జైశ్రీరామ్.
ఆర్యులారా!
శ్రీ నారుమంచి అనంత కృష్ణ కవి గారి మిత్రులొకరు పెంటో రచయతలను కొంచెం పరుషంగా అన్నట్లనిపించి బాధతో వెలయించిన సుగుణ సౌరభాన్విత సీసమాలిక తిలకించండి.
శ్రీ అనంత కృష్ణ కవి మాటలలోనే గ్రహించండి.
మిత్రులొకరు పెంటో రచయతలను కొంచెం పరుషంగా అన్నట్లనిపించి బాధతో ఈ సీసమాలిక వ్రాశాను.సీసమాలిక॥
స్థిరగణ పాద యతిప్రాస బద్ధము । వృత్తము; గణమందు వెసులు కల్గు
జాతుల యందు; ప్రాసనొదిలి, సడలించ । యతినుప జాతులంచందురంట
మాత్రల లెక్కిడి మాత్రమె వ్రాయగ । పంక్తుల కొన్నింటి పాట యండ్రు
పాదాల విరగేసి పద్యమ్ము వ్రాయంగ । ద్విపదగా పదిమంది పిలుతురంట
ఆ పంక్తులనుకూడ నడ్డముగా చీల్చి । మాత్రలు సైతము మరచి పోవ
వ్రాయొచ్చు పెంటోలు వామీలు నానీలు । వింతవింతగు పేర్లు పెట్టుకొనుచు
మణిరంగు పేరిట మనకొచ్చు భాషల |కలిపేసి వ్రాయొచ్చు కవనములను
అన్ని లక్షణముల నవలీల తప్పించి | సద్యో రసస్ఫూర్తి గద్య రచన
వైఖరీ రూపమై వరలునే శబ్దమ్ము | భాషయౌచును పరా వాక్కు లేక
శబ్ద సంచయమంత సకరుణాయుత సర । స్వతి జృంభణాన్విత శక్తి గాదె
చిన్నారి నోటను చిలిపి పలుకులన్న । తల్లి మెచ్చునుగాని తన్నబోదు
గ్రాంథికమ్మేగాని గ్రామ్యమ్మె యగుఁ గాని । భాషకన్నను గొప్ప భావమయ్య
తొలిమెట్టు వానిని మలిమెట్టునెక్కంగ । ప్రోత్సహించవలయు పోర వలదు
మంచినెంచవలెను మన్నించి దోషాల । మేటి చేష్టకిదియె గీటురాయి
ఆ.వె. సూత్ర బద్ధ కవన శూరుడొకఁడు కాగ
చిత్త ధర్మ రచన సేయు నొకఁడు
నాకు నచ్చు భాష నా మౌన హృద్ఘోష
దోషమెంచు మిషను ద్వేషమేల..
N.V.ANANTHA KRISHNA,
Advocate,
భావావేశము తోడఁ బల్కు కవితల్ పద్యంబులౌన్గద్యమౌన్,
భావింపన్, కవి ధీమతిన్ వెలసి సద్వామీలు, నానీ లగున్.
చేవం జూపెడి భావభాగ్య గరిమన్ చెల్వొందు పెంటోలగున్.
ధీవర్యుల్గని మెచ్చుటొప్పుననునీ తేజస్వి కృష్ణుండెగా!
అనంత కృష్ణ కవికి అనంతకోటి ఆశీః పూర్వక అభినందనలు..
.జైహింద్.
3 comments:
నమస్కారములు
శ్రీ అనంత కృష్ణ గారి సీస మాలిక చాలా బాగుంది
" చిన్నారి నోటను చిలిపి పలుకులున్న తల్లి మెచ్చును గాని తన్నబోదు "
తొలిమెట్టు వానిని మలిమెట్టు నెక్కంగ ప్రోత్సహించవలయు పోరవలదు "లాంటి ఆణి ముత్యాలను అందించి నందులకు కృతజ్ఞతలు .
శ్రీ చింతావారికి ధన్య వాదములు
అమ్మా ఈ పద్యము సకూడా చిన్నారి పలికే
ప్రణామములు
అమృతతుల్య మైన " అమ్మా " అన్నపిలుపు "
నా జన్మ ధన్య మైంది . కృతజ్ఞతలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.