గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జూన్ 2013, బుధవారం

తల్లిదండ్రులకు గురువులకు విజ్ఞప్తి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! మీ పిల్లలను విద్యార్థులను క్రమశిక్షణతో పెంచు మిమ్ములను మనసారా అభినందించుచున్నాను.
మీ పిల్లలకైనా, మీ విద్యార్థులకైనా శిక్షణ పొందటానికి ముందుగా మీపై నమ్మకము వారికి కలగాలి. మిమ్మల్ని వారు నమ్మాలంటే ముందు భగవంతునిపై నమ్మకమేర్పడాలి. భగవంతునిపై నమ్మకమేర్పడటానికి శిక్షణ అవసరము. అందుకే మన పూర్వీకులు అక్షర స్వీకారము చేసే సమయంలో మొట్టమొదట ఓ-న-మః---శి-వా-య.---సి-ద్ధమ్---న-మః.అని బియ్యంలో పసుపుకొమ్ముపట్టించి వ్రాయించేవారు. ఆ నాటి నుండి చదువుకొనుటకు ముందు పుస్థకముల ముందు కూర్చొనగానే శ్రీ గురుభ్యోనమం.
తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామ హస్తమున్
మెండుగ మ్రోయు గజ్జలును మెల్లని చూపులు మంద హాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్.
అని గణపతిని ప్రార్థించిన పిదప
తల్లీ నిన్ను దలంచి పుస్థకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సు శబ్దంబు శో
భిల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్ మోహినీ
ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా.
అని సరస్వతీఎ దేవిని ప్రార్థించేలాగ శిక్షణ నిచ్చేవారు పెద్దలు.
మరి ఈనాడు ఎలా నడుస్తోందో, ఎట్టిశిక్షణ నిస్తున్నామో మీకు తెలియనిది కాదు.
మనం కోరుకొనే విధంగా పిల్లలు సుజనాగ్రగణ్యులు కావాలంటే తప్పని సరిగా క్రమశిక్షణతో కూడిన శిక్షణ ఇవ్వడం అత్యంత ఆవశ్యకమని మీకు తెలుసు.
తిరుపతి వేంకట కవులు ఆ సరస్వతీ మాత అనుగ్రహంతో ఎంతటి ప్రతిభా పాటవాలను సభలలో ప్రదర్శించారో దానికి కారణ భూతురాలైన సరస్వతీ మాతనుద్దేశించి వారు చెప్పిన పద్యం చూస్తే మనకర్థమౌతుంది సరస్వతీ మాత ప్రార్థనావశ్యకత.
ఆ పద్యం చూడండి.
ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము, స
న్మానము లందినాము, బహుమానములన్ గ్రహియించినార, మె
వ్వానిని లెక్క పెట్టక నవారణ దిగ్విజయంబొనర్చి ప్ర
జ్ఞా నిధులంచు బేరు గొనినారము, నీ వలనన్ సరస్వతీ! 
చూచారు కదా!
పూజ్యులారా! మంచి శిక్షణ వలనను, భయ న్హక్తులు నేర్పడం వలనను మన పిల్లలు చెడిపోరు కదా! 
మరి మీ పిల్లలకు ఈ ప్రార్థన పద్యములను కంఠస్థము చేయించి క్రమశిక్షణతో మెలిగేలా చెయ్యండి.
శిక్షణనిచ్చి పిల్లలకు శీఘ్రగతిన్ మహనీయ భారతిన్
రక్షణ చేయు కార్యమున రాజిల చేయుడు. దేశ మాతనే
భక్షణ చేయు దుష్టుల స్వభావము మార్చి, మహద్విశేష సత్
శిక్షణి నిచ్చువారలుగ చేయుడు మీరలు. మేలు గొల్పుడీ!
నమస్తే.
జైహింద్.
Print this post

4 comments:

సో మా ర్క చెప్పారు...

సామూహిక అక్షరాభ్యాస దినమున తల్లిదండ్రులకు,గురువులకు సామూహికంగా ఆంధ్రామృత హితోపదేశ పంచామృతాన్ని తీర్థంగా మూడు ముక్కల్లో అందించారు.అభినందనీయం రామకృష్ణ కవివర్యా!ధన్యోస్మి!

సో మా ర్క చెప్పారు...

నేటి సామూహిక అక్షరాభ్యాస దినాన్ని పురస్కరించుకొని అటు గురువులకు,ఇటు తల్లిదండ్రులకు ఆంధ్రామృతం ద్వారా చక్కని వాగుపదేశ పంచామృతాన్నందించారు!ధన్యవాదాలు రామకృష్ణ కవీంద్రా!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
తిరుపతి వేంకట కవులను గుర్తు చేస్తూ మంచి పద్యాలను అందించారు. కొందరైనా మీ సూచనలను పాటించడం మొదలు పెడితే భవిష్యత్తులో అభివృద్ధిని సాధించ వచ్చును .వేచి చూడ వలసిందే మరి

anrd చెప్పారు...


చక్కటి విషయాలను తెలియజేసినందుకు మీకు ధన్యవాదములండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.