ఇలా రా' అన్నప్పుడు దగ్గరకు రావడం చేస్తున్నాయిట. ఏమి చిత్రం! ఈ మధ్య వచ్చిన ఓ హింది సినిమా 'ఓం శాంతి ఓం' లో హీరో ఒక అద్భుతమైన విషయాన్ని చెపుతాడు, "మనం ఏ లక్ష్యాన్నైనా బలమైన సంకల్పంతో కోరుకున్నప్పుడు, సృష్టి అంతా తన క్రమాన్ని మార్చుకుంటుంది మన విధిని జీవనక్రమాన్ని మన సంకల్పాని అనువుగా మారుస్తుంది...", అని. ఎంత అద్భుతంగా వుంది! మనసు వల్ల భావం కలుగుతుంది. భావం బలమై భగవాన్ అవుతుంది. భగవంతుడైన భావం జీవన సర్వస్వాన్ని నిర్దేసిస్తుంది, నిద్రపోతున్న మనలోని మహాశక్తిని లేపుతుంది - కుండలిని దండమై కోదండమై లక్ష్యాన్ని భేదిస్తుంది. ఆ అతీత శక్తే గురువుని మించిన ఏకలవ్యుడిని, బ్రహ్మని సైతం ఛాలెంజ్ చేసిన విశ్వామిత్రుడిని తయారుచేసింది.
వేల సంవత్సరాలు తపస్సు చేయడం అంటే ఎలా? అది మనకి సాధ్యం కాదు కాబట్టి ఉపాసన చెయ్యడం మంచిదని చెప్పారు. 'ఉప - ఆసన ' అంటే దగ్గరగా వుండడం. ఆ దివ్యశక్తికి దగ్గరగా వుంచే ప్రక్రియ కాబట్టి సాధనని ఉపాసన అన్నారుట. ఉపాసన ధ్యానంతోనైనా, మంత్రంతోనైనా చెయ్యవచ్చును. ఇష్టదేవతా నామాన్ని జపిస్తూగాని, ఆ రూపాన్ని స్మరిస్తూగాని ఉపాసన చెయ్యవచ్చు. రెండూ శక్తివంతమైన మార్గాలేట!
ఓ స్నేహితుడు మంచి వినాయకుడి భక్తుడు. ఏం చేసినా "విన్నీ విన్నీ" అంటూ వినాయకుడికి చెప్పే చేస్తాడు. చాలా చక్కగా శంకరాచార్యుల వారి వినాయక స్తుతి, "ముదాకరాత్త మోదకం... " పాడతాడు. ఒకసారి బస్సులో వెడుతుంటే చర్చించుకోవడం మొదలయ్యింది. దేవుడు నిజంగా మన ప్రార్ధన వింటాడా అని. అందులో ఇంకో స్నేహితుడు అన్నాడు, "దేవుడు సర్వాంతర్యామి అంటున్నారు కదా అది నిజమో కాదో చూడ్డానికి ఒక ప్రయోగం చేద్దాం. ఒరేయ్ నువ్వు వినాయకుడి స్తోత్రం మొదలెట్టు. ఇది అయ్యేలోపు వినాయకుడు ఎదో విధంగా మనకి అది వింటున్నట్టు తెలియజెయ్యాలి. చూద్దాం దేవుడున్నాడో లేదో!". మావాడు వినాయకుడు స్తోత్రం మొదలుపెట్టాదు. పాట అవుతుందంగా "అదిగో అది చూడండి" అన్నారు. బస్సు కిటికిలోంచి చూస్తే పేద్ద ఏనుగు వెడుతోంది, రోడ్డు మీద. ఎవరికీ నోటమాటలేదు. బస్సు దిగి దండం పెట్టుకుంటానన్నాడు మావాడు, కాని బస్సు ఆపలేదు. "వినాయకుడు సర్వంతర్యామి" అని నచ్చచెప్పాం వాడికి.
దేవతారూపం ఒక సంకేతంట. అది సృష్టిలో నిబిడీకృతమైన కొన్ని శక్తుల స్వరూపంట.వినాయకుడు మూలాధార చక్రానికి అధిపతి. ఏనుగులా స్థూలంగా వుండే భౌతిక ప్రపంచానికి ఆయన ప్రతీక అని శాస్త్రాలు చెపుతున్నాయి. ఆది దంపతులైన శివ పార్వతులకి ఇద్దరు పుత్రులు. వినాయకుడు, కుమారస్వామి. వినాయకుడు వ్యోమం (స్పేస్) , సుబ్రహ్మణ్యుడు కాలం (టైం). అందుకే రేణు నిర్మితమైన ఈ ప్రపంచానికి అధిపతి కనుక వినాయకుడిని అమ్మవారు నలుగు పిండితో చేసింది అంటున్నారు. ఆయనకు వినాయక చవితినాడు పిండితో చేసిన వుండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం పెడుతున్నాం. అణునిర్మితమైన ప్రపంచానికి ఇవి ప్రతీకలన్నమాట. అలాగే హెలిక్స్ లావున్న గ్రహ, కాల గమనానికి అధిపతి ఐన కుమారస్వామిని చుట్టుకునివున్న సర్పంగా ఆరాధిస్తాం, ప్రవాహ గుణంవున్న పాలతో అభిషేకిస్తాం. ఇలా దేవతల ప్రతిరూపం ఒక్కో తత్వానికి ప్రతిరూపం. ఆతత్వాన్ని బట్టి ఋషుల దర్శనం, తద్వారా మనకి బీజాక్షరాలు తెలిసాయి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా బాగుంది .నిజంగానే భగవంతుడు సర్వాంతర్యామి అనేక రూపాలలొ అన్నిట ఉంటాడు . కాదనే ధైర్యం ఎవ్వరికీ లేదు . మంచి సందేశాన్ని అందించారు. ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.